దీప డ్రైవింగ్ స్కూల్


Sat,February 16, 2019 12:31 AM

కిక్ కొట్టి.. గేర్ మార్చి.. రయ్య్‌మ్రంటూ దూసుకెళుతుంటే.. ఆ మజాయే వేరంటూ అబ్బాయిలు బైక్‌లపై వెళుతుంటారు.. ఎన్‌ఫీల్డ్.. ఆర్‌ఎక్స్ 100లు.. అబ్బాయిల చాయిస్‌లే మొన్నటివరకు.. స్కూటీలను పక్కన పెట్టి గేర్ బండిని చేత బట్టి.. మగవాళ్లకి దీటుగా అమ్మాయిలూ తక్కువ కాదని నిరూపించే రోజులు వచ్చేశాయి.. కానీ నేర్చుకోవడమే ఎలా అనే కదా మీ సందేహం.. గేర్ స్పాట్ దాకా వెళ్లి.. దీపా అని పిలిస్తే చాలు.. నేనున్నానంటూ బైక్‌లతో సిద్ధంగా ఉంటుంది.. ఆ దీపా రాధాకృష్ణన్ చెప్పే మరిన్ని ముచ్చట్లు మన జిందగీలో.. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ బైక్ మీద అమ్మాయిని వెనక కూర్చోబెట్టి తీసుకెళుతుంటే అందరం ఆనందించాం. ఒక్కసారి ఈ సీన్ రివర్స్ చేసి చూడండి. అదే అబ్బాయి ప్లేస్‌లో.. అమ్మాయిని కూర్చోబెట్టి వెనుక అబ్బాయి కూర్చుంటే ఆ కిక్ వేరప్పా అనే విధంగా ఉంది కదా! స్కూటీల వరకే ఇప్పటిదాకా అమ్మాయిలు పరిమితమయ్యారు. గేర్ బైక్‌ల దగ్గరకి వచ్చేసరికి తటపటాయిస్తారు. అవి మావి కాదేమో అన్న సందేహంతో వాటి జోలికి కూడా వెళ్లారు. కానీ ఒక్కసారి ఆ బైక్ మీద కూర్చుంటే ఆ రాజసమే వేరంటున్నది దీప.
Bike-driw
రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా గేర్ బైకులను నడుపడమే కాకుండా శిక్షణ కూడా ఇస్తుంది దీపా రాధాకృష్ణన్. ఎలాంటి బైక్ అయినా కనీసం 150 కి.గ్రా.ల బరువు ఉంటుంది. అన్నింటిలో కన్నా రాయల్ ఎన్‌ఫీల్డ్ చాలా బరువు ఉంటుంది. అలాంటి బైకుని అలవోకగా నడుపుతున్నది దీపా కృష్ణన్. ఒక్క మాటలో చెప్పాలంటే బైక్ అంటే పిచ్చి.

బుల్లెట్ షికారు: దీపా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. చదువు పూర్తయిన తర్వాత కొన్ని సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసింది. తిరిగి హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. కూడబెట్టుకున్న డబ్బులతో ఎంతో ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కొన్నది. ఒక్క గల్లీ కూడా వదలకుండా రౌండ్స్ వేసేది. అడపిల్ల బుల్లెట్ బండి నడుపుతుందని చాలామంది ఆశ్చర్యంగా చూసేవారు. దీపా స్నేహితుల్లో చాలామంది అమ్మాయిలు బైక్ నేర్చుకోవాలనుకునేవారు. కానీ కుదిరేది కాదు. ఫ్రెండ్‌గా వారి కోరికను నెరవేర్చగలిగింది. మిగిలిన వారి ఆశని ఎవరు తీరుస్తారు? ఆ సందేహం దీపా మనసులో మెదిలింది. ఆడపిల్లలకు బైక్ నేర్పే అవకాశాన్ని వదలుకోవాలనుకోలేదు. ఇష్టమున్నవాళ్లందరికీ బైక్ నేర్పి వారి కలల బైకురాణిగా నిలుస్తున్నది దీపా. అలా 2015వ సంవత్సరంలో బైక్ ట్రైనర్‌గా మారింది.

సోషల్‌మీడియా వేదికగా: ట్రైనర్ అన్న విషయం అందరికీ తెలియాలి. అప్పుడే కదా అందరూ వచ్చి నేర్పించమని అడిగేది. ఫేస్‌బుక్‌ని వేదికగా చేసుకున్నది. మహిళలకు రైడింగ్ నేర్పించడానికి లేడీ ట్రైనర్ ఉన్నారని పబ్లిక్‌గా పోస్ట్ చేసింది. అనుకున్న దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. చాలామంది మహిళలు దీపాకి పర్సనల్‌గా మెసేజ్ చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మొత్తం 64 మంది కాంటాక్ట్ అయ్యారు. సైకలాజికల్ కౌన్సెలర్‌గా పనిచేసిన ఈమెకు దీపాకి బైక్ నేర్పడం పెద్ద కష్టమనిపించలేదు. మనుషుల తెలివితేటల్ని అంచనా వేయగలిగింది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా శిక్షణ ఇచ్చేది. బైక్ నేర్చుకోవాలంటే విశాలమైన ప్రదేశం ఉండాలి కదా! దీపాకి ఎలాంటి క్లబ్ లేదు. ఏ ఏరియాలో అయితే తక్కువ ట్రాఫిక్ ఉంటుందో అక్కడ దీపా టీం ఉంటుంది. శిక్షణకి కరెక్ట్ సమయం అంటూ కూడా ఉండదు. నేర్చుకునేవారు, ట్రైనర్‌కి ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రాక్టీస్ చేయడమే. స్లోప్‌లో ఎలా వెళ్లాలో నేర్పడానికి జూబ్లిహిల్స్, టర్న్ తీసుకోవడానికి పెద్ద గ్రౌండ్స్ ఎంచుకుంటుంది. అక్కడే వాళ్లకి అలసట వచ్చేంత వరకు రౌండ్స్ వేయిస్తుంది.

ఆరు క్లాసులు మాత్రమే: బైక్ రైడింగ్‌కి నేర్చుకోవడానికి ఫీజు రూ. 6000. రోజూ శిక్షణ ఉండదు. సుమారు ఆరు క్లాసుల్లో బైక్ నేర్పిస్తానంటుంది. బైక్, పెట్రోలు ఖర్చులు దీపానే చూసుకుంటుంది. నేర్చుకునే అమ్మాయి వస్తే చాలు చాలా జాగ్రత్తగా నేర్పిస్తుంది. నాలుగేండ్ల సర్వీస్‌లో ఒక్కరికి కూడా గాయాలు తగల్లేదంటే దీపా ఎంతటి ప్రతిభావంతురాలో తెలుస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లాంటి బైక్‌ల ట్రిక్ తెలిస్తే ఎవరైనా కంట్రోల్ చేయొచ్చంటుంది దీపా. జాయిన్ అయ్యే ముందు హెల్మెట్, షూ, చేతికి గ్లౌవ్స్, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని నిబంధన పెడుతుంది. రైడింగ్ కంటే సేఫ్టీ ముఖ్యం అంటుంది. బైక్ ఎక్కడానికి కూడా కొంతమంది భయపడుతుంటారు. వారికి భయం పోయేలా కౌన్సెలింగ్ ఇస్తుంది. తర్వాత వారే లెట్స్ స్టార్ట్ అంటారు. నేర్చుకునే వారి వయసు 18 నుంచి 64 సంవత్సరాల లోపు ఉండాలి. 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 మందికి డ్రైవింగ్ నేర్పించింది.

రైడింగ్ ఒక్కటే కాదు: దీపా రైడింగ్‌తో ఆపలేదు. ఇంకా చాలానే చేస్తుంది. టాంజీ సెషన్స్‌కి సహ వ్యవస్థాపకురాలిగా పనిచేస్తుంది. దీంతో పాటు సమోసా లాబ్స్ (మొబైల్ యాప్)కి ప్రధాన కర్తగా వ్యవహరిస్తున్నది. సోఫార్ సౌండ్స్ హైదరాబాద్‌కి వలంటీర్‌గా పనిచేస్తున్నది. అంతేకాకుండా హైదరాబాద్ యునైటెడ్ బైకర్స్ మహిళా కమిటీలో సభ్యురాలిగా చేరింది. అన్ని బాధ్యతల్ని సవ్యంగా వ్యవహరిస్తూ నెలకు కనీసం నలుగురికైనా బైక్ రైడ్ నేర్పిస్తుంటానని దీప చెబుతున్నది. మామూలు బైకుల కంటే గేర్‌లుండే బైక్‌ని నడుపడం చాలా సులువు అంటుంది. కావాల్సిందల్లా రైడింగ్ అంటే ప్యాషన్ ఉండడమేనంటున్నది.

సమానత్వం రావాలి

Bike-driw1
మా నాన్న.. ఎ.పి. రాధాకృష్ణన్, అమ్మ.. టి.వి ప్రమీల. నేను వారికి రెండో అమ్మాయిని. ఫ్రెంచ్ డిగ్రీలో డిప్లొమా చేశాను. ఒక సంవత్సరం సైకలాజికల్ ఇంటర్న్‌షిప్‌గా కూడా చేశాను. తర్వాత టొరొంటోలో ఉద్యోగం చేశాను. ఎన్ని ప్రదేశాలు మారినా ప్రతిచోటా బైక్ రైడ్ చేయడం మాత్రం మానలేదు. టొరొంటోలో వాతావరణం నచ్చక తిరిగి ఇండియాకి వచ్చాను. అక్క, తమ్ముడు సీనియర్ ఐటీలో స్థిరపడ్డారు. ఇంటర్మీడియట్ చదువుతుండగానే యమహా బైక్ రైడ్ చేయడం నేర్చుకున్నాను. కాలేజ్‌కి కూడా బండి తీసుకెళ్లేదాన్ని. స్నేహితురాల్ని బైక్ మీద తిప్పేదాన్ని. అది చూసి వాళ్ల తల్లిదండ్రులు ఎవరో అబ్బాయితో బండి మీద తిరుగుతున్నావని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదట మా అమ్మానాన్నలు బైక్ ట్రైనర్ అనగానే చాలా భయపడ్డారు. కానీ నా ప్యాషన్‌కి గౌరవం ఇస్తారు. అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా రైడ్ చేసే రోజు రావాలి. ఆరోజు దగ్గర్లోనే ఉంది. నేను మార్పు తీసుకొస్తాను అంటున్నది దీపా రాధాకృష్ణన్.

- వనజ వనిపెంట
- చిన్న యాదగిరి గౌడ్

1271
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles