దేశం తర్వాతే కుటుంబం!


Sat,February 2, 2019 02:11 AM

జనవరి 26.. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. మువ్వన్నెల జెండా రెపరెపలు.. వేలాది ప్రజల అభివాదాల మధ్య సైనిక కవాతు.. మరోవైపు త్రివిధ దళాల సైనిక వందనం.. శకటాల ప్రదర్శన.. సైనికుల బూట్ల చప్పుళ్లతో రోమాలు నిక్కపొడుస్తున్న సందర్భమది. అంతమందిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నదో కుటుంబం. ఇంతలోనే 144 మంది పురుష సైనికులకు నాయకత్వం వహిస్తూ.. ఓ మహిళా లెఫ్ట్‌నెంట్ ముందుకు వచ్చారు. ఆ కుటుంబం కళ్లలో ఆనందభాష్పాలు. ఊపిరినంతా బిగబట్టి.. ఉబికి వస్తున్న ఆనంద భాష్పాలతో లెఫ్ట్‌నెంట్‌కు సెల్యూట్ చేశారు. ఆ రోజు కోసం.. ఆ కుటుంబం ఎంత కష్టడిందో తెలుసా?
కన్నతల్లి కలలు, తాతయ్య, అమ్మమ్మల ఆశలు.. ఆ లెఫ్ట్‌నెంట్ ఆశయాలు పరిసమాప్తమైన రోజది. ఆర్మీ లెఫ్ట్‌నెంట్ భావన కస్తూరి కుటుంబం.. తమ ఇంటి ఆడబిడ్డ ఎదుగుదలను జిందగితో ఇలా పంచుకున్నారు.

Bharathanatyam
ఓ కాగితానికి దారం కట్టి ఎగురవేస్తే.. మనకు అందనంత ఎత్తుకు వెళ్తుంది. చూసేవారికి అది గాలిపటం. అంత ఎత్తులో ఉన్న ఆ పటానికి తెలుసు.. తాను ఓ దారంపై ఆధారపడ్డానని. ఆ దారానికి తెలుసు.. ఆ కాగితం ఎప్పటికైనా గాలిపటమై అందనంత ఎత్తుకు ఎదుగుతుందని. ఎందుకంటే ఆ మాటల్లో ఇరువురి కష్టం, ఇష్టం ఉన్నాయి కాబట్టి. అలాంటిదే ఈ సందర్భం. ఎంతకష్టమైనా ఇష్టంతో పనిచేసి లెఫ్ట్‌నెంట్ ఆఫీసర్ స్థాయికి చేరుకుంది భావన కస్తూరి. ఆదే స్ఫూర్తితో 144మంది పురుష సైనిక బృందానికి నాయకత్వం వహించి.. 23 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది. ఆమె మన తెలంగాణ ముద్దుబిడ్డ. అచ్చమైన హైదరాబాదీ. స్వశక్తితో, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో తెలంగాణ సత్తాను ఢిల్లీలో చాటిచెప్పిన ధీరవనిత. భావన ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడిందో కొందరికే తెలుసు. ఎన్ని అడ్డంకులను ధైర్యంతో ఎదుర్కొన్నదో తనకు, తన కుటుంబానికే తెలుసు. వాటిని ఆవిష్కరించే ప్రయత్నమిది.

అమ్మ స్టెనోగ్రాఫర్: సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది భావన. ఆడపిల్ల ఇంటికే పరిమితమవ్వాలనే తత్వానికి ఆ కుటుంబం వ్యతిరేకం. అందుకే భావన తాతయ్య జయంత్ బాబు తన బిడ్డలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అంతే స్వేచ్ఛను తన కూతురికి ఇచ్చారు తల్లి శశిరేఖ. అందుకే భావన అంటే ఏంటో ఇప్పుడు దేశానికి తెలిసింది. భావన తల్లి శశిరేఖ హైదరాబాద్‌లోని కార్మిక న్యాయస్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తుంది. భావన చిన్నతనంలోనే తండ్రి తన తల్లి నుంచి దూరమయ్యాడు. అయినా శశిరేఖ కృంగిపోలేదు. తన కూతురి కోసమే జీవించింది. కుటుంబ ఖర్చులకు సరిపడేంత వేతనమే వచ్చినా.. కూతురి ఇష్టాయిష్టాలను ఎప్పుడూ కాదనలేదు.అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్న భావన.. తన తాహతుకు మించి ఎప్పుడూ ఏదీ కుటుంబాన్ని కోరలేదు. ఉన్నదాంట్లోనే అన్నీ సరిపెట్టున్నారు. తాతయ్య జయంత్ బాబు, అమ్మమ్మ జ్యోతి, తల్లి శశిరేఖ.. వీరే తన ఆనందం. కూచిపూడి, యోగ, సంగీతం, పాటలు పాడడం ఇవే తన ప్రపంచం.
Bharathanatyam2
దారి చూపిన ఎన్‌సీసీ: చిక్కడపల్లిలోని అరోర డిగ్రీ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ఎన్‌సీసీలో జాయిన్ అయ్యారు భావన. చురుగ్గా పాల్గొంటూ మంచి క్యాడెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో క్యాంపుల్లో సుపీరియర్స్‌తో శెభాష్ అనిపించుకున్నారు. 2010లో ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపికయ్యారు భావన. అక్కడ సైనికుల కవాతు, దేశ సేవలో వారి త్యాగాలు ఆమెలో స్ఫూర్తిని రగిలించాయి. అప్పుడే ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. తన లక్ష్యాన్ని, ఆశయాన్ని ఇంట్లో చెబితే.. వారు కూడా అంగీకరించారు. ఎందుకంటే భావన అంటే ఒక విశ్వాసం. తాను ఏం చేసినా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని కుటుంబసభ్యుల నమ్మకం. అందుకే తన నిర్ణయానికి అడ్డుచెప్పలేదు. అప్పటి నుంచి దేశ సేవే తన ప్రపంచంగా మలుచుకున్నారు భావన. ఈ క్రమంలో ఇష్టమైన లక్ష్యం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. రేయింబవళ్లు శ్రమించి, తన శరీరాన్ని ఆర్మీ నిబంధనలకు తగ్గట్లు మలుచుకున్నారు. రాత్రిళ్లు పది నుంచి అర్ధరాత్రి వరకు చదువుకునేవారు. మూడు విఫలయత్నాల తర్వాత.. ఆర్మీ సర్వీస్ కారప్స్ విభాగంలో ఉద్యోగం సంపాదించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. అప్పటి నుంచి దేశం తర్వాతే కుటుంబం అంటూ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

వారందరికీ సమాధానం చెప్పింది: ఆర్మీ శిక్షణ అంటే చాలా కష్టం. నువ్ ఆడపిల్లవి. నీ వల్ల కాదు.. అనే మాటలు ఒకవైపు నుంచి వినబడుతుంటే.. చక్కగా నాట్యం నేర్చుకున్నావ్. సంగీతం బాగావచ్చు. ప్రయత్నిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుంది. నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. పెండ్లి చేసుకోక ఈ తిప్పలన్నీ నీకెందుకు అనే మాటలు మరోవైపు వినపడుతున్నాయి. ఇలా చెప్పేవాళ్లంతా బంధువులు, స్నేహితులు, తెలిసినవాళ్లే. అయినా తల్లి అవేం పట్టించుకోలేదు. కూతురి ఇష్టానికే వదిలేసింది. తర్వాత భావన ఆర్మీకి వెళ్లడం ఇష్టంలేని బంధువులంతా.. రిపబ్లిక్ డే పరేడ్‌లో తనను చూసి గర్వంగా చెప్పుకుంటున్నారు. చాలామంది ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. అప్పుడు నేను వాళ్ల మాటలు విని ఉంటే.. నేడు నా కూతురు దేశానికి సేవ చేసేది కాదు అంటూ నాటి సంఘటనను చెప్పుకొచ్చారు భావన తల్లి శశిరేఖ. ఇప్పుడు తనకు మంచి కుటుంబం దొరికింది. భర్త కూడా ఆర్మీలో డాక్టర్.
kasturi
మరిచిపోలేని సంఘటన: చిన్నవయసులోనే తండ్రి దూరమవడంతో అమ్మమ్మ, తాతయ్యల వద్దనే పెరిగారు భావన. ఆమె అంటే వారికి ప్రాణం. ఐదో యేట నుంచే కూచిపూడిలో శిక్షణ ఇప్పించారు. అంత చిన్న వయసులో ముద్దులొలికే మోముతో.. బుడిబుడి అడుగులతో నృత్యం చేస్తుంటే మురిసిపోయేవారు తాతయ్య. తండ్రి దూరమైన భావనను తన మూడో కూతురిలా పెంచాను అంటున్నారు తాతయ్య జయంత్ బాబు. ఆర్మీ శిక్షణ తీసుకుంటున్న కొత్తలో ఓసారి.. తాతయ్య నా కాళ్లకు బొబ్బలు వచ్చాయి. సాక్స్‌లు కూడా పట్టడం లేదు. అయినా మీరేం బాధపడకండి నేను బాగానే ఉన్నా. ఎలాగైనా దేశ సేవ చేయాల్సిందే అని భావన చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు జయంత్ బాబు. అలాంటి కష్టాలను ఎన్నో అనుభవించారు భావన. ఎంత కష్టమొచ్చినా తల్లికి చెప్పుకునేది కాదు భావన. ఆమెతో కేవలం సంతోషాన్నే పంచుకునేది. అయినా నా మనవరాలికేమండి.. బంగారం. తను ఇంకా ఉన్నతస్థానాలను అధిరోహిస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది అని చిరునవ్వుతో చెబుతున్నారు. ఎందుకంటే ఆమె ప్రతి విజయంలోనూ, అపజయంలోనూ వీరంతా వెన్నంటి ఉన్నారు కాబట్టే అంత నమ్మకం.

ఆమెలో మరో కోణం..

Bharathanatyam1
-భావన యోగాలో మూడుసార్లు రాష్ట్రస్థాయిలో చాంపియన్‌గా నిలిచారు.
-కర్రసాములోనూ ప్రావీణ్యం సంపాదించారు.
-ఎన్‌సీసీలో బెస్ట్ క్యాడెట్‌గా ప్రతిభా పాటిల్ నుంచి మెడల్ అందుకున్నారు.
-2013లో హెచ్‌ఆర్‌డీ స్కాలర్‌గా ఎంపికైంది. సౌత్ ఇండియా నుంచి ఎంపికైంది భావన ఒక్కరే.
-గ్రాడ్యుయేషన్‌లో కాలేజ్ టాపర్‌గా నిలిచి, ఓయూలో మైక్రోబయాలజీ డిస్ట్రింక్షన్‌లో పాసయ్యారు.
-కూచిపూడిలో చాలా ప్రావీణ్యం ఉన్నది. మన దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాల్లో, మలేషియా, సింగపూర్, దుబాయ్ దేశాల్లో కూచిపూడి ప్రదర్శన ఇచ్చారు.
-పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి సంగీతం, డ్యాన్స్‌లో డిప్లొమా పొందారు.
-కర్ణాటక వోకల్ సంగీతంలో చక్కగా పాటలు పడుతారు.
-గుర్రపుస్వారీ, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఈత, రాకెట్ లాంచింగ్, ఫైరింగ్, రోప్ పుషింగ్ వంటి శిక్షణల్లో ఆరితేరారు భావన.
-పరేడ్, పరుగుల్లో పురుష జవాన్లతో సమానంగా పాల్గొంటారు.
-తన బ్యాచ్‌లో 250 మంది ఉంటే అమ్మాయిల సంఖ్య 30. అంతమందిలోనూ అన్ని శిక్షణల్లో ఒక్క దెబ్బ తగలకుండా మెరిట్ సాధించిన ఏకైక జవాను భావన.
-శిక్షణ పూర్తయ్యేసరికి అకాడమీలో టాప్-5లో నిలిచి.. బిపిన్ రావత్ నుంచి అభినందన అందుకున్నారు.
-తన మొదటి పోస్టింగ్ కార్గిల్‌లో ఇచ్చారు.

-డప్పు రవి

1425
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles