గుండె వైఫల్యాన్ని ఎలా నియంత్రించాలి?


Sun,April 7, 2019 10:16 PM

నా వయసు 64 సంవత్సరాలు. కొద్దిరోజులుగా నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నది. నడుస్తుంటే ఆయాసం ఎక్కువగా వస్తున్నది. దగ్గు విపరీతంగా వస్తున్నది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటున్నది. పాదాల దగ్గర వాపు కనిపిస్తున్నది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు జరిపి.. గుండె వైఫల్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సమస్యను తగ్గించుకోవచ్చన్నారు. ఎలాంటి మార్పులు తీసుకోవాలి? గుండె వైఫల్యాన్ని ఎలా నియంత్రించాలి? దయచేసి తెలుపగలరు.
- ఆర్. విశ్వనాథం, హిమాయత్‌సాగర్

Councelling
మీరు తెలిపిన వివరాల ప్రకారం ఆహార నియమాల్లో మార్పులు తీసుకోవడం అవసరం అనిపిస్తున్నది. శరీరంలో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే ఉప్పు వాడకాన్ని చాలావరకు తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాముల (అరచెంచా) కన్నా తక్కువే తీసుకోవాలి. పచ్చళ్లు.. బయట దొరికే చిరుతిళ్లను మానేయాలి. ఉప్పు ఉండని బాదం.. జీడిపప్పు.. పాలు.. పండ్లు ఎక్కువగా తినాలి. రుచికోసం ఉప్పుకు బదులు వెనిగర్ వేసుకోవడం మంచిది. ఇక మీరు కాళ్ల వాపు అంటున్నారు కాబట్టి.. నీరు, మజ్జిగలాంటి ద్రవాలను మితంగా తీసుకోవాలి. రోజు మొత్తమ్మీద లీటర్ కంటే తక్కువ తీసుకోవాలి. విశ్రాంతి కూడా చాలా అవసరం. అలా అని వ్యాయామం చేయొద్దని కాదు. మెట్లు ఎక్కడం, ట్రెడ్‌మిల్ ఇంకా తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మానసిక సాంత్వన ఇంకొక ఎత్తు. గుండె వైఫల్యం అనగానే ఎవరికైనా ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు పెరుగుతుంటాయి. వీటికి యోగా.. ధ్యానం వంటివి చేస్తే మంచిది. ఇక మందులతో కూడా కొన్ని రకాల ఇబ్బందులు రావచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వీటి మోతాదుల్లో మార్పు చేయడం లేదా మందులను మార్చడం వంటివి అవసరం అవుతాయి. అందుకే తరుచూ వైద్యులను కలిసి వారి సూచనలు పాటించాలి. వారి సూచనల మేరకే ఇవన్నీ చేస్తే మీ గుండె వైఫల్యాన్ని నియంత్రణలో పెట్టవచ్చు. ఆల్ ది బెస్ట్.

-డాక్టర్ ప్రణీత్
-కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్
-కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్

581
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles