నారీ... భేరీ...ఆక్స్‌ఫర్డ్‌లోకి నారీ శక్తి


Fri,February 1, 2019 12:20 AM

చీకటిని ఛేదిస్తూ వెలుగువైపు అతివల ప్రస్థానం కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన పరిణామాలు, వాటి ఫలితాలు..మహిళల శక్తికి గుర్తింపు. ఈ నేపథ్యంలో నారీ శక్తి అనే హిందీ పదానికి ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కింది. ఈ సందర్భంగా విభిన్న రంగాలకు చెందిన నలుగురు మహిళలు నారీ శక్తి పదానికి తమ నిర్వచనాన్ని మనతో పంచుకున్నారు.
Women-powerstory
అవమానాలను ఎదిరించి అవకాశాలను అందిపుచ్చుకునే వరకూ మహిళలు తమ శక్తిని ఉపయోగిస్తున్నారు. ఇలా అవధులు లేని ప్రగతివైపు నేటి మహిళల ప్రయాణం కొనసాగుతున్నది.అమ్మలా లాలించడమే కాదు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అవమానాలకు, అణచివేతలకు గురైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. హక్కులను, స్వేచ్ఛను కాపాడుకుంటున్నారు. దీంతోపాటు సుప్రీంకోర్టు సైతం మహిళా శక్తిని ప్రభావితం చేసే అంశాలపై ప్రగతిశీల తీర్పులిచ్చి గణమైన పాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే భాషా నిపుణుల సాయంతో 2018 హిందీ పదంగా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో నారీశక్తిని చేర్చింది. ఇటీవల జైపూర్ సాహిత్య వేడుకలో ఆక్స్‌ఫర్డ్ ఈ ప్రకటన చేసింది. ఈ పదం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. మహిళలు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారు.
little-oxford

ఆలోచనా విధానంలో మార్పు రావాలి

వృత్తిలో భాగంగా రోజూ ఎంతోమంది మహిళలతో మాట్లాడుతుంటాను. వాళ్లు మనోధైర్యం కలిగి ఉంటారు. గ్రామీణ మహిళల ధైర్యం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నిజానికి పురుషుల ఆలోచనా దృక్పథం ఇలాంటి వారిని ఇంటిపట్టునే ఉంచేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టడం అంటే భయపడుతున్నారు. కానీ ఇవి మునుపటి రోజులు కావు. ఆడపిల్లలు పురుషుల కన్నా గొప్పస్థాయికి ఎదుగుతున్నారు.అలాంటి మహిళకు దక్కిన గౌరవంగా ఆక్స్‌ఫర్డ్ నిర్ణయాన్ని గౌరవించాలి.
-డాక్టర్.హేమారఘు, ఎండీ డీజీఓ, మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా

భాగస్వామ్యం కల్పించాలి

సమాజంలో ఎక్కువగా వివక్షకు గురయ్యేది మహిళలే. అలాంటి పరిస్థితిని దాటి మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మహిళలు చక్కగా ఎదుగుతున్నారు. ప్రభుత్వ నిర్వహణలోనే కాకుండా నిర్ణయాధికారంలో కూడా మహిళల పాత్ర ఉండాలి. అప్పుడే సమాజంలో మహిళలకు గౌరవం దక్కుతుంది.
-తిరుమలా దేవి, సీడీపీఓ, మెట్‌పల్లి జగిత్యాల జిల్లా

ఆడపిల్లలకు అండగా నిలవాలి

నేటితరం యువతులు అన్నింటిలో ముందుంటున్నారు. దేన్నయినా సాధించగల పట్టుదల కలవారు. వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ఎన్నో అసాధారణ విజయాలను సాధిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు అండగా నిలవాలి. నా వరకు వస్తే నా తల్లిదండ్రుల నుంచి పూర్తిగా సహకారం ఉంది. ఎందుకంటే వాళ్లు చదువుకున్న వారు. సమాజంలో మహిళల పాత్రగురించి వాళ్లకు అవగాహన ఉంది.
-వేదశ్రీ, విద్యార్థి, ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటి, హైదరాబాద్

మార్పు మరింత జరగాలి

విద్యార్థినిగా, గృహిణిగా, ఉద్యోగినిగా, రాజకియవేత్తగా ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో స్త్రీ భాగమైంది. అయినా పురుషుల చేతుల్లోనే నిర్ణయాధికారాలుఉంటున్నాయి. చాలా సందర్భాలలో సమాజంలో అణచివేతపై మహిళలు గళం విప్పుతున్నారు. ఎప్పటి నుంచో ఉన్న అవాంతరాలను దాటి అవకాశాలు కల్పించుకుంటున్నారు. ఈ మార్పు మరింత జరగాలి.
-జ్యోతి, గృహిణీ, హైదరాబాద్

848
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles