డ్యాన్స్ కోసం ఉద్యోగాన్ని వదిలేసి..


Tue,March 5, 2019 12:32 AM

చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే ఆమెకు ఇష్టం. కానీ మధ్యతరగతి కుటుంబం. డ్యాన్స్‌లో శిక్షణ తీసుకోవడానికి వీలు కాలేదు. చదువులో రాణించింది. ఇన్ఫోసిస్ ఉద్యోగంలో చేరింది. కానీ డ్యాన్స్ మీద మాత్రం ఆశలు వదులుకోలేదు. దాని కోసం చివరికి ఇన్ఫోసిస్ ఉద్యోగాన్ని వదులుకుంది. ఇప్పుడు డ్యాన్స్ స్టెప్పులతో యూత్ ఐకాన్ అయింది. ఆమెనే ముంబైకి చెందిన సోనాలి బాదౌర్య..
Sonali
ఆమె కలలు కన్నది. కష్టాలూ ఎదుర్కొన్నది. కానీ ఆమెకు ఇష్టమైన డ్యాన్సర్ మాత్రం కాలేకపోయింది. చిన్నతనంలోనే సోనాలిలోని డ్యాన్స్ ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. పూర్తిగా డ్యాన్సర్ అవడానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించే స్థోమత ఉన్న కుటుంబం కాదు. దీంతో చేసేదేమీ లేక సోనాలి తన చదవులపై దృష్టి పెట్టింది. మరోవైపు డ్యాన్స్‌ను ఒక అభిరుచిగానే కొనసాగించింది. విద్యాభ్యాసం అయిపోయాక ఇన్ఫోసిస్ ఉద్యోగంలో చేరింది. దీని కోసం ముంబై నుంచి పుణెకు వెళ్లింది. ఇలా వెళ్లడం వల్ల ఒకానొక దశలో డ్యాన్స్ ను వదులుకున్నంత పనైంది. తన ఉద్యోగ జీవితం కొనసాగడానికి డ్యాన్స్‌ను పక్కకు పెట్టాల్సి వచ్చింది. తనలో ఉన్న డ్యాన్సర్‌ను తనలోనే ఉంచుకోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో చిన్న చిన్న ఈవెంట్లకు డ్యాన్సులు వేసేది, తోటి ఉద్యోగులకు స్టెప్పులు నేర్పించేది. ఇలా ఏడాది గడిచాక పుణెలోని ఓ డ్యాన్సింగ్ క్లబ్‌లో చేరింది. తర్వాత డ్యాన్స్ కోసం పూర్తిగా సమయం కేటాయించాలనుకుంది. ఇన్ఫోసిస్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇప్పుడు ఆదాయ మార్గం కోసం వెతుకులాడాలి. అప్పుడే సోనాలి భర్త చొరవ తీసుకున్నారు. 2017లో సోనాలితో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించాడు. క్రేజీ స్టెప్పులతో ఉర్రూతలూగించే సోనాలి యూట్యూబ్‌లో మంచి స్పందన పొందింది. డ్యాన్సులతో వరుస వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది సోనాలి. ఇలా వచ్చిన స్పందన సోనాలిని లండన్‌లో ఒక కన్సెర్ట్ నిర్వహించే అవకాశం తీసుకువచ్చింది. అక్కడ చేసిన కన్సెర్ట్‌కు ఊహించని స్థాయిలో స్పందన రావటంతో సోనాలికి అప్పుడు గుర్తింపు పొందింది. యూట్యూబ్ స్టార్‌గా నిలిచింది. మరిన్ని మంచి వీడియోలు తీయాలని అనుకుంది. అప్పటి వరకూ వెడ్డింగ్ వీడియోలే చేసిన సోనాలి వర్క్ షాప్‌లు నిర్వహించింది. ఇలా చేస్తూ మళ్లీ ఆమె ముంబై వచ్చేసింది. ఇలా యూట్యూబ్ చానెల్ ద్వారా యూత్ ఐకాన్‌గా కీర్తి గడించింది. ఇప్పుడు తన యూట్యూబ్ చానెల్‌కు 11 మిలియన్ల సబ్‌స్రైబర్లను పొందగలిగింది. ఒక్కో వీడియోకు కొన్ని వేల హిట్లు వస్తుంటాయి. తను డ్యాన్సింగ్‌లో ఎలాంటి శిక్షణ తీసుకోలేదనీ, అభిరుచి, ఆసక్తి తనను డ్యాన్సర్ ను చేసిందని తెలుపుతోంది. టీవీల ముందు నిల్చుని స్టెప్పులు నేర్చుకున్న వారిలో, కొరియోగ్రాఫర్లను ఫాలొ అవుతూ కొత్త కొత్త స్టెప్పులు అర్థం చేసుకునే అమ్మాయిల్లో నేనూ ఒకర్తెని అంటోంది సోనాలి.

616
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles