జలచరాలకు జీవం పోస్తున్నది!


Wed,February 27, 2019 01:25 AM

సొర చేపా.. సొర చేపా నువ్వెందుకు తగ్గిపోతున్నావ్ అని అడిగితే నేను తినే చిన్న చేపలు నాకు దొరకడం లేదు అన్నదట..చిన్న చేపా.. చిన్న చేపా నువ్వెందుకు దొరకడం లేదు అంటే నాకు దొరికే నాచు సముద్రంలో లేకపోతే నేనెలా బతుకుతా అన్నదట..చేపలే కాదు.. అవగాహన లేని జాలరుల చేతుల్లో ఎన్నో జలచరాలు మరణిస్తున్నాయి..దీనికి చరమగీతం పాడేందుకు ఓ యువ శాస్త్రవేత్త చేసిన కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.. సముద్రజీవుల పరిరక్షణతో ఫ్యూచర్ ఆఫ్ నేచర్ అవార్డుకు ఎంపికైంది.భారతదేశం నుంచి ఈ అవార్డును అందుకోనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది.. ఆమె పేరు దివ్య కర్నాడ్... ఆమెదే ఈ పరిచయం..
Divya-karnad
దేవుడిచ్చిన గొప్ప వరం ప్రకృతి. ఆహ్లాదమైనా, ఆనందమైనా అన్నీ ప్రకృతితోనే.. మరి అన్నీ సమకూర్చిన ప్రకృతికి మనం ఏమైనా ఇచ్చామా? ఇస్తున్నామా? ప్రకృతిని రక్షించడం మాట పక్కన పెడితే ఈ మధ్య భక్షించడమే ఎక్కువైంది. దీంతో ఎన్నో జీవులు అంతరించిపోవడానికి దగ్గరయ్యాయి. అందులో సముద్ర జీవులు కూడా ఉన్నాయి. వాటిని పరిరక్షించాలంటే జాలరులకు సరైన అవగాహన ఉండాలి. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. వీటన్నిటినీ ఓ ఉద్యమంలా చేపట్టింది దివ్య కర్నాడ్. అందుకే అరుదైన గుర్తింపు పొందింది.

పరిరక్షణ ఉద్యమం

చేపల వృత్తి ఎక్కువ శాతం పురుషులు చేసే పని. తీర ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తాయి. సంప్రదాయ పద్ధతిలో చేపల వృత్తి మొదలై రోజులు మారే కొద్ది అది పారిశ్రామిక వ్యాపారంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ విజృభించింది. సముద్ర జీవులకు డిమాండ్ పెరుగడంతో కార్పొరేట్ శక్తులు సముద్రాలపై వేటను మొదలు పెట్టాయి. పర్యవసానంగా ఎన్నో సముద్ర జీవుల వినాశనం మొదలైంది. చేపల వృత్తిని నమ్ముకున్న వారికి సరైన అవగాహన లేకపోవడంతో తీర ప్రాంతంపై, జీవులపై ప్రభావం పడుతున్నది. వీటన్నిటిని చాలా దగ్గరగా చూసిన దీప వీటిపై అధ్యయనం చేయాలనుకుంది. ఇలాంటి పరిస్థితి పట్ల ప్రజలను అప్రమత్తం చేసి వాళ్లకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నప్పుడే సముద్రతీర, జలచరాల పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో 480 మంది విద్యార్థులను భాగస్వాములను చేసింది. జాతీయ వన్యప్రాణుల అధ్యయనం, సంరక్షణ కేంద్రంలో మాస్టర్ డిగ్రీ చేసింది. అమెరికాలోని రట్గెర్స్ యూనివర్సిటీలో జాగ్రఫీలో పీహెచ్‌డీ చేసింది.

చేసిందేంటి?

అమెరికాలో పీహెచ్‌డీ చేసిన దివ్య హర్యానాలోని అశోక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరింది. దేశంలోని కోరమండల్ తీరంలో తన పరిశోధన సాగించింది. తీరం వెంట మరణిస్తున్న ఆలివ్ రెడ్లీ తాబేళ్లను గుర్తించింది. విచక్షణా రహితంగా చేపలు పట్టడాన్ని తగ్గించాలనుకుంది. చేపల వేటలో స్థానికులకు మెళకువలు, కొత్త పద్ధతులు నేర్పి, వారికి అవగాహన కల్పించింది. సంప్రదాయ పద్ధతిలో చేపలు పట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేసి విజయం సాధించింది. ఓ వైపు పాఠాలు బోధిస్తూనే మరోవైపు తీరం వెంట వందల సంఖ్యలో సొరచేపలను, సముద్ర తాబేళ్లను రక్షించి, వాటి సంరక్షణకు విశేష కృషి చేసింది. కొన్నిసార్లు చేపలతో పాటు సముద్ర జీవులు వలల్లో చిక్కుకుంటాయి. అలాంటి సందర్భాల్లో సముద్ర జీవులను వదిలేసే కిటుకులు నేర్పింది. వారితో పాటే సముద్ర యానం చేసి సముద్ర జీవులకు ఆహారాన్ని అందించడం ప్రారంభించింది.
Divya-karnad1

ఊహించని పురస్కారం

మెరైన్ ఫిషరింగ్‌లో విశేష కృషి చేసిన దివ్యకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గ్లోబల్ ఫ్యూచర్ ఆఫ్ నేచర్ అవార్డుకు ఎంపికైంది. ఈ పురస్కారం పొందిన భారత తొలి మహిళ కావడం విశేషం. యేటా ఈ అవార్డును ముగ్గురికి ప్రదానం చేస్తారు. ఈ ఏడాది అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా 125 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలోంచి దివ్య కృషిని గుర్తించిన కమిటీ ఈ అవార్డును ప్రకటించారు. మే 3న నెదర్లాండ్‌లో జరిగే కార్యక్రమంలో దివ్య అవార్డును అందుకోబోతున్నారు. ఈ అవార్డు కింద ఆమెకు 40లక్షల రూపాయల నగదు బహుమతి అందుతుంది. అయితే ఇంతటి గొప్ప పురస్కారాన్ని నేను అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా అద్భుతం. సముద్ర జీవుల రక్షణ అనేది జాలర్లపై మాత్రమే ఆధారపడదు. వినియోగదారులు కూడా దీనికి బాధ్యత వహించాలి. స్థిరమైన చేపల పెంపకం, మెరుగ్గా చేపలు పట్టే విధానం కోసం అందరూ శ్రమించాలి అంటున్నారు దివ్య కర్నాడ్. గతంలో వన్యప్రాణుల, జలచరాల సంరక్షణ గురించి జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు వ్యాసాలు రాశారు. వేల సంఖ్యంలో పాఠకులకు ఆ వ్యాసాలు చేరువవడంతో 2013లో అమెరికాలోని ప్రఖ్యాత ముయిర్ కన్జర్వేషన్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ముయిర్ కన్జర్వేషన్ అవార్డు కూడా అందుక్నుది.

తీరం వెంట ప్రయాణం

ప్రపంచ వ్యాప్తంగా సముద్ర జీవులకు పెరుగుతున్న డిమాండ్, అంతరించిపోతున్న జాతులు తన అధ్యయనాన్ని మరింత లోతుకు తీసుకెళ్లాయని దివ్య అంటున్నది. న్యూజిలాండ్, అమెరికా, యూరప్ దేశాల్లో ఫిషింగ్ పద్ధతులు స్థిరంగా ఉంటాయనీ, ఇలా ఓ మోతాదులో చేపలను పట్టడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు. తను చూసిన ప్రాంతాల్లో విచక్షణా రహితంగా చేపలు పట్టడం వల్ల మరణిస్తున్న జీవులే తన పరిశోధనకు దారితీశాయంటున్నది. ఈ క్రమంలో అనేక ఫిషింగ్ కమ్యూనిటీలను ఏర్పాటు చేసి, జాలర్లకు అవగాహన కల్పించింది దివ్య. ఇన్ సీజన్ ఫిష్ కార్యక్రమం ద్వారా కోరమండల్ తీరం వెంట సొరచేపల అవాంఛనీయ మరణాలను తగ్గించడంలో మంచి పాత్ర పోషించారు. ఇప్పటి వరకూ ఈమె 2 లక్షలకు పైగా ఆలివ్ రెడ్లీ తాబేళ్లను రక్షించింది. వీటికి సమతుల్యమైన ఆహారం అందించింది.

అవకాశాలెన్నో...

Divya-karnad2
సముద్రతీర అధ్యయనానికి, జలచరాల సంరక్షణకు భారతదేశంలో ఎన్నో అవకాశాలున్నాయని దివ్య అంటున్నది. డిగ్రీ చదివిన వాళ్లకు సైన్స్ మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉంటాయనీ, క్షేత్ర స్థాయిలో అవకాశాలున్నాయని ఆమె అన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, తన పరిశోధనా కాలంలో ఈ రంగానికి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలను కలిశానని అన్నది. ఈ రంగంపై ఆసక్తి ఉంటే ప్రజల్లోకి వెళ్లడం, ఆనందమైన జీవితాన్ని పొందటం అలవాటవుతుందని తెలుపుతున్నది దివ్య.

- పడమటింటి రవికుమార్

716
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles