నిమిషానికే చెల్లించండి!


Wed,September 12, 2018 01:17 AM

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా? అర్జంటుగా మీటింగుకో, పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లాలా? కాసేపు రెస్ట్ తీసుకొని, స్నానం చేసుకొని వెళ్దామనుకుంటున్నారా? ఇంటికెళ్లి ఫ్రెషప్ అయ్యే సరికి లేటవుతుందా? మీ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం పోబైట్. దీనికి సబంధించిన పూర్తి వివరాలు ఈ కథనం చదివితే తెలుస్తుంది.
Hotels
పొయ్యిమీద కుతకుత ఉడుకుతున్న అన్నం గిన్నెను చూసి జేమ్స్‌వాట్‌కి రైలు కనిపెట్టే ఆలోచన వచ్చింది. ఇలా కొన్నిసార్లు మనకు తెలియకుండానే అద్భుతాలు చేస్తాం.. అద్భుతంగా ఆలోచిస్తాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదురైన ఇబ్బందులే కొన్నిసార్లు పరిష్కారాన్ని చూపిస్తుంటాయి. నిఖిల్‌రెడ్డి గుర్రాల విషయంలో కూడా అదే జరిగింది. అసలు నిఖిల్ ఏం చేశాడు? ఏ ఇబ్బందికి ఏ పరిష్కారం కనుగొన్నాడో తెలుసా?

అనిత, రాజేష్ ఇద్దరూ హయత్‌నగర్ నుంచి గచ్చిబౌలికి మూడేండ్ల పాపతో కలిసి దగ్గరి బంధువుల ఫంక్షన్‌కి బయల్దేరారు. కారులో సగం దూరం రాగానే.. పాపకు ప్రయాణం పడక వాంతులు చేసుకుంది. పాప కోసం తిరిగి ఇంటికెళ్దామంటే అప్పటికే చాలా దూరం వచ్చేశారు. పోనీ.. ఫంక్షన్‌కి వెళ్దామంటే పాప సిక్ అయింది. పోనీ ఫంక్షన్‌కి డుమ్మా కొడుదామంటే వాళ్లేమో దగ్గరి బంధువులాయె. ఇప్పుడేం చేయాలి? వెంటనే మొబైల్ తీశాడు. అందులో ఓ యాప్ ఓపెన్ చేశాడు. దగ్గర్లోని హోటల్‌రూమ్‌లో నాలుగు గంటల కోసం రూమ్ బుక్ చేశాడు. పాపను, అనితను అక్కడ డ్రాప్ చేసి, పాపకు మెడిసిన్ ఇచ్చి తను ఫంక్షన్‌కి వెళ్లి వచ్చాడు. అక్కడి నుంచి వాళ్లను పికప్ చేసుకొని ఇంటికెళ్లిపోయాడు.

జహీర్ ముంబై నుంచి ఓ కాన్ఫరెన్స్ పని మీద హైదరాబాద్ వచ్చాడు. ఉదయం పదిగంటల నుంచి సాయం త్రం ఆరింటి వరకు కాన్ఫరెన్స్. కానీ మధ్యాహ్నం రెండింటికే కాన్ఫరెన్స్ మీటింగ్ అయిపోయింది. ైఫ్లెట్ టికెట్ ఏమో రాత్రి ఏడింటికి బుక్ చేసుకున్నాడు. అప్పటి వరకు జహీర్ ఎక్కడుండాలి? ఏం చేయాలి? ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్దామంటే హైదరాబాద్‌లో బంధువులెవరూ లేరు. పోనీ హోటల్ బుక్ చేసుకుందామంటే.. మూడు గంటలు గడుపడం కోసం.. 24 గంటలకు డబ్బు చెల్లించడం ఎందుకు అని ఆలోచిస్తున్నాడు. అంతకుముందు ఫ్రెండ్స్ ఏదో యాప్ గురించి మాట్లాడుకుంటుండగా విన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే వారికి ఫోన్ చేసి ఆ యాప్ పేరు కనుక్కున్నాడు. ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసి మూడు గంటల పాటు హోటల్‌రూమ్ బుక్ చేసుకున్నాడు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు తను ఎంతసేపు హోటల్ రూమ్‌లో గడిపాడో ఆ సమయానికి మాత్రమే డబ్బులు చెల్లించాడు.

ఇది నిజంగా సాధ్యమేనా? హోటల్లో రూమ్ తీసుకోవాలంటే 24 గంటలు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 24 గంటలు అందులో గడిపినా, గడపకపోయినా డబ్బులు మాత్రం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా ఒక గంట ఎక్కువ గడిపినా.. మరో 24 గంటలకు డబ్బులు చార్జ్ చేస్తారు. మరి రాజేష్ హోటల్ నాలుగు గంటల కోసం బుక్ చేసుకున్న యాప్ ఏంటి? జహీర్ తన ఫ్రెండ్స్‌ని అడిగి మరీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని తన ైఫ్లెట్ టైమ్‌కి సరిపోయేలా హోటల్ రూమ్ బుక్ చేసుకున్న యాప్ పేరేంటి? అదే.. పోబైట్ యాప్. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న కథేంటి?

ఇలా మొదలైంది..

హైదరాబాద్‌కు చెందిన నిఖిల్‌రెడ్డి గుర్రాల పదిహేడు సంవత్సరాల వయసులోనే చదువు కోసం అమెరికా వెళ్లాడు. చదువు అయిపోయి, ఉద్యోగం కూడా అక్కడే చేస్తున్నాడు. 2011లో ఒకరోజు ఆఫీస్ మీటింగ్ నిమిత్తం ముంబై వెళ్లాడు. అక్కడ అనుకున్న టైమ్ కంటే ముందే మీటింగ్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఓ కాఫీషాప్‌లో కూర్చుని కాఫీ తాగుతూ కాలక్షేపం చేశాడు. బిల్లు చూస్తే.. రూ.1800 అయింది. ఈ మాత్రం దానికి ఓ హోటల్ రూమ్ బుక్ చేసుకునేవాడిని కదా అనుకున్నాడు. అసలు రెండు, మూడు గంటలు టైమ్ గడిపి పోయేలా హోటల్ సౌకర్యం ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా.. అదే కాఫీషాప్‌లో టిష్యూ పేపర్ మీద తన ఐడియాలన్నీ రాసుకున్నాడు. ఏం చేయొచ్చు? ఎలా చేయొచ్చు? నోట్ రాసుకున్నాడు. అమెరికా వెళ్లిన తర్వాత తన తమ్ముడు నిహాల్‌కి ఈ ఐడియా గురించి చెప్పాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా నిఖిల్ భార్య మేఘన కూడా వచ్చింది. ముగ్గురు చాలాసేపు చర్చించారు.

ఇంతకు ముందు లేదా?

ముగ్గురూ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఇంతకు ముందు ఇలాంటి సర్వీస్ ఉందా? ఉంటే ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది? దాని వివరాలేంటి? ఒకవేళ ఇలాంటి సర్వీస్ లేకపోతే దీన్ని అమలు చేయడం ఎలా? అని ముగ్గురూ ఒక్కో బాధ్యతను తీసుకొని రీసెర్చి చేశారు. ఓ రీసెర్చి సంస్థను సంప్రదించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత మెల్లగా ఐడియా డెవలప్ చేయడం మొదలుపెట్టారు. టెక్నికల్‌గా వచ్చే సమస్యలు, కస్టమర్లను తెచ్చుకోవడం ఎలా? హోటల్ యాజమాన్యాలతో మాట్లాడడం? ఇలా పని విభజన చేసుకున్నారు. ఇంతకు ముందు ఇలాంటి సర్వీస్ లేదని నిర్ణయించుకున్న తర్వాత రంగంలోకి దిగారు.

విస్తరిస్తాం..

ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ సర్వీసు అందుబాటులో ఉంది. సిటీలో ఉన్న 14 త్రీ స్టార్, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో పోబైట్ రూమ్స్ ఉంటాయి. కనీసం మూడు గంటల నుంచి ఆ పైన ఎంతసేపైనా మీరు ఉండొచ్చు. మీరు హోటల్ రూమ్‌లో గడిపే సమయం పెరుగుతున్న కొద్ది మీరు చెల్లించాల్సిన రేటు తగ్గుతుంది. యాప్ ద్వారా హోటల్‌రూమ్ బుక్ చేసుకొని ఏదైనా ఐడీ చూపిస్తే రూమ్‌లోకి అనుమతిస్తారు. దూరప్రాంతాల నుంచి నగరానికి వచ్చి, రెండుమూడు గంటలు సేద తీరాలనుకునేవారికి ఇది మంచి సదుపాయం. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలే ఉంటాయి. పెద్ద హోటల్‌లో గడపాలి అని కోరుకునే మధ్య తరగతి వారికి ఇది మంచి అవకాశం.
- నిఖిల్‌రెడ్డి గుర్రాల, సీఈవో, ఫౌండర్

దీనర్థం ఏంటి? ఎలా పనిచేస్తుంది?

పోబైట్ అంటే పోలిష్ బాషలో ఉండండి అని అర్థం. చాలా పేర్లను పరిశీలించిన తర్వాత ఈ పేరు ఫైనల్ చేశారు. పోబైట్ అనే పదం కూడా కొత్తగా ఉండడంతో చూసేవారు కూడా ఆసక్తి కనబరుస్తారనుకున్నారు. యాప్ ద్వారా పనిచేసే పోబైట్ సేవలు మూడు స్టెప్స్‌లలో బుక్ చేసుకోవచ్చు. అదెలా ఉంటే..

స్టెప్ 1


Hotel
యాప్ ఓపెన్ చేసి మీకు దగ్గర్లోని హోటల్ సెలక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 2


Hotel1
మీరు ఉండాలనుకుంటున్న సమయం సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3


howwork
మీరు ఉండాలనుకుంటున్న సమయానికి తగ్గట్టు అక్కడ నిర్ణీత రుసుము కనిపిస్తుంది. ఆ మొత్తాన్ని చెల్లించి చెక్ ఇన్ కావొచ్చు. ఆ తర్వాత మీరు అదనంగా ఎన్ని నిమిషాలు గడిపితే అంత సమయానికే ఇంత అని లెక్కగడుతారు.

984
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles