తీర్థయాత్రలకు కొత్త దారి చూపిస్తున్నరచనా గులాటీ


Mon,September 10, 2018 01:32 AM

ఎప్పుడో ఒకసారి వచ్చే పండుగులకో పబ్బాలకో గుళ్లకు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అసలే పండుగనాడు ఎంతమంది భక్తులుంటారో? దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో? అసలు గుడి సమయాలు ఎప్పుడో? ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. అవసరమైతే అక్కడ ఎవరైనా
తెలిసిన వారుంటే తెలుసుకుని మరీ వెళ్తాం. అలాంటిది మనకు తెలియని ప్రాంతంలోని పుణ్య క్షేత్రాలను దర్శించాలంటే? ఒక్క హిందూ దేవాలయాలకే కాదు ఇస్లాం, క్రైస్తవం, జైన్, బుద్దిజం.. ఇలా అన్ని మతాల ధార్మిక పర్యటనలూ చేయాలంటే? వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలంటే?.. వీటికి సమాధానమే
మైహోలీ టూర్. ఆర్థిక నిపుణురాలిగా ఉండి మైహోలీ టూర్ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయాల్ని అందుకుంటున్న రచనా గులాటీ సక్సెస్‌మంత్ర.

cropped
80 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో అక్షరాలా ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు. ఇది రెండు తెలుగు రాష్ర్టాల రెండేండ్ల బడ్జెట్‌తో సమానం. అయితే మనం చెప్పుకుంటున్నది ఆ బడ్జెట్ వివరాలు కాదు సుమా! ఈ మొత్తం ఏంటో తెలుసా? దేశ వ్యాప్తంగా ప్రజలు ఏడాదిలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం చేస్తున్న ఖర్చు. దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది కాబట్టే 41 ఏళ్ల ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ రచనా గులాటీ.. తన అదృష్టాన్ని ఈ రంగంలోనే పరీక్షించుకోవాలనుకున్నారు. మైహోలీటూర్‌ను ప్రారంభించి విజయం సాధించారు.

ఆలోచన రేపిన వార్త

న్యూయార్క్ కేంద్రంగా అడ్వర్టయిజింగ్, డిజిటల్ సేవలందించే ఉండర్‌మెన్ సంస్థ ఫైనాన్స్ కంట్రోలర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు రచనా గులాటి. ఓ రోజు దేశంలో ఏటా 1.1 బిలియన్ యాత్రికులు తీర్థయాత్రలకు వెళ్తున్నారని.. ఏటా ట్రావెల్ విభాగం 10 శాతం వృద్ధిని సాధిస్తుంటే.. ధార్మిక యాత్రల విభాగం మాత్రం 30-40 శాతం వృద్ధిని సాధిస్తుందనే ఓ వార్త ఆమెను బాగా ఆకర్షించింది. ఇదే మైహోలీ టూర్ డాట్ కామ్ ఆరంభానికి కారణమని చెప్పారామె. సాయి అమృత టూరిజం నుంచి రూ. 80 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా మైహోలీటూర్ డాట్ కామ్‌ను ప్రారంభించారామె.

సమగ్ర సమాచారం

18 ఏండ్ల పాటు ఆర్థిక నిపుణురాలిగా పని చేసిన రచనా గులాటీ.. 2014లో మైహోలీ టూర్‌ను ప్రారంభించారు. సహజంగా ఆధ్యాత్మిక విషయాలపై అమితమైన ఆసక్తి ఉండటంతో పాటు.. ఆ రంగంలో ఉన్న మార్కెట్ అవకాశాలు కూడా రచనా గులాటీని ఆకర్షించాయి. అయితే అందరిలా తన స్టార్టప్‌ను మార్కెట్ ప్లేస్‌లా మారిస్తే తన ప్రత్యేకత ఏముంది? అనుకున్నారు. అందుకే ముందుగా భారతదేశంలో మరుమూల ప్రాంతాల్లో సైతం ఉన్న గుళ్లూ, గోపురాల సమాచారాన్ని సేకరించి తన వెబ్ సైట్లో నిక్షిప్తం చేశారు. దాదాపు ఇప్పుడు ఆరు వందల పుణ్యక్షేత్రాల వివరాలను మైహోలీటూర్‌లో తెలుసుకోవచ్చు. ఆ క్షేత్రం విశిష్టత, చారిత్రక నేపథ్యం, భక్తుల ఆచారాలు.. ఇలా ప్రతీ విషయాన్ని మైహోలీటూర్ వివరిస్తుంది. వీటితో పాటు వాటిని సందర్శించడానికి ఆన్‌లైన్, ఆఫ్ లైన్ బుకింగ్‌లను కూడా నిర్వహిస్తున్నది.

విస్తృత పరిశోధన

రచనా గులాటి భారత ఆధ్యాత్మిక విశేషాల కోసం సమగ్ర పరిశోధన చేశారు. ఈ క్రమంలో ఫిక్కి సాయం తీసుకున్నారు. సొంతంగా బ్రాండ్‌ను డెవలప్ చేయాలనే లక్ష్యం పెట్టుకుని.. ఆమదెస్, గెలీలియో లాంటి ట్రావెల్ ఏజన్సీలతో టైఅప్ అయ్యారు. టెక్నాలజీ రంగంలో పెద్దగా అనుభవం లేకపోవడం రచనకు ఇబ్బందికరంగా మారింది. వెబ్‌సైట్ రూపకల్పన కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. వెబ్‌సైట్ డెవలపింగ్ విషయంలో చాలా అప్లికేషన్ల అవసరం ఉండటంతో.. వెబ్ డెవలపర్లు భారీ మొత్తాలను డిమాండ్ చేసేవాళ్లు. ఇలాంటి సవాళ్ల మధ్య దాదాపు ఇరవై నెలలు నెట్‌వర్కింగ్ మీద పనిచేశారు. తనకు పూర్తిగా తెలియని కొత్త ముఖాలు.. అప్పటికే ఇండస్ట్రీలో విజయం సాధించిన వారితో వ్యవహారాలు చక్కబెట్టాల్సి వచ్చింది. అయినా తన ఆలోచన మీద ఉన్న నమ్మకంతో అందర్నీ ఒప్పించారు.
Myholytour

ఒప్పందాల్లో సవాలు

వ్యాపారాన్ని ప్రారంభించాక వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం మరో సవాల్‌గా మారింది రచనకు. ఎందుకంటే తన స్టార్టప్‌కు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ తేవాలనుకుంటున్న రచన.. స్వయంగా వారి సర్వీస్‌ను పరిశీలించిన తర్వాతే ఒప్పందం చేసుకునేది. ఇలా ఏడు నెలల పాటు శోధించి.. అధ్యాత్మిక యాత్రలకు వెళ్లేవారికి ఎవరైతే సరిగ్గా సేవలు అందించగలరో అలాంటి వారితోనే టైఅప్ పెట్టుకుంది. ఆధ్యాత్మిక టూరిజంలో చేస్తున్న ప్రయత్నానికి రెక్స్ గ్లోబల్ ఫెలోషిప్‌తో పాటు కర్మ్ వీర్ చక్ర పురస్కారాల్ని కూడా రచనా గులాటీ అందుకున్నారు.

కీలక ఒప్పందాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్న టూరిజం కార్పొరేషన్లతో ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఆధ్యాత్మిక పర్యటనల్లో యాత్రికులకు మంచి సర్వీస్ అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. పెద్దగా ప్రచారంలోకి రాని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను ప్రమోట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం అంటున్నారు రచనా గులాటీ. మైహోలీ టూర్‌లో 700లకు పైగా ధార్మిక పర్యటనలు ఉన్నాయి. దేశంతోపాటు విదేశీ యాత్రలకు సేవల విస్తరించాలనే ఆలోచనలో రచనా ఉన్నారు.

కఠినమై పోటీ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రావెల్, టూరిజం బిజినెస్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైంది. జీడీపీలో దీని వాటా 9.4 శాతం. ఈ రంగంలో కొంతకాలం వరకు మార్కెట్ అసంఘటితంగా ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల్లో కొన్ని స్టార్టప్‌లు మార్కెట్‌ను పెంచుకునేందుకు విశేషంగా శ్రమిస్తున్నాయి. మేక్ మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్, హాలీడే ఐక్యూ లాంటివి మంచి వృద్ధిరేటు నమోదు చేస్తున్నాయి. మేక్ మై ట్రిప్ ఆధ్యాత్మిక పర్యటనల రంగంలోనే 30 శాతం వృద్ధి సాధిస్తున్నది. వీటికి పెద్ద సంస్థలతో ఒప్పందాలు.. వినియోగదారులకు డిస్కౌంట్లు ఇవ్వగలిగిన సామర్థ్యం కూడా ఉంది. వీటితో పాటు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పాతుకుపోయిన లోకల్ ఆపరేటర్లనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో పుణ్యక్షేత్రాల సందర్శన ఎప్పుడూ కొంచెం క్లిష్టమైన వ్యవహారమే. తెలియని భాషలు, తెలియని ప్రాంతాల సందర్శనకు ఓ మంచి నమ్మకమైన తోడు ఉంటే బాగుండు అనుకుంటారు ఎవరైనా. అలాంటి నమ్మకాన్ని మైహోలీ టూర్ కల్పించగలిగితే అనంతంగా ఉన్న మార్కెట్‌లో తనదైన ముద్ర వేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఈ విషయంలో రచనా గులాటి ఆత్మవిశ్వసంతోనే ఉన్నారు.

దేశంలోని తీర్థయాత్రలకు తీసుకెళ్లటం మాత్రమే మా పనికాదు. సంబంధిత యాత్రల వివరాలను, వాటి ప్రాశస్త్యాలనూ మా వెబ్‌సైట్‌లో పొందుపరిచాం. షిరిడీ, తిరుపతి, సిద్ధి వినాయక, ద్వారక, జామా మసీదు, హాతీసింగ్ జైన్ టెంపుల్.. ఇలా దేశంలోని 260 ప్రాంతాల్లో సుమారు 700 ధార్మిక ప్రాంతాల జాబితాను రూపొందించాం. వ్యక్తిగత యాత్రలే కాదు బృంద యాత్ర సేవలనూ బీ2బీ, బీ2సీ, బీ2బీ2సీ సేవలను కూడా అందించడం మా ప్రత్యేకత. ప్రస్తుతం బడ్జెట్, ఎకానమీ, ప్రీమియం కేటగిరీల్లో సుమారు 60 ప్యాకేజీలున్నాయి. మా ప్యాకేజీల సంఖ్యను 100కు చేర్చాలనేది మా లక్ష్యం. అలాగే కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని ధార్మిక యాత్రలకు మా సేవలను విస్తరించనున్నాం. పెట్టుబడుల కోసం పలువురితో చర్చిస్తున్నాం అని రచనా గులాటీ వివరించారు.

ప్రారంభం.. ఉత్సాహం

సుదీర్ఘ పరిశోధన, మరెన్నో సవాళ్లను అధిగమించి మైహోలీ టూర్ బెటా టెస్టింగ్ వెర్షన్‌ను 2014లో ప్రారంభించారు. అధ్యాత్మిక, తీర్థయాత్రల రంగంలో తనదైన ముద్ర వేసేలా మైహోలీటూర్‌ను తీర్చిదిద్దారు. మొదట్లో రోజుకు నూటయాభై పేజ్ వ్యూస్ వచ్చేవి. మా ప్రయాణం ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభించక ముందే వంద టూర్ ఎంక్వైరీలు వచ్చాయని ఉత్సాహంగా చెబుతున్నారు. ఇక్సిగో టూర్స్ తోనూ మైహోలీటూర్ టైఅప్ అయింది.

607
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles