e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిందగీ నా చివరి పాత్ర.. రైతు!

నా చివరి పాత్ర.. రైతు!


పుట్టింది ఆంధ్రాలో. పెరిగింది కర్ణాటకలో. చదివింది సివిల్‌ ఇంజినీరింగ్‌. చేస్తుంది యాక్టింగ్‌. మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న తర్వాత రైతుగా స్థిరపడాలన్నది ‘అత్తారింటికి దారేది’సీరియల్‌ హీరో శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి ప్రణాళిక. బతకడం అంటే నలుగురికీ ఉపయోగపడటమే అంటున్న శ్రవణ్‌ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు..

మాది రాయలసీమ. అనంతపురం జిల్లా.
పెరిగింది మాత్రం కర్ణాటకలో. మూడేండ్ల వయసులో మామయ్యవాళ్ళతో బెంగళూరు వెళ్ళిపోయా. ఆ తర్వాత అక్కడే బాబాయ్‌, పిన్ని వాళ్ల దగ్గర పెరిగా. ఓ రెండేండ్లు ఇంటర్‌ కోసం విజయవాడలో ఉన్నా. ఎంసెట్‌ రాసేందుకు నాకు అర్హత లేదని చెప్పడంతో మళ్లీ బెంగళూరు వెళ్ళిపోయా. కేసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించి విశ్వేశ్వరయ్య యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాను. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగం సాధించాను. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. నాకు చిన్నప్పటినుంచీ నటన అంటే ఇష్టం. పెదనాన్న, నాన్న నాటకాల్లో
దుర్యోధనుడు, అర్జునుడు వంటి పౌరాణిక పాత్రలు వేసేవాళ్ళు. వేసవి సెలవుల్లో వాళ్లతో కలిసి రిహార్సల్స్‌కు వెళ్ళేవాణ్ణి. ఆ పద్యాలు, డైలాగులూ గుక్క తిప్పుకోకుండా చెప్పేందుకు ప్రయత్నించేవాణ్ణి. అందరూ మెచ్చుకుని సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించేవారు. ఇంటర్‌ కాగానే, సినిమాల్లో ప్రయత్నిస్తానని నాన్నను అడిగా. ఆయన మాత్రం, చదువు పూర్తి చేసిన తర్వాతే ఏదైనా అని చెప్పారు. మరో మాట మాట్లాడకుండా, సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసి ఉద్యోగంలో చేరిపోయా.

తెలుగు ప్రభావం..
ఉద్యోగంలో చేరినా కూడా సినిమా ఆశ అలానే ఉండిపోయింది. బాబాయి, పిన్ని ప్రోత్సాహంతో విశాఖలోని సత్యానంద్‌ యాక్టింగ్‌ స్కూల్లో నాలుగు నెలలు శిక్షణ తీసుకున్నా. ఎనభైకి పైగా ఆడిషన్స్‌లో పాల్గొన్నా. రోజూ ప్రొడక్షన్‌ హౌస్‌ల చుట్టూ తిరిగేవాణ్ణి. నేను మాట్లాడే కన్నడపై తెలుగు ప్రభావం ఎక్కువ. దాంతో చాలా అవకాశాలు చేజారిపోయాయి. చివరికి ఒక సినిమాలో చాన్స్‌ వచ్చింది. అయితే, అదీ రిలీజ్‌ అవలేదు. సీరియల్స్‌ కూడా వర్కవుట్‌ కాలేదు. అందుకే బాబాయ్‌ సలహా ప్రకారం, తెలుగు పరిశ్రమలో ప్రయత్నిద్దామని హైదరాబాద్‌కు వచ్చేశా. అన్నపూర్ణ
బ్యానర్‌లో ‘ఒక చిన్న విరామం..’ అనే సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. పరిశ్రమలో పరిచయాలు పెంచుకోవడమే పనిగా మూడేండ్లు తిరిగా. అలా అప్పుడే ఈ టీవీ వాళ్ళు ఆడిషన్స్‌కి పిలిచారు. ‘అత్తారింటికి దారేది’ సీరియల్‌లో అవకాశం ఇచ్చారు. దాంతో నాకు గుర్తింపు లభించింది. నటుడు కావాలన్న కలా నెరవేరింది.

24 క్రాఫ్ట్స్‌ గమనిస్తా..
ఒక్క అవకాశం కోసం చాలా కష్టపడ్డా. కానీ, ఆ కష్టంలోనే చాలా విషయాలు తెలుసుకున్నా. ఎన్నో పనులు నేర్చుకున్నా. ఆ పరిజ్ఞానంతో షార్ట్‌ఫిలిమ్స్‌ తీయడం ప్రారంభించా. ఎడిటింగ్‌, కెమెరా హ్యాండ్లింగ్‌ మీద కూడా పట్టు సాధించా. సివిల్‌ ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న ట్రైపాడ్‌ పద్ధతిలో బాబాయ్‌ ఫ్యాబ్రికేషన్‌ కంపెనీలో వృథాగా పడున్న రాడ్స్‌తో ఓ స్టాండ్‌ తయారుచేసుకొని, దాని మీద కెమెరా ఫిక్స్‌చేసి వీడియోలు షూట్‌ చేసేవాణ్ణి. తెలుగులో ‘ఇమెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ’అనే ఓ షార్ట్‌ఫిలిం చేశా. ఏ షూటింగ్‌లో ఉన్నా, ఆ ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్న అందరినీ గమనిస్తా. అన్ని క్రాఫ్ట్స్‌ గురించీ తెలుసుకుంటా. మనిషి అన్నవాడు నేర్చుకుంటూనే ఉండాలన్నది నా సిద్ధాంతం.

యూట్యూబ్‌ చానల్‌..
డైరెక్షన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఓ యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించా. నమ్మలేని నిజాలపై వీడియోలు అప్‌లోడ్‌ చేస్తా. వెబ్‌సిరీస్‌, షార్ట్‌ఫిలిమ్స్‌ ప్లాన్‌ చేస్తున్నా. మాది చాలా పెద్ద కుటుంబం. నాన్న పెద్దిరెడ్డి, అమ్మ లక్ష్మీదేవి. మాది వ్యవసాయ కుటుంబం. నాకు చిన్నప్పటినుంచీ సేద్యం అంటే ఇష్టం. ఇంటికెళ్ళినప్పుడు పొలాల్లో తిరుగుతా. నటుడిగా ఓ మంచిస్థాయికి చేరుకుని, బాధ్యతలన్నీ నెరవేరాక మా ఊరెళ్ళిపోయి రైతుగా స్థిరపడిపోతా. అదే నా చివరి పాత్ర. ఆధునిక పద్ధతుల్లో ఆర్గానిక్‌ పంటలు పండిస్తా. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే
విద్యార్థులకోసం అన్ని ఆధునిక వసతులతో ఒక ప్రాక్టికల్‌ హౌస్‌ ఏర్పాటుచేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ భూమి మీద పుట్టినందుకు, మన బతుకు మనం బతికామా అని కాకుండా, ఏదో ఓ రూపంలో నలుగురికీ ఉపయోగపడాలనేది నా అభిమతం.
-ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నా చివరి పాత్ర.. రైతు!

ట్రెండింగ్‌

Advertisement