నీలోనే భగవంతుడు


Thu,December 20, 2018 01:47 AM

భగవంతుడిని చేరే ముక్తిమార్గం గురించి అన్వేషిస్తూ గోదాదేవి ముప్పై రోజులపాటు ఆచరించిన వ్రతమే ధనుర్మాస వ్రతం. రోజుకొకటి చొప్పున ముప్పై రోజులు ముప్పై పాశురములు పారాయణం చేస్తూ ఈ వ్రతం ఆచరిస్తారు. ముప్పై రోజుల పాటు పఠించే ఈ పాశురములను తిరుప్పావై అంటారు. వెయ్యి విష్ణునామాలు చదివితే వచ్చే పుణ్యం ఈ తిరుప్పావై పారాయణం చేయడం వల్ల సిద్ధిస్తుందని శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రవచించారు.
Ju
మనల్ని మనం మార్చుకోవడానికి చేసే వ్రతమే ఈ ధనుర్మాస వ్రతమన్నారు చిన్నజీయర్ స్వామి. ఒక ఉత్తమ లక్ష్యం వైపు మనసును సంధించడమే ధనుర్మాస వ్రత ఆచరణ. కేవలం ముప్పై రోజులు ప్రతిరోజూ తిరుప్పావై, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడమే కాదు. ఏ లక్ష్యం కోసం పట్టుదలతో, మనస్ఫూర్తిగా వ్రతం చేస్తున్నామో ఆ ఆచరణను జీవితాంతం పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. మనసు సన్మార్గం వైపు మళ్లుతుంది. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్తూ ఓం అంటే బ్రహ్మ.. బ్రహ్మ అంటే వేదం.. వేదం అంటే నేనే.. నేనంటే నువ్వే. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్దది మహత్తరమైనది కేవలం భగవంతుడు మాత్రమే. ఈ అఖిల చరాచర సృష్టిని సృష్టించేది, పాలించేది, నడిపించేది భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడు ఎక్కడో ఉండడు. మనలోనే నిక్షిప్తమై ఉంటాడు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే మహత్తరమైన భగవంతుడే నీలో ఉన్నాడంటే.. నువ్వు అనంతం. నీ శక్తిని నువ్వు గుర్తించి, ఆత్మ ఉద్దేశాన్ని, నువ్వు జన్మించిన కారణాన్ని గుర్తించి ఆ లక్ష్యం కోసం మనసును లగ్నం చేయమని, లక్ష్యం వైపు మనసును గురి పెట్టమని అంతర్లీనంగా చెప్తుంది ధనుర్మాసం. మనిషికి, ఆత్మకు తెలియనిదంటూ ఏదీ ఉండదు.

సూర్యుడు వృశ్చికరాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా విష్ణు భక్తులు భక్తిప్రపత్తులతో ధనుర్మాసోత్సవాలు జరుపుకుంటారు. అందులో భాగంగానే 30 రోజుల పాటు తిరుప్పావై ప్రవచన పారాయణం నిర్వహిస్తారు. చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మై హోమ్ సిమెంట్స్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు ఇంట్లో ధనుర్మాసం సందర్భంగా ఉత్సవాలు, తిరుప్పావై పారాయణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి జనవరి 14 వరకు నిర్విరామంగా ప్రతిరోజూ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు రోజూ ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు అష్టోత్తరం, తిరుప్పావై సేవాకాలం, తెలుగు ప్రవచనం, తీర్థగోష్టి, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, తిరుప్పావై ప్రవచన గోష్ఠి కార్యక్రమాలు కొనసాగుతాయి.
Ju1
తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. నడిపించే శక్తి వస్తుంది. తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. ఎదుటివారి స్థితిని, పరిస్థితిని అంచనా వేసి, అర్థం చేసుకొని వారికి అర్థమయ్యేలా చెప్పగలుగాలి. భగవద్గీత ఈ అంశాన్నే ప్రధానంగా చెప్పింది. అంత పెద్ద మహాభారత యుద్ధం జరుగుతుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రశాంతంగా అందరినీ ఆపి, అర్జునుడికి గీత బోధ చేశారు. ఆ సమయంలో అందరూ యుద్ధానికి ఉన్ముక్తులై ఉన్నప్పటికీ శ్రద్ధగా, ఆసక్తిగా విన్నారు. దాని ఫలితం మనందరికీ తెలుసు. ఓంకారం ద్వారా భగవంతుని చేరే మార్గాన్ని శోధించాలి. ఆ మార్గాన్ని ఆండాళమ్మ బాధ్యతగా తీసుకున్నది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చిన మాసంలో ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ధనుర్మాసాన ప్రారంభించిన ఆ ప్రయత్నం, ఆచరణయే ధనుర్మాస వ్రతం. ఆ భగవంతుని కృపను పొందే మార్గమే తిరుప్పావై పారాయణం అని వ్రతంలో పాల్గొన్న భక్తులకు ప్రబోధించారు చిన్నజీయర్ స్వామి.

1495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles