చేపలమ్మిన చోటే వైరల్


Wed,December 19, 2018 12:58 AM

చేపలు అమ్ముతూ వైరల్ అయిన కాలేజ్ స్టూడెంట్ హనన్ ఇప్పుడు కొత్త బిజినెస్ ప్రారంభించింది. మరోవైపు డాక్టర్ అవ్వాలన్న తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నది.
Hanan
కాలేజ్ యూనిఫారం ధరించి, చేపలు అమ్ముతూ వెలుగులోకి వచ్చిన కేరళ అమ్మాయి హనన్. తన చదువు కోసం చేపలు అమ్ముతున్న ఆ 21 ఏళ్ల యువతి ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. అయితే, ఆమె ప్రజల్ని మోసం చేస్తుందంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శించింది. అయినా అవేమీ పట్టించుకోలేదు హనన్. తనకు అందిన విరాళాల నుంచి కేరళ వరద బాధితులకు లక్షన్నర విరాళం ఇచ్చి.. తన సేవా గుణాన్ని చాటుకున్నది. ఆ తరవాత సెప్టెంబరులో ఆమె రోడ్డు ప్రమాదానికి గురవడంతో కొద్ది రోజులు ఆమె కనిపించలేదు. తాజాగా తనకు ప్రావీణ్యం ఉన్న చేపల వ్యాపారంలోకి అడుగుపెట్టింది హనన్. వైరల్ ఫిష్ పేరుతో తన బ్రాండ్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలన అత్యాశతో కాకుండా.. ఓ టాటా ఏస్ వాహనంలో తన వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తనకు పేరొచ్చిన తమ్మనమ్ చేపల మార్కెట్‌నే వేదికగా చేసుకున్నది. తన వైరల్ ఫిష్ బిజినెస్‌ను కేరళ సినీనటుడు సలీమ్ కుమార్‌తో ప్రారంభించింది. దీని ద్వారా తన వినియోగదారులకు నాణ్యమైన చేపలను అమ్ముతున్నది. ఆ వ్యాన్‌లో ఒకవైపు ఫ్రైడ్ ఫిష్, ఇంకోవైపు పచ్చి చేపలు విక్రయిస్తున్నది.

అయితే తమ్మనమ్‌కు దగ్గర్లోని మరో ఫేమస్ ప్రాంతమైన పుల్లెప్పడిలో కూడా చేపలు అమ్మేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే అతి తర్వలోనే హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నది హనన్. కొచ్చిలోని ఆస్టర్ కాలేజ్‌లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది హనన్. డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో నీట్ పరీక్షలకు సిద్ధపడుతున్నది. యావరేజ్ స్టూడెంట్ అయిన తను.. నీట్ కోసం కోచింగ్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటున్నది హనన్. తాను కచ్చితంగా డాక్టర్ అవుతానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నది. తండ్రి లేని తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించేందుకు చేపల వ్యాపారంలోకి దిగినట్లు చెబుతున్నది. తన ఎదుగుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నది. అయితే హనన్ కొత్తగా ప్రారంభించిన వ్యాపారం పట్ల నెటిజన్లు, కేరళీయులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. వైరల్ అనే పేరు చూసి ఆమెను ప్రశంసిస్తున్నారు.

452
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles