డయల్ యువర్ ఆర్గానిక్ అంటున్న నమిత అంబానీ


Tue,September 4, 2018 04:02 AM

ఉద్యోగం చేసి నెలకు లక్షల్లో జీతం సంపాదించే చదువు ఆమెకుంది. ఉద్యోగం చేసిన అనుభవమూ ఉంది. కానీ తన కొడుకుకు నాణ్యమైన పాలు పట్టాలన్న ఆలోచనతో మొదలైన ఆమె అన్వేషణ సొంత వ్యాపారానికి చేరువ చేసింది. ఎలాంటి కెమికల్స్ కలువని ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని తన కుటుంబానికే కాదు ముంబై నగరానికి అందించాలన్న సంకల్పంతో ఆర్గానిక్ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఫోన్ చేసిన వెంటనే అడిగిన వారికి అవసరమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందిస్తూ తక్కువ సమయంలోనే ముంబై నగరంలో వ్యాపారాన్ని విస్తరించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు కేంద్రబిందువుగా నిలుస్తున్న డయల్ ఆర్గానిక్ వ్యవస్థాపకురాలు నమితా పురోహిత్ అంబానీ సక్సెస్‌మంత్ర.
namitha-ambani


రుచిగా ఉన్న ఆహారపదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవి అనుకుంటే పొరపడినట్లే. ఈ రోజుల్లో మనం తినే ప్రతి పదార్థం కలుషితమైనదే. కూరగాయలు, పండ్లు ఇతర ఉత్పత్తులన్నీ కూడా ఉత్పత్తి దశలోనే కలుషితమవుతున్నాయి. మొక్కలకు విరివిగా కెమికల్స్ వాడడం వల్ల వాటి ద్వారా పండ్లు, కూరగాయలు కలుషితమై అనారోగ్యానికి దారితీస్తున్నాయి. ఆ సమస్య నుండి పురుడు పోసుకున్నదే డయల్ ఆర్గానిక్.


ఆర్గానిక్‌కు పరిచయం చేయడం

ముంబై కేంద్రంగా ఆర్గానిక్ ఉత్పత్తులను అందించే లక్ష్యం తో డయల్ ఆర్గానిక్‌ను ప్రారంభించారు నమితా అంబానీ. తాజా పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు.. మౌస్‌తో ఒక్క క్లిక్ చేసినా, ఒక్క ఫోన్ కొట్టినా చాలు మీరు అడిగింది మీ గుమ్మం దగ్గరికి చేర్చడం ఈ సంస్థ ప్రత్యేకత. ముంబైలో ఆర్గానిక్ ఉత్పత్తులకూ, ఆహారానికీ కేంద్ర బిందువు కావాలన్నదే డయల్ ఆర్గానిక్ మోటో. అదే వారి నినాదం కూడా. తన లక్ష్యం ఒక్కటేనంటారు దీని ఫౌండర్ నమితా అంబానీ. ప్రతి ఒక్కరికీ ఆర్గానిక్ (సేంద్రియ) అనే పదాన్ని పరిచయం చేయడం. అత్యంత సరసమైన ధరలకు వినియోగదారులకు సేంద్రియ ఆహార ఉత్పత్తులు అందిస్తాం అంటున్నారు నమిత.


ఏడాది శ్రమించి..

ప్రకృతిలో సహజంగా లభించిన దానికం టే మించినది లేదని నిర్థారించుకోవడానికి ఏడాదికి పైగా ఆమె రైతులతోనూ, సేంద్రి య ఉత్పత్తిదారులతోనూ, వ్యాపారులతోనూ గడిపారు. అందుకే వినియోగదారులకు సహజమైన ఉత్పత్తులను అందించాలన్న పట్టుదలతో ఉన్నారామె. చదువు రీత్యా ఆమె మేనేజ్‌మెంట్‌లో, కంపెనీ సెక్రెటరీ కోర్సులోనూ గ్రాడ్యుయేట్. గతంలో ఆమె పాంటలూన్ రిటైల్ ఇండియా లిమిటెడ్‌లో కోర్ ప్లానింగ్ విభాగంలోనూ, ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్‌లో స్ట్రాటెజీ విభాగంలోనూ పనిచేశారు.


ఆర్గానిక్ లంచ్‌బాక్స్

ఈ మధ్యనే నమిత తన డయల్ ఆర్గానిక్ వెబ్‌సైట్‌కి తోడుగా, తెలివిగా తినండి బరువు తగ్గండి అంటూ సరికొత్త సర్వీసును ప్రారంభించారు. ఇందుకోసం ఆమె పోషకాహార నిపుణురాలైన కింజల్ షా సలహాలు తీసుకున్నారు. ఆ విధంగా నమిత తన ఆర్గానిక్ లంచ్‌బాక్స్ సర్వీసు మొదలుపెట్టారు. ఒక భోజనం కావాలన్నా, వారం మొత్తానికి డైట్ ప్లాన్ కావాలన్నా అందజేస్తారామె. ఇక వంటకాల విషయానికొస్తే రష్యన్ సలాడ్ లేదా కీర దోసకాయ సలాడ్ ఉంటుంది. ప్రధాన ఆహరంలో వెజిటేబుల్ కోఫ్తా, మేథీ మటర్ మలై నుంచి అమృత్‌సర్ ఆలూ వరకూ ఉంటాయి. దాల్ రైస్ కాంబినేషన్ కూడా ఆర్డర్ చేయవచ్చు. దీనికి ఒక స్టార్టర్ లేదా డెజర్ట్ లేదా గట్టి స్నాక్ ఐటెమ్ ఏదైనా అదనపు ధర చెల్లించి అడుగవచ్చు.


భవిష్యత్ ప్రణాళికలు, కొత్త ఆలోచనలు

ప్రస్తుతం ఆర్గానిక్ కథలో రెండు అధ్యాయాలు సాగుతున్నాయి. ఒకటి డయల్ ఆర్గానిక్ అయితే, రెండోది ఆర్గానిక్ లంచ్ బాక్స్. త్వరలోనే పోషకాహార నిపుణుల సలహాలను కూడా సైట్‌లో ప్రవేశపెడుతారు. సేంద్రియ ఆహారం ఆస్పత్రులకు చాలా ఉపయోగకరమని నమిత ప్రగాఢ విశ్వాసం. అందుకే వాళ్ళకోసం ప్రత్యేకంగా మ్యూజిక్ థెరపీ, సామూహిక ఉపశమన విధానాల ద్వారా ఒక సేంద్రియ ఆహార పథకం సిద్ధం చేశారు. కీలకమైన ఆస్పత్రులలో ఇది కచ్చితంగా ఆహార నాణ్యతను, పంపిణీ నాణ్యతను పెంచుతుందంటారు నమిత. అదేవిధంగా పిల్లలకు కూడా ప్రణాళికాబద్ధమైన ఆర్గానిక్ ఆహారాన్ని ఆకట్టుకునేలా తయారుచేసి అందిస్తే వాళ్ళకు మంచి అలవాట్లు, ఎదుగుదల ఉంటాయంటారామె. అందుకే ఆర్గానిక్ ఆహారం సరఫరా చేసే విషయమై ప్రముఖ పాఠశాలలను కూడా సంప్రదిస్తున్నారు. వినియోగదారుల జీవనశైలి మెరుగుపడేలా రకరకాల సేవలు అందించడానికి మొబైల్ లోనూ, వెబ్ ప్లాట్‌ఫామ్‌లోనూ డయల్ ఆర్గానిక్ కృషి చేస్తున్నది.


తక్కువ సమయంలోనే పురోగతి

ఆర్గానిక్ ఫుడ్‌తోపాటు ఆర్గానిక్ లంచ్‌బాక్స్ సక్సెస్ కావడంతో నమిత తన వ్యాపారాన్ని ఆస్పత్రులకు విస్తరించాలనుకుంటున్నారు. అలాగే పిల్లలకు కూడా ఆర్గానిక్ ఆహారాన్ని అందించడం ద్వారా వారికి మంచి భవిష్యత్ ఇవ్వవచ్చన్నది ఆమె ఆలోచన. తన కొడుకుకు ఆరోగ్యకరమైన పాలు అందివ్వాలనే సంకల్పంతో మొదలైన ఆమె వ్యాపారం నేడు ముంబై నగరమంతా విస్తరించింది. త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు నమిత.


namitha-ambani2

కొడుకు కోసం మొదలై..

ఆమె పరిశోధించడం ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఒకటి ఆర్గానిక్. నిజానికి పసిపిల్లవాడైన తన కొడుకుకు తన పాలు మాన్పించి మార్కెట్లో నాణ్యమైన పాలు వెతుకుతున్నప్పుడు ఈ ఆలోచన మొదలైంది. అదే సమయంలో తన తండ్రి నడిపే సేంద్రియ పెరటి తోట కూడా ఈ వ్యాపారాభిలాషకి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఫలితంగా, ఆమె సేంద్రియ రంగం మీద పరిశోధన మొదలుపెట్టారు. రైతులను కలుసుకున్నారు, ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలతో చర్చించారు. ఈ రంగంలో వ్యాపారానికి ఉన్న అవకాశాన్ని చాలా త్వరగా పసిగట్టారు. ముందుగా ప్రవేశించడం వల్ల కలిగే ప్రయోజనాలూ ఆమెకు తెలుసు. ఆ తరువాత తన ముందున్న అతిపెద్ద సవాలు... మనుషుల ఆలోచనాధోరణిలో మార్పు తీసుకురావడం. నిజానికి తాను కొంత కాలం ఆ రంగంలో పనిచేసిన తరువాత సొంతంగా ఈ రంగంలో దిగడం మంచిదని గట్టిగా అనుకున్నప్పటికీ వాస్తవంలో అలా చేసినప్పుడు ఆమె దిగ్భ్రాంతికి గురికాక తప్పలేదు. కారణమేంటంటే తనకు తానే బాస్‌గా, ఉద్యోగిగా శిక్షణ ఇచ్చుకుంటూ పని గంటలు కూడా తానే నిర్దేశించుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత పనులన్నీ సులభమయ్యాయి. స్థలంతో, కాలంతో సంబంధం లేకుండా ఆమె మనసు ఎప్పుడూ తన ప్రాజెక్ట్ లో కొత్త ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉండేది.


namitha-ambani3

ఎన్నో సవాళ్ళు

ఒక వెంచర్ ప్రారంభించడంలో ఎన్నో సవా ళ్ళు ఎదురుకాక తప్పవు. సిబ్బంది దొరకటం, నిర్వహణ మూలధనం అందులో కొన్ని. తాను ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు మాత్రం మనుషుల ఆలోచనా ధోరణిని మార్చడంలోనే ఉందంటారు నమిత. సేంద్రియ ఆహారం మీద కొన్ని బలమైన అభిప్రాయాలున్నాయి. ఖరీదెక్కువని, వాటిని నమ్మడం కుదరదని. వాటిని మార్చడానికి చాలా కష్టపడ్డారు నమిత. పొలం నుంచి నేరుగా ఇళ్లకే తాజా సేంద్రియ కూరగాయలు, పండ్లు మోసుకొచ్చే వాళ్లనే డయల్ ఆర్గానిక్ బృందం నియ మించుకుంది. పంపిణీ విషయానికొచ్చేసరికి స్థానికంగా ఉన్న సంస్థల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అదొక పాఠం అయింది. ఇప్పుడు అన్ని ముడిపదార్థాల నూ దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాల నుంచి ముందుగానే ఆర్డర్ చేసి తెప్పించుకోవడం మొదలైంది. చిల్లర వర్తకం ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకునే పాఠమే. ఎప్పుడూ మారుతూ ఉండే వాతావరణం లో వినియోగదారుడికి సేవలందించడంలో ఉత్తమమార్గాన్ని కనుక్కుంటూ ఉండాల్సిందే నంటారు నమిత.


ఆర్డర్ చేయడం

ఆర్గానిక్ లంచ్‌బాక్స్ కోసం వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. లేదా ఫోన్ చేయవచ్చు. లంచ్ బాక్స్ ధర రూ. 150 తో మొదలై డైట్ కన్సల్టేషన్‌తో కలిపి నెలకు రూ. 20,000 దాకా ఉంటుంది.

759
Tags

More News

VIRAL NEWS