
జపాన్ దేశ ప్రజలను ఓ చేప భయపెడుతున్నది. ఎంతోమందిని కలవరపెడుతున్నది. చాలామందికి కంటిమీద నిద్ర కూడా పట్టనీయడం లేదు. ఎందుకో తెలుసా? ఈ చిత్రంలో కనిపిస్తున్న చేపకు పెద్ద కథే ఉంది. ఈ చేప పేరు ఓర్ఫిష్. సముద్ర పాము అని దీనికి మరో పేరు కూడా ఉంది. ఇప్పుడీ చేపలను చూసి జపాన్ వణికిపోతున్నది. ఎందుకంటే ఈ చేపలు సముద్రం నుంచి బయటకు వచ్చి.. ప్రజలకు కనిపిస్తే.. ఏదో అపాయం జరుగుతుందని వారి నమ్మకం. ఇవి తీరానికి కొట్టుకు వచ్చినా, మత్స్యకారుల వలలకు చిక్కినా సముద్ర గర్భంలో భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయని జపనీయులు అంటుంటారు. దీనిని సముద్ర దేవుడి నుంచి వచ్చిన దూతగా జపాన్ ప్రజలు భావిస్తారు. పాములాగా పదిన్నర అడుగుల కంటే ఎక్కువ పొడువుండే ఈ చేపలు సముద్ర గర్భంలో 200 మీటర్ల నుంచి కిలోమీటర్ లోతున ఉంటాయి. తాజాగా జపాన్లోని తొయామా తీరంలో మరో రెండు ఓర్ఫిష్లు కనిపించాయి.
దీంతో ఈ సీజన్లో కనిపించిన మొత్తం ఓర్ఫిష్ల సంఖ్య ఏడుకి చేరింది. వీటిని రైగు నో సుకాయ్ అని కూడా పిలుస్తారు. వెండి రంగులో మెరిసిపోయే చర్మం, ఎర్రటి మొప్పలు ఈ చేపలకు ఉంటాయి. ఇవి తీరానికి వచ్చాయంటే ఏ విపత్తు సంభవించబోతుందో అని అక్కడి ప్రజలు భయపడతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారం అయితే ఏదీ లేదు. కానీ వంద శాతం ప్రకృతి విపత్తు సంభవించదు అని కూడా చెప్పలేమని ఔజు ఆక్వేరియానికి చెందిన కజుసా సైబా అనే వ్యక్తి చెప్పడం విశేషం. 2011లో ఈ చేప కనిపించిన తర్వాతే ఫుకుషిమా భూకంపం, ఆ వెంటనే సునామీ వచ్చాయి. ఆ విపత్తులో మొత్తం 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాదికి ముందు కనీసం పది వరకు ఓర్ఫిష్లు తీరానికి కొట్టుకొచ్చాయి. మళ్లీ ఇప్పుడు అవి కనిపిస్తుండటంతో జపాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.