నీదీ నాదీ ఒకే కథ..యువతరం వ్యథ


Wed,March 21, 2018 12:30 AM

సినిమా ఈజ్.. ఆల్‌ఎబౌట్ కనెక్షన్. తెరపై కదిలే చిత్రాలు.. తెర ముందు కూర్చున్న ప్రేక్షకున్ని కదిలించాలి. ఆ పాత్రలతో కనెక్ట్ అవ్వాలి. నీదీ నాదీ ఒకే కథ అంటూ.. ప్రేక్షకులను టైటిల్‌తోనే కనెక్ట్ చేసిన ఈ కథ.. ఏ ఇద్దరిదో కాదు.. మన అందరి కథ. మన పక్కింటి అబ్బాయి కథ.. ఎదురింటి అమ్మాయి కథ. చదువు పూర్తయ్యాక.. జీవితంలో సెటిలవ్వడానికి మధ్యన ప్రతి యువకుడూ పడే వ్యథ ఇది. ఈ ఫేజ్‌లో ఒక్కొక్కరి స్థితి ఒక్కోలా ఉంటుంది, కానీ అందరిదీ ఒకే పరిస్థితి. యువతలో 80 శాతం మంది తమకోసం కాకుండా..జీవితంలో రాజీపడి ఇతరుల కోసం బతుకున్నారు. అదీ.. అయినవాళ్లు ఆనందానికి, సంపాదనకు ముడి పెట్టడం వల్లే. అసలు ఆనందం అంటే ఏమిటి? మంచి ఉద్యోగం సంపాదించడమా? లక్షలు కూడబెట్టడమా? నచ్చినట్లు బతకడమా?.. అంటూ సోకాల్డ్ మిడిల్‌క్లాస్ మైండ్‌సెట్‌ను ప్రశ్నిస్తున్నాడు నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల. మొదటి సినిమాతోనే యువతలో ఆసక్తిని రేకెత్తించారీయన. దీంతో యువత ఇప్పుడు సోషల్‌మీడియాను వేదికగా చేసుకొని ఏందిరా మీ జనాల గోల? అంటూ రచ్చ రచ్చ చేస్తూ కొత్త గళం వినిపిస్తున్నది. ఈ నెల 23న నీదీ నాదీ ఒకే కథ సినిమా విడుదల సందర్భంగా ఆ కథ వెనుక కథే.. ఈ కథనం.
Venu
విజయానికి ఐదు మెట్లు అంటారొకరు. ఆ ఐదు మెట్లు ఎలా ఎక్కాలో మెదడుకు ఎక్కించుకునే ప్రయత్నం చేస్తుంది యువతరం. ఇంతలోనే ఆయనే విజయానికి ఆరో మెట్టు అంటారు. ఇంతకీ విజయానికి ఎన్ని మెట్లు? ఐదా.. ఆరా? అసలు విజయానికి మెట్లుంటాయా? షార్ట్ కట్లుంటాయా? అసలేమిటీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్? నిజంగానే పుస్తకాలను చదివి మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవచ్చా?- ఇక్కడ ఎవరో చెప్పిన ఓ మాట గుర్తుకొస్తున్నది.. పిల్లల్ని బుద్ధిమంతులుగా పెంచడం ఎలా? అనే పుస్తకం రాసినాయన కొడుకు బుద్ధిహీనుడయ్యాడట. ఇక్కడ పుస్తకాలను తప్పుపట్టడం లేదు. అందులోని కంటెంట్ గురించే ఈ ప్రశ్న. మన దేశంలో మత ప్రచార పుస్తకాల తర్వాత అంతటి బోగస్ పుస్తకాలు.. ఏవైనా ఉన్నాయంటే అవి వ్యక్తిత్వ వికాస పుస్తకాలే. ఒకరు ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అలా ఉంటేనే విజయం లభిస్తుంది.. ఇలా ఉంటేనే వికాసం వస్తుంది.. అని ఎలా చెప్పగలరు? హౌ? ఈ ప్రపంచంలో ఎవరికి వారూ యునిక్. ఎవరికి వారు ప్రత్యేకం. ఎవరి పర్సనాలిటీ వారికి ప్రత్యేకమైనది. వారి జీవితంలో ఎదురయ్యే వ్యక్తులు, పరిస్థితులే ఆ వ్యక్తిని వికాసం వైపో, వినాశనం వైపో నడిపిస్తాయి.. ఇలాంటి వ్యక్తులను, పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువకుని కథే నీదీ నాదీ ఒకే కథ. తనకు నచ్చినట్లు ఉండలేక, తన వాళ్ల కోసం తన ఇష్టాయిష్టాలను చంపుకోలేక.. మానసిక వ్యథ అనుభవిస్తూ ఆత్మన్యూనతా భావానికి గురై దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక తండ్లాడే నీలాంటి యువకుని గాథ. ఇదొక డిఫరెంట్ ఫేజ్. జీవితంలో చదువుకు, స్థిరపడడానికి మధ్య ఉండే ఈ ఫేజ్‌ను ఫేస్ చేయని వారుండరు.. దీన్ని అప్పట్లో అనుభవించిన వారు ఇప్పుడు రాజీ పడి ఎక్కడో అక్కడ స్థిరపడి ఉండొచ్చు. కొందరు ఇప్పుడు ఇదే ఫేజ్‌ను అనుభవిస్తూ ఉండొచ్చు. ఇంకొందరు రేపు ఇదే స్థితిని అనుభవించాల్సి రావొచ్చు. అలాంటి వారిందరికీ కనెక్ట్ అయ్యే, కదిలించే
కథ ఇది.

కథకు స్ఫూర్తి

చలం ఒక మాటన్నారు - ఆనందం మనిషి హక్కు అని.. ఈ కథ ఈ మాట నుంచే పుట్టింది అంటాడు వేణు ఊడుగుల. నీది నాది ఒకే కథ.. ద్వారా ఈ ఆనందం ఎలా పొందాలో చూపించాం. నిజంగానే పిల్లలకు చదువుపై చాలా ఇష్టం ఉంటే చదివించండి. కానీ చదువు రూపంలో ఎలా తయారు చేస్తున్నారో ఆలోచించుకోవాలి. వాళ్లు రోబోలుగా మారుతున్నారా? వారి సృజనాత్మకత పెంపొందుతున్నదా? అస్తమానం పోటీ పోటీ అని వాళ్లను పొడుస్తున్నారా? అలా చేయడం వల్ల ఏమవుతుంది? అందరికంటే ముందుండాలి అనే ఒక యాంటీ సోషల్ థాట్ పెరిగిపోయి ముందుండడం అనే పోటీలో పడి ఎమోషన్స్‌ను కోల్పోతుంటారు. ఆ ఇంటెన్షన్ వల్ల ప్రేమ.. మానవీయత కోల్పోయి రోబోల్లాగా తయారవుతున్నారు. పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయనీయండి. ట్యాక్సీ నడుపుకోవాలనుకునేవాన్ని ట్యాక్సీనే నడుపుకోనివ్వాలి. ఇవాళ డ్రైవర్ అయుండొచ్చు. రేపు ఓనరవుతాడేమో. కొద్దిరోజులకు నాలుగు ట్యాక్సీలు తీసుకుంటాడేమో. మరికొన్ని రోజులకు పదిమందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదుగుతుండొచ్చు కదా. ఎవరికి తెలుసు జీవితం ఎవర్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో? ఈ మాత్రం దానికి చదువండీ.. అదండీ.. ఇదండీ.. అంత సంపాదించండి.. ఇంత సంపాదించండి అని దొబ్బడమెందుకు? అసలు సంపాదనకు.. ఆనందానికి సంబంధం ఉందా ఎక్కడైనా? ఒకేవేళ ఉంది అనుకుంటే ఇవాళ లక్షలు సంపాదించేవాళ్లు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? మనిషికి ఆనందంగా ఉండడమే ముఖ్యం. ఏ మనిషైతే ఆనందంగా ఉంటాడో అతడే జీవితంలో సెటిల్ అయినట్లు లెక్క. లక్షలు కూడబెడితే సెటిల్ అయినట్లు కాదు. ఈ అంశాన్నే చక్కటి భావోద్వేగాలతో చెప్తున్నాం మా సినిమాలో. నా జీవితంలో.. మిగతావాళ్ల జీవితాల్లోంచి పుట్టుకొచ్చిన రియల్ లైఫ్ ఎలిమెంట్ ఇది అని చెప్పారు వేణు.


సోషల్‌మీడియాలో హల్ చల్

ఈ మధ్యకాలంలో పెళ్లిచూపులు.. అర్జున్‌రెడ్డి లాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల టేస్ట్ మారింది అనే నమ్మకం కలుగుతున్నది. ఆ నమ్మకాన్ని మా సినిమా ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తుంది అనడానికి సోషల్‌మీడియానే ఒక ఉదాహరణ. చాలామంది నాన్న ఫీలవుతాడేమో? అమ్మ ఏమనుకుంటుందో ఏమో అని నిజమైన ఎషెన్స్‌ను కిల్ చేసుకొని ఏదో ఒకదాంట్లో కాంప్రెమైజ్ అయి బతుకుతుంటారు. ఇష్టంతో చేసే పని చేయించాలి తప్ప.. తమ ఇష్టాన్ని పిల్లలపై రుద్దొద్దు. అందరూ బాగా డబ్బు సంపాదించాలి అంటున్నారు కానీ ఆనందంగా ఎలా బతుకాలో చెప్పడం లేదు? మా సినిమా చెప్తుంది ఇవ్వన్నీ. ఈ పాయింట్‌కు చాలామంది కనెక్ట్ అయినట్లున్నారు. అందుకే సోషల్‌మీడియా మొత్తం ఈ సినిమాను తమ భుజాలపై వేసుకొని ప్రచారం చేస్తున్నది. ఈ సినిమా పాటలకు కవర్స్ వచ్చాయి, డాన్స్ వీడియోలు వచ్చాయి. కోలాటం, పౌరాణికం లాంటి వివిధ కళారూపాల్లో ఎవరికి వారు ప్రమోషన్ చేస్తున్నారు. కొందరు స్ఫూఫ్‌లు చేస్తున్నారు. ఇంకొందరు మైమ్‌లు చేస్తున్నారు. కొందరు ఫేస్‌బుక్‌లో పోస్టు రాయకపోతే ఏదో మిస్సయిపోతామేమోనని రాసేస్తున్నారు. కొందరు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మొత్తంగా విడుదలకు ముందు సోషల్‌మీడియా ద్వారా సినిమా జనాల్లోకి వెళ్లిపోయినందుకు యూనిట్ హ్యాపీగా ఉంది.

తొలి తెలుగు డోగ్మా 95

నీదీ నాదీ ఒకే కథ.. తెలుగులో డోగ్మా 95 టెక్నిక్‌తో వస్తున్న తొలి సినిమా. ఈ కథ చాలా సహజమైనది. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇలాంటి కథను చెప్పడానికి ఎలాంటి టెక్నాలజీ వాడాలని ఆలోచించినప్పుడు డోగ్మా 95 కరెక్ట్ అనిపించింది. ఈ టెక్నిక్ ద్వారా చిత్రీకరిస్తే సహజంగా పక్కింట్లో.. ఎదురింట్లో సంఘటనలు జరిగినట్లు తెరమీద మనకు కనిపిస్తయి. ఎలాంటి క్రేన్స్ ఎక్విప్‌మెంట్స్ వాడలేదు. నీదీ నాదీ ఒకే కథ.. రెగ్యులర్ సినిమా కాదు. అందులో ఉండే ఫైట్లు.. బాంబ్ బ్లాస్ట్‌లు.. ఫారిన్‌లో డ్యూయెట్లు మా సినిమాలో ఉండవు. నీలాంటి నాలాంటి ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రుద్రరాజు సాగర్ అనే ఒక వ్యక్తి జీవితాన్ని రిప్రెజెంట్ చేసే వాస్తవ కథ. ఒక రకంగా ఇది సినిమా మాత్రమే కాదు, జీవితం కూడా. వాస్తవాన్ని, సహజత్వాన్ని ప్రతిబింబించే సినిమా. ఒక ఇండివిడ్యువల్ కథను అనుకున్నది అనుకున్నట్లుగా తీశాం అని చెబుతున్నారు వేణు ఊడుగుల. మరి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే.. అన్ని కథలు కమర్షియలే. సినిమా ద్వారా ప్రేక్షకుడిని నవ్వించడమో.. ఏడిపించడమో లాంటి ఎమోషన్‌కు గురిచేస్తే అది పక్కా కమర్షియల్. ఫైట్లు.. డ్యూయెట్లు మాత్రమే కమర్షియల్ కావు. విదేశాల్లో పాటలు.. విపరీతమైన ఫైట్లు మాత్రం ఉండవు. నీది నాది ఒకే కథ అన్ని ఎమోషన్లను పండిస్తూ పక్కా కమర్షియల్ సినిమాగా నిలుస్తుంది. ఫస్ట్ టైమ్ ఇన్ టాలీవుడ్ డోగ్మా 95 టెక్నిక్ వాడిన సినిమా నీది నాది ఒకే కథ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. అని చెప్పారు వేణు.

నాన్న పైనుంచి ఈ విజయాన్ని చూస్తారు..

Venu2

టీజర్.. ట్రైలర్, సాంగ్స్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తున్నది. ఎలా అనిపిస్తున్నది?

-సూపర్. సినిమాకు ఇంతకంటే రెట్టింపు స్పందనను.. విజయాన్ని తీసుకొస్తుందనే నమ్మకం ఉన్నది. నిజాయితీగా కథ రాసి సెన్సిబిల్‌గా తెరకెక్కిస్తే విజయం వరిస్తుందనే నమ్మకం ఇంకా బలపడింది.

సెన్సార్ వాళ్లు కూడా క్లీన్ యూతో బావుందనన్నారట.. మీకెలా అనిపిస్తున్నది?

-సెన్సార్ వాళ్లు చూసి డైరెక్టర్‌ని పిలవండీ అన్నారు. నేను లోపలికి వెళ్లగానే సెన్సార్ పెద్దలు మైండ్ బ్లోయింగ్ అన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదన్నారు. ఒక గంటసేపు మాతోనే ఉన్నారు. అవసరమైతే ప్రెస్‌మీట్ పెట్టి మరీ జనాలకు చెప్తాం ఈ సినిమా చూడమని అన్నారు. ఇలాంటి సినిమా సమాజానికి అవసరం అన్నారు. 80 పర్సెంట్ స్టూడెంట్స్.. పేరెంట్స్‌కు యాప్ట్ అయ్యే సినిమా అన్నారు. క్లీన్ యూ కోసం కొన్ని కటింగ్ చెప్తారనుకున్నా. కానీ అవేవీ లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడం నిజంగా గర్వంగా.. సంతోషంగా ఉన్నది.

సినిమా పాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.. ఈ బ్యూటీ ట్రీట్‌మెంట్ ఎలా సాధ్యమైంది?

-ప్రతి పాటలో స్వచ్ఛమైన సాహిత్యం ఉంటుంది. ప్రతీ పాటలో కథ నడుస్తుంది. ఏ పాటలో అయితే కథ నడుస్తుందో ఆటోమేటిగ్గా ఆ కథలో విలువలు ఉంటాయి. కథను నడిపించే క్రమంలో ఒక రైటర్‌గా.. డైరెక్టర్‌గా మంచి సాహిత్యం రావడానికి మంచి టీమ్‌ను ఎంచుకున్నాను.

యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే సినిమాలా అనిపిస్తున్నది? మిగతా ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నారు?

-హండ్రెడ్ పర్సెంట్ యూత్‌కు నచ్చే సినిమా. పేరెంట్స్‌కి నచ్చే సినిమా. ఫ్యామిలీ సినిమా. అందరూ చూడాల్సిన సినిమా. ఒక చెల్లె అక్క.. తమ్ముడు.. అన్నా.. అమ్మానాన్నలతో కలిసి చూడాల్సిన అవసరమైన సినిమా. చూస్తారనే నమ్మకం కూడా ఉన్నది. ఇంట్లో ఒక్కరు చూసి ఇంటిల్లిపాదినంతా నీది నాది ఒకే కథను చూపించడానికి తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది.

త్వరలో రిలీజ్.. టెన్షన్‌గా ఉన్నారా? కాన్ఫిడెంట్‌గా ఉన్నారా?

-టెన్షన్ ఇప్పటివరకూ లేదు. వేరే టెన్షన్లు ఉండొచ్చేమోగానీ సినిమా గురించి అసలు టెన్షనే లేదు. నేనొక్కడినే కాదు యూనిట్ మొత్తం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంది. వందకు వందశాతం ఎఫర్ట్ పెట్టి నిజాయితీగా పనిచేశాం కాబట్టి ఈ కాన్ఫెడెంట్ మాలో ఉన్నది.

హీరో శ్రీ విష్ణు గురించి?

-శ్రీవిష్ణు మంచి నటుడు. గొప్ప వ్యక్తిత్వం గలవాడు. ఆయనకు నటనే కాదు డైరెక్షన్ గురించి తెలుసు. రైటింగ్ తెలుసు. అందుకే కథల్ని ఎంచుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా సెలెక్టివ్‌గా ఉంటారు. మెంటల్ మదిలో.. అప్పట్లో ఒకడుండేవాడు.. నీది నాది ఒకే కథ నావెల్టీ బేస్డ్ సినిమాలు ఎంచుకోవడాన్ని బట్టే ఆయన టేస్టేంటో అర్థమవుతుంది.

పుత్రోత్సాహం గురించి సినిమాలో చెప్పారు. మీ నాన్న ఆ పుత్రోత్సాహాన్ని చూడడానికి చేరువలో మీరున్నప్పుడే ఆయన మీకు దూరమయ్యారు. ఆ బాధను ఎలా భరిస్తున్నారు?

-నాన్న పై నుంచి నా విజయాన్ని చూస్తూ పుత్రోత్సాహం పొందుతారు. ఇంకొక 15 రోజులు బతికి ఉంటే బాగుండేది. ప్రత్యక్షంగా చూసేవారు. నేను చాలా రోజులుగా సినిమా ప్రయత్నాల్లో ఉన్నాననీ.. డైరెక్టర్ కావడానికి ప్రయత్నిస్తున్నానని ఆయనకు తెలుసు. తరుచూ అంటుండేవారు.. ఎప్పుడవుతావురా డైరెక్టర్‌వు అని. 8 ఏండ్లుగా ట్రయల్స్‌లోనే ఉన్నా. ఈ సినిమా స్టార్ట్ అయి కూడా 3 ఏండ్లు అవుతున్నది. ఇంకెప్పుడు రిలీజ్ అంటుండేవారు. నాన్న హాస్పిటల్లో ఉన్నారు. నాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి. ఇంట్లోవాళ్లకు నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక.. నాన్న బానే ఉన్నారు, నువ్వు నీ పని చూస్కో.. ఇక్కడ మేం చూస్కుంటాం అన్నారు. నాకు ఉండాలనిపించలేదు. వెళ్లాను. నాన్నా అని పలుకరిస్తే లేచి చేతిలో చెయ్యేసి సినిమా ఎప్పుడురా అని శ్వాస విడిచారు. అదే చివరి మాట.. అదే చివరి చూపు. సినిమా చూడకుండానే చనిపోయారు.

ఎల్లుండే సినిమా విడుదల? ప్రచారం ఎలా జరుగుతున్నది?

-సినిమా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఎలాంటి ప్రమోషన్ లేకుండానే సోషల్‌మీడియా ద్వారా యూత్ తమ భుజాలమీదేసుకొని మంచి సినిమాగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బుక్‌మైషోలో 94 శాతం ఓటింగ్ వచ్చింది. అందుకే వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, మదన్, దేవకట్ట ఈ సినిమా చూశారు. మంచి సినిమా అన్నారు. చాలా సంతోషం. మా సినిమా రిలీజ్‌కు ముందే సెన్సేషన్ అయ్యేందుకు కృషి చేసిన అందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.
Venu1

వరంగల్‌లోని ఓ మామూలు గ్రామం నుంచి బిగ్ స్క్రీన్ వరకు.. మీ ప్రస్థానం నాలుగు మాటల్లో?

-మాది చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లి గ్రామం. మూడో తరగతి వరకు అక్కడే చదువుకున్నా. తర్వాత హన్మకొండలోని బాలసముద్రం వచ్చా. డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చాను. సినిమా కోసమని చాలా తిరిగాను. ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో కొంతకాలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేశాను. చదువడం.. రాయడం అలవాటు. వాటితోనే ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ కంపెనీలో చేరాను. నా టాలెంట్ నిరూపించుకొని క్రమంగా సినిమాల్లోకి వచ్చేశాను. బ్రేక్ కోసం ఇన్నాళ్లు వేచి ఉన్నా. ఇన్నేళ్ల నా కృషి నీది నాది ఒకే కథ.

1043
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles