గుండెమార్పిడితో ఎంతకాలం బతుకుతాం?


Mon,December 31, 2018 01:03 AM

నా వయస్సు 45 సంవత్సరాలు. నేను రవాణాశాఖలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రతిరోజూ ఎక్క డో ఒకచోటుకు తిరగాల్సిన పరిస్థితి. అయితే రెండు నెలల క్రితం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటనలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలి పోయా ను. సహోద్యోగులు హుటాహుటిన పెద్దాసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు నాది హార్ట్ ఫెయిల్యూర్ సమస్య అని నిర్ధారించారు. ఇప్పుడు పరిస్థితి అదుపు చేసినప్పటికీ గుండెమార్పిడి చేయించుకోవాల్సిందే అంటున్నారు. జీవన్‌దాన్‌లో పేరు కూడా నమోదు చేసుకున్నాం. నాకు హైబీపీ, షుగర్ ఉన్నాయి. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటే వీటివల్ల ప్రమాదమేం ఉండదా? ఈ ఆపరేషన్ నన్ను కాపాడుతుందా? గుండెమార్పిడి చేస్తే ఎంత కొలం కాపాడుతుంది? వివరంగా తెలియజేయండి.
- జే చొక్కా నాయక్, వరంగల్

Counselling
నాయక్‌గారూ.. మీ సమస్యను పరిశీలిస్తే మీకు హైబీపీ, షుగర్ వ్యాధులే మీ గుండెకు బాగా నష్టం కలిగించినట్లు తెలుస్తున్నది. మీకున్న ఆహారపు అలవాట్లు, సంక్రమణ వ్యాధులు వంటివి ఉంటే అవి కూడా ప్రభావం చూపి ఉండవచ్చు అనిపిస్తున్నది. హార్ట్ ఫెయిల్యూర్‌కు ప్రధానంగా ఇవే దారితీస్తాయి. ఈ కారణాల వల్ల అలసిపోయినప్పుడు లేదా పడుకున్నప్పుడు శ్వాస అందదు. మితిమీరిన అలసట వస్తుంది. శరీరంలో వాపులు వస్తుంటాయి. దీంతో గుండె ఏమాత్రం పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే హార్ట్‌ఫెయిల్యూర్‌గా పరిగణిస్తున్నారు. ఈ స్థితిలో గుండెమార్పిడియే మీ ప్రాణాన్ని కాపాడుకునే ఏకైక మార్గం. మీకు కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులేవీ లేవు కాబట్టి మీరు నిర్భయంగా గుండె మార్పిడి చేసుకోవచ్చు. కాలేయ, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలు ఉంటే మాత్రం హార్ట్ ప్లాంటేషన్ ఆపరేషన్‌కు అవకాశం లేదు. కాబట్టి ఇది మీకు అనుకూలించే ముఖ్య విషయంగా చెప్పవచ్చు. ఇక మీరన్నట్టు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాపాడుతుందా? అన్నారు.. మీకెలాంటి అనుమానం లేదు. గుండెమార్పిడి సురక్షితం. అది వందశాతం మీ ప్రాణాలను కాపాడుతుంది. శస్త్రచికిత్స తర్వాత మందుల ద్వారా మీ జీవితానికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్థుల్లో ఎక్కువ మంది హఠాత్తుగా మరణిస్తుంటారు.

గుండె కొట్టుకోవటంలో అసాధారణమైన హెచ్చుతగ్గులు ఈ సమస్యకు కారణం అవుతాయి. మీరు ఇప్పటికే జీవన్‌దాన్‌లో పేరు నమోదుచేసుకున్నారు కాబట్టి.. సమస్య కూడా తీవ్రంగా ఉన్నందున మీకు జీవన్‌దాన్ ద్వారా బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన గుండె అమర్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గుండె మార్పిడి గురించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఇంకా.. గుండె మార్పిడి తర్వాత ఎంతకాలం కాపాడుతుంది అన్నారు. గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులు సర్జరీ తరువాత ఇరవై నుంచి ముప్పయి సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాష్ట్రంలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి సాధించింది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తివంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు గుండె వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. నిశ్చింతంగా ఆపరేషన్ చేయించుకోండి.

డాక్టర్ ఎన్. నాగేశ్వర్‌రావు
సీనియర్ కార్డియోథొరాసిక్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, మలక్ పేట్

570
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles