డ్రైఫ్రూట్స్ డైట్


Thu,July 10, 2014 12:47 AM

రంజాన్.. హలీమ్‌కే కాదు డ్రైఫ్రూట్స్ స్వీట్స్‌కీ స్పెషలే! కామన్‌మ్యాన్ డ్రైఫ్రూట్స్ ఖర్జూర్, కిస్‌మిస్‌ల నుంచి ఖరీదైన అంజీర్.. పలుకుల రాజు కాజు... మస్త్ పిస్తా.. ఒక్కటేమిటీ ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల డ్రైఫ్రూట్స్ అన్నిటినీ రంగరించి శుచిగా వండి రుచిని పండించే మధుర వంటకాల మేళా ఈ ఈద్ నెల! వాటిలో కొన్నిటిని కమ్మగా మీకందిస్తుందీ మెనూ....

cokkie

డ్రైఫ్రూట్స్ కుకీస్

కావలసిన పదార్థాలు :
అంజీర్ ముక్కలు - ఒక కప్పు, ఎండుద్రాక్ష - ఒక కప్పు, ఆప్రికాట్స్ - అరకప్పు, పీకాన్స్ - 3/4కప్పు, తేనె - ఒక స్పూన్, నిమ్మరసం - ఒక స్పూన్, ఉప్పు - పావు టీ స్పూన్, ఆపిల్‌సాస్ - అరకప్పు, పెరుగు - అరకప్పు, చక్కెర - అర కప్పు, లవంగాలు - అర టీ స్పూన్, కోడిగుడ్డు - 1, గోధుమపిండి - రెండున్నర కప్పులు

తయారుచేసే విధానం :
ఒక గిన్నెలో అంజీర్, ఎండుద్రాక్ష, ఆప్రికాట్స్, పీకాన్, తేనె, నిమ్మరసం, ఉప్పు కలిపి మూతపెట్టేయాలి. ఒకరోజు రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఒక పెద్ద గిన్నెలో.. క్రీమ్, ఆపిల్‌సాస్, పెరుగు వేసి బాగా కలపాలి. ఇందులో కోడిగుడ్డు కూడా కొట్టి పోయాలి. ఆ తర్వాత గోధుమపిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. దీంట్లోనే డ్రైఫ్రూట్స్ మిశ్రమం వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక గంటపాటు అలాగే ఉంచాలి. వీటిని పాన్‌లో పోసి ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఓవెన్‌ని ముందే 350డిగ్రీ ఫారన్‌హీట్ వద్ద వేడి చేసి పెట్టుకోవాలి. బేకింగ్ పాన్ పెట్టి 20నిమిషాలపాటు బేక్ చేయాలి. చల్లారాక తింటే ఈ కుకీస్ బాగుంటాయి.

nut-bar

డ్రైఫ్రూట్స్ నట్‌బార్

కావలసిన పదార్థాలు :
ఖర్జూర - ఒక కప్పు, అంజీర్ - 2/3 కప్పు, ఆప్రికాట్స్ - పావు కప్పు, ఎండుద్రాక్ష - పావు కప్పు, క్రాన్బెరీస్ - పావు కప్పు, కిస్‌మిస్ - పావు కప్పు, గసగసాలు - ఒక స్పూన్, కొబ్బరితురుము - పావు కప్పు, బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూన్, బేకింగ్ సోడా - పావు టీ స్పూన్, ఉప్పు - కొద్దిగా, బ్రౌన్ షుగర్ - 2 స్పూన్స్, ఇడిబుల్ గమ్ - 2 స్పూన్స్, బాదం - పావు కప్పు, పిస్తా - పావు కప్పు, జీడిపప్పు - పావు కప్పు, మైదా - 2 స్పూన్స్, కోడిగుడ్డు - 1, నెయ్యి - ఒక స్పూన్

తయారుచేసే విధానం :
ఓవెన్‌ని 325ఫారన్‌హీట్ వద్ద ముందే వేడిచేయాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ఇడిబుల్ గమ్‌ని వేయించాలి. 2నిమిషాల్లోపు అవి పాప్‌కార్న్‌లా అవుతాయి. వాటిని కొద్దిగా చల్లారనిచ్చి గ్రైండ్ చేయాలి. మామూలు కడాయి తీసుకొని అందులో గసగసాలను వేయించి పక్కన పెట్టాలి. కొబ్బరి తురుమును కూడా ఇలానే వేయించాలి. డ్రైఫ్రూట్స్ అన్నిటినీ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో డ్రైఫ్రూట్స్, గసగసాలు, కొబ్బరితురుము, ఇడిబుల్ గమ్, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్, కోడిగుడ్లు అన్ని వేసి కలపాలి. పాన్‌కి కొద్దిగా నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. 35నిమిషాలు బేక్ చేయాలి. ఆ తర్వాత కాసేపు చల్లారనిచ్చి మనకు నచ్చిన ఆకతిలో కట్ చేసుకోవాలి. తీపి డ్రైఫ్రూట్స్ నట్‌బార్ మీ నోరూరించక మానదు!

plated-whole-fruit-cake

మిక్స్‌డ్ డ్రైఫ్రూట్స్ కేక్

కావలసిన పదార్థాలు :
మైదాపిండి - 500గ్రా., బటర్ - 250గ్రా., వెనీలా ఫ్లేవర్ - 1 1/2 టీ స్పూన్స్, కోడిగుడ్లు - 4, కాస్టర్ షుగర్ - 320గ్రా., పాలు - 60మి.లీ., బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూన్, ఉప్పు - అర టీ స్పూన్, మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ - రెండు కప్పులు

తయారుచేసే విధానం :
ఓవెన్‌ని ముందే 180డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు డ్రైఫ్రూట్స్‌ని చిన్నగా కట్ చేసుకోవాలి. బటర్‌లో కాస్టర్ షుగర్ వేసి బాగా కలపాలి. అది చూడడానికి క్రీమ్‌లా కనిపించాలి. ఒక గిన్నెలో కోడిగుడ్లను గిలక్కొట్టాలి. మరో గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని అందులో బటర్ వేయాలి. తర్వాత మెల్లగా కోడిగుడ్ల మిశ్రమం, వెనీలా ఫ్లేవర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో మైదా పిండిని కొద్ది, కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. పాలు పోసి, డ్రై ఫ్రూట్స్ వేయాలి. కేక్ పాన్‌లో ఈ మిశ్రమాన్ని వేసి ఓవెన్‌లో పెట్టాలి. 40నిమిషాలపాటు బేక్ చేయాలి. మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ కేక్ తినడానికి సిద్ధమైనట్లే!

kajur-ladoos

డ్రైఫ్రూట్స్ లడ్డు

కావలసిన పదార్థాలు :
ఖర్జూర - 20ఱగా. (గింజలు లేకుండా), అంజీర్ - 50గ్రా., డ్రై ఫ్రూట్స్ - అరకప్పు, గసగసాలు - 2 స్పూన్స్, నెయ్యి - 4 స్పూన్స్, యాలకుల పొడి - అర టీ స్పూన్

తయారుచేసే విధానం :
కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి.. డ్రైఫ్రూట్స్‌ని ఐదు నిమిషాలపాటు వేయించాలి. తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాలి. ఈ కడాయిలోనే గసగసాలను వేయించాలి. తర్వాత వేరే కడాయి పెట్టి నెయ్యి ఖర్జూర, అంజీర్‌ని కూడా వేయించుకోవాలి. కాస్త చల్లారాక వీటిని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయాలి. దీంట్లోనే డ్రైఫ్రూట్స్‌ని కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మళ్లీ కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఈ పేస్ట్‌ని వేయాలి. దీంట్లో యాలకులపొడి వేసి కలిపి దించేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చిన్నచిన్న లడ్డుల్లా చేసుకోవాలి. వాటిని గసగసాల్లో ముంచి పక్కన పెట్టాలి. నోరూరించే డ్రైఫ్రూట్స్ లడ్డు రెడీ!

3379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles