గుహలాంటి ఐస్ హోటల్!


Sun,January 13, 2019 12:22 AM

గడ్డ కట్టే చలిలో.. మరింత చలి పుట్టించే గదిలో ఉంటే ఎలా ఉంటుంది? ఒళ్లు జివ్వుమంటుంది కదా! స్వీడన్‌లో ఉన్న ఐస్ హోటల్ ప్రత్యేకత అదే. మంచుతో నిర్మితమైన ఈ హోటల్ ప్రతీ సీజన్‌లో మరింత కొత్తగా మారుతుంటుంది. డిసెంబర్ 14తో 29వ సీజన్ పూర్తి చేసుకున్నది. అచ్చం గుహలా ఉండే ఐస్‌హోటల్ ఎలా ఉంటుందో? ఎక్కడుంటుందో? దాని విశేషాంలేంటో తెలుసుకుందాం..
allri
హోటల్ అంటే వచ్చామా.. తిన్నామా.. రెండు రోజులు ఉన్నామా అన్నట్లు ఉంటాయి. మరికొన్ని హోటల్స్ మాత్రం ప్రత్యేకంగా నిర్మితమై ఉంటాయి. వాటిలో మాత్రం రోజుల తరబడి ఉండాల్సినిపిస్తుంది. అలాంటిదే ఈ హోటల్ కూడా. పర్యాటక స్థలంలా మారిన.. దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ హోటల్ ఇటుకలు, రాళ్లతో కట్టలేదు. అద్దాలతో అంతకన్నా కాదు. పెద్దపెద్ద కొండలను పగులకొట్టి గుహలు, శిల్పాలుగా చేయడం చూశాం. ఈ హోటల్‌ని ఎలా కట్టారో తెలిస్తే నోరెళ్లబెడుతారు. మంచుగడ్డలతో ఈ హోటల్‌ని తయారు చేశారు. ఈ ఐస్‌హోటల్ జుక్కాస్‌జర్వీలోని స్వీడిష్ గ్రామానికి చెందిన ఆర్కిటిక్ సర్కిల్‌కి ఉత్తరంగా 200 కి.మీ ల దూరంలో ఉన్నది. 2018 డిసెంబర్ 14న సందర్శకుల కోసం హోటల్ తలుపులు తెరుచుకున్నాయి. చలికాలంలో మాత్రమే ఈ హోటల్‌ని తెరుస్తారు. దీనిని 1989లో స్థాపించారు. 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29లోకి అడుగుపెడుతూ డిసెంబర్ 14న సెలబ్రేషన్స్‌లు కూడా జరిగాయి. 60 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్‌కి ఎంతమంది టూరిస్టులు వచ్చినా ఉండడానికి అన్ని వసతులు కల్పిస్తున్నది. హోటల్ లోపల గుడిసెల్లాంటి ఇగ్లూని ఏర్పాటుచేశారు. ఐస్‌హోటల్‌ని చూడ్డానికి వచ్చిన వారెవ్వరూ వెంటనే తిరిగి వెళ్లరు. రెండు మూడు రోజులుండి అక్కడ జరిగే వినోదాలనూ చూసి ఆనందంగా గడుపుతారు.

ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత..

ఒక్కొక్క గదికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక గదిలోని మంచం మంచుగడ్డతోనే చేశారు. అది బాగా చల్లగా ఉంటుంది. చలిని తట్టుకోవడానికి దాని మీద జింక చర్మంతో చేసిన వస్త్రాన్ని పరిచారు. చలికి తట్టుకునేలానే తగు ఏర్పాటు చేశారు. దీన్ని కెనడాకి చెందిన క్రిస్టోఫర్ పాస్కో, జెన్నీ ఓకిఫ్చే రూపొందించారు. పక్కనే మరొక గదిలో లివింగ్ ఓషియన్‌ని ఏర్పాటు చేశారు. మహాసముద్రాలను కాపాడాలి, దాని ప్రాముఖ్యతను సందర్శకులకు గుర్తుచేసేలా ఉండాలని కళాత్మకంగా చెక్కాడు. మరొక గదిలో సొరచేప ఈత కొడుతున్నట్లుంటుంది. జంతు హక్కులని నాశనం చేయవద్దని తెలియజేస్తుంది. ఇంకొక గదేమో హవెన్ సూట్ గదిలో రెండు జంతువులు ఎదురెదురుగా ఉంటాయి. దీనికి అర్థం కాంతి, ప్రకాశించడం, ప్రతిబింబం మన ఆలోచన నుంచి సృష్టికి విముక్తి కలిగించడానికి ఇది ఒక కలలా అనిపిస్తుంది. ఐస్ ఉమెన్ గది దీనిని స్వీడన్స్ లిండ రూపొందించాడు. ఈతకొట్టడానికి సిద్ధమయిన మహిళగా దీన్ని చెక్కాడు.

లోపల ఇలా ఉంది..

cars
ఈ హోటల్‌ని నిర్మించిన అతనికి మామూలు హోటల్ ఉండేది. దాంట్లో ప్రత్యేకత ఏముందనిపించింది. అందుకే.. మంచుతో ఇలా నిర్మాణం చేపట్టాడు. హోటల్ లోపల విగ్రహాలు, కార్లు, బొమ్మలను చాలా అందంగా చెక్కారు. డిసెంబర్ నాటికి మంచు బాగా ఉంటుంది. ఆ సమయంలో టూరిస్టులను ఆకటుకునేలా మంచుగడ్డలతో గది నిర్మాణాలు, లోపల ఉండాల్సిన అందమైన శిల్పాలను చేయాలన్న ఆలోచన మార్చిలో మొదలైనది. అయితే అప్పుడు మంచు ఉండదు కదా నవంబర్ వరకు ఆగాడు. నవంబర్ మొదలవ్వగానే అక్కడ దొరికే 5,500 టన్నుల మంచుని తీసుకొచ్చి ఒకచోట చేర్చి పెద్ద మంచుగడ్డలా చేశాడు. వాటిని శిల్పాలుగా చెక్కడానికి వందమంది పనివాళ్లని పెట్టాడు. అందులో సగం మంది కళాకారులే.

తట్టుకుంటేనే..

టోపీ ధరించి, పళ్లకి క్యాండీ అనే తీపి పదార్థాన్ని పెట్టారు. దీన్ని చూడ్డానికి వచ్చిన సందర్శకులు క్యాండీ రుచి చూసి మంచి అనుభూతిని పొందుతున్నారు. హోటల్ లోపల -5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. చలికి తట్టుకునేలా చేతికి గ్లౌసులు, వస్త్రదారణ ఉంటుంది. ఈ గదులతోపాటు ఆడుకోవడానికి ఒక గదిని ఏర్పాటు చేశారు. స్నోషూయింగ్, స్నోమొబైల్ సఫారీలు, డాగ్ స్లీడింగ్, రుచిగల ఆహారం, పానీయాలు అమర్చారు. మార్చి వరకు ఈ హోటల్ ఉంటుంది. తరువాత ఎండకి అంతా కరిగిపోతుంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చలికాలంలోనే స్వీడన్ వెళ్లి ఐస్‌హోటల్‌ని సందర్శించి ఆ మధురానుభూతులను ఆస్వాదించండి.
-వనజ వనిపెంట

413
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles