నిజాం న(ధ)గలు!


Sun,March 3, 2019 01:40 AM

19వ శతాబ్దంలోనే ప్రపంచ దేశాల చూపు మన భాగ్యనగరం మీద పడింది. కారణం.. వేల కోట్ల రూపాయల సంపద. కళ్లు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వజ్ర వైఢూర్యాలకు భాగ్యనగరం కేరాఫ్ కాబట్టి. మన దగ్గర దొరికిన వజ్రాలు, బంగారం, ముత్యాలు.. నిజాం నవాబు వంశీయులు యుద్ధాల్లో గెలిచిన వారసత్వ సంపద అంతా హైదరాబాద్ సంస్థానంలో కోలువుదీరింది. అయితే.. నిజాం పాలన తర్వాత ఆ సంపద మొత్తం ఏమైంది? ఎక్కడుంది? అనేది ప్రశ్న. ఆ సంపదలో కొంత మన భారత ప్రభుత్వం వద్ద ఉంది. వాటిల్లో కొన్నింటిని అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు. ఈ విశేషాల సమాహారం ఈ వారం సింగిడి కథనం. నిజాం వంశీయులు అప్పట్లోనే వజ్రాల వ్యాపారం చేయడంతో.. కోట్ల రూపాయల సంపద నగల రూపంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. అయితే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా నిజాం పాలన తర్వాత నగలు, ఆభరణాలు కనిపించలేదు. చాలా సంపద దేశం దాటి పోయింది. మరికొంత దొంగిలించబడింది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంపద కోసం వారసులు కొట్లాడుకున్నారు. దీంతో మిగిలిన నగలను వారసులు వేలం వేశారు. ఆ వేలంలో కొన్ని నగలను భారత ప్రభుత్వం 1995లో రూ. 218 కోట్లకు కొనుగోలు చేసింది. దేశం దాటిపోయిన చాలా సంపద లండన్‌లో ఉందని.. దాన్ని తమకు ఇప్పించమని నేటికీ నిజాం వారసులు పోరాడుతున్నారు.
diamond-necklace
నిజాం ఆభరణ సంపదను సుమారు 225 ఏళ్ల సేకరణగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వీటిపై విజయనగర రాజల శైలి, గోల్కొండ, బీదర్, బీజాపూర్ వారి శైలి కనిపిస్తుంది. ఈ సేకరణలో ఆయా సంస్థానాలకు చెందిన ఆభరణాలతో పాటు మొఘలాయి, భారతీయ శైలుల కలయికతో రూపుదిద్దుకున్న నగలు కూడా ఉన్నాయి. మొఘల్ చక్రవర్తులు, టిప్పు సుల్తాన్ సహా.. దేశంలోని వివిధ సంస్థానాల పాలకులు బహుకరించినవి, నిజాం సంస్థాన జాగీర్దార్లు తయారుచేయించిన వాటితో ఈ ఆభరణాల సంపద కళకళ లాడుతుండేది. 1870 నుంచి 1910 వరకు అంతర్జాతీయ నగల వ్యాపారుల నుంచి మీర్ మహబూబ్ అలీఖాన్ అనేక ఆభరణాలు కొనుగోలు చేశారు. అలెగ్జాండర్ మాల్కం జాకబ్ అనే ఇటాలియన్ వ్యాపారి జాకబ్ డైమండ్‌ను భారత దేశానికి తీసుకువచ్చి 1891లో ఆరవ నిజాంకు విక్రయించారు. ఆయన ఈ డైమండ్‌ను తన పాదరక్షలో అలంకరించుకున్నాడు. ఇదే డైమండ్‌ను ఏడవ నిజాం పేపర్ వెయిట్‌గా వాడుకున్నారు. 18వ శతాబ్దంలో ఇండియాలో హైదరాబాద్ ఒక్కటే డైమండ్ సప్లయర్‌గా ఉండేది.


Jewellery

విదేశాల నుంచి నిపుణులు!

నిజాం రాజులు హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ప్రాంతాన్ని ఆభరణాల తయారీ కేంద్రంగా మలుచుకున్నారు. ఇక్కడ వెండి, బంగారు, వజ్రాలతో ఎంతో సుందరమైన ఆభరణాలు తయారు చేసేవారు. ఇందుకు కళా నిష్ణాతులను ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాలనుంచి రప్పించేవారు. వీరిలో కొందరు హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. బంగారు, వెండి ఆభరణాలపై లతలు, నగిషీలు చెక్కడం వీరి ప్రత్యేకత. వీరితోపాటు గుజరాతీలు, మరాఠీలు, కన్నడిగులు కూడా ఆభరణాల తయారీలో పనివారిగా ఉండేవారు. విదేశాల నుంచి వచ్చిన పనివారు.. ఉంగరాల లోపలి భాగాల్లో కూడా పేర్లు రాయడంలో నిపుణులు. ఇస్కిందిరియా ఉంగరం ఇందుకు ఉదాహరణ.


Jewellery2

అరుదైన వ్రజ్రవైఢూర్యాలు

నిజాం పాలనలో మన గోల్కొండ వజ్రాల గనిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వజ్రాలతో పాటు మరకతం కూడా లభ్యమయ్యేది. వీటితో పాటుగా.. బర్మానుంచి తెచ్చిన రూబీలు, బస్రా, మన్నార్, గల్ఫ్, మన దేశంలోని తూర్పుతీరం నుంచి సేకరించిన ముత్యాలు నిజాం సేకరణలో ఉన్నాయి. గోల్కొండ వజ్రాలు, పచ్చలు, నీలాలు, పగడాలతో మొఘల్ కళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఆభరణాలు, అరుదుగా సంస్థా నాధీశులు ధరించే శిరోభూషణం సర్‌పేచ్, రష్యా గనుల రత్నాలతో పొదిగిన ఉంగరాలు నిజాం అమూల్య సంపదలో భాగం. అన్నీపోగ మిగిలినవి 210కి పైగా ఆభరణాలున్నాయి. వీటిల్లో 173 ప్రదర్శనలో ఉంచారు. ఇలా వేల కోట్ల విలువైన నిజాం ఆభరణాలు తొలుత కింగ్‌కోఠి ప్యాలెస్‌కు అక్కడి నుంచి ముంబాయిలోని హాంకాంగ్ బ్యాంక్‌కు చేరాయి. అక్కడ 45 యేండ్లు తర్వాత 1995న జాతీయ సంపదగా మారాయి.


173 ఆభరణాల ప్రదర్శన

Jewellery3
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించుకున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నగలను.. 11 యేండ్ల విరామం తర్వాత ప్రభుత్వం ప్రదర్శనకు పెట్టింది.


Jewellery4
ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఈ ప్రదర్శన మొదలైంది. మొత్తం 173 వస్తువులను ప్రస్తుతం ప్రదర్శిస్తున్నారు. వీటిలో కోహినూర్ వజ్రం కంటే రెండు రెట్లు పెద్దదైన జాకబ్ డైమండ్ అందర్నీ ఆకర్షిస్తున్నది.


Jewellery5
22 అన్‌సెట్ పచ్చల హారం, 28 షోకేసుల్లో వజ్రాలు, రత్నాలు, పచ్చలహారాలు, పటాకాలు, బ్రాస్ లెట్లు, చెవిదుద్దులు, కంకణాలు, మెట్టెలు, ఉంగరాలు, ప్యాకెట్ వాచీలు, తలపాగకు ధరించే వజ్రాలు, ధవళ వర్ణంలో మెరిసిపోయే ముత్యాల దండలు, కెంపులు, హారాలు, వడ్డాణాలు ఉన్నాయి.


Jewellery6
టిప్పుసుల్తాన్‌కు చెందినవిగా భావిస్తున్న భుజకీర్తులను కూడా చూడొచ్చు. ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఈ ఆభరణాల ప్రదర్శన.. మే 5 వరకూ కొనసాగుతుంది. సోమవారాలు, జాతీయ సెలవుల్లో ప్రదర్శన ఉండదు. టికెట్ ధర రూ. 50.
Jewellery7
Jewellery8
Jewellery9


Jacob-Dimond

మరికొన్ని విశేషాలు!

-నిజాం సేకరణలో మొత్తం 25వేలకు పైగా వజ్రాలు (2.5 కేజీలు), 2 వేల మరకత మణులు (2 కేజీలు), 40వేలకు పైగా ముత్యాలు ఉన్నాయి.
-కోహినూర్ వజ్రం కంటే రెండురెట్లు పెద్దది జాకబ్ డైమండ్. ఇది చాలా విలువైంది కూడా.
-1947లో ఎలిజబెత్‌రాణికి బహుకరించడానికి గులాబిపువ్వు ఆకారంలో కిరీటం, వజ్రాల నెక్లెస్‌ను తయారుచేయించాడు. కొన్ని కారణాల వల్ల ఎలిజబెత్ రాణికి ఇవ్వలేకపోయాడు.
-1911లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓ ఇరానీ వ్యాపారి నుంచి జమ్రుద్ ఆభరణాన్ని కొనుగోలు చేశాడు.
-మీర్ ఉస్మాన్ అలీఖాన్ సేకరణలో అత్యంత విలువైన వజ్రాలు పొదిగిన ఇస్కందరియా ఉంగరం, జాగర్ డైమండ్ ఉన్నాయి.
-మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ వజ్రాల మార్కెట్‌లో 70 శాతం పైన వజ్రాలను సరఫరా చేసేవాడు.
-1937 ఫిబ్రవరి 22న టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ధనికుల జాబితాలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అత్యంత ధనికుడిగా చోటు సంపాదించాడు.
-ఇతను అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కోట్ల విలువ చేసే జాకబ్ డైమండ్‌ను పేపర్ వెయిట్‌గా ఉపయోగించాడు.
-ఉస్మాన్ అలీఖాన్ ఒకసారి వేసిన దుస్తులు మళ్లీ వెయ్యరు. ఒకసారి వాడిన చెప్పులు, బూట్లు కూడా.
-క్రీస్తు శకం 1700లో ఔరంగజేబు అరుదైన అలెగ్జాండ్రెట్ రత్నాలతో పొదిగిన ఉంగరాలు నిజాం పాలకులకు బహుకరించినట్లు తెలుస్తున్నది.
-ఈ ఆభరణాలను తిరిగి సొంతం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Jewellery10
Jewellery12
Jewellery13
Jewellery14
Jewellery15


Asafjahis-of-Hyderabad
-డప్పు రవి

837
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles