గణితంలో ఘనాపాటి.. భిక్షపతి సార్!


Sun,March 10, 2019 12:56 AM

తాను కరిగిపోతూ.. వెలుగును పంచే కొవ్వొత్తిలాంటి వాడు గురువు. దిక్కూ, దిశ లేకుండా పోతున్న జీవితాన్ని ఓ మార్గంలో పెట్టి చక్కటి భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. అలాంటి గురుదేవులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు దొమ్మటి భిక్షపతి. మార్చి 14న పై(Pi) డే పిల్లలకు పై(Pi) విలువను బోధిస్తూ.. రికార్డు సృష్టించిన గణిత ఉపాధ్యాయుడు భిక్షపతి గురించి ఈ వారం సింగిడి ప్రత్యేక కథనం..
bikshapathi
బతకలేక బడిపంతులు అంటూ చాలామంది ఉపాధ్యాయులను చులకనగా చేసి మాట్లాడుతుంటారు. కానీ.. ఈ సమాజాన్ని ముందుకు నడిపించేది టీచరే. ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేయగలిగితే ఉపాధ్యాయుడు సమాజాన్నే ప్రభావితం చేయగలడు. రేపటి దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. చాలామంది ఉదయం పదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు పిల్లలకు ఏవో పాఠాలు చెప్పేసి బడి గంట కొట్టగానే ఇంటికెళ్లిపోతారు. కానీ.. కొంతమంది మాత్రం బడంటే గుడిలా భావిస్తారు. పిల్లల్లో రేపటి నవసమాజ నిర్మాతలను చూస్తారు. వారి కోసమే అహర్నిశలు పనిచేస్తారు. ఏడాదిలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా బడి కోసం పనిచేసే టీచర్లు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో దొమ్మటి భిక్షపతి ఒకరు. ఒక టీచర్ స్కూల్ నుంచి బదిలీ అయి వెళ్లిపోతుంటే సార్ మీరు వెళ్లొద్దు సార్ అంటూ టీచర్ వెంటబడి ఏడ్చిన సందర్భాలూ మనం చూశాం. భిక్షపతి సార్ కూడా ఆ కోవకు చెందినవారే.


టైమంతా పిల్లలకే..

భిక్షపతి సార్ 23 సంవత్సరాల సర్వీసులో ఇప్పటి వరకు ఎప్పుడూ ఆయనకున్న సాధారణ సెలవులు పూర్తిగా వాడుకోలేదు. పిల్లల కంటే ముందే బడికి వస్తాడు. పిల్లలందరూ వెళ్లిపోయినా రేపటి పాఠం ప్రిపేర్ చేస్తూనో, చదువులో వెనుకబడిన పిల్లలను ఎలా చురుగ్గా చేయాలో ఆలోచిస్తూ ప్రణాళికలు రచిస్తారు భిక్షపతి. లెక్కల టీచరైన భిక్షపతి పిల్లలకు లెక్కలు నేర్పించడంలో దిట్ట. మంచినీళ్లు తాగిన ప్రాయంగా లెక్కలు నేర్పించేస్తాడు. ఎంతటి జగమొండి లెక్క అయినా క్షణాల్లో పిల్లల మస్తిష్కాల్లో ముద్ర పడిపోయేలా బోధిస్తాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరినప్పుడు పిల్లలతో పాటు కలిసిపోయి వారితో ఆడుకుంటూ పాఠాలు చెప్పేవాడు. గోళీలాట, తొక్కుడు బిల్ల, ముక్కు గిల్లుడు ఆటల్లో పిల్లలకు పాఠాల తత్తం బోధపడేలా చెప్పేవాడు. గ్రామీణ ఆటలతోనే గణితాన్ని రంగరించి బోధించేవాడు. లెక్కలంటే భయపడే పిల్లలు సైతం భిక్షపతి సార్ బోధనలో లెక్కలను చీల్చి చెండాడేలా మారిపోయారంటే ఆయన గొప్పతనమేంటో అర్థమవుతుంది.


విలువ పెంచేలా..

గణితంలో ఘనాపాటి అయిన భిక్షపతి పై(Pi) విలువను పిల్లలకు నేర్పించడంలో సక్సెస్ అయ్యాడు. చాలామంది పిల్లలు పై(Pi) విలువ అంటే భయపడిపోతారు. వారికి అర్థమయ్యేలా, గుర్తుండిపోయేలా చెప్పేందుకు టీచర్లు సైతం నానా తంటాలు పడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ భిక్షపతి ఆధ్వర్యంలో పై(Pi) విలువ గురించి నేర్చుకున్న పిల్లలు దాంతో ఆటాడుకుంటారు. వృత్త పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తిని పై (Pi) అంటారు. ఈ సూత్రాన్ని పిల్లలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చెప్పారు భిక్షపతి. పై విలువలో గణేష్ విద్యార్థి రెండువేల అంకెలు చదివాడు. దివ్య అనే అమ్మాయి 60 సెకన్లలో 500 అంకెలు చదివింది. గ్రహణ శక్తిని పెంచే పై విలువను పిల్లలకు సులభంగా నేర్పించినందుకు స్థానిక డీఈవో, ఆర్జేడీ, అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీఎస్ సుశీల్ కుమార్ జోషిల చేతుల మీదుగా పలు సందర్భాల్లో ప్రశంసా పత్రాలు, అవార్డులు అందుకున్నాడు.


గతేడాది మ్యాథ్స్ జీనియస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. 2017లో జాతీయ స్థాయిలో ఇచ్చే ఆటా అవార్డు అందుకున్నాడు. అదే ఏడాది డిప్యూటీ సీఎం చేతుల మీదుగా వరంగల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నాడు. 300 నేత్ర శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించాడు. 20 సార్లు రక్తదానం చేశాడు. రక్తదానం చేయడం వల్ల అవతలి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వారిమవుతామని అవగాహన కల్పించాడు. వారంలో ఒకరోజు స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వయంగా చీపురు పట్టి స్కూల్లో, గ్రామంలో రోడ్లు శుభ్రపరుస్తాడు. ఇప్పటి వరకు రెండువేల మొక్కలు నాటి, వారి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నాడు.


సవాళ్లతో సావాసం..

బిక్షపతి ఎక్కడ పనిచేసినా ఉద్యోగాన్ని, విధి నిర్వహణను సవాల్‌గా స్వీకరించేవాడు. సెంకడరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగంలో చేరిన బిక్షపతికి 2001లో స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ వచ్చింది. పదోన్నతి మీద నల్లబెల్లి మండంలం అర్వయ్యపల్లి యూపీఎస్‌లో చేరాడు. ఆ స్కూల్లో కేవలం 15 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. అతి తక్కువ స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో పోస్టింగ్ వచ్చినా బిక్షపతి నిరుత్సాహ పడలేదు. ఊర్లో వాళ్లందరితో సమావేశపరిచాడు. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ కలిశాడు. దాదాపు 130 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. వారందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చైతన్యపరిచాడు. మా స్కూల్లో చేరండి.


ప్రైవేట్ బడి కంటే మంచి చదువు మీ పిల్లలకు అందించకపోతే నా సొంత డబ్బులతో మీ పిల్లలను మీరు కోరిన ప్రైవేట్ పాఠశాలలో నేను చదివిస్తా అని చాలెంజ్ చేశాడు. మూడు నెలలు మిగతా టీచర్లందరితో టీమ్ ఏర్పాటుచేసి కలిసి అహర్నిశలు శ్రమించారు. పిల్లల కంటే ముందే స్కూల్‌కి రావడం, సాయంత్రం స్పెషల్ క్లాసులు తీసుకోవడం, సెలవు రోజల్లో సైతం ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వినూత్న పద్ధతుల్లో పిల్లలకు పాఠాలు చెప్పడంతో అనుకున్న దాని కంటే మంచి రిజల్ట్ వచ్చింది. ఆ సంవత్సరం స్కూల్లో వందకు వంద శాతం విద్యార్థులు పాసయ్యారు. ఊర్లో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పిల్లలంతా ప్రభుత్వ పాఠశాల బడిలో చేరారు.


ప్రస్థానం..

వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టాడు భిక్షపతి. తండ్రి ఐలయ్య కల్లు గీసేవాడు. తల్లి కౌసల్య కూలీపని చేసేది. చిన్నతనంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెట్టినా చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. చిన్నప్పటి నుంచి క్రియేటీవ్‌గా ఆలోచించేవాడు. అందరిలా కాకుండా మ్యాథ్స్ టీచర్ ఇచ్చిన లెక్కను డిఫరెంట్‌గా సాధించేవాడు. సొంతంగా ప్రిపేరై 1996లో ఎస్జీటీ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. సొంతూరులోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాడు.


నా స్టూడెంట్సే..

నా స్టూడెంట్స్ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను పాఠాలు చెప్పాను. బతుకు పోరులో గెలవాలంటే ఎలా శ్రమించాలో చెప్పాను. అంతే.. వారి పట్టుదల, శ్రమ వారిని విజేతలుగా నిలబెట్టింది. నా దగ్గర చదువుకున్న వేణు ఉడుగుల డైరెక్టర్ అయి నీది నాది ఒకే కథ అనే సినిమా తీశాడు. పులి దేవెందర్,ర పంతంగి భాస్కర్ ప్రభుత్వ ఉపాధ్యాయులయ్యారు. మరో ఆరుగురు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఎక్కడ కనిపించినా వినయంగా నమస్కరిస్తారు. నా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారంటే అంతకంటే ఒక గురువు ఏం కావాలి. వారి అభివృద్ధే నా సంతోషం.
- దొమ్మటి భిక్షపతి


వెలుగులు నింపారు..

భిక్షపతి సార్ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయనే మాకు ఆదర్శం. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. కేవలం పాఠాలు మాత్రమే చెప్పకుండా.. జీవితాన్ని జోడించి చెప్పేవారు. ఆయన ఎప్పుడూ కోప్పడిన సందర్భాలు లేవు. ప్రేమగా చదువు నేర్పించడంలో ఆయనకు ఆయనే సాటి.
- వేణు ఉడుగుల, సినీ దర్శకుడు


సార్ ప్రోత్సాహంతోనే టీచరయ్యా..

సార్ విప్పిన లెక్కల చిక్కుముడి ద్వారానే నా బతుకుబాట సాఫీగా సాగుతున్నది. చిన్నప్పుడు నాకు లెక్కలంటే చాలా భయం. ఆ భయాన్ని ఇష్టంగా మార్చారు భిక్షపతి సార్. ఆయన దగ్గర చదువుకోవడం నా అదృష్టం. నేను కూడా సార్ ైస్టెల్లోనే పిల్లలకు పాఠాలు చెప్తున్నా.
- పులి దేవేందర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు


బోధన విభిన్నం

మేం చదువుకుంటున్నప్పుడు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా స్కూల్‌కి వచ్చేవారు సార్. ఆటపాటలతోనే లెక్కలు చెప్పేవారు. ఆయన చూపిన బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాను. ఆయన ఆదర్శంతోనే సివిల్స్ ప్రిపేరవుతున్నాను.
- పంతంగి భాస్కర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు


-ప్రవీణ్‌కుమార్ సుంకరి

1495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles