గోమయ గణేశ్‌కి జై!


Wed,September 12, 2018 11:35 PM

అందరి కంటే ముందు పూజలందుకునే గణనాధుడిని వేడుకున్న తర్వాతనే మిగతా దేవతామూర్తులను పూజిస్తాం. దేవుడంటే పవిత్రాల్లోకెళ్లా పవిత్రమైనదిగా భావిస్తాం మనం. ఇయ్యాల వినాయక చవితి. గల్లీగల్లీల్లో విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం పరిపాటి. మరి మీరు నిలబెట్టే గణేశుడు పవిత్రమేనా?
ganesha
ప్రకృతి అంటే పంచభూతాలు. భగవంతుణ్ణి నమ్మే ప్రతీ ఒక్కరూ పంచభూతాల్లోనే ఆ దేవుడు మిళితమై ఉంటాడని నమ్ముతారు. భూమిని పూజిస్తే దేవుడిని పూజించినట్టే. అలాంటిది ఆ దేవుడికే రసాయనాలు పూసి పూజించడం వల్ల వచ్చేది పుణ్యమేనా? అందుకే దైవంతో సమానమైన మట్టిని, మట్టితో చేసిన వినాయకుడిని పూజిద్దాం అంటోంది దివ్యారెడ్డి అల్లోల. మనదేశంలో అవును పవిత్రంగా భావిస్తారు. ఆవు నుంచి వచ్చే పాల నుంచి గోమూత్రం, ఆవుపేడ వరకు అన్నీ పవిత్రంగా భావించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. అలాంటి పవిత్రమైన ఆవుపేడతో వినాయకుడి విగ్రహాలు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నది దివ్యారెడ్డి అల్లోల. ఆవుపేడతో చేసిన ఈ గోమయ గణనాథుడిని పూజించండి అంటూ.. ప్రచారం చేసి గోమయ గణనాథులను ఉచితంగా పంచుతున్నది దివ్యారెడ్డి. గోమయ గణనాథుడిని ఎలా తయారుచేస్తారంటే..


మౌల్డ్‌లో ఉంచి అచ్చు పడగానే మెల్లగా బయటకు తీయాలి. పచ్చిగా ఈ విగ్రహాలను బయటకు తీయగానే నిలబెట్టకుండా పడుకోబెట్టాలి. మిగతా విగ్రహాల్లా గోమయ గణనాథుని విగ్రహాలను నిలబెడితే కూలిపోతాయి. ఇలా చేసిన విగ్రహాలు ఆరడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది. విగ్రహాలు పూర్తిగా ఆరిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించడానికి సహజ రంగులను వాడి అలంకరించవచ్చు. ఇక నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇంట్లో ఒక బకెట్‌లో నిమజ్జనం చేసి ఆ నీటిని చెట్లకు పోయవచ్చు. ఆవుపేడ, పసుపు, వేపాకు, చింతగింజల పొడిలో ఉండే ఔషధ గుణాలు చెట్లకు, మొక్కలకు క్రిమిసంహారకంలా పనిచేస్తాయి. వేర్లకు అదనపు బలం ఇస్తాయి. చెరువులో అయితే అందులోని చేపలకు ఆహారమవుతుంది. నీటిని శుద్ధి పరుస్తాయి. అందుకే అందరూ ప్రకృతి గణనాథుడికే జై కొట్టండి.


ఆలోచనకు రూపం..

divya-Reddy
ఆవుపేడతో ఎకో గణనాథులను తయారు చేయాలన్న ఐడియా దివ్యారెడ్డికి ఆమె భర్త ఇచ్చాడు. దీంతో కోల్‌కతా నుంచి కళాకారులను పిలిపించి ఆవుపేడతో ప్రత్యేకంగా ఈ విగ్రహాలను తయారు చేయించింది దివ్యారెడ్డి. మేం క్లిమ్‌ఓమ్ పేరుతో ఆవుపాలు, ఆవుపాల ఉత్పత్తులు, గోమయ గణనాథులను అందిస్తున్నాం. మనకు తెలియని మన సంప్రదాయాలను, మన జీవన విధానాలను, ఒకప్పుడు మనం ఆవు నుంచి పొందిన ప్రయోజనాలను అందరికీ తెలియజేసేందుకు క్లిమ్‌ఓమ్ ద్వారా ప్రయత్నిస్తున్నాం. అందులో భాగమే ఈ గోమయ గణనాథుడు అంటున్నారు దివ్యారెడ్డి. గత జూన్‌లో కేంద్రప్రభుత్వం గోకుల్ మిషన్ పథకం అందించే గోపాలరత్న అవార్డు కూడా ఆమె అందుకున్నారు.


ఎలా చేస్తారంటే...
గోమయ గణనాధుడిని ఆవుపేడ, చింతగింజల పొడితో తయారుచేస్తారు. ఆవుపేడతో దేవుడి విగ్రహాలు తయారుచేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గత నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. మహారాష్ట్రలో నాలుగు వందల ఏళ్ల క్రితం ఆవుపేడతో చేసి ప్రతిష్టించిన ఆంజనేయస్వామి విగ్రహం ఇప్పటికీ పూజలందుకుంటున్నది. ఆవుపేడ, పసుపు, తక్కువ మోతాదులో బంకమట్టి, చింతగింజల పొడి కలిపి ఈ మిశ్రమంతో విగ్రహాలు తయారు చేస్తున్నారు దివ్యారెడ్డి. ముందుగా చింతగింజలను పిండిలా పట్టించాలి. ఈ పిండిని బాగా ఉడకబెడితే గమ్‌లా తయారవుతుంది. ఈ జిగురు అన్ని మిశ్రమాలను పట్టి ఉంచేలా చేస్తుంది. ఆవుపేడలో కొద్దిమోతాదులో బంకమట్టి కలపాలి. దీనివల్ల విగ్రహం కూలిపోకుండా నిలబడుతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపాక అందులో పసుపు, వేపాకు పేస్ట్, గోమూత్రం కలుపాలి. ఈ మిశ్రమంలో పసుపు, వేపాకు పేస్ట్ కలపడం వల్ల పేడ పురుగు విగ్రహాన్ని తొలచకుండా కాపాడుతాయి. ఇప్పుడు మనకు కావల్సిన డిజైన్ అచ్చులో, కావాల్సిన సైజులో ఈ మిశ్రమాన్ని నింపాలి.

681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles