e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home జిందగీ జీవితం.. ఎండా వాన!

జీవితం.. ఎండా వాన!


కొన్ని రోజులు ఎండ. కొన్ని రోజులు వాన. ఇదే జీవితం. అన్ని రోజులు ఒక్క తీర్గనే ఉండవు. అన్ని సమయాలల్ల సమస్యలే ఉండవు. కష్టముంటది. సంతోషముంటది. అసొంటి జీవితం నుంచి వచ్చిన జీడిపల్లి చంద్రవ్వ జీవన స్మృతులు..

జీవితం.. ఎండా వాన!

అవసరాలు పెరిగి, అవకాశాలు ఎక్కువైతే అందరమూ ఒక్కతాన్నే ఉండలేం. మనమొక తాన ఉంటం. పిల్లలొక తాన ఉంటరు. వాళ్లెక్కడున్నా, ఏం జేసినా సల్లం గుండాలె అనుకొనుడే తల్లి గొప్పదనం. నేనుకూడా అదే కోరుకుంట. మా కాలంల మేం పడే కట్టం మేం పడి ఉండొచ్చు. మా రాత తీరుగ మేం నడ్సుకొని ఉండొచ్చు. కానీ, ఇప్పటి పిల్లలు అట్లనే ఉండాల్నంటే కుదుర్తదా? కాకపోతే, మా కట్టం వాళ్లకొక పాఠం లెక్క. మా జీవితం వాళ్లకొక తొవ్వ లెక్క. నా పేరు జీడిపల్లి చంద్రకళ. ఊళ్లె అందరూ ‘శెంద్రవ్వా’ అంటరు. పుట్టినింటి కాడైతే ‘ఇమలవ్వా’ అంటరు. మాది కన్నారం పక్కన నుస్తులాపూర్‌. తల్లిగారి ఊరు పెద్దపల్లి పక్కన ఎంట్రావు పల్లె.

పొట్టకు బట్టకే
మా ఆయన పేరు కనుకరావు. మాకు ఆరేడెకరాల పొలం ఉండేది. బర్లు, ఆవులుండేవి. పొద్దున లేశిన కాడ్నుంచి మాకు ఇదే పని. తెల్లం జావున మూడు గంట్లకే మా ఆయిన మోట గొట్టనీకె పోతుండె. అత్త లేని ఇల్లు కావట్టి, నేను కూడా ఆయన వోంగనే లేద్దును. ఆ పనీ ఈ పనీ చేస్కునేసరికి అంబట్యాల్లయ్యేది. తైదంబలి, జొన్నగట్క తీస్కొని గంపనెత్తిల ఎత్తుకొని నేను బాయికాడికి పోదును. మోటగొట్టి అల్శిపోయిన మా కనుకయ్య గట్కదిని అంబలి తాగేటోడు. అంత కష్టవడి చేసినందుకు పుట్టకొద్ది వొడ్లు మిగుల్తుండె. బర్లు, ఆవుల పెండనే ఎర్వుగా ఏస్తుంటిమి. పంటలు మంచిగనే పండేటియి. ఎప్పుడైతే బాయిలకు కరంటు మోటార్లు, పంటలకు మందులు వచ్చినయో అప్పుడు మా ఎవుసానికి కట్టమొచ్చింది. ఏడ్ముట్లెల్ల కాలం పని జేసినా బట్టకు, పొట్టకే సరిపోక పోయేది.

ఖర్సులు పెరిగె, పొలం తగ్గె..
ఎవుసం ఎప్పుడైతే మమ్ములను ఎక్కిరిచ్చినంత పని చేసిందో అప్పుడే మా సుట్టూతా సమస్యలు వచ్చి చేరినయి. పిల్లలను పెంచాల్నాయె. ఒక్క ఖర్సా? ఒక్క కతనా? అవీ ఇవీ ఎక్కువై అప్పులు ఎక్కువైనయి. ఆరేడెకరాల పొలం ఒకట్రెండు ఎకరాల కాడికొచ్చింది. దానికి తోడు పిల్లలు పెద్దగయిండ్రు. వాళ్లకు సదువులు చెప్పించాల్నాయె. మంది పిల్లల్లెక్క మంచి బడికి పంపాల్నాయె. అప్పులు తేర్పనీకె పొలం అమ్మినం. బాధనిపించేదేందంటే ఏ ఎవుసం కోసమైతే రెక్కలు ముక్కలు చేసుకున్నమో ఆ ఎవుసం కోసం చేసిన అప్పుల కోసమే పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. పిల్లలు పెద్దగైనంక వాళ్లకు కొల్వులు లేవనే రంది. ఎన్ని కట్టాలొచ్చినా పిలగాళ్లకైతే ఇబ్బంది కలుగకుంట చూసుకున్నం. సదువులు మంచిగనే సదివించి తెలివకి తెచ్చినం.

జనం ఇంతగనం లేరు
మొన్ననే నా చిన్న కొడుకు ఫోన్‌ జేసి ‘అవ్వా పైలమే. జాగ్రత్త గుండుండ్రి. బైటికెళ్లకుండ్రి. మాస్క్‌ కట్టుకోండ్రి’ అనవట్టె. నాకు ఇచ్చెంత్రం అనిపించింది. మేం మా జమాన్ల ఇసొంటియి మస్తు చూసినం. ఏదో ఇప్పుడు వాళ్లూ, వీళ్లూ చెప్తెనే కట్టుకుంటుండ్రుగనీ అప్పట్ల మూతికి బట్టలు కచ్చితంగా కట్టుకునేటోళ్లం. బావులు తోడవోయినా, చెరువు కట్ట పనికిపోయినా, కలుపునాట్లకు పోయినా సుట్టబట్టలతో పాటు మూతికి సెల్లబట్ట బాజాప్తా కట్టుకుందుము. ఇప్పట్లెక్క ఈ తీరొక్క కతలేదు. తీరొక్క సమస్య లేదు. ఇప్పుడేందో ఎవలు జూసినా కరోనొచ్చె అంటుండ్రు. మేం జూడని కరోనాలా ఇవి? కాకపోతే, లోకం ఇంత ఎక్కడిది? ఇంతమంది జనాలు యేడున్నరు? ఇన్ని పనిపాటలెక్కడివి ఆయల్ల?

కొడుకులు బతికించిండ్రు
పదేండ్ల కింద నాకు ఫిట్సొచ్చింది. ‘ఇగ సచ్చిపోత’ అనుకున్న. ఇంత జీవితం జూసిన సాలు ఇగ అనుకున్న. కానీ, నా పిల్లలు నన్ను బతికించుకుండ్రు. మంచమ్మీది నుంచి కూడా లెవ్వలేదు నేను. నా కొడుకులు ఉండవట్కెనే బతికిన. ఇప్పుడు మంచిగున్న. చిన్న కొడుకుకు సర్కారు నౌకరొచ్చింది. పానం కొంత నిమ్మళమైంది. తుర్తిగా ఉన్నా. ఎందుకంటే, నా కొడుకు నౌకరి కోసం చానా తిప్పలు వడ్డడు. కన్నారంల ఓ పెద్ద హోటల్ల పనిజేసుకుంట పొద్దుమాపు కష్టవడి సదివిండు. ‘ఎందుకుబిడ్డా ఏదో ఒకటి చేసుకొని ఉండరాదూ’ అని అన్నాగూడా ‘ఏదో ఒక పని చేస్తే మీరు పడ్డ కష్టానికి ఏం విల్వుంటదే?’ అన్నడు కొడుకు. ఎవరి జీవితమైనా ఇట్లనే ఉంటది. కొన్నిరోజులు ఎండ గొట్టినట్లు కట్టాలుంటయి. కొన్నిరోజులు వాన గొట్టినట్లు సంతోషాలుంటయి.

కట్టం కొత్త గాదు
నాకు పదమూడేండ్లప్పుడే పెండ్లయింది. ముగ్గురం ఆడపిల్లలమే. ఇద్దుము, మాసం పెట్టిన రోజులే అయినా ఆడివిల్లలంటే అప్పుడు కూడా భయంగనే ఉండేది. మేం ముగ్గురమాయె. ఎప్పుడెల్లగొట్టి చేతులు దుల్పుకోవాల్నా అని అవ్వయ్య ఆలోచిస్తుండేటోళ్లు. అట్లా పదమూడేండ్లకే నా పెండ్లి చేసిండ్రు. పదిగల్ల ఎడ్లబండ్లుగట్టి మంచిగ చేసిండ్రు. మా ఆయన పల్లాకీలొచ్చిండు. అప్పుడు పెండ్లీలు పొద్దుమూకెయాల్ల అయితుండె. మల్ల తెల్లారి యాటలు గోసి దావతి జేసి నన్ను సాగనంపిండ్రు. నా పెండ్లికి కట్నం పద్నాలుగు వందల రూపాయలు. మొన్నటిదాకా బర్లనే సాదినం. కానీ, శాతగాక అమ్మేసినం. పొలంల పంటలు పండకుంటైనంక కోపీన్‌ బియ్యంతోటే పిల్లల్ని బతికించినం. చిన్నప్పుడు బొగ్గుబాయిలు చూసుకుంట పెరిగినోళ్లం, అటెనుక ఎవుసంల రెక్కలరిగేలా పని చేసినం. కట్టం మాకు కొత్తగాదు.

Advertisement
జీవితం.. ఎండా వాన!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement