e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిందగీ జగమొండి..చాముండి!

జగమొండి..చాముండి!


నిన్నమొన్నటి వరకూ విమానమే ఎక్కలేదు. ఇక నుంచీ వాయుసేనలో ఉన్నతోద్యోగి! చిన్న ఖర్చులకూ తడబడాల్సిన పేదరికం. ఇప్పుడేమో, లక్షల్లో జీతం! కష్టాలతో పోరాడింది, వైఫల్యాల మీద తిరగబడింది, అవకాశాలను వెదుక్కుంది.. చివరికి విజేతగా నిలిచింది ‘ఫ్లయింగ్‌ ఆఫీసర్‌’ చాముండేశ్వరి.

జగమొండి..చాముండి!

చాముండేశ్వరిది సాధారణ కుటుంబం. మంచిర్యాల జిల్లా పెద్దపల్లి పరిధిలోని బాబు క్యాంప్‌ బస్తీలో నివాసం. తండ్రి గోపు విజయ్‌ కుమార్‌, తల్లి శారద. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు. అయితేనేం, కూతురు చాముండేశ్వరిని, కొడుకు కపిల్‌ కుమార్‌ను బాగా చదివించాలని సంకల్పించారు. చాముండేశ్వరికి బాల్యం నుంచీ జీవితం పట్ల స్పష్టత ఉంది. డాక్టరు కావాలన్నది తన లక్ష్యం. ఆ పట్టుదలకు ముచ్చటపడిన విజయ్‌ కుమార్‌ స్నేహితుడు నర్సయ్య సొంత ఖర్చుతో చాముండిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదివించాడు. కానీ, రెండు సార్లు నీట్‌ రాసినా మెడిసిన్‌లో సీటు రాలేదు. అయినా చాముండి కుంగిపోలేదు. ‘అవకాశాలు అపారంగా ఉంటాయి. వాటిని అందిపుచ్చుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు’ అన్న నర్సయ్య మాటలతో తన దృష్టిని మరో రంగంవైపు మరల్చింది.

కొత్త లక్ష్యం
బీబీనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సాయుధ దళాలకు సంబంధించి కూడా శిక్షణ ఇస్తున్నట్లు తనకు తెలిసింది. వెంటనే దరఖాస్తు చేసింది. స్క్రీనింగ్‌ టెస్టులో ఉత్తీర్ణత సాధించి బీఎస్సీలో చేరింది. అక్కడ ఉన్నప్పుడే, ఓసారి దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పరేడ్‌కు హాజరైంది.
ఆకాశంలోకి దూసుకుపోతున్న యుద్ధ విమానాల్ని చూడగానే ఒళ్లు గగుర్పొడిచింది. వాయుసేనలో చేరాలని సంకల్పించింది. అందులో ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకూ సిద్ధమైంది. గత ఏడాది జరిగిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుకు లక్ష మందికి పైగా హాజరయ్యారు. ఆ వడపోతలో నిలిచి, మైసూర్‌లో సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డు(ఎస్‌ఎస్‌బి) నిర్వహించిన 16 టెస్టులకు వెళ్లింది. ఆ దశలో, తనతో 220 మంది పోటీపడ్డారు. చివరికి, ఆరుగురు మాత్రమే ఎంపికయ్యారు. తెలంగాణ గడ్డ నుంచి చాముండేశ్వరి మాత్రమే విజయం సాధించింది.

ఇదో రికార్డు
బీబీనగర్‌లోని ‘సాంఘిక సంక్షేమ మహిళా సాయుధ దళాల శిక్షణా కళాశాల’ జాతీయ స్థాయిలో మహిళల కోసం ఏర్పాటైన తొలి గురుకుల కళాశాల. ఈ విద్యాసంస్థకు చెందిన చాముండేశ్వరి, వాయుసేన అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించి గురుకులాల నుంచి ఎంపికైన తొలి విద్యార్థినిగా రికార్డును నెలకొల్పింది. అదీ ఫస్ట్‌ బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని, తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం మరో ఘనత. ఏప్రిల్‌ 26 నుంచి బెంగళూరులో వారం రోజులపాటు నిర్వహించే మెడికల్‌ టెస్టులకు చాముండేశ్వరి హాజరు కానుంది. ఆ తర్వాత దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపడుతుంది. చిన్న వయసులోనే నెలకు లక్షకు పైగా వేతనాన్ని అందుకోనున్నది. ‘నిన్నమొన్నటి వరకూ ఎప్పుడూ విమానం ఎక్కని నేను, వాయుసేనలో దేశరక్షణ కోసం పనిచేయాల్సి రావడం సంతోషంగా ఉంది. ఈ విజయం అమ్మానాన్నలకు నా కానుక’ అంటున్నది చాముండేశ్వరి.

దేశానికే గర్వకారణం
సాంఘిక సంక్షేమ మహిళా సాయుధ దళాల శిక్షణ కళాశాల పేరిట, మహిళల కోసం డిఫెన్స్‌ కళాశాలను ఏర్పాటుచేసి సీఎం కేసీఆర్‌ పేద విద్యార్థులకు గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. చాముండేశ్వరి వాయుసేనలో ఉద్యోగం సాధించడం దేశానికే గర్వకారణం. ఇక్కడి కళాశాలలో మూడు బ్యాచ్‌లకుగాను 430 మంది ప్రవేశం పొందారు. కఠోర శిక్షణకు తట్టుకోలేక కొంతమంది వెళ్లిపోయారు. ప్రస్తుతం 376 మంది మిగిలారు. చాముండేశ్వరి అన్ని పరీక్షలనూ సమర్థంగా అధిగమించింది.
మేజర్‌ యుకె శర్మ, డైరెక్టర్‌

గంజి ప్రదీప్‌ కుమార్‌,యాదాద్రి భువనగిరి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జగమొండి..చాముండి!

ట్రెండింగ్‌

Advertisement