తిరుప్పావై వైభవం


Fri,December 21, 2018 01:04 AM

మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరావు నివాసంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. గురువారం రెండో పాశురములో భాగంగా ధనుర్మాస వైభవాన్ని భక్తులకు అద్భుతంగా వివరించారు. తిరుప్పావై అంటే ఏమిటో ఎంతో సవివరంగా తెలిపారు. గోదాదేవి తాను నిర్వహిస్తున్న తిరుప్పావై వ్రతం తీరుతెన్నులను ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఆమెది ఎంతో స్వచ్ఛమైన మనసని స్వామి చెప్పారు.
ChinnaJeeyarSwamy
భూమ్మీద భగవంతుడు ఉన్నాడని, ప్రతి అణువులోనూ ఆయన కనిపిస్తాడని చిన్న జీయర్ స్వామి వారు అన్నారు. అందుకే ఈ జీవకోటి మనగలుగుతున్నదని కూడా ఆయన చెప్పారు. భూమిమీద భగవంతుడున్నాడు, కాబట్టే ఈ సృష్టంతా సజావుగా సాగుతున్నదని కూడా ఆయన వెల్లడించారు. ఈ భూమి సుఖాన్నిచ్చేది కాదని, వివిధ సౌకర్యాలు, ఆకర్షణలు ఉండడం వల్ల వాటికి ప్రజలు ఆకర్షితులు కాకుండా ఉండలేరని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నేడు అందుబాటులోకి వచ్చిన వినోద కార్యక్రమాలు, ఇతర సౌకర్యాలు మనిషిని పెడదోవ పట్టిస్తున్నాయన్నారు. ఆళ్వార్ ఈ భూమికి అజ్ఞానాన్నిచ్చే ప్రదేశంగా పేర్కొన్నదని చిన్న జీయర్ స్వామి తెలిపారు. రకరకాల రూపాలను చూసినప్పుడు కళ్లు, వివిధ రకాలైన శబ్దాలను విన్నప్పుడు చెవులు అటువైపే పరిగెత్తుతుంటాయి. మనిషికి ఉన్న ఐదు ఇంద్రియాలు ఐదు గుర్రాల వలె పరిగెత్తుతూ కొత్త కోరికల కోసం వెంపర్లాడేందుకు పురిగొలుపుతాయని స్వామి వారు చెప్పారు.

ఈ ఇంద్రియాలు విశృంఖలంగా మనుషుల్ని పరిగెత్తిస్తుంటాయి. వీటన్నిటి మధ్య భక్తి, ధ్యానం సాధ్యమయ్యే వాతావరణం చాలా కష్టమని కూడా ఆయన పేర్కొన్నారు. భూమి అనేది బాగుపడటానికి అలవికాని స్థానమని రామాయణంలో సీతమ్మ తల్లే వెల్లడించిందని శ్రీచిన్న జీయర్ స్వామి అన్నారు. రావణాసురుడ్ని చంపిన తర్వాత రాముడు హనుమంతుడితో సీతమ్మ వారికి సందేశం ఇచ్చి రమ్మని చెప్పాడు. అదే సందర్భంలో సీతమ్మ తల్లి ఈ భూమి గురించి చెప్పిన మాటలను చిన్న జీయర్ స్వామి వారు వివరంగా తెలిపారు. భూమిపై తప్పు చేయని వారెవరూ లేరని, ఆ రకంగా తాను కూడా తప్పు చేసినట్లేనని ఆమె అన్నట్లు పేర్కొన్నారు. మనుషులు తమ విధి నిర్వహణలో భాగంగా చేసే తప్పుల్ని పరిగణనలోకి తీసుకోరాదన్న మాటను ఆయన ఈ వృత్తాంతం ద్వారా చెప్పారు. ఆ తప్పుల శాతంలో కొంచెం తేడా ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. తమో గుణాన్ని పెంచే భూమి ఇది అని, మట్టిలో తయారైన వన్నీ మట్టి వికృతులని, అలాంటి ఆహార పదార్థాలనే తింటున్నామని అన్నారు. ఈ దృష్ట్యానే ఈ భూమికి అన్నం అన్న పేరు కూడా వేదాల్లో ఉందని అన్నారు. ప్రాణులన్నీ ఆ మట్టితో పుట్టిన వాటినే ఆహారంగా తింటున్నాయన్నారు.

తిరుప్పావై అంటే మంచి వ్రతమని అర్థం. తిరు అంటే సంపద, పావై అంటే వ్రతము. తిరుప్పావై అంటే సంపదనిచ్చే వ్రతమని అర్థం. సంపదలంటే డబ్బు, అధికారం, భవనాలు కావని, ఇవన్నీ ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే ఇవన్నీ ఉన్నా వృథానే అని చిన్న జీయర్ స్వామి వారు అన్నారు. అన్ని రకాలుగా ఉండి శాంతియుతంగా జీవితం వెళ్లదీయడమే అసలైన సంపద అని ఆయన వెల్లడించారు. కోరికలుండడం తప్పు కాదు, వాటిని నెరవేర్చుకునేందుకు తగిన సాధన చేయకపోవడమే తప్పన్నారు. సాధన చేయడం ఎలాగో ఆండాళ్ అమ్మ చెబుతుంది. కొన్ని పనులు చేయాలంటే అర్హతలుండాలి. మనస్సులో వ్రతమాచరించాలనే కోరిక ఒక్కటి ఉంటే చాలు, మరి వేటి అవసరమూ లేదని అన్నారు. కల్మషం లేని మనస్సుంటే చాలని అది నారాయణ మంత్రంతో వస్తుందని చెప్పారు.

ఆసాంతం అత్యంత ఆసక్తికరం

ChinnaJeeyarSwamy1
ధనుర్మాస పవిత్రత అంతా అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఆధ్యాత్మికపరులకు, మరీ ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు భక్తులకు ఇదొక అపురూప సందర్భం. ధనుర్మాసం ప్రారంభమైన 5వ రోజు సందర్భంగా గురువారం (20వ తేది) హైదరాబాద్ నగరానికి చెందిన జుబ్లీహిల్స్‌లోని మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు గృహ పరిసరాలు భక్తి తోరణాలతో కళకళలాడుతూ కనిపించాయి. ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారిని రామేశ్వరరావు సరిగ్గా 6 గం॥లకు వేదికపైకి సగౌరవంగా, భక్తి ప్రపత్తులతో తోడ్కొని వచ్చారు. ఆయన ప్రవచనంలోని అణువణువునూ, అక్షరమక్షరాన్నీ భక్తులు ఎంతో శ్రద్ధగా ఆలకించారు. గోదాదేవి (ఆండాళమ్మ) తిరుప్పావై వ్రతదీక్షను ప్రారంభించిన తీరును చిన్న జీయర్ స్వామి వారు ఆసాంతం అత్యంత ఆసక్తికరంగా వివరించారు. ఈ వ్రతాన్ని పేద, ధనిక తేడాలు లేకుండా, బలమైన సంకల్పంతో కూడిన కోర్కెతో, భగవంతునిపై భక్తిగల వారెవరైనా చక్కగా ఆచరించ వచ్చునని చెబుతూ తిరుప్పావై రెండవ పాశురంలోని సందేశంలోని ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ఎంతో అర్థవంతంగా, అనేక ఉదాహరణల యుక్తంగా ఆయన తెలియజేశారు.

889
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles