చల్లచల్ల..చల్లగా


Thu,March 7, 2019 12:25 AM

Cool-juse
మండే ఎండలకు.. చక్కటి.. చిక్కటి పానీయాలే కరెక్ట్.. తియ్యని రసాలు.. కమ్మని లస్సీలు.. జుర్రుకునే జ్యూస్‌లు.. కరిగేపోయే సాఫ్టీలు.. ఇవే కాదండోయ్.. చల్లని లస్సీలు.. ఈ ఎండాకాలానికి ఎంతో ఉపశమనాన్నిస్తాయి.. అందుకే చల్లచల్ల.. చల్లగా ఈ పానీయాలను సేవించండి..

ఉసిరి పుదీనా జ్యూస్

pudina

కావాల్సినవి :


ఉసిరి ముక్కలు : ఒక కప్పు, పుదీనా : 2 రెమ్మలు, నల్ల ఉప్పు : పావు టీస్పూన్, తేనె : రుచికి సరిపడినంత.

తయారీ : ఉసిరి ముక్కలలో గింజలు లేకుండా చూసుకోవాలి. అందులో పుదీనా ఆకులను కడిగి వేయాలి. ఈ రెండింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీంట్లోనే తేనె, నల్ల ఉప్పు వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఇందులోనే సుమారు 250 మి.లీ. చల్లని నీళ్లు పోసి ఇంకోసారి గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ని గ్లాసులోకి వడకట్టాలి. పై నుంచి పుదీనా ఆకులతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేస్తే ఆహా ఏమి రుచి అనకమానరు.

చెరుకురసం సోడా

cherukurasam

కావాల్సినవి :


చెరుకురసం : 100 మి.లీ., సోడా : 100 మి.లీ.,
అల్లం : చిన్న ముక్క, తేనె : ఒక టేబుల్‌స్పూన్, నిమ్మరసం : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు : తగినంత.

తయారీ : అల్లం చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి జ్యూస్‌లా చేసుకోవాలి. ఇందులో చెరుకురసం, తేనె వేసి బాగా కలుపాలి. ఆ తర్వాత నిమ్మరసం, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత చల్లని సోడా పోసి ఒకసారి స్పూన్‌తో కలిపి వెంటనే సర్వ్ చేయాలి. టేస్టీ చెరుకురసం సోడా రెడీ!

అంజీర్ లస్సీ

anjeer

కావాల్సినవి :


డ్రై అంజీర్ : అర కప్పు
కమ్మటి పెరుగు : 200 మి.లీ.
కోవా : ఒక టేబుల్‌స్పూన్
చక్కెర : తగినంత.

తయారీ : డ్రై అంజీర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక బ్లెండర్‌లో సగానికి పైగా అంజీర్ ముక్కలు వేయాలి. ఇందులో పెరుగు, కోవా, చక్కెర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్లాసులో పోసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత తీసి మిగిలిన అంజీర్ ముక్కలతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ ఈ లస్సీ తాగేస్తారు.

మల్‌బెర్రీ ఐస్‌క్రీమ్ సాఫ్టీ

malbari

కావాల్సినవి :


మల్‌బెర్రీ : ఒక కప్పు
ఐస్‌క్రీమ్ : 2 స్పూప్స్ (మీకు నచ్చినది)
చిక్కటి పాలు : 100 మి.లీ.
చక్కెర : తగినంత
బాదం, పిస్తా : గార్నిష్ కొరకు.

తయారీ : చిక్కటి పాలు మరిగించాలి. కాసేపు చల్లారనిచ్చి గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత మీగడ లేకుండా వడకట్టాలి. మల్‌బెర్రీని బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అందులో సగానికి పైగా మిక్సీలో వేయాలి. ఇందులోనే ఐస్‌క్రీమ్, చిక్కటి పాలు, చక్కెర వేసి చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మట్టి పాత్రలో మల్‌బెర్రీ ముక్కలు వేసి ఈ మిశ్రమాన్ని పోయాలి. వీలైతే.. బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

జున్ను షేక్

jubnnu-shaik

కావాల్సినవి :


జున్ను : ఒక కప్పు , చిక్కటి పాలు : 200 మి.లీ.
మిరియాల పొడి : చిటికెడు, యాలకుల పొడి : చిటికెడు, బెల్లం : రుచికి సరిపడినంత.

తయారీ : పాలు బాగా వేడి చేయాలి. పైన మీగడ లేకుండా వడకట్టాలి. బ్లెండర్‌లో జున్ను, పాలు, మిరియాల పొడి, యాలకుల పొడి, బెల్లం వేసి బాగా మిక్సీ పట్టాలి. వీలైతే కొన్ని చల్లని నీళ్లు పోసి మళ్లీ మిక్సీ పట్టి గ్లాసులో పోసి సర్వ్ చేయాలి. ఈ టేస్టీ షేక్‌ని ఒక క్షణంలో గుటకాయస్వాహా చేసేస్తారు.

-జి.యాదగిరి కార్పొరేట్ చెఫ్ వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్ పార్క్‌లైన్, సికింద్రాబాద్

578
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles