గృహ రుణాలిక చవక


Sat,February 9, 2019 01:52 AM

రిజర్వ్‌బ్యాంక్ రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 6.25 శాతానికి తీసుకువచ్చింది. 18 నెలల తర్వాత ఇదే తొలి తగ్గింపు. ఆహార వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు స్థిరంగా ట్రేడ్ అవుతుండడం, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండడం వంటి కారణాలతో రిజర్వ్‌బ్యాంక్ కీలక పాలసీ రేటు తగ్గించింది. ఆదాయం పన్ను రిబేట్ వంటి బడ్జెట్ ప్రతిపాదనలతో ప్రజల వద్ద వ్యయం చేయతగిన ఆదాయాలు పెరగనున్నాయి. దీంతో ప్రైవేట్ వ్యయాలు పెరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ రేట్ తగ్గించాలన్న నిర్ణయాన్ని తీసుకుంది.
homelone

పరపతి విధానంలో జరిగిందేమిటి?

రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశమై రేట్ తగ్గింపుపై 4-2 ఓటింగ్ మెజారిటీతో కొత్త పరపతి విధానానికి ఆమోదం తెలిపింది. ఈ తగ్గింపుతో ఆర్బీఐ తన విధానాన్ని తటస్థతకు మార్చుకుంది. జనవరి - మార్చి మధ్యకాలంలో ద్రవ్యోల్బణం 2.8 శాతంగానూ, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలానికి 3.2 నుంచి 3.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీంతో ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగువనే కట్టడి చేసినట్టు అయింది.

ప్రభావం

విధానపర రేట్ల తగ్గింపుతో సామాన్యుడికి ఊరట లభించినైట్లెంది. ముఖ్యంగా కొత్తగా రుణాలు తీసుకునే వారు, రియల్ ఎస్టేట్ మదుపు చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లకు ఈ నిర్ణయం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఇటీవలి మధ్యంతర బడ్జెట్‌లో నివాసం ఉంటున్న రెండో ఇంటిపై నోషనల్ అద్దెపై పన్నును మినహాయించింది. అలాగే స్థిరాస్తి అమ్మగా వచ్చే ఆదాయంతో రెండు ఇండ్లను కొనుగోలు చేస్తే క్యాపిటల్ గెయిన్స్ పన్ను నుంచి కూడా మినహాయింపును ఇచ్చింది. గతంలో ఒకే ఇంటి కొనుగోలుకు అనుమతి ఉండేది. దీంతో రియల్ ఎస్టేట్‌కు మంచి రోజులు రానున్నాయి. దానికి అదనంగా ప్రస్తుతం ఆర్బీఐ రేట్ల తగ్గింపు మరింత జోష్‌ను కలిగించనుంది.

రుణగ్రహీతలకు ప్రయోజనం

రిజర్వ్‌బ్యాంక్ తగ్గించిన వడ్డీ రేట్లను వాణిజ్య బ్యాంకులు వినియోగదారులకు అందిస్తే మీరు తీసుకునే రుణాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. ఒకవేళ ఇప్పటికే హోమ్‌లోన్‌ను తీసుకుని ఉంటే బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్ రేటును తగ్గిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకున్న రుణాలు ఎంసీఎల్‌ఆర్‌తో ముడిపడి ఉంటే మీ ఈఎంఐలు ప్రస్తుత వడ్డీ రేట్ల ఆధారంగా గణిస్తారు. అంటే, మీ బ్యాంకు వడ్డీ రేటును తగ్గిస్తే, తగ్గించిన వడ్డీ రేట్ల ఆధారంగా ఈఎంఐని గణిస్తారు. దానివల్ల మీ ఈఎంఐ తగ్గి ఆ మేరకు ప్రయోజనం పొందుతారు.

కొత్తగా హోమ్‌లోన్ తీసుకుంటే..

కొత్తగా హోమ్‌లోన్‌ను తీసుకుంటే మీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మీరే ఇప్పుడే హోమ్‌లోన్‌ను తీసుకోవచ్చు. అది ఎంసీఎల్‌ఆర్‌తో లింక్ అయి ఉంటుంది. లేదా మీరు ఏప్రిల్ వరకు ఆగాలి. ఏప్రిల్ నుంచి బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్ మాదిరి వడ్డీ రేట్ల బెంచ్ మార్క్‌ను నిర్ణయించలేవు. బ్యాంకులు తప్పని సరిగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లను పాటించాల్సి ఉంటుంది. అలాంటి బెంచ్‌మార్క్ రేట్లలో మొదటిది రిజర్వ్‌బ్యాంక్ నిర్ణయించే రెపోరేటు. రెండోది ఫెనాన్షియల్ బెంచ్‌మార్క్స్ ఇండియా (ఎఫ్‌బీఐఎల్) నిర్ణయించే భారత ప్రభుత్వ 91 రోజుల ట్రెజరీ బిల్ రాబడి. మూడోది 182 రోజుల ట్రెజరీ బిల్ రాబడి. నాలుగోది ఎఫ్‌బీఐఎల్ నిర్ణయించే ఇతర బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లు.

బడ్జెట్ బోనాంజా

ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ రియల్‌ఎస్టేట్ రంగానికి మేలు చేసే ప్రతిపాదనలను చేసిం ది. తాను నివాసం ఉంటున్న రెండో ఇంటిపై నోషనల్ అద్దెపై పన్ను రద్దు చేసింది. అలాగే స్థిరాస్తి అమ్మగా వచ్చిన సొమ్ముతో రెండు ఇండ్లను కొనుగోలు చేసినా క్యాపిట ల్ గెయిన్స్ పన్ను నుంచి మినహాయింపును ప్రతిపాదించింది. ఈ చర్యలు రియల్ ఎ స్టేట్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ఇండ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా కమిటీని నియమించింది. అలాగే స్టాక్ ఎక్సేంజీల మాదిరిగా ఒకేచోటనే స్టాంప్ డ్యూటీని వసూలు చేయడానికి ఇంటి యజమాని శాశ్వత నివాసం పరిధి ఆధారంగా చెల్లించే ప్రతిపాదనను చేసింది. అందరికీ అందుబాటులో ఇల్లు లక్ష్యాన్ని చేరడానికి సెక్షన్ 80(ఐ) బీఏ కింద మార్చి 31, 2020 వరకూ ఆమోదం పొందిన అన్ని హౌజింగ్ ప్రాజెక్టులకు ప్రయోజనాలను పెంచింది. దీని ప్రకారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వడ్డీ రేటు సబ్సీడీలను మరింత మంది పొందేందుకు వీలు అవుతుంది.

డెట్ ఫండ్ల విషయంలో..

వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో డెట్ ఫండ్లలో మదుపు చేయడానికి ఇన్వెస్టర్లకు మంచి అవకాశం లభించినట్టు అయింది. సాధారణ బ్యాంకు వడ్డీ రేట్లకు వ్యతిరేకంగా డెట్ ఫండ్లలో రాబడులు ఉంటాయి. వడ్డీ రేట్లు పతనం అయినప్పుడు డెట్ ఫండ్ల ఎన్‌ఏవీలు పెరుగుతుంటాయి. ఎందుకంటే డెట్ ఫండ్లు బాండ్లు తదితర సాధనాల్లో మదుపు చేస్తాయి. వడ్డీ రేట్లకు భిన్నంగా బాండ్ల రాబడి ఉంటుంది. వడ్డీ రేట్లు పతనం అవుతూ ఉంటే బాండ్ ధరలు పెరుగుతుంటాయి. అందువల్ల డెట్ ఫండ్ల ఎన్‌ఏవీలు పెరుగుతుంటాయి. అయితే దీర్ఘకాల డెట్ ఫండ్లలో మదుపు చేసే ముందు అంతర్లీనంగా ఉన్న వడ్డీ రేట్ల రిస్క్‌ను అధ్యయనం చేసి మదుపు చేయాలి. వడ్డీ రేట్లు మారిన ప్రతీ సారి దీర్ఘకాల డెట్ ఫండ్లలో ఒడిదుడుకులు పెరుగుతాయి. అలాంటి ఫండ్లు కేవలం దీర్ఘకాల మదుపు లక్ష్యానికే పనిచేస్తాయి. రిస్క్‌లను తగ్గించుకోవాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉండే లిక్విడ్ ఫండ్లు, స్పల్ప కాల డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు.
homelone1

-నవీన్ చందానీ
-ఛీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బ్యాంక్‌బజార్.కామ్

304
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles