టీచర్‌గా మారిన డాక్టర్


Wed,September 5, 2018 12:50 AM

ప్రస్తుతకాలంలో కొంతమంది పిల్లలు చదువు పేరు చెప్పగానే ఆమడదూరం పరుగెత్తుతున్నారు. మరికొంతమంది ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలను చూసిన ఈ డాక్టర్.. తన స్టెతస్కోప్‌ను వదిలేసి.. చాక్‌పీస్ పట్టుకున్నది. ఎలాంటి భయం, బెరుకు, ఒత్తిళ్లు లేని విద్యాబోధన చేస్తూ.. మంచి ఉపాధ్యాయినిగా పేరు తెచ్చుకున్నది.
Dr-anuradha-kishore
గుర్గావ్‌కు చెందిన ఈ డాక్టర్ పేరు అనురాధ కిశోర్. తన దగ్గరకు వచ్చే పిల్లలు ఒత్తిళ్ల కారణంగా రకరకాల రోగాలబారిన పడుతుండడం, మరికొంతమంది ఆత్మహత్యలవైపు అడుగులు వేయడంతో ఎన్నోరోజులు మథన పడింది. తన 17 యేండ్ల డాక్టర్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసి, టీచర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టింది. వైద్యం చేసే డాక్టర్లు, పాఠాలు బోధించే టీచర్లు ఒకే కోణంలో ఆలోచించే సందర్భాలు అరుదుగా ఉంటాయి. కానీ పిల్లల మనస్తత్వాలను టీచర్‌గానూ, డాక్టర్‌గాను పరిశీలించినప్పుడే ఎలాంటి ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాఠాలు చెప్పవచ్చనే ఉద్దేశంతో తాను ఉపాధ్యాయినిగా మారినట్లు చెబుతున్నది అనురాధ. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని పిల్లలకు విసుగు రాకుండా, ఒత్తిడి లేని విద్యను బోధిస్తున్నది. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వును చూసేందుకు వైద్యవృత్తిని త్యజించినట్లు చెబుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో గుర్గావ్ ప్రోగ్రెసివ్ స్కూల్‌లో ఉపాధ్యాయినిగా చేరింది. చదువు అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. పిల్లలకు చదువు నేర్పించడంలో కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులే. అలాంటి వృత్తిని స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నా అని ఆమె చెప్పారు. తాను తరగతి గదలోకి ప్రవేశించగానే విద్యార్థులు ఎంతో ఇష్టంగా, ఆతృతగా పాఠాలు వింటున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నది. పిల్లలకు బలవంతంగా నేర్పించడం కంటే, వారికి చదువుపై ఆసక్తిని కలిగించే మాటలు చెప్పడం వల్లనే సులువుగా విద్యను నేర్చుకోగలుగుతారని ఆమె చెబుతున్నది. విద్యార్థుల కోసం వైద్యవృత్తిని వదిలిన అనురాధ నిబద్ధతను పలువురు కొనియాడుతున్నారు.

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles