నెత్తుటి మరక నిర్భయ


Sat,December 29, 2018 01:01 AM

ఆ నెత్తుటి మరకలు ఇంకా ఆరనేలేదు.. ఆ దేహానికైన గాయం ఇంకా
మానలేదు..బాధితురాలు పెట్టిన కేకలింకా వినిపిస్తూనే ఉన్నాయి.. నిర్భయ
ఈ లోకాన్ని విడిచి నేటికి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం..

Molestationrapegeneric
అది 2012 సంవత్సరం డిసెంబర్ 16వ తేది.. సాయంత్రం సినిమా చూసి తన స్నేహితుడితో పాటు నిర్భయ బస్సు ఎక్కింది. ఆరుగురు ప్రయాణికులున్న ఆ బస్సు నరకం వైపు వెళ్తున్నదని తెలుసుకోలేకపోయింది. అప్పటికే పీకలదాకా మద్యం సేవించి ఉన్న ఆరుగురు నిర్భయ స్నేహితుడిని చితకబాది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న బస్సులోనే గంటకుపైగా పాశవికంగా లైంగిక దాడి చేసి చివరకు ఇద్దరినీ బస్సులోంచి బయటకు తోసేశారు. అచేతనంగా, వివ్రస్త్రంగా పడిఉన్న నిర్భయను చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. డిసెంబర్ 26న నిర్భయను మెరుగైన చికిత్సకోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. లాభం లేకుండా పోయింది.చివరికి చికిత్స తీసుకుంటూ డిసెంబర్ 29న నిర్భయ ప్రాణాలు విడిచింది. ఈ దుర్ఘటన దేశమంతా చలించిపోయేలా చేసింది. ఊరు, వాడను ఏకం చేసింది. గల్లీల్లో చేసిన నినాదం ఢిల్లీని కదిలించింది. ఆరేండ్ల కిందట ఢిల్లీలో జరిగిన ఈ నిర్భయ ఘటన నెత్తుటి మరకను, దేహానికి అయిన గాయాన్ని మాన్పలేకపోయింది. క్షణాలు నిమిషాలవుతున్నాయి. నిమిషాలు గంటలవుతున్నాయి. గంటలు రోజులవుతున్నాయి. ఆ రోజులు గడుస్తున్నాయి. నెలలు తిరిగి క్యాలెండర్లు ఖతం అవుతున్నాయి. ఎట్టకేలకు ఆరేండ్ల తర్వాత న్యాయం కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఆ కుటుంబం కళ్లలో ఒక రకమైన ఆనందం వచ్చింది. ప్రత్యేక కోర్టుల పేరుతో జరిపిన జాప్యం కావొచ్చు, చట్టాల పేరుతో జరిగిన ఆలస్యం కావొచ్చు ఆరేళ్లకు నిందితులకు శిక్షపడేలా చేసింది.

అసలు మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల పట్ల చాలా మందికి అవగాహన లేదు. దేశంలో ప్రతి రోజూ మహిళలపై ఎక్కడో ఒక చోట అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సమానత్వం రావాలి. వివక్ష వీడాలని మనం చేస్తున్న ఉద్యమాలన్ని ఉల్లిగడ్డ పొట్టులా గాలికి కొట్టుకుపోతున్నాయి. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులకు చనిపోయే వరకు ఉరితీయడమే సరైన శిక్ష అని దేశమంతా డిమాండ్ చేసింది. నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష అనుభవించి బయటికి వెళ్లిపోయాడు. మిగితా నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. నిర్భయ ఘటన తర్వాత ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకొని, అది అమలులోకి వచ్చినా నేరాలు తగ్గిపోయాయి అనడానికి ఆధారాలు ఎక్కడా లేవు. స్వయంగా జస్టిస్ వర్మగారే ఉరిశిక్షలను వ్యతిరేకించారు. నాగరిక సమాజానికి ఉరిశిక్షలు తగదన్నారు. అసలు శిక్షలు నేరాలను తగ్గించలేవని ప్రపంచ అనుభవాలన్నీ చెబుతున్నా మనం మాత్రం శిక్షలవైపే చూస్తున్నాం. ఘటనకు కారణమైన మూలాలను వెతకకుండా శిక్షలవైపు చూసినంత కాలం నిర్భయలు పుడుతూనే ఉంటారు. ఇప్పటికైనా మేల్కొందాం.
నిర్భయ సాక్షిగా.. ఆడపిల్లలను గౌరవిద్దాం. ప్రగతిని సాధిద్దాం.

అజహర్ షేక్

748
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles