దేహాలయం లోకి ప్రవేశిద్దామా


Fri,February 22, 2019 01:21 AM

దేహాలయ ప్రవేశమంటే దేవాలయానికి వెళ్లినంత ఈజీ కాదు! అదొక అద్భుత మనో నియంత్రణ తపోవిద్య. దానిలో సిద్ధహస్తులమైతేనే, దేహంలోని దేవుణ్ణి, తనదైన ఆత్మసాక్షాత్కారాన్ని పొందేది. కానీ, అది సిద్ధించాలంటే ఏం చేయాలి?
temple
దేవుడు ఎక్కడుంటాడు? దేవాలయంలోనా, దేహాలయంలోనా? దేవుడు అంతటా వుంటాడు, ఆయనకు రూపం లేదు అన్న దానిని పక్కన పెడితే, అందరూ ఉంటాడనుకొనే దేవాలయాలలోకి అందరికీ ప్రవేశం తేలిగ్గా లభిస్తుంది. దాని కోసం కష్టపడక్కర్లేదు. కులమతలింగ భేదాలకు అతీతంగా గుడిలోకి ఎవరైనా వెళ్లి విగ్రహరూప దేవుణ్ణి దర్శించుకోవచ్చు. కానీ, దేహాలయ ప్రవేశమే ఒక పట్టాన అందరికీ, ఇంకా ఎవరికి పడితే వారికి సాధ్యమయ్యేది కాదు. ఎందుకలా? ఏమిటీ సమస్య? ప్రతి ఒక్కరూ దేహంలోని దేవుణ్ణి దర్శించాలంటే ఏం చేయాలి? అదంత బ్రహ్మవిద్యనా?


అవుననే అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్న సినిమా పాట అక్షరసత్యం. అసలు, దేవుడు లేనిదెక్కడ? ప్రతి చోటా ఉన్నాడు, ఉంటాడనీ వారు ఏనాడో తేల్చేశారు. కొందరు జీవన్ముక్తులైతే దానిని నిరూపించారు కూడా. మహాభక్తుడు ఆంజనేయస్వామి తన రొమ్ము చీల్చుకొని శ్రీరాముని రూపంలోని పరమాత్ముణ్ణి చూపిస్తే, కన్నప్ప తన కన్నును పెరికి శివునికి ఇచ్చి స్వామిని దర్శించాడు. ఇక, అర్జునుడు యుద్ధం చేయనని అస్త్రశస్ర్తాలను త్యజించినందుకు ఏకంగా మహావిష్ణువు విశ్వరూపాన్నే వీక్షించాడు. అంతెందుకు, ఇందు గలడందు లేడని సందేహము వలదు.. అంటూ బాలభక్త శ్రేష్ఠుడు ప్రహ్లాదుడు తండ్రికే హితబోధ చేసి దానిని నిరూపించాడు కూడా.


ఇవన్నీ పుక్కిటి పురాణాలు, కట్టుకథలుగా కొట్టి పారేసే వారికి అద్వైత సిద్ధాంతంతో ఆదిశంకరులు అద్భుత సమాధానం చెప్పారు. అద్వైతం అంటే ఆత్మ, పరమాత్మ వేర్వేరు కాదు, ఒక్కటే అన్నది దీని అత:సూత్రం. కాబట్టి, మానవుడే దానవుడు. మనిషిలోనే దేవుడున్నాడు. మనిషి జన్మించింది మొదలు మరణించే దాకా ఆత్మజ్ఞాన సాధన ద్వారా సత్యాన్ని గ్రహించాలని, ఇలా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొన్న వారే జీవన్ముక్తులు కాగలరని పై సిద్ధాంతం చెప్పింది. అయినా, నమ్మని, నమ్మకం లేని వారు కావాలనుకొంటే పరీక్షించుకోవచ్చు. ఎలా? తమదైన దేహాలయంలోకి ప్రవేశించడం ద్వారా!


అది అంత తేలిగ్గా సాధ్యమయ్యేనా? సామాన్యులకు, ప్రత్యేకించి భౌతిక సుఖసంతోషాలు, అర్థకామాలలో మునకలేస్తున్న వారికి ఇది అసాధ్యమేనా? దేవుడు లేడులేడనుకొనేకన్నా, ఎవరికి వారు తమ దేహాల్లోని పరమాత్మ దర్శనం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు? కారణం, దేవాలయంలోకి వెళ్లినంత తేలిగ్గా దేహాలయంలోకి వెళ్లలేం కాబట్టి. అదొక అనూహ్య ప్రపంచం కనుక. అద్భుత మనోనియంత్రణ తపోవిద్య. అంతా అబద్ధం. మన దేహంలో ఏముంది, పచ్చి రక్తమాంసాలు, ఆమ్ల రసాయన మూలకాలు, పంచేంద్రియాల సువాసనలు, ఎముకలు, జీవకణాల గుట్టలు తప్ప అని అనుకొనే వారెందరో. వారెవరో చేశారని మనమూ రొమ్ములు, కండ్లను, మూడోకన్ను (కనుబొమల మధ్య)ను నిజంగానే చీల్చుకుంటే అన్యాయంగా చస్తాం. నిజంగానే దేవుడు ప్రతీ దేహంలోనూ వుంటే కొందరికి కనిపించి, మరెందరికో ఎందుకు కనిపించడు? రూపం లేదనే వారితోపాటు సృష్టిలోని రూపాలన్నీ తనవే అనే వారూ ఉన్నారు.


ఏమిటీ చిత్రవిచిత్రం? అవును, రెండూ వాస్తవమే. కానీ, అసలు సత్యం ఆయా వ్యక్తులకు వ్యక్తిగత అనుభవంతోనే తెలుస్తుంది తప్ప, పదిమందికి అట్టహాసంగా కనిపించే బహిరంగ విషయంలా ఉండదు. ఈ అస్తవ్యస్త ప్రపంచంలో, మరీ ముఖ్యంగా భౌతిక పదార్థాలతో కూడిన మహాసాగరంలో, మాయామోహాలన్నీ దట్టమైన మేఘాల్లా కమ్ముకున్న జీవజగత్తులో జీవాత్మలకు పరమాత్మ అందడం చాలాచాలా కష్టం. వీటన్నింటినీ ఛేదించి, ఏమీ లేని, తానొక్కడే ఉన్నాడనుకుంటున్న ఆ మహాశూన్యంలోకి మనోయానం (తపోనిద్ర) చేస్తే తప్ప అక్కడికి చేరుకోలేమన్నది నిజం.


జీవన్ముక్తులమయ్యామని చెప్పుకొనే వాళ్లంతా నిజానికి కానట్లే లెక్క అని దైవసమానులైన మానవులెందరో అన్నారు. కానీ, దేవుని కోసం ఎక్కడెక్కడో వెతక్కుండా ప్రతి ఒక్కరూ తమ దేహంలోనే దర్శించే ప్రయత్నం ఎలా చేయాలి? మనసును నిర్వికల్ప స్థితిలోకి ఎలా నెట్టి వేయగలం? బిలియన్ల డాలర్లు (లక్షల కోట్లు) ఖర్చు పెట్టయినా సరే, ప్రత్యక్ష రోదసిలోకి వెళదామనుకొంటారే తప్ప, ఖర్చులేని మనోశూన్యం తలుపుల్ని తెరిచే ప్రయత్నమైనా చేయరు. కారణం, ఉందో లేదో తెలియని దానికోసం ఉన్నదంతా వదిలేసుకొనేంత పిచ్చివాళ్లా (అజ్ఞాన) ఈ మానవులు! అవసరమైతే చిన్న మెదడులోంచి మేథోగంధాన్ని ఇంకాఇంకా తోడుకొంటారు కానీ, అటువంటి తెలివితక్కువ పనికి సిద్ధపడరు. అవునా?


అయితే, మనిషిని నాగరికుణ్ణి చేసి, అనేక సుఖాలు, సాంకేతిక సౌకర్యాలలో తేలియాడేలా చేస్తున్న సైన్సే (విజ్ఞానశాస్త్రం) దేహాలయంలోకి ప్రవేశించడానికి కావలసిన జ్ఞానాన్ని మనకిచ్చిందని న్యూఢిల్లీకి చెందిన ఒక సీనియర్ వ్యవసాయ భౌతిక శాస్త్రవేత్త ఎ.వి.మొహరిర్ ఇటీవలి తన సుదీర్ఘమైన వైజ్ఞానికశాస్త్ర-ఆధ్యాత్మిక వ్యాసం (Science, spirituality and God: An attempted Sytheses) లో పేర్కొన్నారు. యూనివర్సిటీ న్యూస్ పత్రిక (2018 అక్టోబర్ 1-7)లో ప్రచురితమైన ఇందులోని రెండో భాగంలో ఈ వివరాలను ఆయన పొందుపరిచారు. ప్రత్యేకించి మానవదేహం ఆధ్యాత్మిక విజయానికి ఒక ప్రయోగశాల అని, పలు నియమనిష్ఠలతో ఆ జ్ఞాన సింహద్వారాన్ని తెరవగలమనీ చెప్పారు.


సృష్టిని నడిపిస్తున్న ప్రాథమిక సూత్రాల క్రమబద్ధత మాదిరిగానే ఆత్మసాక్షాత్కారానికి కూడా శరీరం ఒక అద్భుత అస్త్రంగా పనిచేస్తుందని మొహరిర్ పేర్కొన్నారు. ఇందుకు తొలుత మన దేహజ్ఞానాన్ని, శరీర తత్వాన్ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి ఎలాగైతే ఒక పద్ధతి ప్రకారం నడచుకుంటున్నదో అదే ధోరణిని మనమూ మన దేహాలయంలోకి ప్రవేశించడానికి ఉపయోగించాలని ఆయన చెప్పారు. అందుకు, అదుపు లేని భావోద్వేగాలను నియంత్రించుకోవడం, నియంత్రణంలో లేని ఆలోచనలను మచ్చిక చేసుకోవడం, గతి తప్పిపోయే మనసుకు కళ్లెం వేయడం, ఆలోచనా రహిత చర్యలను అడ్డుకోవడం వంటి వాటి ద్వారా వ్యక్తిత్వ శక్తిని పెంచుకోవాలని, ఫలితంగా మానవజన్మను సార్థకం చేసుకోగల స్థితిలోకి చేరుకుంటామని మొహరిర్ వివరించారు. ఈ విజ్ఞానాన్నే ఆధ్యాత్మికతగా పిలుస్తామని ఆయన అంటున్నారు.
- దోర్బల బాలశేఖరశర్మ


temple2

తపనతోనే సాధ్యం

మన దేహంలోని విశ్వాత్మ (Universal Consciouness) వాసనలను ఆధ్యాత్మిక సాధనతో పసిగట్ట వచ్చునని మొహరిర్ తెలిపారు. అంతమాత్రాన సాక్షాత్కరం మన అరచేతిలోకి వచ్చిపడదు. దానిని సాధించాలన్న, కావాలన్న, పొందాలన్న తపన, పట్టుదలతో కూడిన పారవశ్యకతలోకి మునిగిపోవాలి. శరీరానికి బయటివైపు జరిగే చర్యలకు అతీతంగా మనసులో అంతర్మథనంతో కూడిన అన్వేషణ జరగాలి. ప్రాచీన భారతీయ ఋషుల భాషలో చెప్పాలంటే ఇదొక తపస్సు. ఈ క్రమంలోనే మన శరీరం ఒక భౌతిక ప్రయోగశాల అవుతుందని, దీనికోసం దేహాన్ని శ్రుతి చేసుకోవలసిందేనని మొహరిర్ అంటున్నారు. మరి, ఇది జరగాలంటే మన మనసులోని అన్ని ఇష్టాయిష్టాలు, మోహాలు, ఒత్తిళ్లు, పంచేంద్రియాల కోర్కెలు, స్వీయ అహాలు, అభిమాన పక్షపాతాలు అన్నింటినీ తుడిపేయాలి. అప్పుడే ఆ ఆధ్యాత్మిక సింహద్వారం కమాను (ఆర్చి) మూలాధారంలో కదలిక వస్తుందన్నది ఆయన నిర్ధారణ.

1313
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles