చిన్ననాటి ఆటలు.. తీపి జ్ఞాపకాలు


Sat,April 13, 2019 01:41 AM

ఒక్కసారి బాల్యంలోకి వెళ్తే బాగు.. ఈ బాధలన్నీ మర్చిపోయి హాయిగా ఆడుకోవచ్చు. అలిసి, సొలిసి కంటినిండా నిద్రపోవచ్చు. అమ్మచేతి గోరుముద్దలు, నాన్న గారాబం.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆప్యాయత.. దోస్తుగాళ్లతో పొద్దస్తమానం ఆటలే ఆటలు.. బాల్యం ఎంత బాగుందో కదా..! గోలీలాట, కర్రా-బిళ్ల, టైరుబండి, బొంగరాలాట, దాగుడుమూతలు, అష్టాచెమ్మా, పచ్చీస్, వామనగుంటలు, తొక్కుడుబిల్ల, చింతపిక్కులాట.. ఇక చీకటిపడితే దొంగా-పోలీస్ ఆటలతో సమయమే తెలిసేదికాదు.
ఈ మధుర స్మృతులు తలచుకుంటే.. నిజంగానే బాల్యంలోకి వెళ్తేబాగు అనుకుంటారు చాలామంది. విసిగివేసారిన బిజీ లైఫ్ నుంచి బయటికి రావడానికి. ఇక ఈ కాలం పిల్లలకైతే ఆ ఆటలంటే ఏంటో కూడా తెలియదు. అందుకే.. పాతకాలపు ఆటలను ఈ తరానికి, భవిష్యత్ తరానికి పరిచయం చేస్తున్నారు సంగీత, అర్చన. ఆ మధుర జ్ఞాపకాల ఆటల వివరాలు జిందగీతో పంచుకున్నారు.

Pachisi
అరె సాగర్, సాల్మన్.. ఎప్పుడూ ఆ టీవీ దగ్గరే కూర్చుంటారేంట్రా. టీవీ ఆఫ్‌చేసి చదువుకోండి అంటూ విసుక్కుంది కృష్ణవేణి. ఆ మాటలు వినపడనంతగా చోటాభీమ్‌లో లీనమయ్యాడు సాగర్. ఇక సాల్మన్ తన తండ్రి స్మార్ట్‌ఫోన్‌లో చాలా సీరియస్‌గా.. కనురెప్పవేయకుండా టెంపుల్న్ ఆడుతున్నాడు. స్కూల్‌కు వెళ్లొచ్చాక వీరి దినచర్య ఇదే. టీవీ చూడడం, ఫోన్‌లో ఆటలు ఆడుకోవడం తప్పా.. బయటి పిల్లలతో ఆడుకోవడమే మర్చిపోయారు. సమయానికి అన్నం కూడా తినరు. పట్టిందే పట్టు. ఇప్పుడు కొత్తగా పబ్జీ గేమ్ ఇన్‌స్టాల్ చెయ్యమని ఇద్దరూ ఒకటే గోల. పిల్లల తీరుతో బెంగపెట్టుకున్నారు తల్లిదండ్రులు. చిన్నవయసులోనే కంటి సమస్యలు, మెడ నొప్పులు వచ్చాయి. ఊబకాయం పెరిగింది. మానసిక ఉల్లాసం లేదు. ఒత్తిడికి లోనై.. ఒంటరిగానే ఉంటున్నారు. వెరసి చిన్నవయసులోనే వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇది ఒక్క కృష్ణవేణి, లక్ష్మణ్ దంపతుల సమస్యే కాదు.. ప్రతి ఇంట్లోనూ ఉంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే పాతతరం ఆటలకు జీవం పోస్తున్నారు ఈ ద్వయం. నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్లు సంగీత, అర్చన దేశంలోని పలు రాష్ర్టాలకు వెళ్లి పాతతరం ఆటలన్నింటిని ఒకచోటికి చేర్చారు. వాటిని ఈతరానికి పరిచయం చెయ్యాలనే సదుద్దేశ్యంతో త్వరలోనే నగరంలో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఆలోచన ఎలా వచ్చిందంటే..?

సంగీత పుట్టి పెరిగింది చెన్నైలో.. భర్త హైదరాబాదీ. దీంతో ఇక్కడే సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన అర్చన పరిచయమైంది. ప్లేస్కూళ్లతో మొదలైన వీరి పరిచయం ఫ్యాషన్ డిజైనర్లుగా విజయవంతంగా కొనసాగుతున్నది. ఒకసారి అనారోగ్యంతో సంగీత ఆస్పత్రిలో జాయిన్ అవ్వడంతో.. తనకు తోడుగా వెళ్లింది అర్చన. ఇద్దరూ కాలక్షేపానికి వామనగుంటలు ఆడేవారు. చైల్డ్ కౌన్సెలర్‌గా ఎంతోమంది పిల్లలకు మానసిక ఉల్లాసంపై కౌన్సెలింగ్ ఇచ్చిన సంగీతకు.. పాతతరం ఆటలను ఈ తరం వారికి పరిచయం చెయ్యాలనే ఆలోచన వచ్చింది. వీరిద్దరూ పెద్దలతో మాట్లాడి ఎన్ని ఆటలున్నాయో తెలుసుకున్నారు. ఇక తెలియనివాటి గురించి వెతకడం మొదలుపెట్టారు.
Old-Games-Pachisi1

ఆటలపై అధ్యయనం..

ఓల్డ్ గేమ్స్ వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచనతో వీరిద్దరూ ఎన్నో ప్రదేశాలు తిరిగారు. చాలామందిని కలిశారు. బొమ్మలు తయారు చేసే చేతివృత్తుల వారిని కలిశారు. ఢిల్లీలోని డాల్ మ్యూజియంలో చాలావరకూ ఆటలను కనుగొన్నారు. చెన్నై, మధురై, చెన్నపట్నం, బెంగళూర్, ఢిల్లీ, వైజాగ్, మన తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పర్యటించి చాలా విషయాలు సేకరించారు. పాత, పాడుబడ్డ దేవాలయాల గోడలపై కొన్ని ఆటలను కనుగొన్నారు. ఇలా మొత్తంగా దాదాపు 101 ఆటలను నేర్చుకొని.. వాటికి కావాల్సిన వస్తువులు, బొమ్మలను ప్రత్యేకంగా చేతివృత్తుల్లో నిష్ణాతులైన కళాకారులతో తయారు చేయించారు. ఇందుకు చాలా ఖర్చు అవుతున్నా.. పాత ఆటలను భవిష్యత్ తరాలకు పరిచయం చేస్తున్నామన్న ఆత్మ సంతృప్తి చాలంటున్నారు.

101 ఆటలతో ఎగ్జిబిషన్..

పాత తరం ఆటల్లో మనకు తెలిసినవి పది నుంచి 20 వరకు ఉండొచ్చు. అయితే వీరిద్దరూ దాదాపు 101 ఆటలకు సంబంధించిన వివరాలు సేకరించారు. తర్వలోనే వీటిని మనకు పరిచయం చెయ్యబోతున్నారు కూడా. ఈనెల 19, 20 తేదీల్లో ఎగ్జిబిషన్ కం సేల్‌ను ఏర్పాటు చేస్తారు సంగీత, అర్చన. ఇది బంజారాహిల్స్‌లోని సప్తపర్ణిలో ప్రారంభమవుతుంది. ఇందులో ఆయా ఆటలకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చెయ్యవచ్చు. ఈ ఆటలు ఎలా ఆడాలో కూడా వీరు చెబుతారు. మీకు వాటిపై ఆసక్తి ఉంటే.. మీరూ ఆడాలని అనుకుంటే ఆటలకు సంబంధించిన వస్తు పరికరాలను కొనుగోలు చేయవచ్చు. ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన ఆటబొమ్మలు, వస్తువులు, పరికరాలు వంద రూపాయల నుంచి 50వేల వరకూ ఉన్నాయి. వస్తువు నాణ్యత, ఆట నేపథ్యాన్ని బట్టి ధరలు నిర్ణయించారు. ప్రస్తుతం ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా ఆట వస్తువులు అమ్ముతున్నారు. మరిన్ని వివరాలకు 8897571212 నంబర్‌ను సంప్రదించవచ్చు.
Old-Games-Pachisi

ఇవి డిజిటల్‌గా ఉండకూడదనే..

ఇవన్నీ డిజిటల్‌గా చేస్తామని చాలామంది మమ్మల్ని సంప్రదించారు. వాటి నమూనాలు ఇవ్వమని అడిగారు. అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తామన్నారు. కానీ మాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు కోసం ఆశపడి.. వారికి నమూనాలు ఇచ్చి.. ఆడడం చెబితే.. భవిష్యత్‌లో ఇవి కనుమరుగు అవడం ఖాయం. అందుకే మేము ఇవ్వదలుచుకోలేదు. ఈ బాల్యపు మధుర జ్ఞాపకాలన్నీ చిరకాలం గుర్తుండిపోవాలి. అదే మా ఆశయం. ఈ సంప్రదాయ ఆటలకూ సంబంధించి వర్క్‌షాపులు నిర్వహిస్తాం. పిల్లల్లో నైపుణ్యాన్ని, ఆలోచనా శక్తిని పెంచేందుకు టోర్నమెంట్లు నిర్వహించే ఆలోచనా ఉంది. ఈ క్రీడలను పాఠ్యాంశాల్లో చేరిస్తే.. పిల్లలకు చాలా మేలు జరుగుతుంది.
- సంగీత, అర్చన, ఫ్యాషన్ డిజైనర్లు

-డప్పు రవి
-గడసంతల శ్రీనివాస్

603
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles