జీఎస్టీ నుంచి మినహాయించాలి!


Sat,March 2, 2019 12:26 AM

ఒక శ్రీమంతుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో రూ.10 కోట్లతో స్థలం కొనుక్కుని, ఇల్లు కట్టుకుంటే జీఎస్టీ కట్టక్కర్లేదు. అదే, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే తరుణంలో.. రెరా అథారిటీ వద్ద నమోదైన ప్రాజెక్టులో ఫ్లాటు కొంటే మాత్రం జీఎస్టీ కట్టాల్సిందే. ఇది ఎంతవరకూ సమంజసం?
BANNER
రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులపై ఎట్టి పరిస్థితిలో జీఎస్టీని వసూలు చేయకూడదు. ఎందుకంటే, రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తారు. అంటే, ఇదో స్థిరాస్తిగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇల్లు అనేది స్థిరాస్తిగా భావించినప్పుడు జీఎస్టీ ఎందుకు వసూలు చేయాలి? ఎవరైనా ఒక శ్రీమంతుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ప్లాటు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటే.. జీఎస్టీ కట్టనే కట్టడు. సొంతంగా నివసించే భవనం కావడంతో.. కొనుగోలు చేసిన నిర్మాణ సామగ్రి మీదే జీఎస్టీ చెల్లిస్తాడు. అంతేతప్ప, నిర్మాణం పూర్తయ్యాక జీఎస్టీ కడతాడా? లేదు కదా! కొన్ని బడా ఐటీ సంస్థలు భవన సముదాయాల్ని నిర్మించినా జీఎస్టీ చెల్లించవు. వాటిని వదిలేసి చిన్నచిన్న స్టార్టప్ సంస్థల నుంచి జీఎస్టీ వసూలు చేయడం ఎంతవరకూ సబబో కేంద్రం ఆలోచించాలి. ద్వంద్వ పన్ను విధానాన్ని సరిదిద్దుకోవాలి.

-దేశంలోని నగరాల్లో నివసించే నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తామని ప్రధానమంత్రి మోడీ అంటున్నారు. ఇందుకోసం పలు రాయితీలను ప్రకటించారు. వార్షిక వేతనం రూ.18 లక్షలున్నవారు ఇల్లు కొనుగోలు చేస్తే.. రూ.2.67 లక్షల వరకూ వడ్డీ రాయితీని కూడా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్నవారిపై జీఎస్టీ వేయడం ఎంతవరకూ సమంజసమో కేంద్రం ఆలోచించాలి. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఆక్యుపెన్సీ సర్టిపికెట్ వచ్చిన ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, రెరా చట్టం అమల్లోకి వచ్చాక దేశీయ నిర్మాణ రంగం స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కొందరు డెవలపర్లు ముందస్తుగా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రమోటర్ సొంతంగా స్థలం కొనుక్కుని.. ఆయా భూమికి సంబంధించిన పలు రకాల ఎన్వోసీలు తెచ్చుకుని, అనుమతి తీసుకుని, రెరాలో నమోదైన తర్వాతే ప్రాజెక్టును ప్రకటిస్తున్నారు. అంతేకాదు, కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతం ఎస్క్రో ఖాతాలో జమ చేయాలన్న నిబంధన కూడా ఉన్నది.

ఆయా ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం డెవలపర్లు చేసిన ఖర్చును ఛార్టడ్ అకౌంటెంట్ లేదా ఎంపిక చేసిన ఇంజినీరు సర్టిఫై చేశాకే నగదును తీసుకోవాల్సి ఉంటుంది. అది స్థిరాస్తి అని ఛార్టడ్ అకౌంటంట్లు, ఛార్టడ్ ఇంజినీర్లు సర్టిఫై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, జీఎస్టీని విధించాల్సిన అవసరమేముంది? బయ్యర్లు ఇచ్చే సొమ్ము కాకుండా సొంత సొమ్ముతో డెవలపర్లు ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఎలాంటి పొరపాటు జరిగినా జైలు శిక్షణను అనుభవించాల్సి ఉంటుంది. నిర్మాణ నాణ్యతకు సంబంధించి ఐదేండ్ల వరకూ డెవలపర్‌దే బాధ్యత. నిర్మాణంలో ఎలాంటి లోపాలున్నా కొనుగోలుదారులు రెరాలో ఫిర్యాదు చేస్తే పరిష్కరించాల్సిందే. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చాకే, ఆయా ఫ్లాటును రిజిస్టర్ చేసుకోవాలని రెరా చట్టం చెబుతున్నది. ఇక్కడ సర్వీస్ లేదా వర్క్స్ కాంట్రాక్ట్ పరిగణించాల్సిన అవసరమే లేదు. ఆయా ప్రాజెక్టును డెవలపర్ కొనుగోలుదారుల సొమ్ముతో కాకుండా స్వయంగా నిలబెట్టాడు. అందుకే, ఫ్లాట్ల మీద జీఎస్టీని వసూలు చేయక్కర్లేదు.

రెరా రాకముందు, కొంతమంది బిల్డర్లు అపార్టుమెంట్లను విక్రయించేటప్పుడు రెండు రకాల ఒప్పందాలు చేసేవారు. నిర్మాణ సమయంలో ఫ్లాటు కొనే సమయంలో సెమీ ఫినిష్డ్‌గా ఒప్పందం కుదుర్చుకుని, స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్టర్ చేసేవారు. మిగతా కన్‌స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేసేవారు. ఇలా చేయడం వల్ల వర్క్స్ కాంట్రాక్ట్ పరిధిలోకి వచ్చేది. రెరా అమల్లోకి వచ్చాక ఇలా రెండు రకాలుగా రిజిస్టర్ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని.. రెరాలో నమోదైన ప్రాజెక్టులన్నీ స్థిరాస్తి పరిధిలోకి వస్తాయి కాబట్టి.. ఫ్లాట్లకు జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపును అందజేయాల్సిన అవసరముంది. అఫర్డబుల్ గృహాలను ప్రోత్సహిస్తూనే.. రెరా పరిధిలో నమోదయ్యే ప్రాజెక్టులను జీఎస్టీ నుంచి మినహాయించాలి. అప్పుడే, ఈ రంగం దేదీప్యమానంగా వెలగడానికి ఆస్కారముంటుంది.

629
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles