నాన్న కళ్లల్లో ఆనందం కనిపిస్తున్నది!


Sun,December 30, 2018 12:53 AM

నవ్యతతో ఆలోచించడం, కొత్త దారుల్లో ప్రయాణించడం అందరికీ సాధ్యం కాదు. ఈ గమనంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుంటాయి. ఎన్నో వ్యయప్రయాసలనోర్చుకుంటూ ముందుకు సాగినప్పుడే అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. విజయాల్ని అందుకోగలుగుతాం. తెలుగు చిత్రసీమలో వరుణ్‌తేజ్ ప్రయాణం అలాగే సాగుతున్నది. కంచె, ఫిదా, అంతరిక్షం వంటి ప్రయోగాత్మక కథాంశాలతో నవతరం కథానాయకుల్లో కొత్త ఇమేజ్‌ను సృష్టించుకున్నారు వరుణ్‌తేజ్. తన సినీ ప్రయాణాన్ని, కెరీర్ పరంగా కుటుంబసభ్యులు అందిస్తున్న ప్రోత్సాహాన్ని గురించి వరుణ్‌తేజ్ మనసులోని మాటలివి..
varun

2018వ సంవత్సరం మీకు ఎలాంటి అనుభూతులను మిగిల్చింది?

-ఈ సంవత్సరం మొత్తం బిజీగా గడిచింది. తొలిప్రేమ విడుదల తర్వాత మూడు నెలలు బ్రేక్ దొరికింది. ఆ తర్వాత అంతరిక్షం, ఎఫ్-2 షూటింగ్‌లు మొదలవ్వడంతో ఇంటికి ఎప్పుడూ వెళ్లానో సరిగా గుర్తులేదు. సెట్స్‌లోనే ఎక్కువ సమయం గడిచింది. షూటింగ్‌ల కోసం రామేశ్వరం, ఫ్రాగ్, బ్యాంకాక్‌లాంటి ప్రదేశాలకు వెళ్లొచ్చాను. ఈ బిజీలైఫ్ తల్చుకుంటే కొన్నిసార్లు ఒత్తిడిగా ఉంటుంది. అంతిమ లక్ష్యం ఏమిటో, దేని కోసం అంతలా కష్టపడుతున్నామో గుర్తుకు వస్తే మొత్తం టెన్షన్ ఒక్కసారిగా దూరం అవుతుంది.

కథానాయకుడిగా మీ సినీ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది. నటుడిగా మీరు చేస్తున్నసినిమాలతో సంతృప్తిగా ఉన్నారా?

-నటుడికి సంతృప్తి ఉండదు. అయితే కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు లభించే ప్రశంసలు, విజయాలు మాత్రం నాలో ప్రోత్సాహాన్ని నింపుతాయి. నేను వెళుతున్న దారి సరైందేననే నమ్మకం, ధైర్యం కలిగిస్తాయి. మరిన్ని వినూత్న ప్రయోగాలు చేయడానికి శక్తినిస్తాయి.

ఓ సినిమాను అంగీకరించే ముందు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?

-నాలుగు గోడల మధ్య ఉండి మనం ఊహించుకున్నది ఎప్పుడూ నిజం కాదు. ప్రేక్షకులు మన నుంచి ఏంకోరుకుంటున్నారో తెలుసుకుంటూ వాటికి అనుగుణంగానే సినిమాలు చేసినప్పుడే విజయాల్ని అందుకోగలమన్నది నా నమ్మకం.

మూసధోరణికి భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేయడానికి మీకు స్ఫూర్తి ఎవరు?

-ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోల కంటే వైవిధ్యంగా ఉండాలనే కోరిక నాలో ఎప్పుడూ ఉంటుంది. విజయాల్ని అందుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తారు. ఇతరులతో పోలిస్తే నా పంథా భిన్నంగా ఉంటుంది. కొత్త దారుల్లో నడువాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాను. హాలీవుడ్ సినిమాల్ని నేను ఎక్కువగా చూస్తాను. టెర్మినేటర్‌తో పాటు సూపర్‌హీరోస్ కథాంశాలతో తెరకెక్కిన అన్ని సినిమాలు చూశాను. అవి చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఇలాంటి సినిమాలు చేయకూడదని అనిపించింది. ఎలాంటి కథనైనా మనవైన భావోద్వేగాలు జోడిస్తే తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. తెలుగులో గొప్ప సినిమాలు వచ్చాయి. అలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగాలని ఎప్పుడూ కోరుకుంటాను. మూసధోరణితో కూడిన ట్రెండ్‌ను బ్రేక్ చేయాలన్నదే నా అభిమతం.

బాక్సాఫీస్ వసూళ్లు, మార్కెట్ లెక్కల గురించి మీరు ఆలోచిస్తుంటారా?

-సక్సెస్‌లను అనుసరించే హీరోల మార్కెట్ ఉంటుంది. పిధా, తొలిప్రేమ విజయవంతం కావడంతో నా సినిమాల మార్కెట్ పెరిగింది. అయితే మార్కెట్ లెక్కలను దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే తెలియకుండానే పరిమితుల చట్రంలో బందీ అయిపోతాం. మాస్, కమర్షియల్ సినిమాలు చేస్తేనే మార్కెట్ పెరుగుతుంది ప్రయోగాలు చేస్తే పెరగదనేది అవాస్తవం. ఒకవేళ నా మార్కెట్ ఐదు కోట్ల దగ్గర ఆగిపోతే అంతరిక్షం లాంటి సినిమాలు చేయడం కుదిరేది కాదు. హీరోగా మార్కెట్ ఉన్నప్పుడే విభిన్నమైన ఇతివృత్తాలతో కూడిన సినిమాల్ని భయపడకుండా ధైర్యంగా చేయగలం. ఆ స్వార్థం కోసమైనా మార్కెట్ పెరుగాలని కోరుకుంటాను.

అమ్మతో మీకు చనువు ఎక్కువగా ఉంటుందని అంటుంటారు? నిజమేనా?

-నా ప్రతి ఆడియో వేడుకకు అమ్మ రావాలని అనుకుంటుంది. కానీ నేనే వద్దని చెబుతాను. నాన్న కూడా నా సినిమాల వేడుకలకు రావడం మానేశారు. వేడుకల్లో నా కొడుకు గురించి మాట్లాడడం అంటే సెల్ఫ్ డబ్బాలా ఉంటుంది రానని, టీవీలో మాత్రమే చూస్తానని చెబుతుంటారు.

సోదరి నిహారిక కెరీర్ విషయంలో మీ జోక్యం ఎంతవరకు ఉంటుంది?

-నేను, నిహారిక దాదాపు ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చాం. నా సినిమాలతో బిజీగా ఉండటంతో తన కెరీర్‌కు తోడ్పాటును అందించలేకపోయాను. తనకు పెద్దగా సహాయం చేయలేకపోయాను. అయితే తాను చేసే సినిమాలకు సంబంధించి నా అభిప్రాయం ఏదైనా నిర్మొహమాటంగా చెబుతాను. ఇప్పటివరకు నిహారిక చేసిన సినిమాలేవీ సరిగా ఆడలేదు. తొలుత తన బలం ఏమిటో తెలుసుకోమని చెప్పాను. నిహారిక కామెడీ టైమింగ్ బాగుంటుంది. కానీ తన శైలికి తగ్గ సరైన కథల్ని ఎంచుకోలేకపోవడం వల్లే విజయాలు దక్కడం లేదు. అలాంటి కథ దొరికితే తప్పకుండా సక్సెస్ అందుకుంటావని తనతో ఎప్పుడూ చెబుతుంటాను.

కెరీర్ పరంగా అమ్మ సలహాలు, సూచనలు తీసుకుంటారా?

-కుటుంబసభ్యుల ప్రోత్సాహం, సహకారం నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. వైవిధ్యమైన సినిమాలు చేసిన ప్రతి సారీ మెచ్చుకుంటారు. అలాగని విమర్శించడం మాత్రం తక్కువే. నటనకు సంబంధించి అవసరమైన సలహాలు నాన్నతో పాటు పెదనాన్న చిరంజీవి ఇస్తుంటారు. వారి అనుభవంతో నా మంచి కోసం ఏం చెప్పినా తప్పకుండా పాటిస్తాను.

వ్యోమగామిగా మారాలనే కోరిక చిన్నతనం నుంచి మీకు ఉండేదా?

-అంతరిక్షం, వ్యోమగాముల గురించి స్కూల్‌డేస్‌లో పాఠాలు చదువుకున్నాను. అంతేకానీ ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఎప్పుడూ లేదు. నేను పెరిగిన వాతావరణం వల్ల ఆ ఆలోచన నా మనసులో ఎప్పుడూ కలగలేదు. అంతరిక్షానికి సంబంధించి పుస్తకాలు చదవడం పరీక్షలు రాయడం వరకే నా నాలెడ్జ్ పరిమితమైంది.

సినిమా డెస్క్

847
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles