నాడు చేపల వేట..నేడు స్వర్ణాల వేట


Mon,September 10, 2018 01:25 AM

ఎవరికైనా లైఫ్‌లో ఒక రోజంటూ వస్తుందని వింటుంటాం. ఈ అమ్మాయికి కూడా ఆరోజు వచ్చేంది. చిన్నప్పుడు చదువుకునేందుకు డబ్బులు లేక, ఇంట్లో తినేందుకు తిండిలేక చేపల వేటకు వెళ్లిన ఈ అమ్మాయే.. నేడు దేశం కోసం స్వర్ణాలను వేటాడుతున్నది.
maneesha
భూపాల్‌కి చెందిన షూటర్ మనీషా తనదైన ఆటలో బుల్లెట్‌లా దూసుకెళ్తున్నది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లో ప్రపంచ రికార్డ్‌కెక్కింది మనీషా. చిన్నప్పుడు తండ్రి కైలాష్ ఖేర్ కుటుంబ పోషణ కోసం సరస్సులో చేపలు పడుతుండేవాడు. ఆయనకు ఏడుగురు సంతానం. అందులో నలుగురు అమ్మాయిలు. చేపలు పట్టి, అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబం గడువడం కష్టంగా మారడంతో కుమార్తె మనీషాకు చేపల వేట నేర్పించాడు కైలాష్. ప్రతిరోజూ చేపలు పట్టి, వాటిని మార్కెట్లో అమ్మగా వచ్చిన డబ్బుతో పొట్టనింపుకునేవారు. మనీషా చేపలు పట్టడంలో తండ్రిని మించిపోయేది. ఒకరోజు తన సోదరి సానియాతో మధ్యప్రదేశ్‌లోని స్టేట్ షూటింగ్ ఆకాడమీకి వెళ్లింది. ఆమెతోపాటు వెళ్లిన మనీషా.. అక్కడ జరుగుతున్న షూటింగ్ శిక్షణను గమనిస్తూ నిలబడింది. అప్పుడు లక్ష్యాన్ని గురిపెట్టే విధానాన్ని అవగాహన చేసుకున్నది. తన అక్క దగ్గర గన్ తీసుకొని షూట్ కూడా చేసింది. అది గమనించిన ఒలింపియన్ మన్షేర్ సింగ్.. ఏదీ ఒకసారి షూట్ చేయ్ అని సరదాగా అన్నాడు. చేపలు పట్టడంలో నేర్పరి అయిన మనీషా.. ఒక్కషాట్‌లోనే లక్ష్యాన్ని ఛేదించింది. తన ప్రతిభకు అవాక్కైన కోచ్ ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం మొదలుపట్టాడు. అలా షూటింగ్‌లో ఆరితేరిన మనీషా పలు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. తాజాగా సౌత్ కొరియాలోని ఛాంగ్వాన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ టెస్ట్‌లో 41 పాయింట్లు సాధించి రికార్డ్ సృష్టించింది. 18 యేండ్లకే దేశం గర్వించే రికార్డ్ సాధించడం గొప్ప విషయం అని కేంద్ర క్రీడల శాఖామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

629
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles