తిరుమల శ్రీవారికి.. గద్వాల జోడు పంచెలు!


Fri,August 31, 2018 11:31 PM

వేయి నామాల వేంకటేశుడు కొలువైన తిరుమల కొండకు బ్రహ్మోత్సవాలు కొత్త శోభను తీసుకొస్తాయి! కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా.. కోరుకున్నవారి కొంగు బంగారు దేవుడా అని భక్తులు కీర్తించగా.. అందంగా ముస్తాబై.. అమ్మవారితో కలిసి భక్తుల వద్దకే వచ్చి దర్శనమిస్తాడు శ్రీనివాసుడు! అంతటి వైభవోపేతమైన బ్రహ్మోత్సవ వేళ తిరుమలేశుడికి మన గద్వాల జోడు పంచెలు సమర్పిస్తారు! గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి సంప్రదాయంగా కొనసాగుతున్న ఏరువాడ జోడు పంచెలపై జిందగీ ప్రత్యేక కథనం!
Chenetha
నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి ఇక్కడ నేత మగ్గంపై తయారు చేసే ఏరువాడ జోడు పంచెలను అలంకరించిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఆనవాయితీ: గద్వాల సంస్థానం నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాల కానుకగా అందే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. 400 ఏళ్ల కిందట గద్వాల సంస్థానాధీశులు సంప్రదాయబద్ధంగా నేత మగ్గాలపై జోడు పంచెలను ఇక్కడి చేనేత కార్మికులతో తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానికి అందజేసే ఆచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతీఏటా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి మూల విగ్రహానికి ఏరువాడ జోడు పంచెలు అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కృష్ణరాంభూపాల్‌తో మొదలైన సంప్రదాయం సంస్థానాధీశుల వారసురాలైన లతాభూపాల్ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. తిరుమలకు జోడుపంచెలు చేరుకోగానే అక్కడి ప్రధాన పూజారులు శ్రీవారి చెవిలో స్వామీ ఏరువాడ జోడు పంచెలు అందాయి. మీ బ్రహ్మోత్సవాల రోజున నూతన పంచెలు అలంకారం చేస్తాం అంటూ అలంకరణ ప్రారంభిస్తారు.

శ్రావణంలో నేత ప్రారంభం: ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు మండల (45 రోజులు) కాలం పడుతుంది. నామాల మగ్గంపై నేత పనిని శ్రావణమాసం నుంచి ప్రారంభించిన ఐదుగురు నేత కార్మికులు సంప్రదాయబద్ధంగా నేస్తున్నారు. వారిలో మహంకాళి కరుణకుమార్, సాకే సత్యం, దామర్ల శన్ముఖరావు, మేడం రమేష్, గద్దె మురళీ ఉన్నారు. మగ్గం నేసేటప్పుడు ఏ ఒక్కరు తప్పు చేసిన ముందుకు సాగదు. జోడు పంచెలు తయారు మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్న చోట ఇంట్లో నిత్యం పూజలు చేయడంతో గోవింద నామస్మరణం చేస్తారు. సంస్థానాధీశుల తరపున గత ఏడేళ్లుగా ఏరువాడ పంచెలను మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో నేయిస్తున్నారు. శ్రీవారికి ఇష్టమైనవే: దేశం నలు మూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. వాటిని కేవలం అలంకార ప్రాయంగా ప్రత్యేక వేడుకలలో మాత్రమే శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కళాకారులు తయారు చేసిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను మాత్రం శ్రీవారి మూల విగ్రహానికి అలంకరించడం విశేషం. 11 గజాల పొడవు, 85 అంగుళాల వెడల్పు, ఇరువైపుల 12 అంగుళాల బార్డర్‌తో కంచుకోట కొమ్మ నగిశీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకే సారి నేయడం జోడు పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. సాంకేతికంగా నేత పనిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా అనాదిగా నూలు, రేషం కలయికతో సంప్రదాయబద్ధంగానే వీటిని తయారు చేస్తున్నారు.

ఆధ్మాత్మిక మగ్గం: జోడు పంచెల తయారీకి మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందజేసే వరకు మగ్గం ఉన్న చోట ఇంట్లో నిత్యం పూజలు చేయడం, గోవిందనామస్మరణం చేసుకుంటూ పనికి ఉపక్రమిస్తాం. మగ్గం ఉన్న ఇంట్లో ఉదయం, సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటం దగ్గర దీపం వెలిగించడం సాంప్రదాయంగా వస్తున్నది. దైనందిన జీవితంలో తెలిసీ తెలియక తప్పులు దొర్లితే మగ్గం దగ్గరకు వచ్చేసరికి ఆ విషయం తమకు పరోక్షంగా తెలుస్తుంది. అందువల్లే అత్యంత జాగ్రత్తగా, భక్తిశ్రద్ధలతో, నిష్టతో నేస్తామని, ఇది తమ అదృష్టమని గద్దె మురళి, రమేష్, సత్యన్నలు చెబుతున్నారు.

TIRUMALA-VENKANNA
మహా పుణ్యక్షేత్రంగా అంతర్జాతీయ స్థాయిలో కీర్తికెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానానికి గద్వాల సంస్థానం యథావిధిగా ఓ చిరు కానుకను సమర్పించుకుంటున్నది. ప్రతీ ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏరువాడ జోడు పంచెలను తిరుమలేషుడికి అందించడం ఆనవాయితీ. స్వామివారికి శిరస్సుపై గద్వాల ఏరువాడ ఉత్తరీయం, ఉత్తరీయం సాలిగ్రామ వస్త్రంగా, మూల విగ్రహం లోపలిభాగంలో గద్వాల ఏరువాడ జోడు పంచెలను అలంకరించడం తెలంగాణకే విశేషం.

తిరిగి గద్వాలకు: ఏడాది పొడవునా మూలమూర్తికి ఈ జోడు పంచెలను అలంకరించి పూజలు చేస్తారు. మూల విరాట్‌కు ఈ పంచెలు మినహా... మరే వస్ర్తాలుండవ్. బ్రహ్మోత్సవాలకు కొత్త పంచెలు వచ్చిన తర్వాత పాత పంచెలను శేష వస్త్రంగా, శ్రీవారి ప్రసాదాలతో తిరిగి గద్వాల సంస్థానానికి అందిస్తారు.

మా అదృష్టం: కరుణ కుమార్

7ఏళ్లుగా తిరుమల శ్రీనివాసుడికి ఏరువాడ జోడు పంచెలను నేస్తున్నాము. శ్రీవారి వస్ర్తాలు నేయడం మేము చేసుకున్న అదృష్టం. ఐదుగురు నేత కార్మికులం శ్రావణం మాసం మొదటి నుంచి 45రోజుల పాటు ఏరువాడ జోడు పంచెలను నియమనిష్టలతో నేస్తున్నాము. నేరుగా తిరుమలకు వెళ్లి గర్భగుడిలో శ్రీవారి ముందు అందజేస్తాము. ఏరువాడ జోడు పంచెలను నేసేందుకు గద్వాల సంస్థానాధీశులు లలితాభూపాల్ ప్రతి ఏడాది ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
నాగిళ్ల నవీన్ కుమార్ జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి

685
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles