నం.1 కలెక్టర్


Thu,February 28, 2019 12:03 AM

పథకం ఏదైనా ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే ఆయన లక్ష్యం.. సమస్య ఏదైనా కూకటి వేళ్లతో పీకేయాలన్నదే సిద్ధాంతం.. అందుకే కొత్త జిల్లాగా ఏర్పడ్డ జగిత్యాలను రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రెండున్నరేండ్ల నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నారు.. అతి చిన్న వయసుగల ఈ జిల్లా పేరును అభివృద్ధి అనే మంత్రంతో దేశవ్యాప్తం చేసి ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా పేరు గడించారు. అందుకే ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అందించే ఎక్స్‌లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డును ప్రధాని చేతుల మీదుగా నేడు అందుకోబోతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ.. వీటన్నింట్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఆయన మిగిలిన అన్నిరంగాల్లోనూ జగిత్యాలను నం.1గా చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి మంత్రమని, జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ విశేషాలే జిందగీ ప్రత్యేక కథనం..
IE-Awards
జగిత్యాల జిల్లాను తనదైన ముద్రతో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న శరత్ ఉత్తమ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. అనేక రంగాల్లో విశిష్ఠ సేవలు చేసిన కలెక్టర్లను గుర్తించి ఉత్తమ అవార్డులు ఇవ్వనున్నది ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్. అందులో భాగంగా ఉత్తేజం కార్యక్రమానికి కేంద్ర బృందం ఫిదా అయ్యింది. అన్ని రంగాల్లోనూ మంచి ప్రతిభ కనబర్చినప్పటికీ ఏదో ఒక రంగంలో మాత్రమే అవార్డు ఇవ్వాలన్న నిబంధన ఉండడం వల్ల కలెక్టర్ డా. శరత్‌ను ఉత్తేజం కార్యక్రమానికి అవార్డు వరించింది. ఈ నెల 28న దేశ రాజధాని ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు.


సుప్రీం మాజీ న్యాయమూర్తితో ఎంపిక కమిటీ

ఉత్తమ కలెక్టర్ల ఎంపికను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన ప్రముఖులకు బాధ్యతలప్పగించింది. జ్యూరీ కమిటీకి చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోథా, విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా రిటైర్ అయిన నిరుపమా రావు, కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రెటరీగా రిటైర్ అయిన కే.ఎం చంద్రశేఖర్, ఎక్స్‌చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజ్యహత్ హబిబుల్లా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు కంట్రీ హెడ్ జనరల్ మేనేజర్‌గా రిటైర్డ్ అయిన నైనాలాల్ కిద్వాయ్‌లు మెంబర్లుగా ఉన్న కమిటీ శరత్‌ను ఉత్తమ కలెక్టర్‌గా ఎంపిక చేసింది.


అన్ని రంగాల్లో జగిత్యాల మేటి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 2016 అక్టోబర్ 11న జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించింది. చిన్న జిల్లా ఏర్పాటు ఫలితాలు ఎలా ఉంటాయో చూపించారు శరత్. ఆయన సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనను అందించారు. మిగతా జిల్లాలకు మార్గదర్శకంగా నిలిచారు. భూరికార్డుల ప్రక్షాళనలో జగిత్యాల జిల్లా నంబర్ వన్‌గా నిలిచేలా కష్టపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయపడే రోజుల నుంచి సర్కారు దవాఖానకు పరుగులు పెట్టేలా మార్పులు చేపట్టారు. ఇరవై శాతం కూడా లేని ప్రసవాల శాతాన్ని కేసీఆర్ కిట్ ద్వారా 75 శాతానికి పెంచారు. దీంతో ఈ కిట్ మిగతా జిల్లాల కంటే కూడా జగిత్యాలలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లాలో 170 ప్రైవేటు ఆస్పత్రులున్నప్పటికీ ప్రజలు ప్రభుత్వ దవాఖానాలపై మొగ్గు చూపారు. గొర్రెల పంపిణీలోనూ నంబర్ వన్‌గా నిలిచింది జగిత్యాల జిల్లా. స్వచ్ఛ భారత్ మిషన్ కింద వంద రోజుల్లో అరవై వేల మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించారు. హరితహారంలోనూ నూతన ఒరవడి సృష్టించి ఎక్కడా లేని విధంగా ప్రతి బుధవారం వాటర్ డే, గ్రీన్ డే నిర్వహించారు. ప్రజలను భాగస్వామ్యం చేసేలా హరిత దళాలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రామేశ్వరరావు పేట రాంపూర్ పంప్ హౌజ్‌ల నిర్మాణానికి కేవలం 24 గంటల్లో భూసేకరణ జరిపి రికార్డు సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో జగిత్యాలను నంబర్ వన్‌గా నిలిచేలా చేశారు. అందుకే జగిత్యాల పలు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకుంది.


ఉత్తమ కలెక్టర్ వెనుక మిషన్ ఉత్తేజం

సంక్షేమ రంగాల్లో నంబర్ వన్‌గా నిలవడం ఒక ఎైత్తెతే.. విద్యారంగంలో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు జగిత్యాల కలెక్టర్ శరత్. జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించే నాటికి కేవలం 65 శాతం కూడా పదో తరగతి ఫలితాలు ఉండేవి కావు. దాన్ని సమూలంగా మార్చాలని కలెక్టర్ నిర్ణయించారు. అందుకే ఏ జిల్లాలోనూ లేని విధంగా ఉత్తేజం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖలో ఉన్న ఉత్తమ టీచర్ల సహకారం తీసుకున్నారు. ఐస్ బకెట్ చాలెంజ్, గ్రీన్ చాలెంజ్‌లాగే ఎడ్యుకేషన్ చాలెంజ్ తీసుకున్నారు కలెక్టర్. అందులో భాగంగా స్కూల్ అవర్స్‌లో కాకుండా స్పెషల్ క్లాసులను నిర్వహించాలని, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా విద్యార్థులు బడిలోనే ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని సంకల్పించారు. దీని కోసం స్పెషల్ క్లాసులు చెప్పేందుకు టీచర్లు ముందుకు వచ్చారు. సీఎం కేసీఆర్ సహాయ నిధి నుంచి కొన్ని నిధులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా విరాళాలు సేకరించి పిల్లలకు పౌష్టికాహారం ఇబ్బంది లేకుండా కూడా చూసుకున్నారు. ఇలా రెండు అంశాల మీద ప్రారంభమైన ఉత్తేజం ఎన్నో అంశాలకు మార్గదర్శకంగా నిలిచింది.


అవార్డు ప్రత్యేకత..

IE-Awards2
ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం, ఉత్తమ పాలనకోసం నిరంతరం కృషి చేయడం, వినూత్న రీతిలో ఆలోచించి ఉత్తమ ఫలితాలు అందుకోవటం వంటి అంశాల్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ సర్వే నిర్వహించింది. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాల జిల్లాల పాలనాధికారుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న కలెక్టర్లను గుర్తించి వారిని ప్రోత్సహించడం, భవిష్యత్ ఐఏఎస్‌లకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలవడం ఈ అవార్డు ఉద్దేశం. దేశంలో ఉత్తమ కలెక్టర్ ఎవరు? అన్న ప్రశ్న ఆధారంగా ఈ సర్వేకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరుపై లోతైన అధ్యయనం జరిపిన అనంతరం ఒక్కో రంగంలో ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. వినూత్న రీతిలో జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తన్న టాప్ పదిహేను మంది కలెక్టర్లలో శరత్ నెంబర్‌వన్‌గా నిలిచారు. శరత్ దాదాపు 700 మంది కలెక్టర్లతో ఎనిమిది రంగాల్లో పోటీపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూరికార్డుల ప్రక్షాళన, ఆరోగ్యం, విద్యా, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ, స్వచ్ఛభారత్ మిషన్ లాంటి అద్భుత పథకాలపై శరత్ ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలపై రహస్య కమిటీ జగిత్యాలలో పరిశీలించి ఆయన కృషిని గురించి నివేదిక అందించింది.


పదిలో జగిత్యాల టాప్

జిల్లా ఏర్పడక ముందు ఏ గ్రామంలో చూసినా పదో తరగతి ఫెయిల్ అయి బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండేవారు. పదో తరగతి ఫెయిల్ అయితే వారి ఎదుగుదల అక్కడే ఆగిపోయేది. చిన్నచూపుకు గురయ్యేవారు. జగిత్యాల జిల్లా 85 శాతం గ్రామీణ నేపథ్యమున్న జిల్లా. అప్పుడున్న అరకొర ఫలితాలు కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. జిల్లా ఏర్పడిన తర్వాత ఉత్తేజం కార్యక్రమంతో పదో తరగతిలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో ఉత్తేజం అమలుతో మొదటి సంవత్సరమే రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించింది. మొదటి ఏడాది 97.35 ఉత్తీర్ణతా శాతాన్ని నమోదు చేసి రాష్ట్రంలోనే టాప్ స్థానంలో నిలిచింది. రెండో ఏడాది కూడా 97.56 శాతంతో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించింది. అప్పటి వరకు ప్రభుత్వ నిధులతో నడిచిన ఉత్తేజం కార్యక్రమం.. అద్భుత ఫలితాలు రావటంతో ప్రస్తుతం విరాళాలతో కొనసాగుతున్నది.


నగదు పురస్కారం

ఉత్తమ కలెక్టర్‌గా ఎంపికయ్యానంటే దానికి సీఎం కేసీఆర్ కారణం. చిన్న జిల్లాల ఏర్పాటుతోనే నాకు అవకాశం కల్పించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి ఉండకపోతే ఈ అభివృద్ధి సాధ్యపడేది కాదు. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. జిల్లాను రాష్ట్రంలో మంచి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం అవార్డుతో పాటు ఒక లక్ష రూపాయల నగదు బహుమతి కూడా వస్తుంది. దీనికి మరొక లక్ష నా జీతం నుంచి కలుపుకొని ఆ మొత్తాన్ని పదో తరగతిలో పదికి పది గ్రేడ్ సాధించిన వారికి ప్రోత్సాహంగా అందజేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది కూడా విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి. జిల్లా స్థానాన్ని కాపాడాలి. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అల్ ది బెస్ట్ అని చెప్పారు డా.శరత్.

IE-Awards1
నల్గొండ జిల్లా కొండ్రపోల్ గ్రామానికి చెందిన డాక్టర్ శరత్ 2005 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందినవారు. గతంలో మెదక్ ఇంచార్జ్ కలెక్టర్‌గా, రంగారెడ్డి జేసీగా, గుంటూరు జేసీగా, భద్రాచలం, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, మహబూబ్‌నగర్ డివిజన్ ఆఫీసర్‌గా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా, తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, మార్క్‌ఫైడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, హైదరాబాద్ రైతు బజార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. నూతన జిల్లా ఆవిర్భావం నేపథ్యంలో శరత్ జగిత్యాల జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.


సీఎం కేసీఆర్ స్ఫూర్తి..

కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత నేను కలెక్టర్‌గా జగిత్యాలకు రావడం నా అదృష్టం. సీఎం కేసీఆర్ పలు సమావేశాల్లో మాలో స్ఫూర్తిని నింపుతుంటారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరాలనే లక్ష్యంతో చిన్న జిల్లాలు ఏర్పాటు చేశామని, అందులో మీరు కీలక పాత్ర పోషించాలని అంటుంటారు. ప్రజలకు పారదర్శకంగా అన్ని సంక్షేమ పథకాలు చేరవేయాలని, మార్పునకు ఏజెంట్‌గా వ్యవహరించాలని చెబుతుంటారు. ఇదే మాకు నిత్యం స్ఫూర్తి మంత్రం. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పథకాల అమలులో కొత్త కొత్త ఆలోచనలు జోడించే అవకాశం కూడా కల్పించారు. ముఖ్యంగా ఎంపీ కవిత మాకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతో ప్రోత్సహిస్తారు. జిల్లాకు పెద్ద బహుమతి ఎంపీ కవిత. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సహా అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్లే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించగలుగుతున్నాం. నాకు వచ్చిన ఈ అవార్డు జిల్లా ప్రజలందరికీ అంకితం.

-సిద్ధార్థ్ బీసగోని

1290
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles