చెరగని కుసుమం!


Tue,February 12, 2019 01:55 AM

పచ్చబొట్టేసినా పిల్లగాడా నువ్వు.. అన్నారో సినీ కవి.. ఆ పాటలోలాగే ఈ రంగంలో ఆడపిల్లలు మనకు ఎక్కడా కనిపించడం లేదు.. ఇప్పుడా ఆ పాటను మార్చి పాడుకునే అవకాశం వచ్చేసిందండోయ్.. సిమ్మి అలియాస్ కుసుమ కుమారి అనే అమ్మాయి.. పచ్చబొట్టునే కాదు.. పియర్సింగ్ అనే కష్టతరమైన కళనూ.. చకచకా వేస్తూ అందరి మన్ననలనూ పొందుతున్నది.. హైదరాబాద్‌లోని మొదటి.. ఏకైక పియర్సింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నది.. మరి ఈ ఉమెన్ టాటూ ఆర్టిస్ట్ పరిచయం ఆమె మాటల్లోనే..
tattoos
టాటూ అంటే వ్యాపారం కాదు.. ఇదొక ఆర్ట్. మనస్సుల్లోని ప్రేమకు, భావాలకు కళాత్మక రూపాన్ని ఇవ్వడం టాటూ ఆర్టిస్టుల పని. ఈ టాటూలు భావోద్వేగాలను కలిగిస్తాయి. సందేశాలను మోసుకొస్తాయి. శరీరాన్నే కాన్వస్‌గా మలిచి ప్రేమాభిమానాలకు రూపమివ్వడమే టాటూ అంటాను. ఇలాంటి టాటూలు జీవితంపై చెరగని ముద్ర వేస్తాయి. అందుకే టాటూలు వేసుకోవడానికి ముందు ఆలోచించాలని చెబుతాను. నా దగ్గరకు వచ్చే వారికి నచ్చిన టాటూ వేయడం ఎంత ముఖ్యమో వాళ్లకు దాని గురించి వివరించి, అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తాను. చాలామంది తొందరపాటులో టాటూలు వేసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్లను చూస్తున్నాను. అలా జరగకుండా, ఇతరులకు నష్టం కలుగకుండా చూడాల్సిన అవసరం ఆర్టిస్టుగా ఉన్న ప్రతీ ఒక్కరిపైనా ఉంది.


tattoos2

కళాత్మక అభిరుచి

మా కుటుంబంలో అందరూ బాగా చదువుకున్న వాళ్లే. ఆయా రంగాల్లో వారు స్థిరపడ్డారు. కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి సృజనాత్మక పనులు అంటే ఇష్టం. ఎలా అయినా విభిన్న రంగంలో స్థిరపడాలని అనుకునేదాన్ని. దానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయేది. కచ్చితంగా నువ్వు ఫలానా ఉద్యోగంలోనే స్థిరపడాలని నాకు ఆప్షన్స్ ఇచ్చేవారు. ఆ మాటలను నేను పెద్దగా పట్టించుకోలేదు. నాకు నచ్చిన వాటిని చేసుకుంటూ వచ్చాను. మోడల్‌గా చేశాను. ఫిల్మ్ మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను. ఇలా ఉండగానే ఆర్ట్‌వైపు ఆసక్తి పెరిగింది. టాటూ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా. కానీ ఎక్కడా నేర్పించే వాళ్లు లేరు. డబ్బులు కట్టి నేర్చుకుందాం అనుకున్నా నేర్చుకోవడానికి ఎక్కడా ఆ అవకాశం లేదు. యూట్యూబ్ వీడియోలు చూసి వాటి మీద ఒక అవగాహనకు వచ్చాను. కానీ ప్రొఫెషనల్‌గా ఎదగాలంటే ట్రెయినింగ్ అవసరం కదా.. ఇలా వెతుకుతూ ఉన్నప్పుడే ముంబైకి చెందిన పింకూ బిజయ్ గోష్ అనే టాటూ ఆర్టిస్ట్‌తో మాట్లాడే అవకాశం వచ్చింది. అతను హైదరాబాద్‌లో ఇంక్‌క్రాఫ్ట్ టాటూ స్టూడియో నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దీంతో అక్కడ టాటూ ఆర్టిస్ట్‌గా శిక్షణ తీసుకున్నాను. కొద్ది రోజుల్లోనే దీనిమీద పట్టు రావడంతో ఆర్ట్‌క్రాఫ్ట్ స్టూడియోలో టాటూ ఆర్టిస్ట్‌గా చేరాను. ఇక్కడే పియర్సింగ్ కూడా చేస్తున్నాను.


tattoos3

ప్రొఫెషనల్‌గా...

యూత్‌లో టాటూలకి బాగా క్రేజ్ ఉంది. కానీ టాటూలు వేయించుకోవడంలోనే చాలా ఇబ్బంది పడతారు. నాణ్యత లేని టాటూలు వేసుకొని సమస్యలను తెచ్చుకుంటారు. బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ పేర్లను వేయించుకొని బ్రేకప్ తర్వాత వచ్చి తీసేయడానికి అవకాశం ఉందా? అని అడుగుతారు. నాకు విచిత్రంగా అనిపిస్తుంటుంది. టాటూలు వేయించుకునే ముందే ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించకుండా వేయించుకుంటున్నా వారికి టాటూ ఆర్టిస్టులు అవగాహన కల్పించాలి. నేను వాళ్లను ముందుగా వివరాలు అడిగి, తెలుసుకున్న తర్వాతనే టాటూలు వేస్తాను. దీంతోపాటు పియర్సింగ్‌లో కూడా నైపుణ్యం ఉంది. ఇది ఇంటర్నేషనల్ కల్చర్. శరీరంపై ఎక్కడైనా పియర్సింగ్ చేయవచ్చు. పియర్సింగ్ అంటే.. చెవులకు కమ్మలు కుట్టినట్టు.. శరీరంలో అక్కడక్కడ స్టోన్స్‌ని సర్జరీలు చేసి అతికిస్తాం. ఇది చాలా కష్టమైన పని. వీటిని వేయించుకోవడం, తీయడం కూడా కష్టమే. కాకపోతే ఇక్కడ పియర్సింగ్ అరుదుగా వేయించుకుంటారు.


tattoos4

ఆలోచన వాళ్లది.. ఆర్ట్ మాది...

టాటూలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కో టాటూను ఒకరికంటే ఎక్కువ మందికి వేయొచ్చు. ఇది జీవితాంతం చెరిగిపోకుండా అలాగే ఉండిపోతుంది. భావాలను, ప్రేమాభిమానాలను చూపించుకునేందుకే టాటూలు వేయించుకుంటారు. అలాంటప్పుడు వాళ్ల ఆలోచనలోంచే టాటూ డిజైనింగ్ చేయాలి. ఇంటర్నెట్ టెంప్లేట్స్‌తో టాటూస్ అసలే వేయను. వాళ్లతో మాట్లాడి, ఆ టాటూలో వాళ్ల సందేశం స్ఫురించేట్టు ఉండే కొత్త డిజైన్‌ను సొంతంగా సృష్టిస్తాను. ఒకసారి ఒకరికి వేసిన టాటూ మరోసారి వేరే వాళ్ల మీదకు వెళ్లదు. అలా వెళ్లితే అందులో ఉద్దేశం సన్నగిల్లుతుందని నా అభిప్రాయం. అమ్మాయిలు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ఎలాంటి టాటూస్ వేయించుకోవాలో సరిగా అవగాహన ఉండదు. అమ్మాయిలకు అయితే మినిమలిస్ట్ టాటూలూ అందంగా ఉంటాయి. అబ్బాయిలకు థిక్ అండ్ థిన్ టాటూలు బాగా కనిపిస్తాయి.


tattoos5

కళారంగాల్లో రాణించాలి...

పచ్చబొట్టు.. పాతదే అయినా యూత్‌లో దానిపై క్రేజ్ మాత్రం తగ్గలేదు. మనసులో నిక్షిప్తమైన భావాలను శరీరంపై టాటూలుగా ముద్రించుకోవడం యూత్‌కు ఒక స్టయిల్ స్టేటస్‌గా మారింది. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు ఆల్ట్రా మోడర్న్‌గా కనిపించడానికి టాటూలపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వాటిలో పియర్సింగ్ మరొకటి. ఈ తరహా వైవిధ్యమైన రంగాల్లో స్థిరపడడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరు. తెలంగాణ అంటేనే సంస్కృతి, కళలకు నెలవు. ఇప్పుడున్న అమ్మాయిలు ఇలాంటి కళారంగాలవైపు అభిరుచి పెంచుకోవాలి. కొత్త దారుల్లో నడువాలి. వైవిధ్యమైన ఆలోచనలతో ముందుకెళితే కచ్చితంగా విజయం సాధిస్తాం. ఇలాంటి రంగాలు సృజనాత్మకతను పెంచుకోవడానికి, ఇతరుల పట్ల బాధ్యతగా మెదలడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారికి తగిన ప్రోత్సాహం, సహకారం అందిస్తే ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది.


జాగ్రత్తలు అవసరం

స్టూడియోలో అన్నీ హైజెనిక్ పరికరాలే వాడుతున్నాం. ఒకసారి వాడిన నీడిల్‌ని, పిగ్మెంట్స్‌ని మళ్లీ ఉపయోగించం. నాణ్యతలేని పని చేయడం లాభాలు ఇస్తుందేమో కానీ ఎదుటివాళ్ల ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టాటూ వేయించుకున్న తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎక్కువ మంది వాటిని పట్టించుకోరు. టాటూ నయం అవడానికి వారం నుంచి పది రోజులు పడుతుంది. ఈ సమయంలో దానిపై ఎండ నేరుగా పడకుండా చూడాలి. చెమట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సబ్బు నేరుగా రుద్దకూడదు. బయట ఎక్కువ తిరుగకూడదు. దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. అంటే దీనికి కవరింగ్ అవసరం. ఆ కవరింగ్‌ను టాటూ ఆర్టిస్టులే వేయాలి. టాటూ వేయడంతో పాటు అది నయం అయ్యే వరకూ జాగ్రత్తలు తీసుకునేలా చేయడం మేం చేస్తున్న పనికి గుర్తింపునిస్తుంది. ఇంకా ఆ సమయంలో ఎలాంటి ఆహారం అయినా తీసుకోవచ్చు. ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియక అపోహలకు గురవుతారు.


- వినోద్ మామిడాల

1321
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles