డియర్ సోల్జర్!


Sun,February 17, 2019 01:47 AM

ఈ ఉత్తరం మిమ్మల్ని చేరే క్షణాన.. మీరంతా నిలువెత్తు దుఃఖంలో మునిగి ఉంటారని తెలుసు. అయినా విధి నిర్వహణలో సరిహద్దు కంచె దగ్గర కళ్ళనే కెమెరాగా చేసి పహారా కాస్తూనో .. థార్ ఎడారి మండు టెండల్లో భగభగ మండే బుల్లెట్ వర్షానివై మెరుస్తూనో.. కశ్మీర్ మంచుకొండల్లో ఎంతోమంది దేహాన్ని పేల్చే పిరికి తీవ్రవాదుల ముందు గుండె నిలిపో .. తూరుపు చిట్టడవుల్లో ఎక్కుపెట్టిన విల్లుల్లా సంచరిస్తూనో ఉంటారని తెలుసు.. ఏది ఏమైనా నా దేశానికి ఉదయం కాపలా కాసే సూర్యుడివి నువ్వే.. రాత్రికి పహారా కాసే చంద్రుడివీ నువ్వే..అన్నిటికన్నా మిన్నగా 120 కోట్ల జనాల అంతరంగ అభిమాన మూర్తివీ నువ్వే. ఎలా ఉన్నా.. ఎక్కడున్నా.. కాస్త సమయం తీసుకుని నా ఉత్తరం చదువుతావు కదూ!
ARMY-Soldiers
డియర్ సోల్జర్.. పుల్వామా ఘటన చూసి ఎర్రబడింది మంచు కొండలు మాత్రమే కాదు. 130 కోట్ల జనాభా నేత్రాలు కూడా. దేశం చుట్టూ అల్లుకున్న రక్షణ హస్తాలు మీవి. దేశాన్ని నిరంతరం కాపాడుతున్న నిఘా నేత్రాలు మీవి. చురుకైన కళ్ళు, కఠిన శిక్షణతో రాటుతెలిన ఒళ్ళు, ఆత్మ స్థయిర్యంతో కూడిన నడక, ఆత్మీయ పలుకరింపులతో మీరు కవాతు చేస్తుంటే పొంగేది ఎర్రకోట మాత్రమే కాదు మన దేశపు జనాభా గుండెలు కూడా!సరిహద్దుల్ని కాపలా కాయడమే కాదు, విపత్తులొచ్చినప్పుడు పరుగెత్తికొచ్చి ఆదుకునేది మీరే. విలయాన్ని, విషాదాన్ని దాటుకుంటూ దేశ జెండాలా నిలబడి ఆత్మవిశ్వాసాన్ని నలుదిక్కులా పరిచేదీ మీరే. దేవుడు మొక్కితేనే వచ్చి కాపాడతాడు. కానీ సైనికుడిగా మీరు దేశానికి ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉంటారు. వెన్నుతట్టి ధైర్యం చెప్పి నిలబెట్టి వెళ్తారు.అమృతం కురిసిన రాత్రిలో తిలక్ సైనికుడి ఉత్తరం చదివి ఎన్ని రాత్రులు ఏడ్చానో! మీకు నేను ఎన్ని ఆరాధనా పూర్వక ఉత్తరాలు రాశానో! అంతేనా 19 ఏళ్ల వయసులో దేహాన్ని బుల్లెట్లు తూట్లు పొడిచినా లెక్క చేయక కార్గిల్ వార్‌లో కార్గిల్ శిఖరం ఎక్కి తోటి సైనికులకు దారి చూపిన సుబేదార్ యోగేంద్రసింగ్ యాదవ్ వీరోచిత మరణాన్ని ఎవరు మాత్రం మర్చిపోతారు?

కార్గిల్ వార్‌లో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా చెప్పిన ఆఖరి మాటలు నాకు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతున్నాయి.. నేను తిరిగి వస్తాను.. మన త్రివర్ణ పతాకాన్ని కార్గిల్‌పై ఎగరేసిన తర్వాతైనా.. లేదా ఆ త్రివర్ణ పతాకాన్ని నా దేహం చుట్టూ చుట్టుకొని శవంగానైనా.. కానీ కచ్చితంగా విజయంతోనే తిరిగొస్తాను ఎంత ధైర్యం కావాలి ఇలా మాట్లాడటానికి..?

1971 ఇండో-పాక్ యుద్ధంలో మేజర్ జనరల్ ఇయాన్ కర్డొజో (Ian Cardozo) గురించి ఎన్నో వార్తలు చెప్పేవారు. మందుపాతర పేలి కాలు తీవ్రంగా గాయపడితే తనకు తానుగా ఆ కాలుని కత్తిరించుకుని యుద్ధంలోకి తిరిగి దూకాడని.. దేశం ముక్కలు కాకుండా ఉండడానికి తాను ఎన్ని ముక్కలైనా ఫర్వాలేదని చెప్పారని అప్పటి యుద్ధ సైనికులు చెప్పేవారట! వీరి స్థయిర్యం ఎంత గొప్పది. కార్గిల్‌లో అమరుడైన వీర జవాన్ తల్లి ఉద్వేగంతో ఓ మాట చెప్పింది. నేను ప్రతి సంవత్సరం కార్గిల్ యాత్రకి వెళ్తాను, అక్కడికి నాలాంటి, బిడ్డని పోగొట్టుకున్న తల్లులెందరో వస్తారు. మా బిడ్డలు మాకు అక్కడ కనిపిస్తారు అని. మీకు మరో ఘటన గుర్తు చేయనా.. బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్.. ఆ పేరు చెప్పగానే మీ కళ్ళల్లో ఆనందం నాకు తెలుస్తుంది. భారత్ పాకిస్థాన్ విభజన సమయంలో మాతృదేశం భారతదేశాన్ని వదిలి రానని, తన జీవితం దేశానికి అంకితమని చెప్పి అవివాహితుడిగానే ఆఖరిశ్వాస వరకూ జీవించిన ఆ పుణ్యపురుషుడి గొప్ప గుణాన్ని ఎన్ని రీతుల్లో చెప్పుకుందాం. పుల్వామా దాడిలో ఎంతమంది జవానుల గుండెలు ఎగిరెగిరిపడ్డాయో.. ఎన్నెన్ని కుటుంబాల ఆశలు ఆర్తనాదాలు చేసాయో.. ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత గుండెకోత.. ఇది వ్యక్తిగతం కాదు, వ్యవస్థాగతం. కందకాల్లో, ముండ్లచెట్లల్లో, హిమాలయ పర్వత శిఖరాలలో, ఎడారుల్లో, అడవుల్లో, లోయల్లో, మీ ఊపిరే మిమ్మల్ని భయపెట్టే సమయాల్లో గుండెల నిండా దేశభక్తిని నింపుకొని మృత్యువు ఛాయలో సైతం నిర్భయంగా మీరు కాసే పహారా వల్లే కదా.. మేమిక్కడ ఇంత నిశ్చింతగా బతకగలుగుతున్నది. బానిస బతుకులు ఎంత హీనమో గుర్తెరిగాక స్వేచ్ఛను గుండెల నిండా అనుభవిస్తున్నాం కదా! దేశం సగర్వంగా తలెత్తుకుని ఉండాలనే అందరం కోరుకుంటాం. ఆ బాధ్యతను సమర్ధవంతంగా మోస్తూ దేశం ప్రశాంతంగా ఉండేలా చేసే మీ వృత్తి ధర్మాన్ని, ప్రవృత్తి గుణాన్ని ఎలా విస్మరించగలం? అందుకు ప్రతిఫలంగా మిమ్మల్ని గాయపర్చిన ఈ విద్రోహదాడిని ప్రపంచం యావత్తు అసహ్యించుకుంటున్నది. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు.

పేరు తెలియదు. ఊరు తెలియదు. జాతి-మతం తెలియదు.. అందరిదీ ఒకే బ్రాండింగ్ సోల్జరిజం (soljarism). సోల్జర్ అని పలుకుతుంటే చెయ్యి చేసే సెల్యూట్ కంటే ముందు మనసు సాగిలపడి పాదాభివందనం చేస్తుంది. నా సైనిక సోదరా! మీ ఔన్నత్యం మీ పట్ల ఎంత గౌరవభావాన్ని పెంచుతుందో, మీ కుటుంబాన్ని తలుచుకున్నప్పుడల్లా అంతకంటే ఎక్కువ ఆరాధనా భావం కలుగుతుంది. బంధాన్ని, అనుబంధాల్ని వదిలేసి మరో మహోన్నత బంధానికి కట్టుబడి యాత్ర చేస్తున్నారు మీరు. మాతృదేశానికి నిత్య సేవ చేస్తున్నారు మీరు. అమ్మానాన్నల దీవెనల చేతులు ఉండాల్సిన తలమీద ఇనుప టోపీతో, చిన్నారి బిడ్డల లేతముద్దుల ముద్రలుండాల్సిన ముఖం మీద నల్లటి చారికలతో, భార్య చేతిలో ఉండాల్సిన మీ చెయ్యి ట్రిగ్గర్ మీద ఇలా గుండెలోతుల్లో ఎంత అంతర్ యుద్ధ్దాన్ని అనుభవిస్తారో? మీ జ్ఞాపకాల పుటల్లో ఎన్ని దిగుళ్ళ నెగళ్లను చవిచూస్తుంటారో? మీ ఆలోచనల ప్రవాహంలో ఎన్ని బెంగల కన్నీళ్లను దిగమింగుకుంటారో కదా! మనసును శిలగా మార్చి, కంటి రెటీనా వెనుక అశ్రువులను గడ్డ కట్టించి, పెదాల మాటున రక్త బంధాన్ని, పాదాల దిగువన స్నేహ సుగంధాన్ని మాయం చేసి ఒకే లక్ష్యంతో, ఒకే నినాదంతో, ఒకే గమనంతో దూసుకెళుతున్న మీరు పిట్ట కన్నును మాత్రమే చూస్తున్న ఆధునిక అర్జునులు కదా అనిపిస్తుంది. రాగ ద్వేషాలకన్నా దేశభక్తిలోనే ఆత్మానందాన్ని వెతుక్కుంటున్న ఆధునిక భీష్ములు కదా అనిపిస్తుంది.

కార్గిల్ వార్‌లో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా చెప్పిన ఆఖరి మాటలు నాకు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతున్నాయి.. నేను తిరిగి వస్తాను.. మన త్రివర్ణ పతాకాన్ని కార్గిల్‌పై ఎగరేసిన తర్వాతైనా.. లేదా ఆ త్రివర్ణ పతాకాన్ని నా దేహం చుట్టూ చుట్టుకొని శవంగానైనా.. కానీ కచ్చితంగా విజయంతోనే తిరిగొస్తాను ఎంత ధైర్యం కావాలి ఇలా మాట్లాడటానికి..?
ARMY-Soldiers1
అయ్యో పుల్వామా, ఎంత పని చేశావు? మీ ఇంటి దగ్గర ఇంకా చూడని ఆరు నెలల పాప తండ్రి ఒకరు, పండు వయసులో కళ్ళలో ప్రాణాలు నిలుపుకొని నిరంతరం ఎదురు చూసే తల్లి కన్న కడుపున పుట్టిన కొడుకు ఒకరు, కట్టిన తాళికి దిష్టి తగల కుండా గుండెల్లో దాచుకుంటూ నుదుటి బొట్టులో రోజూ చూసుకుంటూ నిద్రలో పలవరించే భార్య ఉన్న భర్త ఒకరు, రక్తబంధాన్ని దేశానికి ధారాదత్తం చేసి కుటుంబ బాధ్యతలను చూసుకునే తోబుట్టువుల్ని పొందిన అన్న ఒకరు, వీళ్ళందరి త్యాగాల ఫలమే కదా ఒక్క మన దేశం. దేశాన్ని రక్షించటానికి నా బిడ్డడు వెళ్ళాడు అంటూ రచ్చబండ సాక్షిగా రాజసంతో పొంగిపోయి మిమ్మల్ని కన్న ఊర్లు ఎంతగా గర్వ పడతాయో తెల్సా సోల్జర్..! ఫ్రెండ్ చెప్పాడు.. దేశభక్తి నిస్సందేహంగా మందగిస్తున్నది.. దేశద్రోహం నిర్లజ్జగా ఎదుగుతున్నది.. అంతులేని అవినీతి అంతటా వ్యాపిస్తున్నది.. అంతు పట్టని అభద్రతా రోగం అందరినీ వేధిస్తుంది అని.

మసీదుల్లో చొరబడ్డ ముష్కరుల్ని అంతమొందించడానికి.. శరపరంపరగా వస్తున్న బుల్లెట్ల వర్షాన్ని తప్పించుకుంటూ మీరు తెగువతో ముందుకురుకుతున్నప్పుడు, మందిరాల్లోకి దూసుకొచ్చిన తీవ్రవాదుల్ని అడ్డుకోటానికి మీ వొంటినే కవచంగా మార్చి అడ్డుగోడగా మీరు నిలబడ్డప్పుడు, భూమికీ ఆకాశానికీ మధ్యన మంచు శిఖరాలలో తోడేళ్ళ మాదిరి తెగపడి మీ సహచరులను పట్టుకెళ్ళి మర్మాంగాలను కోసి మిమ్మల్ని బలహీన పర్చాలని కుతంత్రం చేస్తుంటే.. సంయమనంతో పక్కా ప్రణాళికతో, ఎదురుదాడి చేసి, విజయాన్ని ధరించి, చిరునవ్వుతో మీరు వస్తుంటే దేశ దేహం ఉప్పొంగింది.. జనావళికి దీపావళి వచ్చింది. ప్రతీ క్షణం.. ప్రతీ సందర్భం మా రోమాలు నిక్కపొడుచుకొనేలా ఎన్నో వీరోచిత గాథలలో మీరంతా మా నోళ్లలో నానుతూ.. మా ఇంట్లో చందమామ పాటలా మార్మోగుతూ ఉంటారు. అందరికీ అమ్మానాన్నలు, అన్నాదమ్ములు, భార్యాబిడ్డలు ఇలా ఓ కుటుంబం. కానీ, దేశమే కుటుంబంగా భావించి ఆ రక్షణ వ్యవస్థను ఏర్పరుచుకొని నువ్వు నిబద్ధంగా ఉన్నందుకేమో.. ప్రతి గడపా మీకోసం ఎదురు చూస్తున్నది, ప్రతి ఇల్లూ మీ పేరును జపిస్తున్నది.

ఎన్ని పార్శాల్లో అవినీతి, అన్యాయం తొంగి చూసినా, దేశద్రోహులు ఎన్ని రూపాలు మార్చినా, ఎన్ని దారుల్లో తెగబడ్డా మిమ్మల్ని ఏమార్చగలుగుతారా. అప్పుడెప్పుడో ఓ పెద్ద మనిషి చెప్పాడట.. భారతదేశ సిపాయిలని ఇవ్వండి, ప్రపంచాన్ని జయించి చూపిస్తాను అని - ఎంత గొప్ప ప్రశంసో కదా సోల్జర్!

సోల్జర్.. ఒకసారి నేను ఉత్తర భారతం వైపు వెళ్ళాను. అక్కడ రైల్వేస్టేషన్‌లో మీ డ్రస్ కనిపిస్తే చాలు అది దేశ అడ్రస్‌గా భావిస్తూ ఒకటే దండాలు, పాదాభివందనాలు. ఒక కదిలించే సంగతి చెప్పనా.. అక్షరధామ్ ఘటనలో మీరు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఒక నిండు గర్భిణి, అప్పుడే పుట్టిన తన బాబుని అక్కున చేర్చుకొని తన భర్తను వెతుకుతూ మందిర పరిసరాలకు వచ్చిందట. రెండు చేతుల్లో అతన్ని ఎత్తుకొని మీరొచ్చినపుడు, చనిపోయాడు అనుకున్న భర్తని మళ్లీ చూసిన ఆనందంలో తన బాబుకి మీ పేరే పెట్టిందట. అది విన్నప్పుడు అనిపించింది జన్మంటే ఇది కదరా అని.

కోట్లాది ప్రజల మాన, ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయన్న భావన మీకెంత ఆనందాన్ని, బాధ్యతని పంచుతుందో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. గగనతలంలో వాయుసేన, నీళ్లలో జలసేన, భూమ్మీద సైనిక సేనలను మూడుకండ్లుగా ఈ దేశం భావిస్తుంది. అయితే సోల్జర్.. విధి నిర్వహణలో పడి కళ్ల నిండుగా మీ కుటుంబాన్ని చూసి ఎన్ని దినాలైందో? బంకర్లలో మాగన్నుగా నిద్ర పడుతున్న సందర్భంలో, ఉలిక్కి పడిలేచి, నా పాప ఏడుపు వినిపించింది అంటూ దిక్కులు చూస్తే కనిపించేది చిమ్మ చీకటే కదా! మాట్లాడాలని ఉన్నా సాటి మనిషి కూడా కానరాని స్థితి. చేతికర్రతో ఏ వృద్ధుడు కనిపించినా భుజం సాయం చేసి తాతా అంటూ పాదాలు తాకే మీకు.

పుల్వామా అమర సిపాయిల్లారా.. మీరు మాకు హీరోలు, మీరు వీరులు, ధీరులు. మీరే మా ధైర్యం, స్థయిర్యమూ మీరే, మా బలం మీరే, మా బలగం మీరే, మా భవితా మీరే. భిన్నత్వంలో ఏకత్వం చూసిన దేశ ప్రజగా చెపుతున్నా.. శాంతిని స్థాపించే యుద్ధంలో మీ మరణం ఆఖరి వాక్యం కాదు. మీ త్యాగం చివరి చరణం కాదు. అలాగే మాతృభూమి రక్షణలో మీ వీరత్వం విజయ సంకేతం. మీ ధీరత్వం ఆత్మవిశ్వాస కేతనం. మీ పట్టుదల, నిబద్ధత మాకు నిత్య స్ఫూర్తి మీ నిస్వార్ధం, నిజాయితీ మాకు నిరంతర దీప్తి. అందుకే మనదేశ ప్రజల కళ్ళల్లో మీరుంటారు. దేశం గుండెల్లో మీరుంటారు. మా తొలివేకువ ప్రార్థనల్లో మీరుంటారు. అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..

Dear సోల్జర్ Long live your spirit ఇట్లు,మీ భారతదేశం
శాంతిని వల్లె వేస్తున్న రక్షక దూతల్ని రాక్షసంగా వెన్నుపోటు పొడవమని ఏ మతం నేర్పింది? మతం అభిమతం అందరి హితం కావాలి గానీ మనిషిని చంపే ఉన్మాదం కాకూడదు కదా! ఇలా రాసుకుంటూ పోతే ఈ ఉత్తరం చాలదు.. ఈ సమయమూ సరిపోదు.. మీ త్యాగం.. మీ బలిదానం.. మీ దేశభక్తి.. దేశ ప్రజల పట్ల మీకున్న అనురక్తి ఈ దేశం ఎప్పుడూ మర్చిపోదు.

ఏ పూల పరిమళమో సోకినప్పుడు కళ్ళనిండా నీళ్లతో భార్య గుర్తొచ్చినప్పుడు.. కళ్లతడి గుండెల్లోకి రాకుండా దేశ జెండా వంక చూసి నమస్కారం చేసే మీ సంస్కారం చూసినప్పుడల్లా మేము ఎంత గర్వపడతామో తెలుసా! ఏ మెత్తటి మట్టి కనిపించినా మా అమ్మ స్పర్శంత మెత్తగా ఉందంటూ నుదుటిన పెట్టుకుని ఆనందిస్తారు మీరు!
-రచన: అయినంపూడి శ్రీలక్ష్మి, సెల్ : 9989928562

689
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles