గంజి To బెంజ్!


Sat,December 22, 2018 11:23 PM

కట్టుబట్టలతో సిటీకి వచ్చేశాడు. ఉన్నది ఒక్కటే చొక్కా. అది పగలు అతని ఒంటిమీద.. రాత్రి తాడుపై ఆరేది. దాన్ని ఉదయాన్నే చెంబుతో ఇస్త్రీ చేసుకొని పనికెళ్లేవాడు. అప్పటి అతని వయసు 15 యేండ్లు. పుస్తకాలు మోయాల్సిన వయసులో ప్లాస్టిక్ మూటలు మోశాడు. అతనుండే ప్రాంతం నుంచి పనిచేసే స్థలానికి 30 కిలోమీటర్ల దూరం. ఆ ప్రయాణంలో ఓపిక ఉన్నంత సేపు నడిచేవాడు. డబ్బులు ఆదా చెయ్యడానికి. కారణం.. రాత్రికి మిగిలిన డబ్బులతోనే తినాలి కాబట్టి. అలా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో.. ఆకలితో అలమటించిన తన కడుపునకే తెలుసు. ఎందుకంటే.. జీవితంలో ఏదో సాధించాలనే తపన, పట్టుదల. కాదు కాదు.. కసి. అందుకే డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు లేకపోయినా కాలంతో పోరాడాడు. కసితీరా గెలిచాడు.. నేడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అతనే ప్రముఖ ల్యాండ్‌స్కేప్ డిజైనర్ కేపీ రావు.
kp-rao
ప్రతి ఒక్కరికీ ఓ రోజు వస్తుందని చెప్తుంటారు పెద్దలు. ఏ పనీ చెయ్యకుండా.. కనీసం ప్రయత్నం కూడా చెయ్యకుండా ఉంటే.. లైఫ్‌లో ఎప్పటికీ ఆ రోజు అనేది రాదు. ఆ రోజు రావాలంటే శ్రమ చెయ్యాలి, కష్టాలను ఆహ్వానించి.. ఆస్వాదించాలి. కన్నీటిని ఆనంద భాష్పాలుగా మలుచుకునే సత్తా ఉండాలి. అప్పుడే ఆ రోజు నీదవుతుంది. ఆ రోజు ఇప్పుడు కేపీ రావుది. పదేండ్ల పాటు కష్టపడ్డాడు కాబట్టే.. ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. నాడు ఆకలితో అలమటించిన ఆయన.. నేడు రూ.లక్షల విలువైన కార్లలో తిరుగుతున్నాడు. పూట గడవడం కోసం పస్తులున్న ఆ మనిషి.. తన కారుకి రూ. 30 వేల నెలవారీ డీజిల్ బిల్లు కట్టే స్థాయికి వచ్చాడు. అదీ పట్టుదల, తపన, కసీ అంటే. కష్టాన్ని అనుభవించి, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటే ఈ స్థాయికి చేరాలి. జీరో స్థాయి నుంచి లక్షల రూపాయలు సంపాదించే స్థితికి వచ్చాడు కేపీ రావు.


కేపీ రావు మట్టిని, గడ్డిని, రాయిని నమ్ముకున్న మనిషి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుడు. మొక్కనాటితేనే బుక్క తినగలం అని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి. అందుకే ల్యాండ్‌స్కేప్ డిజైనింగ్ వైపు అడుగులు వేశాడు. చదువుకున్నది 8వ తరగతే అయినా.. మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన క్రియేటివ్ వర్క్‌తో కస్టమర్లను మెప్పించగలడు. అంతటి పనిమంతుడు. అందుకే దేశవ్యాప్తంగా ల్యాండ్‌స్కేప్, ఇంటీరియర్ డిజైనింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇప్పుడు దేశంలోని టాప్ నర్సరీలకు కేపీ సుపరిచితం. తాను చేసే నాణ్యమైన పనే.. తనకు ఓ బ్రాండ్‌ను కట్టబెట్టింది. ఇప్పుడు కేపీ రావు అంటే ఓ బ్రాండ్.


kp-rao2
కేపీ రావు పూర్తిపేరు కోవూరు ప్రద్యుమ్నరావు. ఊరు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామం. తల్లిదండ్రులు కిషణ్‌రావు, విజయలక్ష్మి. తన చినప్పుడు కరణాల బిడ్డగా పాలేర్ల భుజాలపై పాఠశాలకు వెళ్లాడు రావ్. కానీ, ఆ వైభవాన్ని మరవకముందే కడుపేదరికాన్ని అనుభవించాడు. ఉన్న భూమి ప్రభుత్వ పరమైతే, తండ్రికి రావాల్సిన ఉద్యోగం వయసు మించిపోవడంతో ముఖం చాటేసింది. అప్పటి నుంచే చదువులు కొనుక్కోలేక నానా ఇబ్బందులు పడ్డాడు. ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. తన ఎనిమిదో తరగతిలోనే చదువు మానెయ్యాల్సిన దుస్థితి. పుస్తకాల బ్యాగు మోయాల్సిన భుజం కాటేదాన్‌లోని వందన ప్లాస్టిక్స్‌లో మూటలు మోసింది. జీవితంలో ఎంత సంపాదించామో చూపించొచ్చు కానీ, ఎంత కష్టపడ్డామో చూపించలేం. ఉన్నది ఒకటే షర్టు.. పగలు ఆది ఒంటి మీద ఉంటే రాత్రి తాడుపై ఆరేది. ఉదయాన్నే చెంబు ఇస్తిరీకి నలిగి.. ఒంటిపై వేసుకోవడానికి తయారయ్యేది. ఇలాంటి సమయంలో అతని పనితనం గురించి విన్న గ్రాస్ వరల్డ్ నారాయణరావు అతణ్ని ఉద్యోగంలోకి తీసుకున్నారు. అక్కడే ల్యాండ్ స్కేప్ గురించి తెలుసుకొని.. తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు.


kp-rao3
ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు ల్యాండ్‌స్కేపింగ్. ఎందుకంటే ఇల్లు, ఆఫీస్, గెస్ట్‌హౌస్.. ఏదైనా అందంగా, ఆహ్లాదంగా కనిపించాలంటే ల్యాండ్‌స్కేపింగ్, ఇంటిరియర్ నిపుణులు అవసరం. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే అయినా.. లైఫ్‌లాంగ్ సంతోషాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ప్రముఖ నగరాల్లో ల్యాండ్‌స్కేపింగ్, ఇంటీరియర్ జపం చేస్తున్నారు. ల్యాండ్‌స్కేపింగ్ భవిష్యత్‌ను కేపీరావ్ పదేండ్ల క్రితమే అంచనా వేశాడు. అందుకే ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. మొదట్లో ఇలాంటి పనుల గురించి ఎవరికైనా చెబితే.. వ్యంగ్యంగానే స్పందించేవారు. కొంతమందైతే.. ఈ గడ్డి ఆవులకు పెట్టొచ్చా.. దీన్ని తింటే బాగా పాలిస్తాయా అంటూ అవమానించేవారు. ఈ క్రమంలో ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లకు, కార్పొరేట్ కంపెనీలకు తన పనిని పరిచయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకు భాష అవసరమైంది. రావు చదివిందేమో 8వ తరగతి. కొంతకాలం ఇంగ్లీష్ వచ్చిన మిత్రుడ్ని పక్కనపెట్టుకొని మ్యానేజ్ చేసినా.. భాష నేర్చుకోవడం తప్పనిసరి అయింది. బెంగళూర్ వెళ్లి ఆరునెలల్లోనే ఇంగ్లిష్, హిందీల్లో పట్టుసాధించాడు. ఇప్పుడు మాట్లాడటమే కాదు ఆయా భాషల్లో రాయగలడు కూడా. తర్వాత సాయిఅనిరుధ్ సంస్థలో కొండలు గుట్టలతో ఉన్న ఎకరాన్నర స్థలంలో 40 రోజుల్లో ల్యాండ్ స్కేప్ డిజైన్లు వేశాడు. అలా సొంతంగా ప్రయోగాలు చేస్తూ.. నైపుణ్యం సంపాదించాడు. కొద్దికాలంలోనే ఆ రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నాడు కేపీ రావ్.


kp-rao4
ఈ క్రమంలో ఎంతోమంది పెద్దలు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అవికాస్తా రాష్ర్టాలు, క్రమంగా దేశం దాటాయి. తాజాగా కేపీ రావు వర్క్స్ నచ్చిన చైనాకు చెందిన ఓ సంస్థ.. ఆయన్ను అక్కడికి ఆహ్వానించింది. దివంతగ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, శరద్‌పవార్, రేణుకా చౌదరి, ఇవివి సత్యనారాయణ, రాజశేఖర్, సి.రామచంద్రయ్య వంటి ఎంతోమంది ప్రముఖులు.. కేపీరావు పనిని మెచ్చిన వారే. కస్టమర్‌కు నచ్చే విధంగా.. ఖర్చుకు వెనకాడకుండా విదేశాల నుంచి మొక్కలు, మెటీరియల్‌ను తెప్పించి మెప్పించేవాడు. ఇప్పటివరకు 23 రాష్ర్టాల్లో తను ల్యాండ్‌స్కేపింగ్, ఇంటీరియర్ వర్క్స్ చేశాడు. అతని పనిలో భార్య వైష్ణవి, తమ్ముడు అనిరుధ ఆయనకు తోడ్పడతారు. తన బృందం.. కస్టమర్ అభిరుచికి తగ్గట్లుగా 2డి, 3డి డిజైనింగ్ చేసి, ఖర్చు వివరాలు చెబుతారు. పూట గడవడం కోసం అష్టకష్టాలు అనుభవించిన కేపీరావు.. ఇప్పుడు కేపీరావు అసోసియేట్స్, శ్రీవెంకటేశ్వర నర్సరీతో వందలమందికి ఉపాధి చూపిస్తున్నాడు. 1200 రూపాయల జీతంతో బతికిన ఆయన.. నేడు లక్షల రూపాయలను కళ్లజూస్తున్నాడు.


అంతటి పనిమంతుడు కాబట్టే.. బాహుబలి సినిమాకు పనిచేసేందుకు అవకాశం వచ్చింది. దేవసేన కుంతలరాజ్యం స్క్రీన్‌పై అంత అందంగా కనిపించడానికి కేపీ రావు బృందం కృషి ఉన్నది. 14 రోజుల్లో కుంతలరాజ్యం గ్రీనరీ అయిపోవాలని లక్ష్యంగా చెబితే.. కేవలం పది రోజుల్లోనే పూర్తి చేశాడు. ఇందుకు బాహుబలి చిత్ర యూనిట్ ప్రశంసలందాయి. ఎంతోమంది పట్ల ఉదారంగా వ్యహరించే కేపీరావు.. అనాథ బాలలు, వృద్ధుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని అనుకుంటున్నాడు. అంతేకాకుండా త్వరలోనే సినిమా నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తాను అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ కష్టాల్లో చేరదీసిన గ్రాస్ వరల్డ్ నారాయణరావు దయే అంటాడు కేపీ రావ్. మట్టి, గడ్డి, రాళ్లని నమ్ముకుంటే ఏమవుతావ్ అని ఎవర్నైనా అడిగితే.. కె.పి రావులా అవుతా అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. అందుకే డిగ్రీపట్టాలు కేవలం అర్హత కోసమే.. ఎప్పటికైనా సొంతంగా బతికి నలుగురు చెప్పుకునే స్థాయికి ఎదగాల్సింది మనమే అంటాడు రావ్. ఇలా ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.


kp-rao5

హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదు!

వాహనరద్దీ పెరిగిన దృష్ట్యా కాలుష్యం కూడా పెరిగిపోతున్నది. ప్రభుత్వం హరితహారం ద్వారా దాన్ని తగ్గించే చర్యలు చేపట్టింది. ఇంకా కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించేందుకు మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన హైదరాబాద్ మరో ఢిల్లీ కాకుండా ఉండేందుకు.. నగరంలో ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటాలి. ప్రజలు కూడా ఇళ్ల పరిసరాలలో సాధ్యమైనంత వరకూ గ్రీనరీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంట్లోనే పెంచుకునేందుకు చాలా ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఇల్లు, పాత ఇల్లు అని తేడా లేకుండా ఉన్నదాంట్లోనే హాయిగా జీవించే సదుపాయాలు ఉన్నాయి. ల్యాండ్‌స్కేపింగ్, ఇంటీరియర్ పనుల కోసం 8019411199 నంబర్‌ను సంప్రదించవచ్చు. ల్యాండ్‌స్కేపింగ్‌కు ఉన్న అపార అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి.
- కేపీ రావు, ల్యాండ్‌స్కేప్ డిజైనర్


kp-rao6

ల్యాండ్‌స్కేప్ డిజైనింగ్ రకాలు

ఇంగ్లిష్ గార్డెన్ ైస్టెల్, ఓరియంటల్ ల్యాండ్‌స్కేప్, ఫార్మల్ ల్యాండ్‌స్కేప్, ఇన్ఫార్మల్ ల్యాండ్‌స్కేప్, బటర్‌ైఫ్లె గార్డెన్స్, గ్జరీస్కేప్ గార్డెన్స్, ఆర్గానిక్ గార్డెన్స్, మోరిష్ గార్డెన్స్‌తోపాటు.. చైనీస్, డచ్, గ్రీక్, ఇటాలియన్, కొరియన్, పర్షియన్, స్పానిష్, జపనీస్, మోడ్రన్, తుస్కాన్, కంట్రీ, ట్రోపికల్, ఫ్రెంచ్, డిసెర్ట్, సౌత్‌వెస్ట్, మెడిటేరియనెన్, కొలోనియల్, కాప్‌కోడ్, కోస్టల్, ట్రెడిషనల్ వంటి పలు రకాలు ఉన్నాయి. వీటిన్నింటిపై కేపీ రావుకు అవగాహన ఉన్నది. విదేశాల్లో గార్డెనింగ్.. వాటి పద్ధతులు, విధానాలు ఇక్కడ కూడా ప్రవేశపెడుతున్నాడు. మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వీటితో పాటుగా అందమైన లైటింగ్, నూతన టెక్నాలజీతో ఇంటీరియర్ పనులు కూడా చేయిస్తుంటాడు. రోమన్ ఇటాలిక్, క్లెంపోగార్డ్.. ఇలా ఏ రకమో కస్టమర్ తన ఖర్చు ఎంతో చెబితే.. దానికి అనుగుణంగా అందమైన పని చేసిపెట్టడం కేపీ రావు బాధ్యతగా తీసుకుంటాడు..

1302
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles