నిలవాలి.. గెలవాలి..


Sat,January 26, 2019 12:50 AM

stockmarket
గడిచిన సంవత్సరం మదుపరులను ఎన్నో రకాలుగా పరీక్షించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు విపరీతమైన ఒడిదుడుకులకు లోనయ్యారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్).. ఈక్విటీ మార్కెట్ల రీ-రేటింగ్, మళ్లీ ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను (ఎల్‌టీసీజీ), కార్పొరేట్ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు, స్థూల ఆర్థిక హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ విపత్కర పరిణామాలు, స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వర్గీకరణలతో ప్రభావితమయ్యాయి. మదుపరుల నుంచి ఫండ్ మేనేజర్లదాకా అందరిపైనా వీటి ప్రభావం ఉండగా, సలహాదారులకూ మినహాయింపు లేకుండాపోయింది. స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ విలువ హరించుకుపోగా, లార్జ్‌క్యాప్ షేర్లు ప్రతికూలతల్ని తట్టుకుని కాస్తోకూస్తో లాభాలను పొందగలిగాయి. వీటిలో ఐటీ రంగ షేర్లు మినహా చాలావరకు ఇతర రంగాల షేర్ల విలువ పెరిగింది.


స్టాక్ మార్కెట్లలో గత ఏడాది అనేక ఎదురుదెబ్బలను మదుపరులు చవిచూశారు. మదుపరులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చిన పోర్టుఫోలియోలు కూడా ఏమీ లేవు. డాలర్ విలువ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను నిలకడగా పెంచుతూపోవడం వంటి పరిణామాల మధ్య విదేశీ మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకే మొగ్గుచూపారు. కానీ దేశీయ మదుపరులు మాత్రం పెట్టుబడులకే ఆసక్తి కనబరిచారు. విశ్వాసాన్ని వీడకుండా ముందుకు సాగారు. అయినప్పటికీ స్థూలంగా సూచీలు నష్టాలనే చూపడంతో ఒక్కసారి పోర్టుఫోలియోల పునఃపరిశీలన అవసరం ఉందన్న భావన భారతీయ మదుపరుల్లో కలిగింది. ప్రస్తుత ఫండ్స్‌పై వారికి అనేక అనుమానాలూ తలెత్తాయి.


పెట్టుబడులు అనేవి లాభనష్టాలకు అతీతంగా ఉంటాయి. ఒక్కోసారి లాభాలను అందించిన పెట్టుబడులు.. మరికొన్నిసార్లు నష్టాలకే పరిమితం కావచ్చు. అంతమాత్రం చేత పెట్టుబడులకు దూరం కావడం అసలైన మదుపరుల లక్షణం కాదు. వరుసగా నష్టాలు వాటిల్లుతున్నప్పుడు.. మన నిర్ణయాలను సమీక్షించుకోవడం ఉత్తమం. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేకానేక అంశాలకు లోబడి ఉంటాయి. దేశ, విదేశీ పరిణామాలకు ప్రభావితం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒడిదుడుకులు అత్యంత సహజం అనేది ప్రతీ ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ షేర్లు ఎలాంటి పరిణామాలకు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నాయి అన్నది గమనిస్తే.. నష్టాల నుంచి బయటపడే వీలున్నది. ప్రతీ షేర్‌పై ఏదో ఒక అంశం ప్రభావం అనేది తప్పక ఉంటుంది. అది కొన్నిసార్లు లాభిస్తే, మరికొన్నిసార్లు నష్టపరుస్తుంది. కనుక తరచూ ప్రతికూల పరిణామాలే ఎదురైతే సదరు షేర్లలో పెట్టుబడులకు దూరంగా ఉండటమే మంచిది.


ఇక మొదటగా, మదుపరి అంచనాలు ఏవిధంగా ఉన్నాయి.. ఏ పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నాడు.. అన్నదానిపై సలహాదారులు దృష్టిసారించాలి. దీంతో ఎలాంటి పెట్టుబడులకు మదుపరి నైజం సరిపోతుందన్నదానిపై ఓ అవగాహనకు రాగలం. అప్పుడే మదుపరుల అంచనాలకు తగ్గట్లుగా ప్రతిఫలాల్ని సృష్టించగలం. మదుపరులు కూడా మరిన్ని పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తారు. తమ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులపై ముందుకు రాగలుగుతారు. అయితే మొదట్లోనే ప్రతికూల పవనాలు వీస్తే మాత్రం జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పెట్టుబడులు అంటేనే మదుపరులు భయపడిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఫండ్ మేనేజర్లు.. తమ క్లయింట్లను తగిన విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది.


రెండోది, అధిక లాభాలు అనేవి ఎప్పుడూ సాధ్యం కాదు. ముఖ్యంగా తరచూ ఒడిదుడుకులకు లోనయే స్టాక్ మార్కెట్లలో ఇది అస్సలు వీలుపడదు. కాబట్టి మదుపరులు ఈ నిజాన్ని గ్రహించాలి. సలహాదారులూ వారికి ముందే తెలియజేస్తే.. ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందులుండవు. అయితే ఏ షేర్లలో లేదా ఎలాంటి పెట్టుబడులు ఎక్కువ లాభాల్ని అందిస్తాయన్నది తెలుసుకుని అడుగేస్తే చక్కని రాబడులను అందుకోగలం. అంతేగాక స్వల్పకాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక లాభాలపై స్పష్టత ఉండటం అవసరం. కొన్ని పెట్టుబడులు త్వరగా లాభాలను పంచిపెడితే.. మరికొన్ని ఆలస్యంగా ప్రతిఫలాల్ని అందిస్తాయి. త్వరగా లాభించే పెట్టుబడులు.. అంతే త్వరగా ఒడిదుడుకులకు లోనవుతాయన్న విషయం మరువరాదు.


మూడోది, నిన్న నష్టాలను అందించిన పెట్టుబడులు.. నేడు లాభాలను ఇవ్వవచ్చు. రేపు తిరిగి నష్టపోనూవచ్చు. కాబట్టి పెట్టుబడులను ఎప్పుడూ ఒకే రకంగా అంచనా వేయడం సరికాదు. ఇప్పటిదాకా మంచి ప్రతిఫలాల్ని అందించాయి.. ఇకపైనా ఇలాగే ఉంటుంది అనుకోవడానికి ఎంతమాత్రం వీల్లేదు. భవిష్యత్తును ఎవరూ నూటికి నూరుపాళ్లు అంచనా వేయలేరు. పెట్టుబడులకు సురక్షితం అనుకున్న రంగాలేవీ లేవంటే అతిశయోక్తి కాదు. లాభాలపై ఎవరూ కూడా స్పష్టమైన పూచీకత్తు ఇవ్వలేరు. నమ్మకంతోనే ముందుకు సాగాలి. పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి అన్న పెద్దల సామెత గుర్తుండే ఉంటుంది. కాబట్టి పోయినేడాది నష్టపోయాం.. ఈ ఏడాది కూడా నష్టపోతామనే భావన సరికాదు. ఆశాభావంతో ముందుకెళ్తే అంతిమ విజయం మనదే.


నాలుగోది, పెట్టుబడులపట్ల చిత్తశుద్ధి అవసరం. తగినంత సమయం కేటాయిస్తేనే స్టాక్ మార్కెట్లలో రాణించగలుగుతాం. సరైన వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు అత్యంత సున్నితమైన పెట్టుబడుల వేదికలు. ప్రతి చిన్న అంశం సూచీలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పెట్టుబడులకు ముందు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని అడుగేయాలి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నది కూడా గమనిస్తూ ముందుకెళ్తే.. మన పెట్టుబడులు అర్థవంతంగా ఉంటాయి. లేదంటే ఆరంభంలోనే నష్టాలు పలుకరించడం ఖాయం. దీర్ఘకాలంలో లాభాలకు అవకాశాలున్న రంగాలను ఎంచుకుంటే నిర్దిష్టమైన, స్థిరమైన ప్రతిఫలాలను పొందవచ్చు.


చివరగా, సమయానుసారంగా పెట్టుబడుల తీరుతెన్నులను పరిశీలించడం మదుపరుల బాధ్యత. ఈ విషయంలో ఏమరుపాటు అస్సలు పనికిరాదు. మన నిర్ణయాలు లాభిస్తున్నా.. సమీక్ష అనేది అత్యంత ఆవశ్యకమే. నష్టాలు వచ్చినప్పుడే సమీక్షించుకుందాం.. అప్పటిదాకా మన నిర్ణయాలు సరైనవేనన్న ఒంటెత్తు పోకడ మంచిది కాదు. అతి విశ్వాసం ఎప్పుడూ కూడా చేటే. అది మనలోని తెలివిని, సమర్థతను మింగేస్తుంది. కాబట్టి నిత్య విద్యార్థిలా ఉంటేనే విజయాలు చేకూరుతాయి. ఇకపోతే పోర్టుఫోలియోల ఎంపిక చాలాచాలా ముఖ్యమైనది. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. నిపుణుల ద్వారా సరైన సలహాలతో ముందుకెళ్తే ఆశించిన లాభాలు అందివస్తాయి.


NARESH-KUMAR
కే నరేశ్ కుమార్
సహ వ్యవస్థాపకులు, వెలాసిటీ,
వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ
[email protected]

746
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles