గల్ఫ్‌గాయానికి స్పందన


Tue,July 1, 2014 01:33 AM

దుబాయ్.. దిర్హంల పంటనే కాదు దుఃఖాల ఊటకూడా! అక్కడి ఉపాధి ఊరిస్తుంటే.. ఇక్కడి అమాయకత్వం ఓడిపోతుంటుంది.. ఈ జీవనసంఘర్షణలో ఓ చేతన చెంత నిలిస్తే కొండంత ధైర్యం.. దుబాయ్ వెళ్లిన వాళ్లకు వాళ్లను నమ్ముకున్న ఇంటోళ్లకూ! ఆ చొరవ పేరు వొబ్బిలిశెట్టి అనూరాధ.. న్యాయవాది...

ఈ ఆడబిడ్డ పరిచయమే ఇది...

anuradhaదుబాయ్‌లోని తెలుగు కార్మికులకు స్పందన పేరుతో అనూరాధ చేస్తున్న సేవ చాలా విలువైనదే. తన ఈ కార్యక్రమాన్ని సేవ అంటే ఆమె ఒప్పుకోదు. ఓ మనిషిగా తోటివాళ్లకు తోచినంత సహాయం అందిస్తున్నానంతే అంటుంది! అసలామె దుబాయ్ ప్రస్థానమే ఊహించని ప్రయాణం! రాజమండ్రి స్వస్థలమైనా తండ్రి (సత్యనారాయణ, కోపరేటివ్ సొసైటీ ఉద్యోగి)వత్తిరీత్యా విశాఖపట్టణంలో పెరిగింది. అక్కడే బిజినెస్ లా లోఎల్‌ఎల్‌ఎమ్ పూర్తిచేసింది. అయితే ఫైనలియర్ పూర్తికాకముందే దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది.

ప్రయాణం.. ప్రణయం.. పరిణయం

2006లో దుబాయ్‌లో ఉన్న అనూరాధ స్నేహితులకు వ్యాపారంలో చిన్న సమస్య తలెత్తడంతో వాళ్లు ఆమె సహాయాన్ని అర్థించారు. వాళ్లకోసం ఆమె తొలిసారిగా యూఏఈ ఫ్లయిట్ ఎక్కింది. దుబాయ్‌లో ల్యాండ్ అయింది. అక్కడ స్నేహితుల సమస్యకు తన న్యాయసలహాలతో పరిష్కారాన్ని చూపింది. ఆ క్రమంలోనే ఇబ్రహీం హసీముల్లా అనే లాయర్‌ను కలిసింది. అక్కడి చట్టాలు, న్యాయవ్యవస్థకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకుంది... ఇంగ్లీష్ జడ్జిమెంట్స్ కోసం లైబ్రరీలకు వెళ్లింది. అక్కడి లీగల్ ప్రొసీడింగ్స్.. వేగంగా కేసులు పరిష్కారమవ్వడం ఆమెకు ఎంతో నచ్చాయి. ఆమె ఆసక్తి గమనించిన లాయర్ ఇబ్రహీం సంవత్సరంలో ముడునాలుగు నెలలు ఇక్కడ ఉండి నువ్వు కేసులు చూసుకోవచ్చమ్మా... నీకు అకామిడేషన్ నేను ఏర్పాటు చేయిస్తాను అని సలహా ఇచ్చాడు.

అది అనూరాధను ఆలోచింపచేసింది. ఆ సమయంలోనే అక్కడి సాంస్కతిక సంస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలుగు స్రవంతి నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొంది. ఆ సందర్భంలోనే విజయనగరానికి చెందిన రాజకీయనేత (తొలి వైశ్య ఎమ్మెల్యే) వొబ్బిలిశెట్టి రామారావు కొడుకు సురేశ్ పరిచయమయ్యాడు. అప్పటికే అతను లండన్‌లో ఎంబీఏ పూర్తిచేసొచ్చి దుబాయ్‌లో గ్లాస్ అండ్ అల్యూమినియం వ్యాపారం చేస్తున్నాడు. అనూరాధలోని చురుకుదనం, చొరవకు ముగ్ధుడైన సురేశ్ ఆమె ముందు పెళ్లి ప్రతిపాదన పెట్టాడు. ఓ మూడు నెలలకు అంటే 2006, ఏప్రిల్ 16న పెళ్లి అయింది. ఇప్పుడు ఆమెకు ఒక బాబు.. పేరు వైభవ్. వయసు ఏడేళ్లు!

స్పందనతో అడుగులు

పెళ్లితో ఆమె కుటుంబ జీవితానికే అంకితమైపోలేదు. ఆ బాధ్యతలతోపాటు వత్తిభారాన్నీ పెంచుకుంది. దుబాయ్‌లో ఉండే తెలుగు కార్మికుల స్థితిగతులను చూసింది. పొట్టచేతపట్టుకొని పరాయిదేశం వచ్చి తెలిసీతెలియని తనంతో నేరాల్లో భాగస్వాములై కటకటాలపాలవుతున్నవారు కొందరైతే... ప్రమాదాల అంచున పనిచేస్తూ చావుపిశాచానికి బలయ్యేవాళ్లు కొందరు.. ఆ గాథలు, వైనాలు ఆమెను కదిలించాయి. ఒక చిన్న సమాచారం లేక సొంతగడ్డమీదున్న సొంతవాళ్లు అల్లాడిపోవడం... కనీస అవగాహనలేక పరాయిగడ్డమీద వీళ్లు చితికిపోవడం... అనూరాధను ఓ కొత్త పనివైపు నడిపించాయి. తనలాంటి ఆలోచనలే ఉన్న నలుగురు స్నేహితులతో కలిసి స్పందన అనే పేరుతో ఓ గ్రూప్ మొదలుపెట్టింది. పైసా లాభాపేక్ష లేకుండా కేవలం సహాయం అనే పేరుతోనే ఈ గ్రూప్ పనిచేస్తున్నది.

ఏం పని?

ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అనే తేడా లేకుండా దుబాయ్‌లో ఉన్న తెలుగు వాళ్లందరి యోగక్షేమాల కోసం ఈ స్పందన కదులుతుంది. చేయని నేరానికి జైలు పాలైన ఖైదీల తరపున న్యాయవాదిగా పోరాడుతుంది అనూరాధ. అనామకులుగా మరణించిన వాళ్ల చిరునామా, వివరాలను కనుక్కొని వాళ్లవాళ్లకు విషయం చెప్పి శవాలు త్వరగా స్వదేశం చేరుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది స్పందన.

పనిచేస్తూ ప్రమాదాల బారిన పడిన వారికి యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పిస్తుంది. అయితే వీటికోసం చాలానే కసరత్తు చేస్తుంది అనూరాధ. ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ గ్రూప్‌కి వాలంటీర్లు ఉన్నారు. ఆయా జిల్లాల నుంచి దుబాయ్ వెళ్లిన వాళ్ల కుటుంబ వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్లు వగైరా సేకరించి ఒక రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. ఇది అనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు. పూర్తివివరాల సేకరణ అసాధ్యం అనుకున్నచోట కనీసం గ్రామ సర్పంచ్ లేదా ఇతర గ్రామపెద్దల కంటాక్ట్ నంబర్లను సేకరించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇప్పటి వరకు చేసినవి...

స్పందన తరపున ఇప్పటి వరకు చాలా కేసులను డీల్ చేసింది అనూరాధ. ఉమ్మడి ఆంధ్రప్రదేశే (విభజనకు పూర్వం)కాకుండా ఒడిశా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాలు, నేపాల్, బంగ్లాదేశ్ వంటి అయిదు దేశాలకు చెందిన ప్రవాసీయులకూ తమ సహాయసహకారాలు అందిస్తోంది అనూరాధ స్పందన గ్రూప్ తరపున. నిజామాబాద్ జిల్లాలోని దేగాం గ్రామానికి చెందిన వడ్డె ముత్యం, రాజన్న అనే వ్యక్తులకు హత్యానేరం కింద పడ్డ ఉరిశిక్షను తప్పించి మూడేళ్ల జైలు శిక్షగా మార్చింది.

ఆమె న్యాయసహాయం అందించిన కేసుల్లో ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటివింకెన్నో! దొంగతనం నుంచి హత్యల దాకా ఎన్నో నేరాల కింద జైళ్లల్లో మగ్గుతున్న వందలమంది తెలుగువాళ్ల తరపున నిలబడుతున్నది స్పందన. తెలంగాణకు సంబంధించిన కొంత మంది దుబాయ్ కార్మికుల విషయంలో కేసీఆర్, కేటీఆర్‌లు తమకెంతో సహకరించారని కతజ్ఞత తెలుపుతుంది అనూరాధ. ఇప్పుడైతే తెలుగువాళ్ల కోసం రెండు రాష్ర్టాలు, రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి గల్ఫ్‌లోని తెలుగు కార్మికుల సంక్షేమం ఈ రెండు సర్కార్లు పోటీపడి పనిచేస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది తెలుగు స్రవంతి సాంస్కతిక సంస్థకు తొలి మహిళా అధ్యక్షురాలైన అనూరాధ. స్పందన పనులు నాకెంత గౌరవాన్ని, ఆత్మీయతను పంచిపెడ్తున్నాయో ఒక్కోసారి అంతే చేదు అనుభవాల్నీ ఇస్తాయి. ఒకసారి కొన్నికొన్ని కేసులకు సంబంధించి మారుమూల పల్లెలకు వెళ్లాల్సి వస్తుంది.

న్యాయం చేయడానికి వెళ్లినా నమ్మరు. వాళ్లకు రావాల్సిన డబ్బును నేను తీసుకుంటున్నానేమో అనుకుంటారు. చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. వాటన్నిటినీ తట్టుకోవాలి. అసలు విషయాన్ని వాళ్లకు వివరించి మా మీద నమ్మకం కలిగేటట్టు చేసుకోవాలి. ఇవన్నీ బయటకు కనిపించేంత తేలికైన విషయాలు కావు. అయినా ఇష్టంగానే చేస్తాను. నా ఈ ప్రస్థానంలో నా భర్త సహకారం చాలా ఉంది. తొమ్మినెలల నా కొడుకును వదిలేసి ఎక్కడో బెంగాల్‌లోని మారుమూల పల్లెటూరికి వెళ్లిన సందర్భాల్లాంటివి కోకొల్లలు.

అయితే ఇంత కష్టపడుతున్నందుకు నేను రెండు ప్రభుత్వాలను కోరేది ఒకటే. మా శ్రమకు ఒక గుర్తింపు ఇవ్వాలి. యూఏఈ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య మేం వారధులం కాబట్టి ఆ ఐడెంటిటీ మాకిస్తే ఇంకొంచె అధికారికంగా పనులు చేసే అవకాశం ఉంటుంది. చట్టబద్దమైన ఆ గుర్తింపునిస్తే మా సేవలనూ విస్తతం చేసే అవకాశం ఉటుంది. ఆ ప్రోత్సాహం మమ్మల్ని మరింత ఉత్సాహంగా నడిపిస్తుంది. ఇక్కడున్న తెలుగు కార్మికుల సమస్యల పరిష్కారంలో మాకు భీంరెడ్డిలాంటివాళ్లెందరో ఎంతో హెల్ప్ చేస్తున్నారు. వాళ్లందరి సహకారంతో మా స్పందనను మరింత స్ట్రాంగ్ చేయాలనేదే నా లక్ష్యం అంటూ తన భవిష్యత్ కార్యాచరణను తెలిపింది వొబ్బిలిశెట్టి అనూరాధ! లాభాపేక్ష, కీర్తికాంక్ష లేని ఆ స్పందనకు వందనం!

శరాది
ఫోటోలు: జి. భాస్కర్

918
Tags

More News

VIRAL NEWS