చెట్టూ పుట్టను ఆస్వాదించాం


Thu,February 14, 2019 11:40 PM

జనవరి 31 నాడు అన్నా.. నాగోబా జాతర పోదామా? అని మొబైల్‌కి వాట్సాప్ మెసేజ్ వచ్చింది నవీన్ దగ్గర నుంచి. పోయినేడు పోదామని ఏదో పనివడుట్ల పోలే, ఈసారి ఎట్లనన్న పోవాలే అనుకున్న టైంల ఈ మెసేజ్ అచ్చింది. నేను రిప్లై ఇయ్యలే. పగటీలి నవీనే ఫోన్ చేసిండు అన్నా నేను కామారెడ్డి నుంచి, ధామన్న కరీంనగర్ నుంచి కార్ల జగిత్యాలకి వస్తాం. నిన్ను, విజయ్ అన్నను ఎక్కిచ్చికొని పోతాం, నాగోబా జాతర నాలుగో తారీఖు నుంచి చాల్ అయితది. ఆ రోజు పగటీలి జగిత్యాల నుంచి బయలెల్దాం అని ఫోన్ పెట్టేసాడు. నాలుగో తారీఖు రానే వచ్చింది, ఏదో పనివడి విజయ్ మంచిర్యాల్ పోయిండు, అచ్చుడు కాదె అని చెప్పిండు. పగటీలి రెండు ప్రాంతంలో నేను, నవీన్, ధామన్న కార్ల జగిత్యాల నుండి బయలెల్లినం. సారంగాపూర్, బీర్‌పూర్ గుట్టలమీదికెళ్లి కమ్మునూర్ బ్రిడ్జి కాడికి పోయినం. ఆడ జరంత సేపు ఆగినం. కింద గంగ (గోదావరి)సప్పుడు కాకుండా పారుతున్నది. నాగోబా దేవతను పూజించే మెస్రం వంశీయులు జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు ఈ బ్రిడ్జి అవతల ఉన్న కలమడుగు గ్రామానికి కేస్లాపూర్ నుండి దాదాపు 80 కి.మీ. కాలినడకన వచ్చి ఇచ్చోడ మండలం సిరికొండ గ్రామంలో తయారు చేయించిన కొత్త కుండల్లో పవిత్ర గంగాజలాన్ని తీసుకొని కేస్లాపూర్ తిరిగి వెళ్తారు. జోడేఘాట్ అనేది కుమ్రం భీం అమరుడైన స్థలం. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం. ఆదివాసీలపై నిజాం ప్రభువు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ఎదుర్కొని పోరాడి ప్రాణాలర్పించిన యోధుడు. జల్-జంగల్-జమీన్ అనే నినాదానికి ప్రతీక భీం.. ఆదివాసీల ఉద్యమ పతాక భీం.. ఆత్మ గౌరవ పోరాటాల దిక్సూచి భీం.. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొనే తెలంగాణ ఉద్యమం కొనసాగింది..
nagoba-jatara
అందరం కమ్మునూర్ బ్రిడ్జి, గోదారి అందాలు, కింద చేపలు పట్టెటోళ్ల ఫొటోలు తీసుకొని ఆడికెళ్ళి బయలెల్లినం. అక్కడి నుండి పదికిలోమీటర్లు వెళ్లగానే నిర్మల్-మంచిర్యాల హైవే ఎక్కాము. ఎడమవైపు నిర్మల్ రూట్లో కొద్దీ దూరం పోంగనే కుడివైపు ఆదిలాబాద్ వెళ్లే బోర్డు, చెట్లను నరకద్దనే అటవీశాఖ సిమెంటుతో చేయించిన బొమ్మలు కనిపించాయి. రోడ్డుకు ఇరువైపులా దట్టమైన అడవి ఉంది. అక్కడ గద్దెమీద అమాయకంగా కూర్చున్న గోండు బిడ్డ మీద నా దృష్టి పడింది. దగ్గరకి వెళ్ళగానే చిరునవ్వు నవ్వాడు.


ఏం పేరే నీది? అని అడిగా.
జంగు అని బదులిచ్చాడు
జంగ్ అంటే యుద్ధం ..అవును ఈ అడవిలో బతకాలంటే యుద్ధం చేయాల్సిందే కదా.. తన ఫొటోలు తీసుకొని బయలెల్లినం. దట్టమైన అరణ్యం మధ్యలో కారు నిశ్శబ్దంగా సాగుతున్నది.కొద్ది దూరం వెళ్ళగానే కుడివైపు చెట్ల మధ్యలో చిన్న కుంట కనిపించింది. కారు సైడ్‌కి ఆపి లోపలికి వెళ్ళగానే హ..అద్భుతం.. అని ముగ్గురి నోటివెంట ఒకేసారి వచ్చింది. అక్కడి నుండి సుమారు గంట ప్రయాణం తర్వాత ఉట్నూరు చేరుకున్నాం. దారి మధ్యలో నాగోబా జాత్రకు తరలుతున్న గోండు బిడ్డల కచ్చురం బండ్లు కనిపించాయి. ఉట్నూర్ చేరగానే టీ తాగి ఐ.టి.డి.ఏ ఆఫీసుకి వెళ్ళాం. రూముల గురించి అడిగితే జాతరకు వచ్చే అధికారులకోసం అన్నీ బుక్ చేసాం సర్ అని అక్కడి అధికారి చెప్పడంతో కేస్లాపూర్ తొవ్వ పట్టాం. ఉట్నూర్ దాటగానే కెరమెరి వెళ్లే దారి దగ్గర స్వాగత్ దాబా కనిపించింది. తినడానికి తందూరీ రొట్టెలు,దాల్ పార్శిల్ చేయించుకొని ఇంద్రవెల్లి దాటి మెయిన్ రోడ్ మీదున్న ముత్నూర్ నుండి లోపలికి 5 కిమీలు పోయి సాయంత్రం ఏడున్నర సమయంలో కేస్లాపూర్ గ్రామం చేరుకున్నాం.


nagoba-jatara2
సుమారు ఏడువందలు జనాభా ఉండే ఆ చిన్న ఊరు వేలాది మందితో, జాతర కోసం వెలసిన దుకాణాలతో ఒక పెద్ద పట్టణాన్ని తలపించింది. కారును సీదా గుడి పక్కన నిర్మించిన తాత్కాలిక హెలిపాడ్ దగ్గర తీసుకెళ్లి ఆపినం. బయట నల్ల దగ్గర కాళ్ళు కడుక్కుని గుడి ద్వారం దగ్గరికి వెళ్లేసరికి పరదాలతో మూసేసి ఉంది. బయట నిలబడి ఉన్న ఒక యువకుణ్ణి పరిచయం చేసుకున్నాం. అతను నాగోబా గుడి పూజారి మెస్రం ఆనంద రావు. చాల అప్యాయంగా మాట్లాడాడు. రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు కలమడుగు నుండి తెచ్చిన గోదావరి జలాలతో అభిషేకం ఉంటుందని, దానికి కేవలం మెస్రం వంశీయులకు మాత్రమే ప్రవేశమని చెప్పాడు. రేపు ఉదయం వస్తే దర్శనం మంచిగ చేపిస్తా అని మాటిచ్చాడు. పాత గుడిని తొలగించి పెద్దగా కడుతున్నట్టున్నారు,గర్భగుడి చుట్టూ పెద్ద పెద్ద పరదాలు కట్టారు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీడియోలు, ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు అక్కడక్కడ . రేపు కలుస్తామని చెప్పి ఆనందరావు వద్ద సెలవు తీసుకున్నాం.


జాతర ఒక రౌండ్ వేద్దామని ధామన్న అనడంతో దుకాణాల సముదాయంలోకి ఎంటర్ అయ్యాం. మునుపెన్నడూ చూడనంత పెద్ద పెద్ద బోలు పాలాల సంచులు, చిలుకలు, బత్తీసుల దుకాణాలు కనిపించాయి. రంగుల రాట్నాలు, పిల్లలు ఊగే ఉయ్యాలలు, ఎడ్ల మెడలో కట్టే దొత్తులు, పగ్గాలు అమ్మే షాపులు, హోటళ్లు అన్నీ తిరిగి కారు తీసుకొని ఊరి ఎంట్రెన్స్‌లో ఉన్న పార్కింగ్ ప్లేస్ కాడికి చేరుకున్నాం. వాహనాల వెనుక ఉన్న పెద్ద చింతచెట్టు కింద కార్ పార్క్ చేసుకొని చాప పరుసుకొని తినడానికి కూసున్నాం.


nagoba-jatara3
రేపు ఏం చేద్దామని మాట్లాడుకుంటూ ఉండగా ఓ వ్యక్తి మా వద్దకి వచ్చాడు. మాటల మధ్యలో మేము కూసున్న శేను తనదేనని తన పేరు గెడెం జనార్దన్ రావు అని పరిచయం చేసుకున్నాడు. రాత్రి పడుకోవడానికి ఇబ్బంది పడద్దని, కనిపించే మంచె మీద పడుకోవచ్చని, పొద్దున లేశినంక అక్కడే నీళ్లు కాగవెట్టుకొని స్నానం చేయచ్చని చెప్పి ఇంటికి వెళ్లి కప్పుకోడానికి బ్లాంకెట్లు తెచ్చాడు. పొద్దుగాల్ల ఇంటికాన్నే రొట్టెలు చేపిస్తానని, పాలు తాగి దర్శనానికి వెళ్లండని ఒక్కతీరుగా చెప్పాడు.మా కోసం నువ్వు ఇబ్బంది పడవద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నిజంగా అతని ఆప్యాయత చూస్తే ఆశ్చర్యం వేసింది. తనే కాదు గోండు సమాజం అంతా అలా ప్రేమగానే ఉంటారని తెల్లవారి జరిగిన సంఘటనలు మాకు తెలిసేలా చేసాయి . జనార్దన్ రావు మా వద్ద సెలవు తీసుకున్నాక తిని మంచె దగ్గరికి వెళ్లాం, అప్పటికే దానిమీద జనార్దన్ రావు బామ్మర్ది పడుకొని ఉన్నాడు, ఇంకో ఇద్దరికీ మాత్రమే స్థలం ఉండడంతో మేము వూరు చివర ఉన్న అంగన్వాడీ బడి హాల్లో పడుకున్నాం.


పొద్దున్న లేచి శేను దగ్గరికి వచ్చి స్నానం చేసి జనార్దన్ రావు మామ (తను మమ్మల్ని అలాగే సంబోధించాడు )ని కలిసి దర్శనానికి వెళ్ళాం. అప్పుడప్పుడే భక్తుల తాకిడి పెరిగింది. పోలీసుల హడావుడి కనిపించింది. మేం ఓ పది నిమిషాలు వేచి ఉన్నాక ఆ నాగోబా దర్శన భాగ్యం కలిగింది. పూజారి మెస్రం ఆనందరావు మాకోసం విగ్రహం వద్ద ఉన్న ప్రసాదాన్ని ఇచ్చాడు, కళ్ళకద్దుకొని గుడి ప్రాంగణం నుండి బయటకు రాగానే మెస్రం వంశీయుల కొత్త కోడళ్ళు, ఇంటి ఆడిబిడ్డలు ఎర్రమట్టితో చేసిన రెండు పుట్టలు ఉన్నాయి. పెద్ద పుట్ట ఆడిబిడ్డలు తయారు చేసింది, చిన్నది కొత్త కోడళ్ళు చేసింది . గుడి పక్కగా ఉన్న వలయాకారంలో ఉన్న ఓ నిర్మాణం లోపలికి వెళ్ళాం. లోపల 22 పొయ్యిలు ఉన్నాయి. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాదిమంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక గూళ్ళు (దిగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతులలో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు.


nagoba-jatara4
అక్కడ ఉన్న గోండు అవ్వలతో మాటాముచ్చట పెట్టి కొన్ని ఫొటోలు తీసుకొని జాతరలో కాసేపు తిరిగి కొన్ని కావాల్సిన వస్తువులు తీసుకున్నాం. జాతరలో వెలసిన హోటల్లో పూరీ తిని షాపులన్నీ తిరిగాం. జాతర నిండా పెద్ద పెద్ద ఇనుప సామానులు అమ్మేవాళ్ళు, వంట సామానులు, జింక్ ఇత్తడి మిశ్రమం తో చేసిన వస్తువులు అమ్మేవాళ్లు, పిల్లల ఆటవస్తువులు అమ్మేవాళ్ళు ఎకరాలకొద్దీ ఆ స్థలాన్ని ఆక్రమించారు. వేలాది మందితో సందడి సందడిగా ఉంది. జనార్దన్ రావు మామ వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. వెళ్ళేటప్పుడు ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం దగ్గర ఆగి ఆనాటి అమరులకు నివాళులు అర్పించాం. చరిత్ర పుటల్లో చేరిన మానని ఆదివాసుల గాయం ఇంద్రవెల్లి. ఈ దేశ మూలవాసులపై నాగరిక సమాజం అమలు చేస్తున్న వివక్షకు, అణచివేతకు అది పర్యాయపదం. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను తలపించిన ఊచకోత. తమ హక్కుల కోసం గిరిజన రైతుకూలి సంఘం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సభలో ఆనాటి ప్రభుత్వం పోలీసులతో అమానుషంగా కాల్పులు జరిపించగా అరవై మంది గిరిజనులు మరణించగా ఎనభై మంది వరకు గాయపడినట్టు నాటి పత్రికల్లో వచ్చింది.


అక్కడి నుండి కెరమెరి వైపు వెళ్లే తోవవరకు వచ్చినం . అక్కడ రాత్రి ఫుడ్ తీసుకున్న స్వాగత్ ధాబాలో తిని అక్కడికి నుంచి డ్బ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న జోడేఘాట్ వెళ్దామని నిశ్చయించుకున్నాం. అప్పటి వరకు చేసిన ప్రయాణం ఒక ఎత్తైతే భీకరమైన ఘాట్ రోడ్లలో ఎత్తైన కొండల మీద పాములా మెలికలు తిరుగుతూ చేసే ఈ ప్రయాణం ఒకెత్తు. అలా ఆ రోడ్డుపై ఓ గంట సేపు ప్రయాణించాం. కెరమెరి వద్ద ఆగి చాయ తాగి జోడేఘాట్ వైపు కారు తిప్పినం . ఇక్కడి నుండి మా ప్రయాణం పూర్తిగా ఆదివాసీ ప్రాంతాల గుండా సాగింది.


nagoba-jatara5
కుమ్రం భీం పన్నెండు గ్రామాలను ఏకం చేసి మావా నాటే ..మావా రాజ్ ( మా తండాల్లో మా రాజ్యం) అని ఆదివాసీలని ఏకం చేసి నిజాంపై యుద్ధం ప్రకటించాడు.. పోరు దాదాపు పన్నెండేళ్ళు కొనసాగింది. జోడేఘాట్ అడవుల్లో రహస్య స్థావరం గురించి నిజాం సైన్యానికి సమాచారం అందించి కుర్దు పటేల్ నమ్మక ద్రోహం చేసి భీం చావుకు కారణమయ్యాడు. ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కుమ్రం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కుమ్రం భీమ్ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ. ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ ఉండగానే జోడేఘాట్ చేరుకున్నాం. మేం వెళ్లిన రోడ్డు అక్కడికి వరకే ఉంది, అక్కడి నుండి తిరిగి వెళ్లడమే కానీ ముందుకు వెళ్ళడానికి లేదు.. అక్కడికి వెళ్ళగానే ఎడమ వైపుగా గిరిజన ఆశ్రమ పాఠశాల కనిపించింది ..పిల్లలంతా లైన్‌లో వెళ్తున్నారు సాయంత్రం స్నాక్స్ కోసం.. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కుమ్రంభీం స్మారక స్థూపం దగ్గరికి వెళ్ళడానికి మూడు తోరణాలు వరుసగా ఉన్నాయి.. భీం పోరాడిన జల్ జంగల్ జమీన్‌కి ప్రతీకగా ఆ మూడు తోరణాలు నిర్మించారు. మధ్యలో తుపాకీ ఎత్తి పట్టుకొని ఉన్న ఎత్తయిన భీం కాంస్య విగ్రహం ఉంది. విగ్రహం పక్కనే ఆయన సమాధి ఉంది. విగ్రహానికి జోహార్లు తెలిపి మ్యూజియంలోకి పోయినం..


లోపల కుమ్రం భీం,అతని అనుచరుల బొమ్మలు, భీం వాడిన వస్తువులు,ఆయుధాలు, ఆదివాసీల జీవన విధానానికి సంబంధించిన వస్తువులు, ఆయన భార్య సోంబాయి ఫోటో, ఆదివాసీలు మొక్కే దేవుళ్ల చిత్రాలు వరుసగా ఉన్నాయి.. నిజంగా ఈ ఆదివాసీలు స్వచ్ఛతకు మారుపేరు అనిపించింది. చుట్టూ లోయలు, దూరంగా ఎత్తైన కొండలు, దట్టమైన అడవి ఉన్న ఆ ప్రాంతాన్ని విడిచి రాబుద్ధి కాలేదు. ప్రభుత్వం కొంచెం శ్రద్ద చూపితే మంచి పర్యాటక స్థలంగా మారే అవకాశం ఉంది. మనం ఆదివాసీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మట్టిని ప్రేమించగలగాలి. అక్కడి చెట్టూ పుట్టను ఆస్వాదించాలి. అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకొని మసలాలి. ముఖ్యంగా వాళ్ళ అస్థిత్వాన్ని గౌరవించాలి. వాళ్ళలో ఉండే నిజాయితిని, ప్రేమను, స్వచ్ఛతను మనలో కొంచెమైనా నింపుకోవాలి. నా జీవితంలోఅత్యుత్తమంగా గడిపిన రోజుల్లో ఈ రెండు రోజులు తప్పక ముందు వరుసలో ఉంటాయి.


జాతర తొలిరోజు రాత్రి గంగాజలం అభిషేకం. తర్వాత రాత్రి ఒంటి గంట నుండి ఉదయం తొమ్మిది వరకు మెస్రం వంశస్థుల్లో కొత్త కోడళ్ళకు నాగోబా దేవున్ని పరిచయం చేయిస్తారు. ఆమెతో దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్ని భేటీ కొరియాడ్ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి దాకా వారు నాగోబా దేవుణ్ని చూడడం, పూజించడం నిషిద్ధం. చుట్టూ పచ్చని అడవి, రెండు క్రికెట్ స్టేడియాలంత పచ్చటి మైదానం, మధ్యలో చిన్న నీటి కుంట, ఆవుల మందలు, తీతువు పిట్టల అరుపులు, బరుకు బరుకు మని లాగె దూడ గడ్డిని కొరుకుతున్న శబ్దం.. పట్టణాల్లో ఏం కోల్పోయామో చెప్పింది మాకు.. ఆదిలాబాద్‌ని ఎందుకు దక్షిణ కాశ్మీర్ అంటారో అర్ధమయ్యింది.


-సుధీర్ కుమార్ తాండ్ర

1055
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles