డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు.. రూ.29 లక్షలకే


Fri,August 31, 2018 11:23 PM

-నమస్తే సంపదతో వాసవి గ్రూప్ ఛైర్మన్ విజయ్ కుమార్
VIJAY-KUMAR
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాల వల్ల.. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ రియల్ రంగంలో స్వర్ణయుగం నెలకొన్నదని వాసవి గ్రూప్ ఛైర్మన్ విజయ్‌కుమార్ అభివర్ణించారు. హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన నమస్తే సంపదతో ప్రత్యేకంగా ముచ్చటించారు. నిబంధనల్ని పాటించే నిర్మాణ సంస్థలకు రెరా వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. బెర్లిన్‌లో పలు నిర్మాణాల్ని పరిశీలించామని.. అన్నీ ప్రీ క్యాస్ట్ తరహాలో చేపడుతున్నారని.. ఫలితంగా, యాభై శాతం సమయం ఆదా అవుతుందన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..

బెర్లిన్‌లో జరిగిన క్రెడాయ్ నాట్‌కాన్ సదస్సు వల్ల నిర్మాణ సంస్థలకు కలిగే లాభం అంతాఇంతా కాదు. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం, వాటికి పరిష్కారాల్ని కనుగొంటాం. ఆధునిక పోకడలు, ప్రాజెక్టు ఫైనాన్స్, ప్రైవేటు ఈక్విటీ వంటి విషయాలపై ఉపయోగకరంగా మారిందీ సదస్సు. సెప్టెంబరు 1 నుంచి రెరా అమల్లోకి వస్తున్న నేపథ్యంలో.. నిర్మాణ నిబంధనలకు పాటించని డెవలపర్లకు కొంత సమస్యే అని చెప్పొచ్చు. అయితే, నిబంధనలకు అనుగుణంగా కట్టేవారికి రెరా వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

ఇదీ నేపథ్యం..

1994లో హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. మొదటి ప్రాజెక్టును వాసవీ నగర్‌లో చేపట్టాను. అప్పట్లో నిర్మాణ వ్యయం చదరపు అడుక్కీ రూ.300 అయ్యేది. గత 24 ఏండ్లలో నిర్మాణ రంగం పది రెట్లు అభివృద్ధి చెందింది. ఇప్పటివరకూ దాదాపు యాభై ప్రాజెక్టులను కొనుగోలుదారులకు విజయవంతంగా అందజేశాను. సుమారు కోటి చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో 2.5 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో 20 లక్షల చదరపు అడుగుల్లో వాణిజ్య ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. మిగతావన్నీ నివాస గృహాలే. వివిధ ప్రాంతాల్లో మొత్తం కలిపి ఇరవై ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. అప్పటితో పోల్చితే ప్రస్తుతం మార్జిన్లు మెరుగ్గా ఉన్నాయి. బ్యాంకులు రుణాల్ని మంజూరు చేస్తున్నాయి. ఎఫ్‌డీఐలు, ప్రైవేటు ఈక్విటీలు రుణాల్ని ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాల వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తున్నాయి. దేశ, విదేశీ ఆర్థిక సంస్థలు నగరం వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడ ఇండ్ల ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇండ్ల అమ్మకాలు మెరుగ్గా జరుగుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ రియల్ మార్కెట్‌కు స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఎఫ్‌ఎస్‌ఐ నిబంధన విధిస్తే.. ఇండ్ల ధరలకు రెక్కలొచ్చే ప్రమాదముంది. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో చదరపు అడుక్కీ రూ.8000 అమ్ముతున్నారు.. చన్నైలో రూ. 10,000.. అదే హైదరాబాద్లోని మంచి ప్రాంతంలో నేటికీ చదరపు అడుక్కీ రూ.4,000కే ఫ్లాట్లు దొరుకుతున్నాయి. అంటే, ఓ యాభై లక్షలు పెట్టగలిగితే డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ సులువుగా లభిస్తుంది. మన వద్ద ఫ్లాట్ల రేట్లు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ ఉండటమే.

రూ.29 లక్షలకే ఫ్లాట్

బాచుపల్లిలో అందుబాటు గృహాల ప్రాజెక్టును చేపడుతున్నాం. వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ చేరువలో దాదాపు నాలుగు వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. ఇందులో వచ్చేవన్నీ అరవై చదరపు మీటర్లలోపు గల ఫ్లాట్లే. ఇందులో ఇల్లు కొనేవారికి.. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో భాగంగా కొనుగోలుదారులకు వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. ఆధునిక సదుపాయలతో కలిపి డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ ధర.. రూ.29 లక్షలుగా నిర్ణయించాం. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. మూడేండ్లలోపు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం.

4419
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles