తెలంగాణ కశ్మీరం


Thu,August 16, 2018 10:54 PM

కనుచూపుమేరలో పరుచుకున్న పచ్చదనం.. కనువిందు చేసే లోయలు, గలగలాపారే అందాల సెలయేటి గలగలలు.. ఎత్తైనకొండలు, అబ్బురపరిచే వృక్షాలు.. పాము మెలికలు తిరిగి నట్లు కొండలను చుడుతూ సాగే ఘాట్‌రోడ్లు.. ఆకాశమంతా మంచుదుప్పటి కప్పుకున్నట్లు నీటితుంపరలు, తమ అందాలతో కట్టిపడేసే జలపాతాలు.. పక్షులు, వన్యప్రాణులు ఇలా ఒక్కటని కాదు ఎన్నెన్నో అందాలను తన ఒడిలో దాచుకున్న పచ్చని అడవిమల్లె.. కశ్మీరపు అందాలను తలదన్నే తెలంగాణ అందాల హరివిల్లు పూర్వ ఆదిలాబాద్ జిల్లా.
telangana-kashnimr


ఆదిలాబాద్ జిల్లరా.. అది ఎర్రని అడవిమల్లెరా పచ్చని అడవంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మరా అంటూ జిల్లా అందాలను కళ్లముందుంచుతాడు మిట్టపెల్లి సురేందర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాను ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలుగా విభజించారు. ఎన్నో అందాలకు నిలయాలైన నాలుగు జిల్లాల సమహారం ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లే కాదు, పలు విశేషాలు చారిత్రాత్మక స్థలాలకు నిలయమీ జిల్లాలు. ఒకప్పుడు దండకారణ్యంలో అంతర్భాగమైన ఆదిలాబాద్ జిల్లా చరిత్ర ఎంతో ఆసక్తికరం.


ప్రకృతి అందాల నిలయం

ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా. ప్రకృతి అందచందాలకు నిలయాలు ఇక్కడి అభయ అరణ్యాలు. జలపాతాలు, ప్రకృతి రమణీయతను చాటుతుంటా యి. కవ్వాల్ అభయ అరణ్యాలు జంతువులకు ఆలవాలం అయిన ప్రాణహిత బ్లాక్, శివారం అభయ అరణ్యం లోగిలి, ఆదిలాబాద్ సెలయేటి గలగలలు, పక్షుల కిలకిల రావాల నడుమ వన్య ప్రాణులు సంచరిస్తుంటాయి. వన్య ప్రాణులకు ఇక్కడ కొదువ లేదు. పులులు, ఎలుగుబంట్లు, నీల్వాయిలు, చిరుతలు, దుప్పులు, నెమళ్ళు, లేళ్లు, నక్కలు, కొండ చిలువలు తదితర వన్యప్రాణులతో పాటు టేకు, జిట్రేగి, వెదురు మొదలగు అపారమైన అటవీ సంపద విస్తారంగా ఉంది.


కుంటాల జలపాతం..

ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధమైన అందమైన జలపాతాల్లో కుంటాల ఒకటి. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతాల్లో కుంటాల జలపాతం మొదటిది. పూర్వం శకుంతల దుష్యంతుల విహార కేంద్రంగా ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. దీన్ని ముందుగా శకుంతల జలపాతంగా పిలిచే వారు క్రమేణా కుంతల జలపాతంగా ప్రస్తుతం కుంటాల జలపాతంగా పిలుస్తున్నారు. కారడవుల మధ్య సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్, నాగపూర్ ఏడవ జాతీయ రహదారిలో ఉన్న నేరడిగొండ మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.


నిర్మల్ కొయ్య బొమ్మలు

సకల కళలకు, కళాకారులకు ప్రసిద్ది గాంచినదే నిర్మల్ జిల్లా. నిర్మల్ కొయ్యబొమ్మల తయారీ కళాకారులు నిర్జీవమైన ప్రతిమలకు జీవం ఉట్టిపడేలా ఆకృతులను తయారుచేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ తయారైన బొమ్మలు అచ్చంగా కూరగాయలు, పండ్లు, పక్షుల మాదిరిగా ఉండి ఆకర్షిస్తాయి. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కొయ్య బొమ్మలు ప్రసిద్ధి గాంచాయి. అలాగే నిర్మల్ పెయింటింగ్‌లకు పెట్టింది పేరుగా నిర్మల్ నిలుస్తున్నది. ఇక్కడ తయారైన బొమ్మలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.


జ్ఞాన సరస్వతి దేవాలయంtelangana-kashnimr2

భారతావనిలో అతి ప్రసిద్ధి గాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం ముదోల్ మండలంలోని బాసరలో కొలువై ఉంది. గోదావరి తీరాన కిలోమీటర్ దూరంలో ఉన్న జ్ఞాన సరస్వతిదేవి వేద వ్యాస మహర్షిచే ప్రతిష్టంపబడింది. మహర్షి వ్యాసుడు ఆ దేవిని ప్రతిష్టించినందుకు, ఆ క్షేత్రంలో నివసించినందుకు ఈ క్షేత్రం వాసరగా, క్రమేణా బాసరగా పిలుస్తున్నారు. బాసర గ్రామానికి వెళ్లే దారిలో వేదవతి (ధనపు గుండు) అనే పెద్ద శిల కనిపిస్తుంది. గోదావరి సమీపాన శివాలయం (సూర్యేశ్వర) ఆలయం ఉంటుంది.


నాగోబా దేవాలయం

జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో వెలసిన గిరిజనుల ఆరాధ్యదైవం అయిన నాగోబా దేవతకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది గిరిజనులు తమ ఇష్ట్టదైవాన్ని దర్శించుకునేందుకు హాజరవుతారు. ప్రతియేటా పుష్యమాసంలో అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది.


జోడేఘాట్

గిరిజనులపై నిజాం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎదిరించి నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పొరాటం చేసిన ఆదివాసీ ముద్దుబిడ్డ, గిరిజనుల ఆరాధ్యదైవం కొమురంభీం. కొమరంభీంది ఆసిఫాబాద్ దగ్గర్ సంకెపల్లి గ్రామం. కొమురం భీం జోడేఘాట్ వద్ద జరిగిన పోరులో ఆయన నేలకొరిగాడు. ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థం స్థూపం, గిరిజన మ్యూజియం నిర్మించారు.


ఇంద్రవెల్లి

1981 ఏప్రిల్ 20న పోలీసుల తూటాలకు నేలకొరిగిన గిరిజనుల జ్ఞాపకార్థం ఇంద్రవెల్లిలో స్థూపం నిర్మించారు. ఇన్ని రోజులు స్థూపం వద్ద నివాళ్లర్పించడానికి ఆంక్షలు విధించేవారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత స్వేచ్ఛావాతావరణంలో గిరిజనులు నివాళులు అర్పిస్తున్నారు.


ప్రాణహిత,శివరాం వన్యప్రాణి అభయారణ్యాలు

ప్రాణహిత సంరక్షణ కేంద్రం మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో దాదాపు 136 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. శివరాం అభయారణ్యం ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 29.81 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. ఇది గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉంది.
-మధుకర్ వైద్యుల


పొచ్చెర జలపాతం

pochera
ఈ జలపాతం చిన్నదే అయినప్పటికీ ఎంతో ఆకర్షణీయంగా కనిపి స్తుంది. జాతీయ రహదారి పక్క నుంచి బోథ్ వెళ్లే మార్గంలో కిలోమీటర్ దూరంలో ఈ జలపాతం ఉంది. పొచ్చెర అనే గ్రామ సమీపంలో చిన్నకొండ వాగు రాళ్ల పై నుంచి దూకే ఈ దృశ్యం చూడచక్కగా కనిపిస్తుంది. ఏ కాలంలోనైన పొచ్చెర జలపాతానికి చేరుకోవచ్చు. పర్యాటకులు ఏ వేళలోనైనా అక్కడికి వెళ్లి జలపాతం అందాలను తిలకించవచ్చు. ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేకపోగా ప్రస్తుతం అధికారులు సందర్శకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేశారు.


కెరమెరి ఘాట్‌రోడ్

telangana-kashnimr3
ఆదిలాబాద్ అడవుల్లో కెరమెరి గ్రామానికి సమీపంలో ఉండే ఘాట్‌రోడ్ చూడడానికి రెండుకళ్లు సరిపోవు. మెలికలు తిరుగుతూ విస్తారమైన అడవిమధ్యనుండి సాగిపోయే ఈ రోడ్‌మీద ప్రయాణం ఒక మధురానుభూతి. శీతాకాలంలో ఈ రోడ్డునుండి చూస్తే అందాల కాశ్మీరం కళ్లముందు కదలాడుతుంది.

3576
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles