డైలాగ్ మాది యాక్షన్ మీది !


Sun,July 5, 2015 11:41 PM

డబ్‌స్మాష్ : ది ట్రెండింగ్ యాప్
ఒక్కొక్కన్ని కాదు షేర్‌ఖాన్ వందమందిని ఒకేసారి రమ్మను ఈ డైలాగ్ రానా చెప్తే.. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు డైలాగ్‌కి మంచు లక్ష్మీ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే.. అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టు చరిత్రలో లేదు అని తమిళ హీరో డైలాగ్ చెబితే.. యే బాబూరావ్‌కా ైస్టెల్ హై... హా... హా... హా అంటూ విరాట్ కొహ్లీ అదరగొడితే... రానా, కోహ్లీనే కాదు అలాంటి డైలాగులు ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చు. యాక్షన్ మాత్రమే మీది. వాయిస్ ఒరిజినల్ సెలబ్రిటీదే. అదే డబ్‌స్మాష్ అంటే. దునియా అంతా ఇప్పుడు డబ్‌స్మాష్ ట్రెండ్ నడుస్తున్నది.

dubsmash


ఒకప్పుడు సినిమాలోని డైలాగులు పేరడీ చేస్తూ స్పూఫ్‌లు వచ్చేవి. వాటికయితే డైలాగులు మార్చుకుని స్క్రిప్టు రాసుకోవాలి, కెమెరా కావాలి, ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు జస్ట్ పాకెట్‌లో మొబైల్ ఉంటే చాలు నచ్చిన డైలాగ్‌కి యాక్షన్ చేసేయొచ్చు. టేక్‌లు,రీటేక్‌లు అనేది మనిష్టం. నచ్చితే ఓకే, లేకపోతే రీటేక్. సెలబ్రిటీస్ చెప్పిన డైలాగ్‌వాయిస్‌కి లిప్ సింక్రనైజ్ చేస్తూ ఎవరైనా, ఎవరి డైలాగ్‌కైనా యాక్షన్ చేసే అవకాశం ఈ డబ్‌స్మాష్ యాప్‌లో ఉంది. కామన్‌పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఇప్పుడు డబ్‌స్మాష్‌కి దాసోహమవుతున్నారు. ఒక్కఛాన్స్.... ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగే ఆర్టిస్టులందరూ ఎన్ని ఛాన్సులైనా తీసుకుని, ఎన్ని టేకులైనా తీసుకుని జేబులోని మొబైల్ కెమెరాతోనే నచ్చిన డైలాగ్‌లకు యాక్షన్ చేసి యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆల్ క్రెడిట్ గోస్ టు డబ్‌స్మాష్ అంటున్నారు. డబ్‌స్మాష్‌తో ప్రేమలో పడ్డ జాబితాలో త్రిష, నవదీప్, రకుల్‌ప్రీత్ సింగ్, రెజీనా, రానా, సల్మాన్‌ఖాన్, శృతిహాసన్, సోనాక్షి సిన్హా, అలియాభట్, రవళి, విరాట్ కొహ్లీ, సైనా నెహ్వాల్, యువరాజ్ సింగ్, సన్నీలియోన్, గీతామాధురి, బాలకృష్ణ, మంచులక్ష్మీ, ధనుష్, మహేశ్‌బాబు కొడుకు గౌతమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు.

నటించడం కాదు జీవిస్తున్నారు...డాన్‌కో పకడ్‌నా ముష్కిల్ హీ నహీ నా మున్కీన్ హై అనే అమితాబ్ డైలాగ్‌ని రజినీకాంత్ అల్లుడు ధనుష్ తన ైస్టెల్లో అదరగొట్టాడు.
యే... నీ ఫ్రెండ్‌ని కొడితే నువ్వు కొట్టవా? కొట్టాలీ... కొడితేనే ఫ్రెండ్ అంటూ టైగర్ సినిమాలోని సందీప్ కిషన్ డైలాగ్‌ని రకుల్ ప్రీత్ సింగ్, రెజీనాలు కలసి సినిమా విడుదలకు ముందు డబ్‌స్మాష్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఐయామ్ నాట్ ఎ ప్రెట్టీ ఉమెన్.... ఐయామ్ ద డెవిల్ అంటూ ది డెవిల్ సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్ భలే ఉంది.
గ్రౌండ్‌లోనే కాదు డ్రెస్సింగ్ రూంలో కూడా అందరితో ఫన్నీగా ఉండే మన డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఐ థింక్ యు షుడ్ గో ఫర్ సీ... బికాజ్ లాంగ్‌టైమ్ నో సీ అంటూ డబ్‌స్మాష్‌తో చేసిన అల్లరి అంతాఇంతా కాదు.

ప్రతి దానికీ ఓవర్ ఎక్స్‌ప్రెషన్సూ.... అబ్బా... ఇప్పుడనండి అబ్బా.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌కి నవదీప్ డబ్‌స్మాష్‌తో అదరగొట్టాడు.
అంతేనా ! ఇంకేం కావాలి ? వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. ఈ పాపులర్ డైలాగ్‌ని శివబాలాజీ తన భార్యతో కలిసి డబ్‌స్మాష్ చేశాడు. చెబితే వందసార్లు చెప్పినట్టు అంటూ గీతామాధురి రజినీ ైస్టెల్లో అదరగొట్టేసింది. ఈ వీడియోని నందు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆశ... దోశ... అప్పడం... వడ అంటూ కమెడియన్ రఘుబాబు చెప్పిన కామెడీ మంత్రాన్ని జపిస్తూ అటు సెలబ్రిటీలతో పాటూ ఇటు యూత్ కూడా పిచ్చపిచ్చగా నటించేస్తున్నారు.

ఏమయ్యా... సెగట్రీ... ఎప్పుడు బిగినెస్సేనా...? తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటాది? మడిసన్నాక కాసింత కళాపోషణుండాల అంటూ ముత్యాలముగ్గులో రావుగోపాల రావు చెప్పిన డైలాగ్‌కి నటి మాధవీలత చేసిన యాక్షన్ బాగా కుదిరింది. నాన్నా... పందులే గుంపులు గుంపులుగా వస్తాయి... సింగం సింగలారిమ అనే రజినీకాంత్ డైలాగ్‌కి ఓ ఫారినర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్.

ఈ డైలాగ్ నా సినిమాలో ఉంటే బాగుండు ఈ డైలాగ్ నేనయితే ఇంకా బాగా చెప్పేవాడిని అనుకునే వాళ్లంతా ఇప్పుడు డబ్‌స్మాష్ యాప్‌తో తమకిష్టమైన డైలాగ్ చెప్పి ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇక యూత్ దూకుడుకు అయితే అడ్డూ అదుపే లేదు.

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు... నేనే పండు అంటూ మహేశ్‌బాబు కొడుకు గౌతమ్ చేసిన డబ్‌స్మాష్ వీడియో ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. తన కొడుకు పర్ఫామెన్స్ చూసి మహేశ్ బాబు కూడా తెగ మురిసిపోయాడట.

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు...పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే, పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టిందంట అధ్యక్షా ! , నిన్నిర్కిచ్చే ఖర్మ మాకేం పట్టిందయా...! మాకేమన్న కాళ్లుచేతులు గులగుల పెట్టినాయ్ అని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు తెలంగాణ, ఆంధ్రా అనే తేడా లేకుండా యూత్ ఆయన్ని ఇమిటేట్ చేస్తూ డబ్‌స్మాష్‌లో చేసిన వీడియోలకు సోషల్ మీడియాలో తెగ లైకులు పడుతున్నాయి. ఏందిరా ఇదీ... ఏందీ రచ్చా.... సదువుకోమ్మని పంపిస్తే... నువ్వీడ పోరీలతోటి తిరుగుడు, బిరాండి తాగుడు నేర్చినావ్ రా అంటూ తెలంగాణ శకుంతల చెప్పిన డైలాగ్‌కి ఓ హైదరాబాదీ అమ్మాయి చేసిన యాక్షన్ అద్భుతంగా సెట్ అయింది. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ విత్ యూ. డోన్ట్ వర్రీ అనే డైలాగులు డబ్‌స్మాష్‌లో దుమ్ములేపుతున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా మీ యారు గుర్రాలు మాయారు గుర్రాలు.. లాంటి తెలంగాణ పాటలకు విశ్వాంత్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వీడియోగా మారింది. నేనెప్పుడూ చూడని కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయ్... నేనెవర్నీ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్‌ని హైదరాబాద్ కుర్రాడు అదిరిపోయేలా చెప్పాడు.

2346
Tags

More News

VIRAL NEWS