గుండెపోటు లక్షణాలు గుర్తించండి..


Thu,September 28, 2017 01:46 AM

ఇది వరకు సినిమాల్లో ఏదైనా దుర్వార్త వినగానే పెద్దవారు గుండెనొప్పితో కుప్పకూలి పోవడం, తర్వాత హాస్పిటల్‌లో డాక్టర్ ఐసీయూ నుంచి బయటకు వచ్చి ఆ పెద్దాయనకు హార్ట్‌ఎటాక్ వచ్చిందని చెప్పడం చూపించేవారు. నిజానికి జీవితంలో గుండెపోటు అంత స్పష్టంగా ఉండదు. చాలా మందికి గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడానికి గంటల తరబడి సమయం తీసుకుంటారు. నిజానికి ఇది అత్యంత ప్రాణాంతకమైన అశ్రద్ధ అని చెప్పాలి. ఎందుకంటే సమయానికి అందే చికిత్స, గుండెకు జరిగే నష్టాన్ని తగ్గించడం మాత్రమే కాదు అప్పుడప్పుడు ప్రాణాలను సైతం కాపాడుతుంది.
HeartAttack

సమయం ప్రాముఖ్యత

గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా గుండెపోటు వస్తుంది. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్, ఇతర పోషకాలు అందకపోతే దానికి నష్టం వాటిల్లుతుంది, ఒక్కోసారి అది పూర్తిగా నిర్వీర్యం కావచ్చు కూడా. చికిత్స అందడానికి ఎంత ఎక్కువ సమయం పడితే అంత ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే గుండెకు అంత తక్కువ నష్టం జరుగుతుంది. అంత త్వరగా కోలుకునే అవకాశాలుంటాయి.

లక్షణాలు

సాధారణంగా గుండెపోటులో ఛాతిలో నొప్పి, లేదా ఛాతిలో పట్టేసినట్టు ఉంటుంది. ఒక్కోసారి గుండె మీద ఏదో బరువు ఉన్నట్టుగా కూడా ఉండొచ్చు.
గుండెలో మంటగా ఉంటుంది. ఛాతి ముందు వైపు కూడా నొప్పి ఉండొచ్చు. సాధారణంగా ఎడమ వైపు నొప్పి వస్తుంది. చాలాసార్లు ఎడమ భుజం నుంచి నొప్పి పాకినట్టుగా ఉంటుంది. ఇలా 30 నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు. నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉండొచ్చు. కొంత మందిలో భరించలేని విధంగా కూడా ఉండొచ్చు. నొప్పితో పాటు తీవ్రంగా చెమటలు, ఊపిరి అందక పోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే అందరిలో ఈ అన్ని లక్షణాలు కనిపించకపోవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో ఇలాంటి లక్షణాలు అన్నీ కనిపించవు.

ఏం చెయ్యాలి?

గుండె పోటు వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
వెంటనే చేస్తున్న పని ఆపేసి విశ్రాంతిగా ఉండాలి. ఎలాంటి పని చెయ్యకూడదు.
హాస్పిటల్‌కు చేరుకోవడానికి స్వయంగా డ్రైవింగ్ చెయ్యకూడదు. ఇతరుల సహాయం తప్పక తీసుకోవాలి.
ఇది వరకే గుండెపోటు వచ్చిన వారైతే నాలుక కింద సార్బిట్రేట్ ట్యాబ్లెట్ పెట్టుకోవాలి.
ఆస్ప్రిన్ ట్యాబ్లెట్ చప్పరించడం లేదా మింగడం చెయ్యాలి.
అందరిలోనూ గుండెపోటు లక్షణాలు ఒకే విధంగా ఉండవన్న అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి అవగాహనే ప్రాణాలను కాపాడుతుంది.
Drramesh

1365
Tags

More News

VIRAL NEWS