తాజ్ మహోత్సవం!


Sun,February 17, 2019 01:43 AM

తాజ్ మహల్.. సింబల్ ఆఫ్ లవ్. మన దేశానికి ఓ కలికితురాయి. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ఉత్సవాలు ప్రతియేటా జరుగుతాయి తెలుసా? అది కూడా ఫిబ్రవరిలోనే. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా సందర్శకులు తరలి వస్తుంటారు. వందలామంది మంది కళాకారులు అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటారు. పది రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుతాయి. ఆ విశేషాల సమాహారం ఈ వారం సింగిడిలో.. ప్రపంచంలోని వింతల్లో అత్యద్భుత కళాఖండం తాజ్‌మహల్ ఒకటి. ప్రేమకు ప్రతిరూపంగా విశ్వసించే ఈ తాజ్‌మహల్‌కు ఫిబ్రవరి 18 నుంచి 27 వరకూ తాజ్ మహోత్సవ్ పేరుతో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. తాజ్‌కు సమీపంలోని శిల్పగ్రామ్ వద్ద ఈ ఉత్సవాలను పదిరోజుల పాటు నిర్వహిస్తారు. ఇందుకు తాజ్ మహోత్సవ్ పేరుతో అధికారిక కమిటీ కూడా ఉన్నది. ఉత్సవాలు జరిగే పదిరోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. 1992 నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతియేటా ఓ థీమ్ ఆధారంగా ఉత్సవం జరుగుతుంటుంది. ఈ ఏడాది పరంపర థీమ్‌తో ఉత్సవాలు నిర్వహించనున్నారు.
Taj-Mahostav

జోష్ నింపే సాంస్కృతిక కార్యక్రమాలు

తాజ్ మహోత్సవానికి వచ్చే సందర్శకుల్లో జోష్ నింపడానికి పదిరోజులూ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో దేశ విదేశాల నుంచి గుర్తింపు పొందిన సంగీత కళా బృందాలు పాల్గొంటాయి. అంతేకాకుండా గజల్స్, కవిత్వాలు, పాటలు, జానపద, శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలతో హోరెత్తిస్తారు. ఈ ఏడాది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా మన బాలీవుడ్ తారల హంగామా ఈ ఉత్సవానికే హైలెట్‌గా నిలువనున్నది. దేశ, విదేశీ సంగీత బృందాలకు తోడు బాలీవుడ్ తారల ఆటపాటలు ఆహుతులను ఉర్రూతలూగించనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ కళాకారులను తాజ్ రత్నా అవార్డులతో సత్కరిస్తారు.


Taj-Mahostav2

నోరూరించే వంటలు.. ఫన్ ఫెయిర్!

తాజ్ మహోత్సవ్ చూడ్డానికి వచ్చేవారికి నోరూరించే వంటకాలు స్వాగతం పలుకుతాయి. ఇందులో మన దేశంలో ప్రత్యేకమైన వంటకాలను, పలు దేశాల్లో ప్రాచుర్యం పొందిన వాటినీ తనివితీరా రుచి చూడొచ్చు కూడా. వంటలు అద్భుతంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నది తాజ్ మహోత్సవ్ కమిటీ. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు టీనేజర్స్, పెద్దలకు వినోదాన్ని, థ్రిల్ పంచేందుకు భారీగానే ఏర్పాట్లు చేశారు. వీటల్లో మెర్రీ గో రౌండ్, ట్రైన్ రైడ్స్, ఫెర్సీస్ వీల్, రోల్ కోస్టర్స్ వంటివి ఈ ఏడాది ఆకట్టుకోనున్నాయి. మొత్తానికి కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే ఈ తాజ్ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజ్ మహోత్సవ్‌కు సంబంధించిన అన్ని వివరాలు http://www.tajmahotsav.org వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా ఈ కార్యక్రమాలు ఉంటాయని నిర్వహణ కమిటీ చెబుతున్నది. మరింకెందుకు ఆలస్యం తాజ్ మహోత్సవాలకు కుటుంబంతో
సహా వెళ్లి.. మీరూ ఓ మధురానుభూతితో తిరిగిరండి.


Taj_Crafts

అబ్బురపరిచే చేతివృత్తులు

తాజ్ మహోత్సవ్‌లో ముఖ్యంగా చెప్పుకునేవి చేతివృత్తులు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన అన్ని చేతివృత్తి కళలను ఇక్కడ చూడొచ్చు. నచ్చిన వాటిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది 400 మందికిపైగా చేతివృత్తి కళాకారులు తమ సుందరమైన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. తమిళనాడు, ఈశాన్య రాష్ర్టాల నుంచి చెరుకు, వెదురు ఉత్పత్తులు, కశ్మీర్ నుంచి పేపర్ మాష్ ఆకృతులు, ఆగ్రా నుంచి పాలరాతి ఆకృతులు, సహరాన్పూర్ నుంచి చెక్కబొమ్మలు, మొరాదాబాద్ నుంచి ఇత్తడి వస్తువులు, లక్నో నుంచి చిక్కన్ ఉత్పత్తులు, కశ్మీర్/గుజరాత్ నుంచి సిల్క్, జరీ, శాలువా, కార్పెట్లు.. పశ్చిమ బెంగాల్ నుంచి చేతి ముద్ర ఉత్పత్తులు ప్రధానమైనవి. ఇవే కాకుండా రకరకాల కళాకృతులు, తాజ్ మహోత్సవ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ మేళాలో కొలువుదీరనున్నాయి.


Traom

ఎలా వెళ్లాలి? ఇంకేం చూడొచ్చు?

ఉత్సవానికి చేరుకునేందుకు విమానం, రైలు, బస్సు, టాక్సీ సర్వీసులు ఉన్నాయి. ఆగ్రాకు సమీపంలో చాలా హోటళ్లు సందర్శకులకు విడిది ఏర్పాట్లు చేస్తాయి. వాటిల్లో రూ.400 నుంచి రూ.1,200 వరకూ చార్జీలు ఉంటాయి. ఈ ఉత్సవాలు తిలకించేందుకు ప్రత్యేక టికెట్లు అంటూ ఏమీ లేవు. అంతా ఒక్కటే. పెద్దలకు ఒక్కరికి రూ. 50 టికెట్ ధర. ఐదేండ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. ఐదేండ్ల నుంచి పదేండ్ల లోపు వారికి ప్రవేశ రుసుం 10 రూపాయలు. విదేశీ పర్యాటకులకు ప్రవేశం ఉచితం. పాఠశాల యూనిఫాంలో వచ్చే 100 మంది విద్యార్థులకు కలిపి రూ.500 ప్రవేశ రుసుం. వారిలో ఇద్దరు ఉపాధ్యాయులకు ప్రవేశం ఉచితం. ఎంట్రీ గేట్స్ నుంచే టిక్కెట్లను కొనుగోలు చెయ్యాలి. ఎవ్వరి వద్ద టికెట్లు కొనుగోలు చేయవద్దు. వివరాలకు +91-562-2226431/2233056 నంబర్‌ను సంప్రదించవచ్చు.


Taj-Mahostav3

ప్రత్యేకతలు

-దేశంలోని అన్ని భిన్న సంస్కృతులను, సంప్రదాయాలను ఈ ఉత్సవంలో చూడొచ్చు.
-మొఘల్ సామ్రాజ్య యుగంలో జరిగిన విధంగా ఏనుగులు, ఒంటెల ఊరేగింపుతో వీటిని ప్రారంభిస్తారు.
-ఉత్తరప్రదేశ్‌లోని అన్ని దర్బార్‌లలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. శిల్పాగ్రామ్‌లో జరిగేవి ముఖ్యమైనవి.
-11.5 ఎకరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
-ఈ ఉత్సవాలకు వచ్చే నూతన సందర్శకులు తాజ్ మహల్, ఎర్ర కోట, మెహ్తాబ్ బాగ్, సికింద్ర, ఇతేమ్ద్- ఉద్-దుల్హా, మరియమ్ సమాధి, జామా మసీదు, రామ్ బాగ్, చిని కా రోజా, ఫతేపూర్ సిక్రీ, పాట్నా పక్షుల అభయారణ్యం, సుర్ సరోవర్ వంటి పర్యాటక కేంద్రాలనూ సందర్శించవచ్చు.
-తాజ్ మహల్‌ను నెలలో ఐదు రోజులు రాత్రివేళ్లలో చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రతి బ్యాచ్‌లో 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఈ ఉత్సవాల్లో ఆ ఏర్పాట్లు చేశారు.
-ఇక్కడికి వచ్చే సందర్శకులు ఆగ్రా, స్థానిక ప్రజల సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి.
-ధార్మిక స్థలాలను సందర్శించేటప్పుడు సంప్రదాయ వస్ర్తాలు ధరించాలి.

727
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles