తెలంగాణ పర్యాటకంపై క్రెడాయ్ దృష్టి..


Sat,March 2, 2019 12:09 AM

credai
పర్యాటకం ద్వారా భారత గ్రామీణ ఆర్థిక వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో క్రెడాయ్ యూత్ వింగ్ చేపట్టిన కార్యక్రమంలో వరంగల్, సిద్ధిపేటలోని శరభేశ్వర్ ఆలయాలకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 13 గ్రామీణ పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని క్రెడాయ్ యూత్ వింగ్ నిర్దేశించుకున్నది. ఢిల్లీలో జరిగిన క్రెడాయ్ యూత్‌కాన్‌లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని చేరుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అవసరమని, ఆయా ప్రాంతాల్లో ఉండే పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరచడం మంచి మార్గమని క్రెడాయ్ యూత్ వింగ్ అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన ఒక నివేదికను క్రెడాయ్ ప్రధాని నరేంద్ర మోడీకి అందించింది. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సరైన సదుపాయాలు కల్పించేందుకు రుణం అందించాలని, స్థానిక ప్రభుత్వాల సహకారం కావాలని కోరింది. హోం స్టే టూరిజం అనేది గ్రామీణ పర్యాటకంలో అతి ముఖ్యమైందని, దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని స్పష్టం చేసింది. గ్రామాలను నగరాలతో అనుసంధానం చేసేలా రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు, ఇంటర్‌నెట్, సోషల్‌మీడియాలో ఆయా గ్రామీణ పర్యాటక ప్రాంతాల గురించి ప్రచారం చేసేలా చర్యలుండాలని పేర్కొంది. పర్యాటకులు సంతృప్తి చెందేలా క్రీడా మైదానాలు, వాకింగ్, ట్రెక్కింగ్ పాత్స్ ఉండాలని, వ్యవసాయ పర్యాటకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, కొనుగోళ్లు సైతం పెరుగుతాయని సూచించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో క్రెడాయ్ తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు జక్సే షా తెలిపారు. క్రెడాయ్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంతో పాటు,భారత ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

233
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles