గీత.. కొలువుల వనిత!


Tue,March 12, 2019 01:34 AM

Geetha
కష్టాన్ని నమ్ముకున్నవారెవరూ చరిత్రలో ఓటమిపాలైన దాఖలాలు లేవు. వారికే విజయాన్ని బానిసగా చేసుకొనే శక్తి, ధైర్యం ఉంటుంది. అలాంటి మనిషే ఈ తహశీల్దార్ గీత. తండ్రి లేని కుటుంబాన్ని తన భుజాలపై మోస్తూ.. అంచెలంచెలుగా ఎదిగింది. ఎంతోమంది పేద, మధ్య తరగతి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. పట్టుదలకు కేరాఫ్‌గా నిలుస్నున్నది గీత. అందుకే.. పేదల కన్నీళ్లు ఆమె మోము చూస్తే ఆనంద బాష్పాలుగా మారతాయి. తాను అనుభవించిన కష్టాలు తన పరిధిలో ఎవ్వరూ అనుభవించకూడదనే సంకల్పమే.. ఆమెకు శ్రీరామరక్ష. అంతటి మంచి మనుసున్న గీత పరిచయం ఇది.


ఈ మూడు సన్నివేశాలను ఎదుర్కొన్నది ఒక్కరే. ఆమే గీత. ఇప్పుడు అందరిచేత శభాష్ తహశీల్దారు అనిపించుకుంటున్నది. ఆమె కథ ఆమె మాటల్లోనే.. నల్గొండ జిల్లా మోతే మండలం బుర్కచర్ల గ్రామం మాది. అమ్మానాన్నలు బాలాజీ, అనుసూర్యమ్మ. నాకు ఇద్దరు తమ్ముళ్లు. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో కుటుంబ భారం అమ్మపై పడింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో అమ్మ కూలీ పనులకు వెళ్లేది. నేను కూడా సెలవుల్లో పనులూ చేస్తూ.. తమ్ముళ్ల ఆలనా పాలనా చూస్తూ అమ్మకు చేదోడువాదుగా ఉండేదాన్ని. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జీవితంలో ఉన్నతస్థానంలో నిలబడాలనే సంకల్పం నాలో కలిగింది. ఏ పని చేస్తూన్న అదే ఆలోచన. మనం చేసే పనిని సక్రమంగా నిర్వర్తిస్తే.. అదే విజయాన్ని అందిస్తుందని నాకు చిన్నప్పుడే తెలిసింది. నేను హైదరాబాద్‌లో చదువుకునేందుకు అమ్మ ఎంతో కష్టడింది. మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది.


టికెట్.. టికెట్..

బంధువులు, స్నేహితుల ప్రోత్సాహంతో డిగ్రీ సెకండియర్ చదువుతుండగానే ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. హకీంపేటలో శిక్షణ తీసుకున్న. మాదే మొదటి మహిళా కండక్టర్ బ్యాచ్. శిక్షణను కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో అప్పుడే అధికారుల నుంచి ప్రశంసలు అందాయి. నన్ను రోల్‌మోడల్‌గా తీసుకోవాలని నాటి ఆర్టీసీ అధికారులు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. తర్వాత సూర్యాపేట నుంచి మా గ్రామమైన బుర్కచర్ల నా మొదటి పోస్టింగ్. మొదట నైట్ డ్యూటీ వేశారు. అయినా జంకలేదు. వచ్చిన ఏ అవకాశమైనా వదులుకోకూడదనేది నేను నేర్చుకున్న జీవిత పాఠం. అందుకే ధైర్యంగా విధులు నిర్వర్తించా.


సైలెన్స్.. సైలెన్స్..

బస్సుల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడే నా గమ్యాన్ని వెతుకున్నా. ఆ సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పుస్తకాలతో కుస్తీ పట్టా. ఎలాగైనా టీచర్ ఉద్యోగం సంపాదించాలని కష్టపడి చదివాను. ఉద్యోగం సంపాదించా. 2000వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా గుండాల మోత్కూరు మండలం పెద్ద పడిశాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా నా మొదటి పోస్టింగ్. ఆ సయమంలో చాలామంది పేద విద్యార్థులకు దిశా నిర్దేశం చేశా. ఇంతటితో నా ప్రయాణం ఆగకూడదనుకున్నా.


గ్రూప్స్ ఉత్తమమని..

2001లో గ్రూప్2 రాశా. ఎగ్జామ్ క్వాలిఫై అయినా.. ఇంటర్యూ లో ఫెయిలయ్యా. అదే సమయంలో 2002లో స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ వచ్చింది. అయినా లక్ష్యాన్ని మరువలేదు. మళ్లీ రాత్రిళ్లు పుస్తకాలతో కుస్తీ మొదలైంది. 2005లో గ్రూప్2 పరీక్ష పాసై.. ఇంటర్వూలో కూడా క్వాలిఫై అయ్యాను. 2007లో ఫలితాలు రావడంతో.. టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశా. తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా మొదటి పోస్టింగ్. అప్పటి నుంచి ప్రభుత్వ ప్రతినిధిగా బాధితుల పక్షం పోరాడుతున్నా. నా సేవలకు గుర్తుగా ఎన్నో అవార్డులు, అభినందనలు, ప్రశంసలు అందాయి. 2011లో ప్రమోషన్‌పై సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్‌గా విధులు నిర్వర్తించా. తర్వాత డిప్యూటేషన్‌పై రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌లో సేవలందించా. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం తహశీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. నా ప్రయాణంలో భర్త ధారావత్ వెంకన్న ప్రోత్సహం మరువలేనిది. మాకు ఇద్దరు కుమారులు రిత్విక్, కౌశిక్ పవిత్రన్. నా దగ్గరకు కన్నీళ్లతో వచ్చిన బాధితులు.. ఆనంద బాష్పాలతో వెళ్లాలనే సంకల్పంతోనే విధులు నిర్వర్తిస్తున్నా. ప్రణాళికాబద్ధమైన కష్టం లేకపోతే.. ఎంత శ్రమపడినా వృథానే. అనాథ ఆశ్రమం ఏర్పాటు చెయ్యాలనేది నా తదుపరి లక్ష్యం.

Geetha1

మరపురాని సంఘటన

ఓసారి సూర్యాపేట నుంచి కోదాడ బస్‌లో డ్యూటీ. ఒక వృద్ధుడు సూర్యాపేటలో బస్ ఎక్కి కోదాడలో దిగి తన సూట్‌కేస్ మర్చిపోయాడు. చూస్తే అందులో లక్షల రూపాయల డబ్బు ఉంది. ఆ డబ్బును ఎలాగైనా అతనికి చెందేలా చూడాలని.. దాదాపు నాలుగు ట్రిప్పులు వేచిచూశాం. అయినా అతను రాకపోవడంతో డిపోలో అప్పగిద్దామని వెళ్తుంటే.. పరుగున నా వెనుకే వచ్చాడు. అమ్మా.. నేను ఎంపీడీఓగా రిటైర్డ్ అయ్యాను. ఆ డబ్బుతో కోదాడలో క్వారీ వ్యాపారం చేయాలని వచ్చాను. వృద్ధాప్యంలో మతిమరుపు వల్ల సూట్‌కేస్ మర్చిపోయా. ఇది నా జీవిత కష్టార్జితం అంటు బోరుమన్నాడు. నేను కొన్ని ప్రశ్నలు వేయడంతో అన్నింటికీ సమాధానం చెప్పడంతో డబ్బు ఇచ్చేశా. ఆ సంతోషంలో అతను మాకు స్వీట్స్ పంచాడు. నా వివరాలు తెలుసుకొని గీతమ్మా.. నువ్వు చల్లగా ఉండాలి అంటూ దీవించాడు.


- అణగారిన వర్గం, అందులోనూ పేదరికం. ఆడిపాడే వయసులోనే తండ్రి చనిపోయాడు. అమ్మ ఒంటరైంది. లోకం తెలియని చిన్నారి తమ్ముళ్లు ఒకవైపు. తన చెంపలను తడుపుతున్న కన్నీళ్లను తుడిచివేస్తూ.. కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నది గీత.అది 1999. అప్పుడే ఆర్టీసీ కండక్టర్ల నోటిఫికేషన్ వచ్చింది. రాసింది, పాసైంది. బస్సుల్లో టికెట్.. టికెట్.. అంటూ అరుస్తూనే తన గమ్యాన్ని వెతుక్కుంది. ఉదయం కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. సాయంత్రం, రాత్రిళ్లు
పుస్తకాలతో కుస్తీ పట్టింది.


- 2000వ సంవత్సరం. ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. కష్టపడి చదివి ఉపాధ్యాయురాలైంది. అప్పుడే ప్రజా సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూనే.. తనను తాను చెక్కుకుంది.


- 2001లో గ్రూప్2 నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ క్వాలిఫై అయినా.. ఇంటర్వ్యూ వెక్కిరించింది. తన లక్ష్యం, పట్టుదలకు కసి తోడైంది. 2005లో వచ్చిన గ్రూప్2 పరీక్షలో ఉత్తీర్ణురాలై.. డిప్యూటీ తహశీల్దారు లక్ష్యాన్ని చేరుకుంది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంటూ నేడు తహశీల్దారుగా తానేంటో నిరూపించుకుంటుది. ఆ కష్టాల కడలిని చిరునవ్వుతో అధిగమించింది.


- బండారి జార్జివిల్సన్, వినాయక్‌నగర్ రిపోర్టర్

2542
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles