పడమటి కనుమల్లో తామర అందాలు


Fri,February 1, 2019 12:27 AM

Endenlotus-External
మన దేశంలోని అత్యంత విలాసవంతమైన రిసార్ట్‌లలో తామర కూర్గ్ ఒకటి. పడమటి కనుమల్లో వికసించిన ఈ పద్మానికి ఇండియాస్ మోస్ట్ రొమాంటిక్ రిసార్ట్ అనే పేరు కూడా ఉంది. హనీమూన్‌కు వెళ్లాలనుకునే జంటలకు ఇది పర్‌ఫెక్ట్ డెస్టినేషన్ కూడా. కర్ణాటకలోని కొడగు జిల్లాలో విస్తరించిన పర్వత శ్రేణుల్లో కూర్గ్ ఉంది. ఎత్తయిన పర్వతాల మీద, పరుచుకున్న సహజమైన కాఫీ తోటలు, సుగంధ పుష్పాల పరిమళాల మధ్య విడిది చేయడం ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది.


తామర అంటే మీకు తెలుసు కమలం పువ్వు. స్వచ్ఛతకు, పవిత్రతకు సూచకంగా కమలాన్ని భావిస్తారు కాబట్టి రిసార్ట్‌కు ఈ పేరు పెట్టారట నిర్వాహకులు. తామర వారి హాస్పిటాలిటీ వెంచర్స్‌లో కూర్గ్ ఒకటి. 180 ఎకరాల్లో విస్తరించిన ఒక అందమైన పర్యావరణ రిసార్ట్ తామర కూర్గ్.


బెంగళూరు నుంచి 270 కిలోమీటర్లు, మైసూర్ నుంచి 133 కి.మీ. మంగళూరు నుంచి 164కిమీ, కోళికోడ్ నుంచి 187 కి.మీ. దూరంలో ఉంది కూర్గ్. బెంగళూరు, మంగళూరు, కోళికోడ్ విమానాశ్రయాల నుంచి కూర్గ్‌కు చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గాలు కూడా ఉన్నాయి.


వసతి

తామర కూర్గ్‌లో విడిది చేయడం ఒక గొప్ప అనుభూతి. ఆదిమ మానవుడిగా అరణ్యంలో ఆధునిక వసతులతో బతుకున్న అనుభూతిని పొందొచ్చు. సముద్ర మట్టానికి 3600 నుంచి 3900 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలపై చక్కని చెక్క (వుడెన్) కాటేజ్‌లలో బస చేయొచ్చు. తామర కూర్గ్‌లో నాలుగు రకాల కాటేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. 42 లగ్జరీ కాటేజ్‌లు, 4 సూపర్ లగ్జరీ కాటేజ్‌లు, 8 సూట్ కాటేజ్‌లు, 2 ఎక్స్‌క్లూసివ్ ఈడెన్ లోటస్ సూట్ విత్ లార్జ్ ప్రయివేట్ జాకుజీ (బాత్ టబ్) కాటేజ్‌లు కూర్గ్‌లో ఉన్నాయి. మీరు ఎంచుకునే ప్యాకేజీలను బట్టి మీ విలాసం, అతిథి మర్యాదలుంటాయి. రెగ్యులర్, కార్పొరేట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.


ద ఫాల్స్ అండ్ ద డెక్

తామర కూర్గ్‌లో ఎంచుకున్న ప్యాకేజీల్లో భాగంగా కాటేజ్‌లలో బస చేయొచ్చు. కానీ ఆహారం, పానీయాల కోసం మాత్రం కామన్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడి ఆహారం ప్యాకేజ్‌లో భాగంగానే పొందవచ్చు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కాటేజ్‌కు తెప్పించుకుంటే మాత్రం కొంత ప్రత్యేక రుసుము వసూలు చేస్తారు. తామర కూర్గ్‌లోని మల్టీ కుసైన్ రెస్టారెంట్ పేరు ద ఫాల్స్. ఒక జలపాతం మీదుగా వుడెన్ బ్రిడ్జీపై దీన్ని నిర్మించారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ, కింది జలపాతాన్ని అద్దం (గ్లాస్ ఫ్లోర్)లో నుంచి వీక్షిస్తూ, పక్షుల కిలకిలరావాలు, పరవళ్లు తొక్కే జలపాతం శబ్దాన్ని వింటూ ఇక్కడ భోజనం చేయొచ్చు. స్థానికంగా లభించే పదార్థాలతో ఇక్కడ చక్కటి ఆహారం దొరుకుతుంది. కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో తామర సొంత తోటల్లో పండిస్తుంటుంది. దీనికి ఆనుకునే ద డెక్ పేరుతో బార్ ఉంటుంది. పానీయాలు మాత్రం ప్యాకేజ్‌లో భాగంగా కాదు.

Endenlotus-External1

ద ఎలివేషన్

తామర కూర్గ్‌లో ద ఎలివేషన్ అనేది ఒక స్పా. ఇక్కడ అంతర్ మంత్ర పేరుతో చక్కటి స్పా సేవలు అందిస్తారు. కూర్గ్ స్పాకు జాతీయంగా మంచి పేరు ఉంది. ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఈ స్పా చికిత్సలు, థెరపీలు విశ్రాంతికి, పునరుజ్జీవనం, నిర్విషీకరణకు ఉపయోగపడతాయని చెబుతారు.


ద వరండా

ఇది తామర వారి వారసత్వ కట్టడం. ఇందులో నాలుగు విభాగాలుంటాయి. మొదటిది గిఫ్ట్ షాప్. రెండోది బుక్ స్టోర్. మూడోది కాఫీ బార్.. ఇందులో కస్టమ్ కాఫీని మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు. నాలుగోది ఓపెన్ ఏరియా. ఇక్కడ ఎంచక్కా కాఫీ తాగుతూ మీకు నచ్చిన పుస్తకాన్ని చదువుతూ కూర్చోవచ్చు.


యోగాలయం

తామర అందించే సదుపాయాల్లో ది యోగా టెంపుల్ ఒకటి. సేద తీరుతున్న ప్రకృతిలో ప్రశాంతతను పొందేందుకు స్థానిక సంప్రదాయ పద్ధతుల్లో దీన్ని నిర్మించారు. మంగళూరు మట్టి, రాళ్లతో నిర్మించిన ఈ టెంపుల్‌లో యోగ శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక గురువులు ఉంటారు. ఈ సదుపాయాన్ని ప్యాకేజ్‌లో భాగంగా ఎంచుకోవచ్చు.


ది విండో

కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహించుకునేందుకు తామర కూర్గ్‌లో ది విండో పేరుతో ప్రత్యేక సదుపాయం ఉంది. 80 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ విండోలో వై-ఫై, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ వంటి సదుపాయాలున్నాయి.

Endenlotus-External2

కొడైకెనాల్‌లోనూ..

తామరకు రిసార్ట్‌లే కాదు. దేశ, విదేశాల్లో హోటల్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ఎస్‌డీ శిబులాల్ వీటిని స్థాపించారు. ప్రస్తుతం ఆయన కూతురు శృతి శిబులాల్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తామర రిసార్ట్‌ను 2018లో ఆవిడ కొడైకెనాల్ (తమిళనాడు)లోనూ ప్రారంభించారు. రూమ్స్, కాటేజెస్ కలిపి 2015 నాటికి వెయ్యి గదులతో ఆతిథ్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు శృతి.

Endenlotus-External3

ప్యాకేజెస్

తామర్ కూర్గ్‌లో స్పా, స్టీమ్ బాత్, స్నానం, ఫిట్‌నెస్ సెంటర్, స్పోర్ట్స్ ఏరియా, యోగ టెంపుల్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీటిని ప్యాకేజ్‌లో భాగంగానే ఎంచుకోవచ్చు. పర్సనలైజ్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.


ట్రెక్కింగ్ :

అతిథులకు ఉల్లాసవంతమైన, ఉత్తేజకరమైన అనుభూతిని కలిగించేందుకు తామర కూర్గ్ రెండు రకాల ట్రెక్కింగ్స్‌ను ఏర్పాటు చేసింది. పత్తిపోలే ఫాల్స్ వద్దకు, బల్లియాత్రే వద్దకు రోజూ రైడ్స్ నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా నాలుగైదు గంటల పాటు పర్వతాలు ఎక్కి దిగాల్సి ఉంటుంది.


ప్లాంటేషన్ టూర్ :

ఇదొక సుగంధ భరిత ప్రయాణం. కాఫీ తోటల్లో విహరించడం ఒక గొప్ప అనుభూతి. యాలకులు, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాల తోటల్లో సహజ సిద్ధమైన పరిమళాలను ఆస్వాదిస్తూ కాసేపు నడవడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. పూలు, కూరగాయల తోటలు కూడా ఉన్నాయి. ప్లాంటేషన్ టూర్‌లో భాగంగా వీటిల్లోనూ కలియ తిరగవచ్చు.

- నగేష్ బీరెడ్డి

967
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles