జాగిలాల జైత్రయాత్ర!


Fri,February 15, 2019 01:40 AM

పోలీసులే కాదు, జాగిలాలు సైతం కఠోర దీక్ష చేస్తున్నాయి. పరుగు పందాల్లో పాల్గొంటున్నాయి. నేరస్తులను పట్టుకోవడంలో, ఆధారాలను గుర్తించడంలో అవి ఇకపై సపోర్టింగ్ రోల్ పోషించడం కాకుండా, క్రియాశీలకంగా కీలకంగా పనిచేసేందుకు రెడీ అయ్యాయి. 18వ బ్యాచ్‌లో 75 జాగిలాలకు నేడు ఔట్ పరేడ్ జరుగనున్న సందర్భంగా ఈ కథనం. హ్యాండ్లర్ మాటే శాసనం. పరిస్థితి ఏదైనా ఒక్కసారి ఆదేశాలు వచ్చాయంటే వెన్నుచూపేది లేదు. ఎదురుగా ఉన్న శత్రువు ఎవరైనా మట్టుపెట్టాల్సిందే. నేరం చేసి కలుగులో దాక్కున్నా వందలాది మంది గుంపులో నక్కి ఉన్నా చొక్కాపట్టి ఈడ్చి బయటకి తెస్తుంది. మోకాలు లోతులో పాతి పెట్టిన మందుపాతరనైనా వాసనతో పసిగట్టి చెబుతుంది పోలీస్ జాగిలం. అవి ఆన్ డ్యూటీలో ఉంటే స్మగ్లర్లు, టెర్రరిస్టులు, నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. మొయినాబాద్‌లోని ఐఐటీఏలో శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేక శిక్షణ తర్వాత 18 బ్యాచ్‌కి చెందిన 75 జాగిలాలు పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొంటున్నాయి.
Police-dogs
జాగిలాల్లో శిక్షణకు పనికి వచ్చే మేలు జాతి రకాల కోసం ఐఎస్‌డబ్ల్యూ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు పిలుస్తున్నారు. నిపుణులైన డాక్టర్లు, ఇన్‌స్ట్రక్టర్లు, హ్యాండ్లర్లు ఓకే అంటే జాగిలాలను కొనుగోలు చేస్తారు. ఎనిమిది నెలల శిక్షణ తర్వాత ఫీల్డ్‌లోకి తీసుకువస్తారు. ఒక్కో జాగిలం కనీసం తొమ్మిది నుంచి పదేండ్లపాటు సేవలందిస్తుంది. కొన్ని 11, 12 ఏండ్ల వరకు విధుల్లో చురుగ్గానే ఉంటాయి. 13 ఏండ్ల నుంచి వాటిని విధుల నుంచి తప్పిస్తారు. ఏటా జూన్‌లో శిక్షణ ప్రారంభమై ఫిబ్రవరిలో పూర్తవుతుంది.

హ్యాండ్లర్ మాటే శాసనం..

జాగిలాల శిక్షణ మొత్తం 8 నెలల పాటు ఉంటుంది. నెలల పిల్లను కొనుగోలు చేసినప్పటి నుంచి అది సర్వీస్ నుంచి విరమణ పొందే వరకు దాని వెన్నంటి ఒక కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఉంటారు. వీరిని హ్యాండ్లర్ అంటారు. హ్యాండ్లరే జాగిలానికి సర్వస్వం. శిక్షణ 8నెలల్లో మొదటి లవ్ అండ్ ఎఫెక్షన్. తర్వాత 21 రోజులపాటు హౌస్‌మ్యానర్.. పని అయిపోయాక బ్యారక్‌లోకి వెళ్లిన తర్వాత ఎట్లా నడుచుకోవాలన్నదానిపై శిక్షణ. మూడో దశలో ఓబీడియెన్సీ..ఫీల్డ్‌లో హ్యాండ్లర్‌తో ఎలా నడుచుకోవాలన్నది నేర్పుతారు. ఇక చివరిది సెంట్ వర్క్. ఇక్కడ శునకం జాతిని బట్టి దానితో ఫీల్డ్ అవసరాలను బట్టి తర్ఫీదు ఇస్తారు. క్రైం డాగ్స్‌కు వాసనను బట్టి దొంగలను పట్టడం, స్నిపర్‌డాగ్స్‌కు వాసనబట్టి పేలుడు పదార్థాలను గుర్తించడం నేర్పుతారు.. అసాల్ట్, గార్డింగ్‌డాగ్స్‌కు టెర్రరిస్టులు వంటి కరుడుగట్టిన నేరస్థుల భరతం పట్టడం ఎలాగో నేర్పుతారు. ఒక్కో శునకానికి మూడు గదుల బ్యారెక్స్ ఉంటాయి. మొదటి దాంట్లో నిద్ర, రెండో గదిలో వాకింగ్..ఆహారం తీసుకోవడం, మూడో దానిలో మల, మూత్ర విసర్జన. వేసవి కాలంలో ప్రతి శునకానికి ఏసీ లేదంటే కూలర్ తప్పనిసరి. ప్రతి రోజు రెండుసార్లు అత్యంత బలవర్దకమైన పెడిగ్రీ 250 గ్రాముల చొప్పున ఇస్తారు. ప్రతి పదిహేను రోజులకోసారి మెడికేటెడ్ శాంపోలతో ప్రత్యేక స్నానం ఉంటుంది. ప్రత్యేకంగా డాక్టర్ పర్యవేక్షణ, క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ ఇస్తారు.

ఇతర రాష్ట్ర జాగిలాలకూ

జాగిలాలకు శిక్షణ ఇస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి. బీఎస్‌ఎఫ్‌కు చెందిన బిహార్‌లో లిక్కర్ మాఫియాను అరికట్టేందుకు అక్కడి పోలీసులు ఈ జాగిలాలను రంగంలోకి దింపుతున్నారు. ఇందుకోసం మొయినాబాద్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేకంగా బిహార్‌కు చెందిన 20 జాగిలాలు శిక్షణ పొందుతున్నాయి. వీటితోపాటు గోవాకు చెందిన ఆరు జాగిలాలు నార్కోటిక్స్, స్నిఫర్, గార్డింగ్‌లో శిక్షణ పొందుతున్నాయి. అదే విధంగా ఆక్టోపస్ విభాగం కోసం బెల్జ్‌మెనలయిస్ జాతికి చెందిన అక్టో అనే అసాల్ట్‌డాగ్‌కు ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నారు.

ఫించన్ ఇవ్వాలన్న యోచన

ఇప్పటి వరకు పోలీస్ జాగిలాలుగా పనిచేసిన కుక్కలను సర్వీస్ తర్వాత పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండడంలేదు. వాటి జీవిత కాలంలో ప్రజల రక్షణ కోసం కష్టపడిన జాగిలాలు వయస్సు అయిపోయిన తర్వాత వాటికి రిటైర్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వ యోచిస్తున్నది. ఇప్పటికే తమిళనాడులో ఏనుగులకు ఈ విధంగా సర్వీస్ తర్వాత పదవీవిరమణ అధికారికంగా ఇస్తున్నారు. అదే తరహాలో ఇక్కడా అమలు చేయాలని తెలంగాణ పోలీస్‌శాఖ భావిస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

తొలిసారిగా దేశీయ ముథోల్ డాగ్‌కు శిక్షణ

Policedogs
జర్మన్‌షెపర్డ్, లాబోడార్, బెల్జియం మెలినాయిస్, డాబర్‌మ్యాన్, కాకర్‌స్పానెల్, గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్స్ శునకాలను ఎక్కువగా పోలీస్ జాగిలా శిక్షణకు వినియోగిస్తున్నారు. అయితే, ఈ ఏడాది తొలిసారిగా దేశీయ బ్రీడ్‌కు చెందిన ముథోల్ జాతి కుక్కకు శిక్షణ ఇస్తున్నారు. కర్నాటక రాష్ర్టానికి చెందిన ఈ శునకాన్ని ప్రస్తుతం కేవలం మిలిటరీలో గార్డింగ్ కోసం వినియోగిస్తున్నారు. అతిభారీ పొడవైన ఈ శునకం. పరుగులో చిరుతను తలపిస్తుంది.

నాగోజు సత్యనారాయణ
క్రైం రిపోర్టర్, స్టేట్ బ్యూరో

607
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles