e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిందగీ న్యాయానికి సాయంగా!

న్యాయానికి సాయంగా!

భవిష్యత్‌లో నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి డిగ్రీ పట్టా ఉపయోగపడితే చాలనుకుంటారు చాలామంది. కానీ, ఆ చదువు నలుగురికీ దారి చూపాలని కోరుకునేవారు కొందరే. ఈ కోవకే చెందుతుంది 21 ఏండ్ల చాడ శ్రీహర్షిత. పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో, పదో తరగతిలోనే న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే ఎల్‌ఎల్‌బీలో సీటు సంపాదించింది. కోరుకున్నట్టుగానే ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. స్వయంగా ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు బాసటగా నిలుస్తున్నది.

న్యాయానికి సాయంగా!

తల్లిదండ్రులు ఇద్దరూ శాస్త్రవేత్తలు. కానీ, శ్రీహర్షిత మాత్రం లాయర్‌ కావాలని పదో తరగతిలోనే నిర్ణయించుకుంది. అనుకున్నట్టే లా కాలేజీలో చేరింది. కోర్టు హాలులో బల్లగుద్ది కేసులు వాదించడానికి ముందే ఎన్నో సమస్యలపై గళమెత్తుతున్నది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. విద్యార్థులకు చట్టాల చిట్టాలను విప్పి చెబుతున్నది. ప్రతి పౌరుడూ నిర్వర్తించాల్సిన బాధ్యతలను తెలియజేస్తున్నది.

అవగాహనా సదస్సులు
హర్షిత పసితనంలో ఉండగా, ఆమె తండ్రి చాడ రాజిరెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసేవారు. దీంతో నాలుగేండ్లు వచ్చేవరకూ తనుకూడా అమెరికాలోనే పెరిగింది. తర్వాత రాజిరెడ్డి కుటుంబం హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యింది. హర్షిత విద్యాభ్యాసం కొన్నాళ్లు ఇక్కడే సాగింది. కర్నూలులోనూ చదివింది. హైదరాబాద్‌లో ఇంటర్‌ చేసింది. లాయర్‌ కావాలనే లక్ష్యంతో లా ఎంట్రన్స్‌కు సిద్ధమైంది. లా ప్రవేశపరీక్షలో అర్హత సాధించి షాద్‌నగర్‌లోని ‘సింబయాసిస్‌ లా స్కూల్‌’లో సీటు సంపాదించింది. మొదటి సంవత్సరం నుంచే కాలేజీలో నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. క్యాంపస్‌లోని ‘లీగల్‌ ఎయిడ్‌ సెంటర్‌’కు మూడేండ్లు ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. ఆ సెంటర్‌ తరఫున న్యాయ హక్కులు, బాధ్యతల గురించి కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక చట్టంపై అవగాహన కల్పించింది హర్షిత అండ్‌ టీమ్‌. జైళ్లతోపాటు జువైనల్‌ హోమ్స్‌కు వెళ్లి న్యాయచైతన్యం కలిగించింది.

అటు చదువు, ఇటు శిక్షణ..
ప్రతి లా స్టూడెంట్‌ ఒక్కో సెమిస్టర్‌ పూర్తయ్యాక ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే శ్రీహర్షిత మొదటిసారి ‘కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేసింది. “తర్వాత డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, యునైటెడ్‌
నేషన్స్‌ గ్లోబల్‌ కాంపాక్ట్‌ నెట్‌వర్క్‌, నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌, అహస్తియా లీగల్‌, హైదరాబాద్‌ లా చాంబర్స్‌తో కలిసి పనిచేశాను. ఆ ఫీల్డ్‌వర్క్‌ నన్ను బాగా తీర్చిదిద్దింది. లా ఫస్ట్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు ఢిల్లీలోని జిందాల్‌ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ‘పాలసీ బూట్‌ క్యాంప్‌’కు హాజరయ్యాను. దేశం మొత్తం మీద 80 మంది మాత్రమే ఎంపికయ్యారు. అందులో నేనొకదాన్ని. 16 రోజుల రెసిడెన్షియల్‌ క్యాంప్‌లో ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది. లా సెకండియర్‌లో ఉండగానే స్నేహితులతో కలిసి ‘కౌన్సిల్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ (సీటీఐ) స్థాపించాను” అని చెప్పుకొచ్చింది శ్రీహర్షిత.

న్యాయానికి సాయంగా!

‘సైబ్‌హర్‌’లో కీలకపాత్ర
లాక్‌డౌన్‌తో ప్రపంచమంతా ఆన్‌లైన్‌లో ఉంటున్నది. శ్రీహర్షితకూడా లా పాఠాలు ఆన్‌లైన్‌లోనే వింటున్నది. ఇదే సమయంలో లాక్‌డౌన్‌లో సైబర్‌ నేరాలు పెరగడం గమనించిందామె. సామాజిక మాధ్యమాల వినియోగం అధికం కావడం, ఆన్‌లైన్‌ పేమెంట్లు ఎక్కువ కావడంతో సైబర్‌ నేరగాళ్ల చేతివాటమూ పెచ్చుపెరిగింది. ముఖ్యంగా సైబర్‌ క్రిమినల్స్‌ ఆడపిల్లలనే టార్గెట్‌ చేస్తున్నారు. దీనికి చెక్‌ పెట్టడానికి తన వంతుగా నడుం బిగించింది శ్రీహర్షిత. తను తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగంతో కలిసి లీగల్‌ ఎయిడ్‌ సెంటర్‌కు అనుసంధానమై పనిచేస్తున్నది. ‘సైబర్‌స్పేస్‌ అండ్‌ సేఫ్టీ’పై అవగాహన కల్పిస్తూ ‘సైబ్‌హర్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెలరోజులపాటు విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులతో ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించింది. ఫేస్‌బుక్‌, ఇ-మెయిల్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ తదితర ప్లాట్‌ఫామ్స్‌పై సైబర్‌ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. సుమారు పదిలక్షల మందికి అవగాహన కల్పించింది.

కొవిడ్‌ బాధితులకు అండగా..
తన టీమ్‌తో కలిసి ‘హైదరాబాద్‌ ఎసెన్షియల్‌ డెలివరీ సిస్టమ్‌’ కార్యక్రమానికి నాంది పలికింది శ్రీహర్షిత. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటున్నది. తినే ఆహారం నుంచి ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ ద్వారా డాక్టర్లు రాసిచ్చిన మందుల వరకు అన్నీ నేరుగా బాధితుల ఇంటికి చేర్చే వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏరియానుబట్టి దగ్గర్లోని వలంటీర్ల సహకారంతో ఈ సాయం అందిస్తున్నది. విద్యార్థి దశలోనే ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న శ్రీహర్షిత, క్రిమినల్‌ లాయర్‌గా స్థిరపడాలన్నది తన అభిమతమని వెల్లడించింది. నిరుపేదలకు ఉచిత న్యాయసాయం అందిస్తానంటున్నది. మానవహక్కులపై తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని కూడా చెబుతున్నది.

లైసెన్స్‌పై బ్లడ్‌ గ్రూప్‌
లా రెండో సంవత్సరంలో స్నేహితులు రోహిత్‌, షణ్ముఖ్‌రావుతో కలిసి ‘కౌన్సిల్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ (సీటీఐ) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది శ్రీహర్షిత. ఈ బృందం చేపట్టిన కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది ఎంతోమంది వీరితో జట్టు కట్టారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌పై సదరు వ్యక్తి బ్లడ్‌ గ్రూప్‌ ముద్రించాలని కొన్నేండ్లుగా పోరాటం చేస్తున్నది సీటీఐ. ‘లైసెన్స్‌ దరఖాస్తులో బ్లడ్‌ గ్రూప్‌ ఉంటుంది. కానీ, ఫైనల్‌ కార్డుపై ఉండదు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్‌పై బ్లడ్‌ గ్రూప్‌ ఉంటే తక్షణ సాయం అందించే అవకాశం ఉంటుంది. అలా లేకపోతే, ప్రమాదంలో గాయాలైన వ్యక్తి రక్తాన్ని పరీక్షించి, ఏ గ్రూప్‌దో నిర్ధారించి రక్తం ఏర్పాటు చేసేసరికి కొంత ఆలస్యమవుతుంది. ఈ జాప్యంతో ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. లైసెన్స్‌పై బ్లడ్‌ గ్రూప్‌ ఉంటే ఈ పరిస్థితి ఏర్పడదు. ఈ విషయమై మేం చాలా రోజులుగా పోరాడుతున్నాం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కూడా కలిశాం. ఈ క్యాంపెయిన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం’అంటున్నది శ్రీహర్షిత.

‘నాన్న హైదరాబాద్‌లోని
ఐఐసీటీలో సైంటిస్ట్‌. అమ్మ స్మిత గౌనికూడా జీవీకే గ్రూప్‌లో సైంటిస్ట్‌. తమ్ముడు పదో తరగతి. అమ్మానాన్న పరిశోధన రంగంలో ఉన్నా, నేను లా చదువుతానంటే ఏ అభ్యంతరం చెప్పలేదు. నా అభిప్రాయానికి విలువ ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
నా ప్రతి అడుగులో అమ్మానాన్నలు తోడుగా ఉన్నారు.’

నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న్యాయానికి సాయంగా!

ట్రెండింగ్‌

Advertisement